టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. దీంతో మరో హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. రానా ప్రస్తుతం రాక్షస రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు.
కాగా.. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి గుర్గావ్‌లో జరిగిన సినాప్స్ -2024 ఈవెంట్‌కు రానా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన రానా తన ఆరోగ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. అంతేకాదు చిన్న వయసులోనే కార్నియా మార్పిడి జరిగినట్లు వెల్లడించారు. ప్రకృతినే అన్నింటికంటే మెరుగైన వైద్యమని రానా పేర్కొన్నారు. గతంలో తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు ప్రకృతి సాయం చేసిందని రానా వివరించారు.
రానా మాట్లాడుతూ.. 'అన్నీ సౌకర్యాలున్నా ఆసుపత్రిలో అసంతృప్తితో ఉన్నా. అనారోగ్యం కారణంగా యుఎస్‌లోని మాయో క్లినిక్‌లో ఉన్నా. నాకు ఏం జరిగిందో గుర్తించగలిగే ఏకైక ప్రదేశం అదే. మనం ప్రాణాంతక స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తాం. అప్పటి నుంచే ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోయింది' అని అన్నారు. అన్నింటిలో మనం అనుకుంటున్నట్లుగా జీవితం ఉండదని అర్థమైందని రానా తెలిపారు.
హెల్త్ కండీషన్ గురించి మాట్లాడుతూ.. 'బాహుబలి సినిమా కోసమే తాను అలా మారినట్లు అందరూ భావించారు. అనారోగ్యంతో ఉన్నారా? అని కొందరు అడిగారు కూడా. కానీ నేను వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. ఆ పరిస్థితుల్లో నగర ప్రజలతో జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరైనా నా ఆరోగ్యం గురించి అడిగితే.. మీరు కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప.. దాని గురించి అడగవద్దని చెప్పా. ఆ సమయంలో నేను చేస్తున్నది నాకే నచ్చలేదు.' అని అన్నారు.
'ప్రకృతే గొప్ప వైద్యం'
రానా మాట్లాడుతూ.. 'ఒకసారి నా సినిమా కోసం అడవిలో షూట్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నా. అడవిలో ఏనుగులతో షూటింగ్ చేశాం. అక్కడ నన్ను అడిగేవాళ్లు లేరు. కనీసం నేను అనారోగ్యంతో ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అడవిలో నిశ్శబ్దమే నా జీవితంలో అవసరమనిపించింది. అన్నింటి కంటే ప్రకృతే గొప్ప వైద్యమని తెలిసింది' అంటూ రానా చెప్పుకొచ్చారు. కాగా.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు సోలమన్ తెరకెక్కించిన తమళ చిత్రం కాదన్ రీమేక్‌లో రానా నటించారు. ఈ సినిమా ఎక్కువగా అడవిలోనే షూట్ చేశారు. ఈ మూవీని తెలుగులో అరణ్య, హిందీలో హాథీ మేరే సాథీ పేర్లతో విడుదలైంది.
కాగా.. గతేడాది రానా పుట్టిన రోజు ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పోస్టర్‌లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment