‘ఫిట్’..ఫట్!
రోడ్డుపైకి 151 కండీషన్ లేని స్కూలు బస్సులు
నిబంధనలు కాలరాస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు
మేల్కొనని ఆర్టీఏ అధికారులు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: ఆర్టీఓ
విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్ పాఠశాలల ప్రచారపర్వం ముగిసి, పిల్లల మార్పుచేర్పు కూడా జరిగిపోయింది. కానీ చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సు ఫిట్‌నెస్ మాత్రం పూర్తికాలేదు. కండీషన్‌లేని బస్సులు రోడ్డుపై తిరుగుతూనే ఉన్నాయి. ఒక్కో బస్సులో రెండింతల విద్యార్థులను కుక్కి స్కూళ్లకు తీసుకెళ్తున్నా.. పట్టించుకునేవారు లేరు. అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్‌స్కూళ్ల యాజమాన్యాల లాభార్జన.. వెరసి విద్యార్థుల భద్రత గాల్లోదీపంగా మారింది .
సాక్షి, మహబూబ్‌నగర్/క్రైం: విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే స్కూలుబస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న 794 బస్సులకు గాను ఇప్పటి 643 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 151 బస్సులు కండిషన్ లేకుండానే రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో వందలాది మంది విద్యార్థులు సురక్షితం లేని ప్రయాణం మధ్య చదువుకుంటున్నారని తెలిసింది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తరువాత కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందుగానే వాహనాల తనిఖీ బాధ్యతను విస్మరిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే పిల్లలను తీసుకెళ్లే స్కూలు బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేసి ధ్రువీకరణపత్రాలు జారీచేయాలి. ఆ తర్వాత కూడా రవాణాశాఖ నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేయలేదు.
40 కేసులు..లక్ష జరిమానా!
జిల్లాలో ఐదువేలకు పైగా ప్రైవేట్‌స్కూళ్లు బస్సులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో ఒక్కోస్కూల్లో రెండు నుంచి ఐదుబస్సుల వరకు ఉన్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా 794 బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో చాలా కండీషన్‌లేని బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఒక బస్సులో 42 మంది విద్యార్థులు, మినీ బస్సులో 24 మంది విద్యార్థులను కూర్చోబెట్టాలి. కానీ ఒక్కోబస్సులో 50 మంది చిన్నారులను కుక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకు 40కేసులు నమోదుచేసి.. రూ.లక్ష వరకు జరిమానా విధించారు. సాధారణంగా ఒక స్కూలు బస్సు 15 ఏళ్ల లోపు మాత్రమే రోడ్డుపై తిరిగాలి. కానీ మారుమూల ప్రాంతాలైన కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేట, కొడంగల్ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ తిప్పుతున్నట్లు సమాచారం.
ఇవీ నిబంధనలు
నర్సరీ నుంచి పదో తరగతులను నిర్వహించే పాఠశాలల బస్సులు తప్పనిసరిగా కిటికీలకు ఇనుపగ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలి.
బస్సుబ్రేకుల కండీషన్‌లో ఉన్నాయో? లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న డ్రైవర్లనే స్కూలు బస్సులను నడిపేందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు నియమించాలి.బస్సు డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించరాదు.బస్సు నడిపే వ్యక్తి డ్రైవింగ్ సామర్థ్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటే వారిని మార్చాలి.ఇందుకోసం బస్సు వెనకభాగంలో ఎడమవైపు పాఠశాల యాజమాన్యం ఫోన్ నంబర్‌ను రాయాలి.బస్సుల్లో చెక్కసీట్లకు బదులు కుషన్ ఉన్న సీట్లను అమర్చాలి.బస్సులో ప్రయాణించే విద్యార్థుల కదలికలు డ్రైవర్ గమనించేందుకు అనువుగా రియల్‌మిర్రర్‌ను ఏర్పాటు చేయాలి.బస్సుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకుపోరాదు.అత్యవసర ద్వారం, ప్రథమచికిత్స పెట్టెలు బస్సులో అందుబాటులో ఉండాలి. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే, వాటిని నివారించేందుకు అగ్నిమాపక యంత్రం నర్సరీ నుంచి ఐదోతరగతి వరకు విద్యార్థులను తరలించే బస్సుల్లో పిల్లలు సులువుగా కిందికి దిగేందుకు వీలుగా మరోమెట్టును కిందివైపునకు అమర్చాలి.
ఫిట్‌నెస్ టెస్టులు త్వరలో పూర్తి
స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా 150బస్సులను పరీక్షించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించాం. అలాగే నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. రవాణా నిబంధనల అమలు కోసం త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.. పిల్లల తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతగా స్కూల్‌బస్సులపై నిఘా ఉంచాలి. ఏమైనా అనుమానాలుంటే తక్షణం ఫిర్యాదు చేయొచ్చు.
- ఎల్.కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్