చక్కెర కావాలా నాయనా! | Sugar Industry officers neglected | Sakshi
Sakshi News home page

చక్కెర కావాలా నాయనా!

Published Thu, Jan 1 2015 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

Sugar Industry officers neglected

బుచ్చిరెడ్డిపాళెం : కర్మాగార అధికారుల నిర్లక్ష్యం, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేమితో కోవూరు చక్కెర కర్మాగారంలో చక్కెర అమ్మకాల్లో గోల్‌మాల్ జరిగింది. కలెక్టర్, జేసీ సమక్షంలో జరగాల్సిన అమ్మకాలు కర్మాగారం అధికారులే జరిపారు. నగదును డీడీల రూపంలో తీసుకోకుండా చెక్ తీసుకున్నారు. తీరా చెక్ బౌన్స్ కావడంతో జాగ్రత్తపడేందుకు మరో ఆలోచన చేశారు. విషయాన్ని గోప్యంగా ఉంచి జిల్లా అధికారుల వద్దకు అమ్మకాల వ్యవహారాన్ని తీసుకెళ్లారు. రెండు సీజన్ల నిల్వ చక్కెరకు మళ్లీ తాజాగా సోమవారం టెండర్లు పిలిచారు. వివరాల్లోకి వెళితే.... కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో 2012-13 సంవత్సరానికి 2,428 హెక్టార్లలో చెరకును సాగుచేశారు. అందుకు సంబంధించి 1.73 లక్షల మెట్రిక్ టన్నులకు కర్మాగారం అగ్రిమెంట్ జరిగింది. అయితే కర్మాగారంలో ఎక్కువసార్లు బ్రేక్‌డౌన్ జరగ డంతో కేవలం 89,356 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ జరిగింది.
 
 దీంతో అగ్రిమెంట్ జరిగిన మిగతా 84వేల మెట్రిక్ టన్నుల చెరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా చక్కెర కర్మాగారాలకు తరలింది. ఇదిలా ఉంటే అగ్రిమెంట్ కాని చెరకు 55 వేల మెట్రిక్ టన్నుల చెరకు కర్మాగారం పరిధిలో ఉంది. దానిని కూడా మహబూబ్‌నగర్, ఖమ్మం, కృష్ణా, చిత్తూరు జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు రైతులు తరలించారు. అయితే కోవూరు చక్కెర కర్మాగారంలో క్రషింగ్ జరిగిన 89,356 మెట్రిక్ టన్నుల చెరకుకు 63,515 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. కలెక్టర్ జోక్యంతో ఇందులో 59,519 క్వింటాళ్ల చక్కెర అమ్మకాలు జరిగాయి. 3,996 క్వింటాళ్ల చక్కెర మిగిలిపోయింది. అలాగే 2011-12 గాను కర్మాగారంలో 1,06,406 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ కాగా 80వేల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. అందులో అమ్మకాలు పోగా 248 క్వింటాళ్ల చక్కెర మిగిలింది. దీంతో రెండు సీజన్లకు గాను 4,244 క్వింటాళ్ల చక్కెర నిల్వ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది.
 
 అధికారుల నిర్లక్ష్యం ఇలా..
 సహాయ చక్కెర కమిషనర్ సత్యనారాయణ హయాంలో 4,244 క్వింటాళ్లకు సంబంధించి అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరిగాయి. అవి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు సంబంధం లేకుండా జరిగినట్లు సమాచారం. అయితే చక్కెరను కొనేందుకు వచ్చిన ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు డీడీలు తీసుకురాగా, మరో వ్యక్తి చెక్‌బుక్‌తో వచ్చాడు. అయితే డీడీలు తెచ్చిన వ్యక్తులు కిలో రూ.18.19 లెక్కన చక్కెర కొనుగోలుకు రాగా, మరో వ్యక్తి దాదాపు రూ.25 వరకు కొనేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఆ వ్యక్తికే చక్కెరను అధికారులు అమ్మారు. ఆ సమయంలో అతను కేవలం చెక్‌ను మాత్రమే అధికారులకు ఇచ్చాడు. అయితే అతను కొన్న రెండు రోజులకే మార్కెట్లో ధర అమాంతంగా పడిపోవడంతో చ క్కెరను తరలించేందుకు ముందుకు రాలేదు. ఇదే సమయంలో కొన్న వ్యక్తి ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో జమచేయగా అది కాస్తా బౌన్స్ అయ్యింది. కొన్నవ్యక్తి ఎవరో తెలియక, కోర్టులో కేసు వేయలేక అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా జాయింట్ కలెక్టర్ సమక్షంలో మళ్లీ నిల్వ ఉన్న 4,244 క్వింటాళ్ల చక్కెరకు టెండర్లు పిలిచారు. వీటిలో మంచి చక్కెర 767 క్వింటాళ్లు ఉండగా తడిసిన చక్కెర 3,767 క్వింటాళ్లు ఉంది. వీటిలో సోమవారం సాయంత్రం 3,767 క్వింటాళ్లకు కిలో రూ.16.10 లెక్కన టెండరు ఖరారైంది. దీనిపై బుధవారం జాయింట్ కలెక్టర్ ఆమోదం లభించింది. అయితే మిగిలిన మంచి చక్కెర 767 బస్తాలకు జనవరి 20న పర్చేసింగ్ కమిటీ సభ్యులు, జేసీ కూర్చుని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
 
 వేబిల్లు పరిస్థితి ఏమిటో..?
 ఇప్పుడు చక్కెరను తరలించేందుకు వే బిల్లులు తప్పనిసరిగా మారాయి. వేబిల్లుల ప్రక్రియ కర్మాగారం అధికారులు చేస్తారా, కొనుగోలుదారుడు తెచ్చుకుంటాడా అన్న అంశం సంశయంగా మారింది. దీంతో చక్కెర తరలింపులో జాప్యం నెలకొంది. ఇప్పటికైనా కోవూరు చక్కెర కర్మాగారంలో అవకతవలపై జరుగుతున్న గోల్‌మాల్‌పై కలెక్టర్ జానకి, జాయింట్ కలెక్టర్ రేఖారాణి దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement