కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నాడు ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కింద ఎంపీలంతా తమ ప్రాంతంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ యూపీలోని సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలోగల జయపూర్ గ్రామాన్ని పదేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. మరి ఆ గ్రామ పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈ పదేళ్లలో ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సందీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో ఇక్కడ బ్యాంకులు, రోడ్లు ఉండేవి కావని, ఇప్పుడు గ్రామంలో కాంక్రీట్ రోడ్లు కూడా ఏర్పడ్డాయని, బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయని అన్నారు.
గ్రామంలో జల్ నిగం ఏర్పాటైన తర్వాత ఇంటింటికి పైపులైన్ ద్వారా నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పడిందని, ఉజ్వల పథకం కింద పలువురు లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్లు పొందారన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరయ్యాయన్నారు.
గ్రామానికి చెందిన మరో యువకుడు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జయపూర్ గ్రామంలో రెండు బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసు తెరుచుకున్నాయన్నారు. రోడ్ల నిర్మాణం, నీటి వసతి ఏర్పాట్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు నోచుకున్నాయన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలని అన్నారు.
గ్రామానికి చెందిన మహిళ ధర్మశీల మాట్లాడుతూ ప్రధాని మోదీ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తమకు ఉపాధి అవకాశాలు వచ్చాయని, కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతున్నామన్నారు. ఇంతకు ముందు గ్రామ శివార్లలోని బావి నుంచి నీటిని తెచ్చుకునేవారమని, ఇప్పుడు ఇంట్లోనే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు.
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ప్రధాని మోదీ దత్తత తీసుకున్న ఈ జయపూర్ గ్రామ జనాభా సుమారు 3,100. ఈ గ్రామంలో మొత్తం 2,700 మంది ఓటర్లు ఉన్నారు. వారణాసి రైల్వే స్టేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment