మహబూబ్‌నగర్ ఘటన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ
అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలు పాటించని 72 బస్సులను సీజ్ చేశారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 45 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతూ బస్సులను సీజ్ చేయడం ప్రారంభించారు. కలెక్టర్ కోన శశిధర్ సంఘటన జరిగిన రోజే ఆర్టీఏ అధికారులతో సమావేశమై నిబంధనలు పాటించని ట్రావెల్స్‌ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆయా బస్సుల్లో భద్రతపై దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీటీసీ శ్రీకృష్ణవేణి అదేరోజు సాయంత్రం ట్రావెల్స్ యజమానులతో సమావేశమయ్యారు. కలెక్టర్ సూచించిన నిబంధనలు పాటించకపోతే రోడ్లపైకి తమ బస్సులను తీసుకురావద్దని నోటీసులు కూడా జారీ చేశారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాలకు చెందిన 72 బస్సులను రోడ్డుపైకి రాకుండా చేశారు.
జిల్లాలో ట్రావెల్స్ బస్సుల పరిస్థితి
కడప, ప్రొద్దుటూరు పట్టణాలలో ప్రధానంగా 72 బస్సులు రాష్ట్రంలోని వివిధ నగరాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. వీరంతా కాంట్రాక్టు క్యారేజ్ పద్ధతిలోనే ట్యాక్సు కట్టి ప్రయాణీకులను మాత్రం స్టేజి క్యారియర్లుగా తరలిస్తున్నారు. ఏ బస్సులోనూ అగ్ని ప్రమాద నివారణ పరికరాలు కనిపించకపోవడం గమనార్హం. ప్రతి బస్సులోనూ టన్నుల కొద్దీ లగేజీ తరలిస్తున్నా ఆర్టీఏ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. స్మోక్ అలారమ్‌లు ఏర్పాటు చేయకపోవడం మరొక దుస్థితి. డ్రైవర్లు ఒక్కొక్కరే పనిచేస్తూ నెలకు లేదా రెండు నెలలకోసారి వారు మారడం, కొత్త డ్రైవర్లు రావడం జరుగుతోంది.
లిఖిత పూర్వకమైన హామీ ఇస్తేనే..
జిల్లాలో 72 ట్రావెల్స్ బస్సులను నడపకుండా ఎందుకు నిలిపి వేశారని ‘న్యూస్‌లైన్’ డీటీసీ శ్రీకృష్ణవేణిని వివరణ కోరగా సంఘటనలు జరిగినపుడే కొత్త నిబంధనలు విధించాల్సి వస్తుందని తెలిపారు. ఇక నుంచి ప్రతి బస్సులోనూ ప్రయాణీకుడిని సీటు ముందు భాగాన సుత్తిని అమర్చాలని, లేకుంటే ప్రయాణీకులే సుత్తి తెచ్చుకోవాలని సూచనలు కూడా చేశామన్నారు. ట్రావెల్స్ యజమానులు నిబంధనలన్నీ పాటిస్తామని లిఖిత పూర్వకమైన హామీ ఇస్తేనే ఆయా బస్సులను నడిపేం దుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.
కలెక్టర్ సూచించిన నిబంధనలు
ట్రావెల్స్ బస్సుల్లో అత్యవసర ద్వారాలు, అగ్నిప్రమాద నివారణ పరికరాలు అమర్చుకోవాలి.
డ్రైవర్లకు లెసైన్సుతోపాటు అనుభవమున్న ఇద్దరు డ్రైవర్లను, ఒక క్లీనర్‌ను నియమించుకోవాలి.
ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు అమర్చడంతోపాటు ప్రయాణీకుల పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి.
ప్రమాద, అత్యవసర సమయాల్లో వారి బంధులకు సమాచారం ఇచ్చేందుకు వారి నెంబర్లను నమోదు చేసుకోవాలి.
సామర్థ్యానికి తగ్గట్టే ప్రయాణీకులను ఎక్కించుకోవాలి.
ప్రతి బస్సు యజమాని తన సెల్ నెంబరుతోపాటు 24 గంటలు పనిచేసేలా టోల్‌ఫ్రీ నెంబర్లను బస్సులో కనిపించేలా ప్రదర్శింపజేయాలి.
ప్రతి బస్సులోనూ ఒక ప్రయాణీకుడికి 10 కిలోల లగేజీని మాత్రమే అనుమతించాలి. అధిక లగేజీని వేసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రైవేట్ బస్సులు సీజ్
Published Sat, Nov 2 2013 3:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement