RDA officers
-
‘ఫిట్’..ఫట్!
రోడ్డుపైకి 151 కండీషన్ లేని స్కూలు బస్సులు నిబంధనలు కాలరాస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు మేల్కొనని ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: ఆర్టీఓ విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్ పాఠశాలల ప్రచారపర్వం ముగిసి, పిల్లల మార్పుచేర్పు కూడా జరిగిపోయింది. కానీ చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సు ఫిట్నెస్ మాత్రం పూర్తికాలేదు. కండీషన్‌లేని బస్సులు రోడ్డుపై తిరుగుతూనే ఉన్నాయి. ఒక్కో బస్సులో రెండింతల విద్యార్థులను కుక్కి స్కూళ్లకు తీసుకెళ్తున్నా.. పట్టించుకునేవారు లేరు. అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్‌స్కూళ్ల యాజమాన్యాల లాభార్జన.. వెరసి విద్యార్థుల భద్రత గాల్లోదీపంగా మారింది . సాక్షి, మహబూబ్‌నగర్/క్రైం: విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే స్కూలుబస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న 794 బస్సులకు గాను ఇప్పటి 643 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 151 బస్సులు కండిషన్ లేకుండానే రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో వందలాది మంది విద్యార్థులు సురక్షితం లేని ప్రయాణం మధ్య చదువుకుంటున్నారని తెలిసింది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తరువాత కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందుగానే వాహనాల తనిఖీ బాధ్యతను విస్మరిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే పిల్లలను తీసుకెళ్లే స్కూలు బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేసి ధ్రువీకరణపత్రాలు జారీచేయాలి. ఆ తర్వాత కూడా రవాణాశాఖ నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయలేదు. 40 కేసులు..లక్ష జరిమానా! జిల్లాలో ఐదువేలకు పైగా ప్రైవేట్‌స్కూళ్లు బస్సులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో ఒక్కోస్కూల్లో రెండు నుంచి ఐదుబస్సుల వరకు ఉన్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా 794 బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో చాలా కండీషన్‌లేని బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఒక బస్సులో 42 మంది విద్యార్థులు, మినీ బస్సులో 24 మంది విద్యార్థులను కూర్చోబెట్టాలి. కానీ ఒక్కోబస్సులో 50 మంది చిన్నారులను కుక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకు 40కేసులు నమోదుచేసి.. రూ.లక్ష వరకు జరిమానా విధించారు. సాధారణంగా ఒక స్కూలు బస్సు 15 ఏళ్ల లోపు మాత్రమే రోడ్డుపై తిరిగాలి. కానీ మారుమూల ప్రాంతాలైన కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేట, కొడంగల్ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ తిప్పుతున్నట్లు సమాచారం. ఇవీ నిబంధనలు నర్సరీ నుంచి పదో తరగతులను నిర్వహించే పాఠశాలల బస్సులు తప్పనిసరిగా కిటికీలకు ఇనుపగ్రిల్స్ను ఏర్పాటు చేయాలి. బస్సుబ్రేకుల కండీషన్లో ఉన్నాయో? లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న డ్రైవర్లనే స్కూలు బస్సులను నడిపేందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు నియమించాలి.బస్సు డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించరాదు.బస్సు నడిపే వ్యక్తి డ్రైవింగ్ సామర్థ్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటే వారిని మార్చాలి.ఇందుకోసం బస్సు వెనకభాగంలో ఎడమవైపు పాఠశాల యాజమాన్యం ఫోన్ నంబర్‌ను రాయాలి.బస్సుల్లో చెక్కసీట్లకు బదులు కుషన్ ఉన్న సీట్లను అమర్చాలి.బస్సులో ప్రయాణించే విద్యార్థుల కదలికలు డ్రైవర్ గమనించేందుకు అనువుగా రియల్మిర్రర్ను ఏర్పాటు చేయాలి.బస్సుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకుపోరాదు.అత్యవసర ద్వారం, ప్రథమచికిత్స పెట్టెలు బస్సులో అందుబాటులో ఉండాలి. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే, వాటిని నివారించేందుకు అగ్నిమాపక యంత్రం నర్సరీ నుంచి ఐదోతరగతి వరకు విద్యార్థులను తరలించే బస్సుల్లో పిల్లలు సులువుగా కిందికి దిగేందుకు వీలుగా మరోమెట్టును కిందివైపునకు అమర్చాలి. ఫిట్నెస్ టెస్టులు త్వరలో పూర్తి స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా 150బస్సులను పరీక్షించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించాం. అలాగే నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. రవాణా నిబంధనల అమలు కోసం త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.. పిల్లల తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతగా స్కూల్బస్సులపై నిఘా ఉంచాలి. ఏమైనా అనుమానాలుంటే తక్షణం ఫిర్యాదు చేయొచ్చు. - ఎల్.కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్ -
ఆర్టీఏ అధికారుల దాడులు
కడప అర్బన్, న్యూస్‌లైన్ : నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సుల యాజ మాన్యాలపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝళిపించి 8 బస్సులను సీజ్ చేశారు. కలెక్టర్ శశిధర్ సూచించిన నిబంధనలను పాటించలేదని, స్టేజి క్యారియర్లను నిర్వహిస్తున్నార నే సమాచారంతో మంగళవారం ఎంవీఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో నగర శివార్లలో ట్రావెల్స్ బస్సులను, రికార్డులను పరిశీలించారు. బస్సుల్లో స్మోక్ డిటెక్టర్స్, అగ్నిమాపక నివారణ పరికరం, కనీసం రెండు సుత్తులు (హ్యామర్స్) అమర్చుకోలేదని గమనించారు. 8బస్సులను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. వాటనన్నింటిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలు కోర్టు ద్వారానే బస్సులను విడుదల చేసుకోవాల్సి ఉంది. ఈనెల 16వ తేదీన ఏఎంవీఐ హేమకుమార్ ఆధ్వర్యంలో రెండు బస్సులను సీజ్ చేశారు. వీటిని కడప డిపో ఆవరణలో ఉంచారు. ఎంవీఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలను పాటించాలని, లేకుంటే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. -
ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దందా!
సాక్షి ప్రతినిధి, న్యూస్‌లైన్: ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా.. పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా.. అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకుల వుతున్నా.. ఆర్టీఏ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరు. కళ్లముందే అదనపు ప్రయాణికులతో పాటు ప్రమాద కరమైన లగేజీని బస్సులో తరలిస్తుంటే రూ.500 తీసుకుని రైట్ చెబుతున్నారు. ఈ శాఖ అవినీతికి పునాది రాయిలా నిలిచిందని జిల్లా వాసులు నెత్తి నోరు బాదుకున్నా.. దాన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోరు. నెల వస్తే ఎవరి వాటా వారి ఇళ్లకు చేరాల్సిందే. పైసా తగ్గినా సహించరట! కింది స్థాయి సిబ్బందినీ ఉపేక్షించరట! తాజాగా మూడు నెలల పాటు సమైకాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున సాగితే ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది కూడా అందులో పాల్గొన్నారు. కాగా తిరిగి విధులకు హాజరైన సిబ్బంది పనిదినాల్లో వచ్చిన అక్రమ సొమ్మును పంచుకుని ఓ ఉన్నతాధికారికి ఆయన వాటా ముట్టజెప్పేందుకు వెళ్లారు. అక్రమ సొమ్మును లెక్కపెట్టుకున్న అధికారి డబ్బును విసిరి కొట్టినట్లు తెలిసింది. ఇదేంది లెక్క తగ్గిందని సిబ్బందిపై హుకుం జారీ చేసినట్లు సమాచారం. కాగా సిబ్బంది రెండు నెలల పాటు ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తనకు అదంతా సంబంధం లేదని అధికారి తేల్చి చెప్పారట! ప్రతి నెలా తనకు చెందాల్సిన సొమ్ము పక్కాగా ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో మీ ఇష్టం అని చెప్పడంతో సిబ్బంది వారి వాటాల్లో తగ్గించుకుని మిగిలిన సొత్తు పోగేసి ఇచ్చినట్లు తెలిసింది. చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షలు పెనుకొండ చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షల నగదు ప్రతి నెలా జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారికి ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది. కాగా ఆ డబ్బును వసూలు చేయాలంటే అక్కడి సిబ్బంది వాహనాలు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నా.. వదిలి పెట్టాల్సిందే. కాక పోతే వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. మాట వినక పోతే వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు హజరు పరుస్తూ వస్తారు. అధికారుల ఒత్తిడితోనే తాజాగా ఓ టూరిస్ట్ బస్సును కూడా రూ.500 లంచంగా తీసుకుని వదిలిపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ విషయం బహిర్గతం కావడంతో చెక్ పోస్ట్‌కు ఆఫీస్ సబార్డినేటర్లను వేయకుండా వారిని కేవలం కార్యాలయం విధులకు నియమించినట్లు తెలిసింది. చెక్‌పోస్ట్‌లో ప్రెవేట్ వ్యక్తులను నియమించి వారి ద్వారానే డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. మహాబూబ్‌నగర్ ఘటనతో కురుస్తున్న ధనం మహబూబ్‌నగర్ జిల్లా పాల్యం వద్ద ఓల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల అధికారులకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బస్సులను కట్టడి చేయాలని సూచించింది. దీంతో ఆర్టీఏ అధికారుల జేబుల్లో ధన వర్షం కురుస్తోంది. అర్ధ రాత్రిళ్లు 44వ జాతీయ రహదారిపై వందలాది బస్సులు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఓ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకే నెంబరుతో తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు స్పందించడం లేదని కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి పర్వానికి తెర వేయాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఏ అధికారుల అవినీతి బాగోతాలపై అసలు నిజాలను వెలికి తీసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ప్రైవేట్ బస్సులు సీజ్
మహబూబ్‌నగర్ ఘటన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలు పాటించని 72 బస్సులను సీజ్ చేశారు. కడప అర్బన్, న్యూస్‌లైన్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 45 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతూ బస్సులను సీజ్ చేయడం ప్రారంభించారు. కలెక్టర్ కోన శశిధర్ సంఘటన జరిగిన రోజే ఆర్టీఏ అధికారులతో సమావేశమై నిబంధనలు పాటించని ట్రావెల్స్‌ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా బస్సుల్లో భద్రతపై దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీటీసీ శ్రీకృష్ణవేణి అదేరోజు సాయంత్రం ట్రావెల్స్ యజమానులతో సమావేశమయ్యారు. కలెక్టర్ సూచించిన నిబంధనలు పాటించకపోతే రోడ్లపైకి తమ బస్సులను తీసుకురావద్దని నోటీసులు కూడా జారీ చేశారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాలకు చెందిన 72 బస్సులను రోడ్డుపైకి రాకుండా చేశారు. జిల్లాలో ట్రావెల్స్ బస్సుల పరిస్థితి కడప, ప్రొద్దుటూరు పట్టణాలలో ప్రధానంగా 72 బస్సులు రాష్ట్రంలోని వివిధ నగరాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. వీరంతా కాంట్రాక్టు క్యారేజ్ పద్ధతిలోనే ట్యాక్సు కట్టి ప్రయాణీకులను మాత్రం స్టేజి క్యారియర్లుగా తరలిస్తున్నారు. ఏ బస్సులోనూ అగ్ని ప్రమాద నివారణ పరికరాలు కనిపించకపోవడం గమనార్హం. ప్రతి బస్సులోనూ టన్నుల కొద్దీ లగేజీ తరలిస్తున్నా ఆర్టీఏ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. స్మోక్ అలారమ్‌లు ఏర్పాటు చేయకపోవడం మరొక దుస్థితి. డ్రైవర్లు ఒక్కొక్కరే పనిచేస్తూ నెలకు లేదా రెండు నెలలకోసారి వారు మారడం, కొత్త డ్రైవర్లు రావడం జరుగుతోంది. లిఖిత పూర్వకమైన హామీ ఇస్తేనే.. జిల్లాలో 72 ట్రావెల్స్ బస్సులను నడపకుండా ఎందుకు నిలిపి వేశారని ‘న్యూస్‌లైన్’ డీటీసీ శ్రీకృష్ణవేణిని వివరణ కోరగా సంఘటనలు జరిగినపుడే కొత్త నిబంధనలు విధించాల్సి వస్తుందని తెలిపారు. ఇక నుంచి ప్రతి బస్సులోనూ ప్రయాణీకుడిని సీటు ముందు భాగాన సుత్తిని అమర్చాలని, లేకుంటే ప్రయాణీకులే సుత్తి తెచ్చుకోవాలని సూచనలు కూడా చేశామన్నారు. ట్రావెల్స్ యజమానులు నిబంధనలన్నీ పాటిస్తామని లిఖిత పూర్వకమైన హామీ ఇస్తేనే ఆయా బస్సులను నడిపేం దుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ సూచించిన నిబంధనలు ట్రావెల్స్ బస్సుల్లో అత్యవసర ద్వారాలు, అగ్నిప్రమాద నివారణ పరికరాలు అమర్చుకోవాలి. డ్రైవర్లకు లెసైన్సుతోపాటు అనుభవమున్న ఇద్దరు డ్రైవర్లను, ఒక క్లీనర్‌ను నియమించుకోవాలి. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు అమర్చడంతోపాటు ప్రయాణీకుల పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రమాద, అత్యవసర సమయాల్లో వారి బంధులకు సమాచారం ఇచ్చేందుకు వారి నెంబర్లను నమోదు చేసుకోవాలి. సామర్థ్యానికి తగ్గట్టే ప్రయాణీకులను ఎక్కించుకోవాలి. ప్రతి బస్సు యజమాని తన సెల్ నెంబరుతోపాటు 24 గంటలు పనిచేసేలా టోల్‌ఫ్రీ నెంబర్లను బస్సులో కనిపించేలా ప్రదర్శింపజేయాలి. ప్రతి బస్సులోనూ ఒక ప్రయాణీకుడికి 10 కిలోల లగేజీని మాత్రమే అనుమతించాలి. అధిక లగేజీని వేసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.