sugar industry
-
ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రెసిడెంట్ ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. అప్పుడే 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణాన్ని 20 శాతానికి (ఈ20) పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడగలదని పేర్కొన్నారు. ఈ20 లక్ష్య సాధన కోసం 1,000 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా చెరకు, చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు మరింత అధిక తయారీ సామర్థ్యాలు, మరిన్ని డిస్టిలరీలు అవసరమవుతాయని ఆదిత్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వ విధానాలపరమైన తోడ్పాటు కావాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమ ఇప్పటికే పూర్తి ఉత్పత్తి సామర్థ్యాలతో పనిచేస్తోందని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదిత్య వివరించారు. చక్కెర పరిశ్రమ ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతోందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చెరకు పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వ్యవసాయ వ్యర్ధాల్లాంటి వనరుల నుండి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు స్పష్టమైన విధానాలు కీలకం హెచ్ఎంఎస్ఐ సీఈవో ఒగాటా దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలంటే స్పష్టమైన, స్థిరమైన విధానాల ప్రణాళిక కీలకమని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్ అత్సుషి ఒకాటా చెప్పారు. ప్రభుత్వ విజన్‌ను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇంధన సరఫరా, ధర వంటి సవాళ్లను పరిష్కారం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రణాళిక విజయవంతంగా అమలయ్యేందుకు తగిన విధానం అవసరమన్నారు. -
చేదెక్కనున్న చక్కెర..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో చక్కెర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం తగ్గగా, వచ్చే ఏడాది మరింత పడిపోయే అవకాశముందని కర్మాగారాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పదకొండు చక్కెర కర్మాగారాలకు గాను బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2008, ఎన్డీఎస్ఎల్ పరిధిలోని మరో మూడు చక్కెర కర్మాగారాలు 2016 నుంచి మూతపడ్డాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రతి ఏటా చెరకు క్రషింగ్ సీజన్ నవంబర్ రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా, చెరకు కొరతతో క్రిష్ణవేణి చక్కెర కర్మాగారం మినహా, మిగతావన్నీ డిసెంబర్ మొదటి వారంలో క్రషింగ్ ప్రారంభించాయి. గత ఏడాది రాష్ట్రంలో సుమారు 29 వేల హెక్టార్లలో చెరకు సాగు చేయగా, ఈ ఏడాది 27 వేల హెక్టార్లకు సాగు విస్తీర్ణం పడిపోయింది. మంజీర నది పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గణపతి, గాయత్రి చక్కెర కర్మాగారాల పరిధిలో సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లోనూ రైతులు వరి, మొక్కజొన్న సాగువైపు మొగ్గుచూపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ప్లాంటేషన్ సీజన్లోనూ చెరుకు సాగు విస్తీర్ణం ఆశాజనకంగా లేదని చక్కెర శాఖ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది (2020–21) రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి సగానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల పూర్తిస్థాయి క్రషింగ్ సామర్ధ్యం 33 లక్షల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ ఏడాది 15లక్షల మెట్రిక్ టన్నులకు మించి క్రషింగ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కష్టకాలంలో కర్మాగారాలు.. ఈ ఏడాది చెరుకు రైతులకు టన్నుకు సగటున రూ.3,080 చొప్పున మద్దతు ధర (ఎఫ్ఆర్పీ) చెల్లిస్తుండగా, పొరుగున ఉండే కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన చక్కెర కర్మాగారాలు అదనంగా టన్నుకు రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లిస్తున్నాయి. స్థానికంగా క్రషింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు చెరుకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గత ఏడాది ఆల్కహాల్ తయారీకి సహకరించిన కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంది. కాకతీయ, గణపతి చక్కెర కర్మాగారాల్లో కార్మికులు, యాజమాన్యం నడుమ నెలకొన్న వివాదాలు కూడా క్రషింగ్‌పై కొంత ప్రభావం చూపాయి. చెరుకు సాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం, క్రషింగ్ సామరŠాధ్యనికి సరిపడా చెరుకు సరఫరా కాకపోవడంతో సీజన్‌ను కుదించాల్సిన పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయి. గత ఏడాది 24.83 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును క్రషింగ్ చేసి, 2.56 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి సాధించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ఏడు కర్మాగారాల పరిధిలో చక్కెర ఉత్పత్తి 1.6 లక్షల టన్నులకు మించక పోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కర్మాగారాల వద్ద కిలో చక్కెర ధర రూ.35 పలుకుతుండగా, బయట మార్కెట్ ధరలతో పోలిస్తే తమకు అంతగా లాభసాటిగా లేదని కర్మాగారాల ప్రతినిధులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు సాగును ప్రోత్సహించని పక్షంలో రాబోయే రోజుల్లో చక్కెర కర్మాగారాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయనే ఆందోళన అటు కర్మాగారాలు, ఇటు చెరుకు రైతులు వ్యక్తం చేస్తున్నారు. -
చక్కెర రంగానికి రూ.5,538 కోట్లు
న్యూఢిల్లీ: చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల మేర ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. చెరకు పండించే వారికి ఇచ్చే ఉత్పత్తి సాయం, ఎగుమతి చేసే మిల్లులకు ఇచ్చే రవాణా సబ్సిడీ రెండు రెట్లకు పైగా పెరిగింది. మిగులు చక్కెర నిల్వల సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో చక్కెర పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన మూడో సాయం ఇది. ఇప్పటికే షుగర్‌కేన్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు అధిక ధరలు నిర్ణయించడంతోపాటు, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు ఆర్థిక సాయం అందించడం వంటి చర్యల్ని కేంద్రం గతంలో ప్రకటించింది. అతి త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అధిక ఉత్పత్తికి పరిష్కారం ‘‘గతేడాది, ఈ సంవత్సరం కూడా చక్కెర తయారీ అధికంగా ఉంది. వచ్చే ఏడాది కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా. దీంతో అధిక ఉత్పత్తి సమస్యను పరిష్కరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఓ సమగ్ర విధానానికి ఆమోదం తెలిపింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. చెరకు ఉత్పత్తి, ఎగుమతి వ్యయాల తగ్గింపునకు మొత్తం రూ.5,538 కోట్ల రూపాయిల సాయం అందించనున్నట్టు చెప్పారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో దేశీయ మార్కెట్ స్థిరపడడంతోపాటు చెరకు రైతులకు మిల్లులు చెల్లింపులు చేయగలవని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ప్యాకేజీలోని అంశాలు... 2018–19 మార్కెటింగ్ సంవత్సరానికి క్వింటాల్ చెరకు క్రషింగ్‌కు గాను ప్రభుత్వం రూ.13.88 సాయం అందిస్తుంది. 2017–18 మార్కెటింగ్ సంవత్సరానికి ఈ సాయం రూ.5.50గానే ఉంది. ఈ ఒక్క సాయానికే రూ.4,163 కోట్ల మేర కేంద్రంపై భారం పడుతుంది. 2018–19 మార్కెటింగ్ సంవత్సరం (అక్టోబర్–సెప్టెంబర్)లో 5 మిలియన్ టన్నుల ఎగుమతులకు గాను అంతర్గత రవాణా, నిర్వహణ చార్జీల రూపంలో మిల్లులకు పరిహారం లభించనుంది. పోర్ట్‌లకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మిల్లులు, అవి ఎగుమతి కోసం చేసే రవాణా వ్యయాలపై ప్రతీ టన్నుకు రూ.1,000 సబ్సిడీగా అందుతుంది. 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటే టన్నుకు సబ్సిడీ రూ.2,500 లభిస్తుంది. తీర రాష్ట్రాల్లోని మిల్లులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని మిల్లులకు టన్నుపై రూ.3,000 లేదా వాస్తవంగా అయిన వ్యయం... ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంతమేర సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.1,375 కోట్ల భారం పడుతుంది. అయితే, ఈ రెండు ప్రయోజనాలను మిల్లులకు నేరుగా ఇవ్వకుండా, అవి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు తీర్చేందుకు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. చక్కెర కర్మాగారాలు రైతులకు రూ.13,567 కోట్ల బకాయిలు (యూపీలోని మిల్లులకే రూ.9,817 కోట్లు) చెల్లించాల్సి ఉంది. అవి తీర్చడంతోపాటు, ఎగుమతులు పెంపునకు కేంద్రం చర్యలు వీలు కల్పించనున్నాయి. నూతన టెలికం పాలసీకి పచ్చజెండా నూతన టెలికం విధానం ‘నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్డీసీపీ) 2018’కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ విధానం లక్ష్యాలుగా ఉన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు అంతర్జాతీయంగా చాలా వేగంగా మారుతున్నాయని... ముఖ్యంగా 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్ విభాగాల్లో ఈ పరిస్థితి ఉందని కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. జీడీపీలో టెలికం రంగం వాటా ప్రస్తుతం ఆరు శాతంగా ఉంటే, అది ఎనిమిది శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలివస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. సమాచార సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, 5జీ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందరికీ అధిక వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులో ఉంచడం, 40 లక్షల ఉద్యోగాల కల్పన, ఐసీటీ సూచీలో భారత ర్యాంకును 50కు తీసుకురావడం నూతన విధానం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. జీఎస్టీఎన్ ఇక పూర్తిగా ప్రభుత్వ సంస్థ జీఎస్టీకి ఐటీ వ్యవస్థను అందించే జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్)ను నూరు శాతం ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం అనుమతి తెలిపినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జీఎస్టీఎన్ను పునర్వ్యవస్థీకరించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యాజమాన్యాన్ని సమంగా వేరు విభజించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జీఎస్టీఎన్లో కేంద్రం, రాష్ట్రాలకు కలిపి 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఉంది. ఐటీడీసీ హోటళ్ల విక్రయాలు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా జమ్మూ కశ్మీర్, బిహార్ రాష్ట్రాల్లో ఐటీడీసీకి ఉన్న రెండు హోటళ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయించింది. -
చక్కెర పరిశ్రమకు ఊరట : భారీ ప్యాకేజీ
సాక్షి, ముంబై: భారత చక్కెర పరిశ్రమకు కేంద్రం తీపి కబురు అందించింది. చక్కెర పరిశ్రమలో సంక్షోభాలను గట్టెక్కించడంకోసం కేంద్ర క్యాబినెట్ రు.4,500 కోట్ల ప్యాకేజీ అందించనుంది. ఈ మేరకు ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈసీ) ఆమోదం లభించింది. తద్వారా చక్కెర మిగులు నిల్వలను పరిష్కరించడానికి, భారీ చెరకు బకాయిలు రూ. 130 బిలియన్ల మేరకు క్లియర్ చేయటానికి సహాయం చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో పెంచిన రు.5.50కు ఇది అదనపు పెంపు. గత జూన్ మాసంలోనే చక్కెర పరిశ్రమకు కేంద్రం రు. 8,500కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. షుగర్ పరిశ్రమలకు ఇచ్చే ఇథనాల్ ఉత్పత్తి రాయితీ రు. 4,400 కోట్ల నిధులు కూడా ఇందులోనే చేర్చారు. తాజా నిర్ణయం ప్రకారం దాదాపు రు.1,332 కోట్ల వడ్డీ రాయితీని కేంద్రం భరించనుంది. 5మిలియన్ టన్నుల ఎగుమతే లక్ష్యం: 2018-19మార్కెటింగ్ (అక్టోబరు-సెప్టెంబర్) సంవత్సరంలో దాదాపు 5 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తులను ఎగుమతి చేయలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. 2017-2018 సంవత్సరానికి గాను 32 మిలియన్ టన్నులకే దిగుమతి పరిమితం కావడంతో ఈ దిగుబడులను మరింత పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2018-19 5 మిలియన్ టన్నుల వరకు ఎగుమతులపై చెరకు రైతులకు, రవాణాపై మిల్లులకు సబ్సిడీని రెండు రెట్లు పెంచనుంది. షుగర్ షేర్లు జూమ్: నాలుగు వేల కోట్ల ప్యాకేజ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో షుగర్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శ్రీ రేణుకా షుగర్స్, బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, బలరాంపూర్ చిన్నీ, దాల్మియా షుగర్స్, ఈఐడీ ప్యారీ అన్నారిఅమ్మాన్ షుగర్స్ , ద్వారకేష్ షుగర్స్, ఉత్తమ్ షుగర్స్ , రానా షుగర్స్, ఆంధ్ర షుగర్స్ వంటి కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. దాదాపు 8శాతానికిపై గా లాభపడ్డాయి. -
చక్కెరకు జీఎస్టీ పన్ను పోటు వద్దు
మంత్రి ఈటలకు షుగర్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: చక్కెర పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ షుగర్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి ఈటలతో భేటీ అయ్యారు. జీఎస్టీ అమలవనున్న నేపథ్యంలో చక్కెరపై పన్నులు విధిస్తే నేరుగా చెరుకు పండించే రైతులపై ఏ మేరకు భారం పడుతుందనే కోణంలో చర్చించారు. చక్కెర వినియోగంలో భారత్ మొదటిస్థానంలో, తయారీలో రెండోస్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రంగంపై జీఎస్టీ పన్ను పోటు లేకుండా చూడాలని అసోసియేషన్ అధ్యక్షుడు సరితారెడ్డి, కార్యదర్శి భలేరావు విజ్ఞప్తి చేశారు. చక్కెర పరిశ్రమను 6 శాతం పన్నుల కేటగిరీలోకి తీసుకురావాలని, ఇథనాల్ తయారీపై ఎలాంటి వడ్డింపులు లేకుండా చూడాలని పరిశ్రమల ప్రతినిధులు కోరారు. -
చక్కెర పరిశ్రమ సమస్యల పరిష్కారం తప్పనిసరి..
హైదరాబాద్: చక్కెర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ భారత చక్కెర కర్మాగారాల సంఘం (తెలంగాణ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌లకు ఈ మేరకు సంఘం ప్రెసిడెంట్ టి సరితా రెడ్డి, ఇతర ప్రతినిధులు ఇటీవల ఒక వినతిపత్రం సమర్పించారు. రుణ పునర్వ్యవస్థీకరణ, చక్కెర ధరకు అనుగుణంగా చెరకు ధర నిర్ణయానికి రెవెన్యూ షేరింగ్ విధాన రూపకల్పన, ప్రాధాన్యతా రంగంగా రుణ వెసులుబాటు వంటి ప్రయోజనాలను పరిశ్రమలకు కల్పించాలని వారు కోరారు. -
చక్కెర కావాలా నాయనా!
బుచ్చిరెడ్డిపాళెం : కర్మాగార అధికారుల నిర్లక్ష్యం, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేమితో కోవూరు చక్కెర కర్మాగారంలో చక్కెర అమ్మకాల్లో గోల్మాల్ జరిగింది. కలెక్టర్, జేసీ సమక్షంలో జరగాల్సిన అమ్మకాలు కర్మాగారం అధికారులే జరిపారు. నగదును డీడీల రూపంలో తీసుకోకుండా చెక్ తీసుకున్నారు. తీరా చెక్ బౌన్స్ కావడంతో జాగ్రత్తపడేందుకు మరో ఆలోచన చేశారు. విషయాన్ని గోప్యంగా ఉంచి జిల్లా అధికారుల వద్దకు అమ్మకాల వ్యవహారాన్ని తీసుకెళ్లారు. రెండు సీజన్ల నిల్వ చక్కెరకు మళ్లీ తాజాగా సోమవారం టెండర్లు పిలిచారు. వివరాల్లోకి వెళితే.... కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో 2012-13 సంవత్సరానికి 2,428 హెక్టార్లలో చెరకును సాగుచేశారు. అందుకు సంబంధించి 1.73 లక్షల మెట్రిక్ టన్నులకు కర్మాగారం అగ్రిమెంట్ జరిగింది. అయితే కర్మాగారంలో ఎక్కువసార్లు బ్రేక్‌డౌన్ జరగ డంతో కేవలం 89,356 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ జరిగింది. దీంతో అగ్రిమెంట్ జరిగిన మిగతా 84వేల మెట్రిక్ టన్నుల చెరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా చక్కెర కర్మాగారాలకు తరలింది. ఇదిలా ఉంటే అగ్రిమెంట్ కాని చెరకు 55 వేల మెట్రిక్ టన్నుల చెరకు కర్మాగారం పరిధిలో ఉంది. దానిని కూడా మహబూబ్‌నగర్, ఖమ్మం, కృష్ణా, చిత్తూరు జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు రైతులు తరలించారు. అయితే కోవూరు చక్కెర కర్మాగారంలో క్రషింగ్ జరిగిన 89,356 మెట్రిక్ టన్నుల చెరకుకు 63,515 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. కలెక్టర్ జోక్యంతో ఇందులో 59,519 క్వింటాళ్ల చక్కెర అమ్మకాలు జరిగాయి. 3,996 క్వింటాళ్ల చక్కెర మిగిలిపోయింది. అలాగే 2011-12 గాను కర్మాగారంలో 1,06,406 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ కాగా 80వేల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. అందులో అమ్మకాలు పోగా 248 క్వింటాళ్ల చక్కెర మిగిలింది. దీంతో రెండు సీజన్లకు గాను 4,244 క్వింటాళ్ల చక్కెర నిల్వ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. అధికారుల నిర్లక్ష్యం ఇలా.. సహాయ చక్కెర కమిషనర్ సత్యనారాయణ హయాంలో 4,244 క్వింటాళ్లకు సంబంధించి అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరిగాయి. అవి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు సంబంధం లేకుండా జరిగినట్లు సమాచారం. అయితే చక్కెరను కొనేందుకు వచ్చిన ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు డీడీలు తీసుకురాగా, మరో వ్యక్తి చెక్‌బుక్‌తో వచ్చాడు. అయితే డీడీలు తెచ్చిన వ్యక్తులు కిలో రూ.18.19 లెక్కన చక్కెర కొనుగోలుకు రాగా, మరో వ్యక్తి దాదాపు రూ.25 వరకు కొనేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఆ వ్యక్తికే చక్కెరను అధికారులు అమ్మారు. ఆ సమయంలో అతను కేవలం చెక్‌ను మాత్రమే అధికారులకు ఇచ్చాడు. అయితే అతను కొన్న రెండు రోజులకే మార్కెట్లో ధర అమాంతంగా పడిపోవడంతో చ క్కెరను తరలించేందుకు ముందుకు రాలేదు. ఇదే సమయంలో కొన్న వ్యక్తి ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో జమచేయగా అది కాస్తా బౌన్స్ అయ్యింది. కొన్నవ్యక్తి ఎవరో తెలియక, కోర్టులో కేసు వేయలేక అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా జాయింట్ కలెక్టర్ సమక్షంలో మళ్లీ నిల్వ ఉన్న 4,244 క్వింటాళ్ల చక్కెరకు టెండర్లు పిలిచారు. వీటిలో మంచి చక్కెర 767 క్వింటాళ్లు ఉండగా తడిసిన చక్కెర 3,767 క్వింటాళ్లు ఉంది. వీటిలో సోమవారం సాయంత్రం 3,767 క్వింటాళ్లకు కిలో రూ.16.10 లెక్కన టెండరు ఖరారైంది. దీనిపై బుధవారం జాయింట్ కలెక్టర్ ఆమోదం లభించింది. అయితే మిగిలిన మంచి చక్కెర 767 బస్తాలకు జనవరి 20న పర్చేసింగ్ కమిటీ సభ్యులు, జేసీ కూర్చుని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేబిల్లు పరిస్థితి ఏమిటో..? ఇప్పుడు చక్కెరను తరలించేందుకు వే బిల్లులు తప్పనిసరిగా మారాయి. వేబిల్లుల ప్రక్రియ కర్మాగారం అధికారులు చేస్తారా, కొనుగోలుదారుడు తెచ్చుకుంటాడా అన్న అంశం సంశయంగా మారింది. దీంతో చక్కెర తరలింపులో జాప్యం నెలకొంది. ఇప్పటికైనా కోవూరు చక్కెర కర్మాగారంలో అవకతవలపై జరుగుతున్న గోల్‌మాల్‌పై కలెక్టర్ జానకి, జాయింట్ కలెక్టర్ రేఖారాణి దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్.. చిత్తూరులో పెండింగ్
* నేటి నుంచి శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమలో క్రషింగ్.. * చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌పై నీలినీడలు * 30న ఎండీలతో సీఎం కీలక సమావేశం.. * బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకోకపోతే సహకార పరిశ్రమలకు కష్టకాలమే సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెరకు రైతుకు ఒకింత తీపి కబురు.. మరింత చేదువార్త..! క్రషింగ్కూ రికవరీకి ముడిపెట్టి డిసెం బర్ 25 తర్వాతే సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్ ప్రారంభించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం సడలించింది. రేణిగుం ట మండలం గాజులమండ్యంలోని శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమ(ఎస్వీ షుగర్స్)లో గురువారం క్రషింగ్ ప్రా రంభించనున్నారు. కానీ.. చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ(చిత్తూరు షుగర్స్)లో మాత్రం క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. రెండేళ్ల నుంచి బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఎస్వీ షుగర్స్‌కు చెరకును సరఫరా చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమల మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో బకాయిలను చెల్లించే లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సహకార పరిశ్రమలకు.. రైతులకూ ప్రయోజనం. లేదంటే ఇరు వర్గాలకూ కష్టకాలమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లాలో 87,004 హెక్టార్లలో చెరకు పంటనుసాగుచేశారు. హెక్టారుకు కనిష్ఠంగా 80 టన్నుల చొప్పున 69.6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో మూడు ప్రైవేటు, రెండు సహకార చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. ప్రైవేటు చక్కెర పరిశ్రమల్లో అక్టోబర్ నాలుగో వారం నుంచే క్రషింగ్‌ను ప్రారంభించారు. సహకార చక్కెర పరిశ్రమల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ.. డిసెంబర్ 25 తర్వాత క్రషింగ్ చేస్తే రికవరీ పర్సంటేజీ అధికంగా ఉంటుందని, అప్పుడే క్రషింగ్ ప్రారంభించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కానీ.. 1.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌కు ఎస్వీ షుగర్స్, 50 వేల టన్నుల క్రషింగ్‌కు చిత్తూరు షుగర్స్ రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. డిసెంబర్ 25 వరకూ క్రషింగ్ ప్రారంభించకపోతే.. ప్రైవేటు ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో చెరకును కొనుగోలు చేస్తాయని సహకార ప్యాక్టరీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించాయి. దాంతో ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించింది. కానీ.. చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌కు అనుమతించలేదు. మద్దతు ధరపై మీనవేషాలు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టన్ను చెరకుకు ఆయా ప్రభుత్వాలు రూ.2,650ను మద్దతు ధరగా ప్రకటించాయి. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా చెరకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించలేదు. ఎస్వీ షుగర్స్ యాజమాన్యం టన్ను చెరకును కనిష్ఠంగా రూ.1,450 నుంచి గరిష్ఠంగా రూ.1,550 వరకూ ఖరీదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెరకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తే.. ధరను పెంచాలని భావిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న ప్రైవేటు చక్కెర పరిశ్రమలు చెరకు రైతును లూటీ చేస్తున్నాయి. టన్ను చెరకు కనిష్ఠంగా రూ.1,850 నుంచి రూ.1,950 వరకూ ఖరీదు చేస్తూ చెరకు రైతును నట్టేట ముంచుతున్నాయి. గతేడాది కేన్ కమిషనర్ బెన్హర్ ఎక్కా ప్రతిపాదనల మేరకు టన్ను చెరకు రూ.2,650ను మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే మనుగడ.. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లో టన్ను చెరకుకు ప్రభుత్వం రూ.2,100ను మద్దతు ధరగా ప్రకటించింది. సహకార చక్కెర పరిశ్రమలు రైతులకు టన్ను రూ.1800 చెల్లించగా. రూ.300ను ప్రభుత్వం చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. కానీ.. ప్రభుత్వం తాను చెల్లిస్తానన్న రూ.300 రెండేళ్లుగా రైతులకు చెల్లించలేదు. గత రెండేళ్లకు గాను ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.5 కోట్ల మేర బకాయిపడింది. బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ ఏడాది క్రషింగ్ సజావుగా సాగకపోతే సహకార ఫ్యాక్టరీలకు మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార పరిశ్రమలను తెగనమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఈనెల 30న సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
చక్కెర పరిశ్రమ నెత్తిన పాలు!
సాధారణంగా పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు, బహిరంగ మార్కెట్లో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు ‘ఉద్దీపన’ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటాయి. కాని ప్రస్తుతం చక్కెర పరిశ్రమ విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. చక్కెర పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కనుగొన్న మంత్రం పంచదార మిల్లుల యజమానులకు తీయగా ఉండొచ్చునేమోగానీ, అది వినియోగదారులకు మాత్రం కచ్చితంగా చేదు గుళికే. సుగర్ మిల్లులకు ‘ఉద్దీపన’ ప్యాకేజీ ప్రకటించిన మర్నాడే షేర్మార్కెట్లో చక్కెర కంపెనీల షేర్లు పది శాతం దాకా తారాజువ్వలా దూసుకుపోయాయి. అదేస్థాయిలో కొన్ని రోజుల్లోనే బహిరంగ మార్కెట్లో పంచదార ధర దాదాపు కిలోకు రెండు రూపాయల దాకా ప్రియమవుతుందంటే నరేంద్ర మోడీ సర్కార్ ఏ వర్గం కొమ్ముకాస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా పండగ సీజన్ వచ్చిందంటే చక్కెర రేటుకు రెక్కలు వస్తాయి. కాని దానికన్న కొన్ని నెలల ముందుగానే ప్రభుత్వమే ధర పెరిగేలా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మామూలుగా పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు, బహిరంగ మార్కెట్లో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు ‘ఉద్దీపన’ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటాయి. కాని ప్రస్తుతం చక్కెర పరిశ్రమ విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. పరిశ్రమ నెత్తిన పాలుపోసి, వినియోగదారులకు కాళ్లకింద మంటపెట్టినట్టయ్యింది! నిజానికి వినియోగదారులకు అన్ని రకాలుగా ఒకేసారి కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రభుత్వం ‘ఉద్దీపన’ ప్యాకేజీ ఇచ్చిందంటే అది ‘ఆమ్ఆద్మీ’ జేబులోంచి ఇవ్వాల్సిందే కదా. తర్వాత సొంత అవసరాలకు మార్కెట్లో చక్కెరను అధిక రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తుంది! చక్కెరపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 40 శాతానికి పెంచడం, సెప్టెంబర్వరకు వర్తించేలా ఎగుమతి సబ్సిడీని టన్నుకు రూ.3,300 చొప్పున కొనసాగించడం వంటి చర్యలు కచ్చితంగా మార్కెట్లోని ఇన్వెస్టర్లను సంతోషపెట్టాయి. అంతేగాదు చక్కెర మిల్లుల యజమానులకు అదనంగా రూ. 4,400 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు వచ్చింది. అంతకుముందు ఈ పద్ధతిలో రూ. 6,600 కోట్ల దాకా రుణాలు సమకూర్చింది. చెరుకు రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ.11,000 కోట్ల దాకా బకాయిలను చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ప్యాకేజీ ఇస్తామని పాశ్వాన్ అంటున్నారు. కానీ సెప్టెంబర్‌లోగా రైతుల బకాయిలను తీర్చాల్సిందిగా మిల్లు యాజమాన్యాలను మంత్రి గట్టిగా ఎందుకు ఆదేశించలేకపోతున్నారో అర్థం కాదు. మన దేశంలో ఒక రైతు కుటుంబం నెలకు సగటు ఆదాయం రూ. 2,400 కన్నా తక్కువనే ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ పార్లమెంట్లో ప్రకటించింది. ఈ దేశానికి తిండిపెట్టే అన్నదాత పేదరికంలో మగ్గుతూ క్షుద్బాధతో అలమటించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటే ఇంతకన్నా అవహేళన మరొకటి ఉంటుందా? మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) రోజు కూలీలుగా పనిచేసే వారిలో దాదాపు 60 శాతం మందిదాకా భూమి సొంతంగా ఉన్న రైతులే ఉన్నారంటే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో విషయం ఏమంటే.... దేశంలోని రైతుల్లో దాదాపు 58 శాతం మంది ఒక పూట పస్తులతో గడుపుతున్నారు. ఇక చెరుకు రైతుల పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. ఏదో ఒకటీ అరా పెద్ద రైతులను మినహాయిస్తే అనేకమంది సన్నకారు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్క యూపీలోనే రైతుల బకాయిలు రూ. 7,900 కోట్ల మేరకు పేరుకుపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధిక స్థాయిలో ఉన్న చెరుకు మద్దతు ధరల సమస్య పరిష్కారం కాకపోతే చక్కెర పరిశ్రమ నిలదొక్కుకోలేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. చెరుకు ధరలను తగ్గించాలన్నదే వారు సూచించే పరిష్కార మార్గం. ఈ వాదనతో నేను ఏకీభవించను. రైతుల ప్రయోజనాల కోసమే చెరుకు ధరలను తగ్గించాలని వాదించేవారు అసలు మిల్లులకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో, దాని వెనక నిజమైన కారణమేమిటో తెలివిగా దాటవేస్తున్నారు. మిల్లుల ఆధునీకరణకు యాజ మాన్యాలు ఎంతమాత్రం సిద్ధంగా లేవు. పచ్చి నిజం ఏమంటే... చక్కెర పరిశ్రమ యజమానుల అసమర్థ నిర్వాకానికీ అటు రైతులూ, ఇటు వినియోగదారులూ భారీగా మూల్యం చెల్లించుకోవల్సి వస్తోంది. (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) దేవందర్ -
చక్కెర మిల్లులకు తీపి కబురు..
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న చక్కెర కర్మాగారాలకు తీపి కబురు ఇది. చెరకు రైతులకు చెల్లింపులు చేసేందుకు మిల్లులకు రూ.6,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలపై వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.2,750 కోట్ల మేరకు ఉండే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. గురువారం నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ తెలిపారు. ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులు గట్టెక్కడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం చేసిన సిఫార్సుల మేరకు సీసీఈఏ ఈ నిర్ణయం తీసుకుంది. షుగర్ మిల్లులకు ఈ రుణాలను బ్యాంకులు సమకూరుస్తాయి. చెరకు రైతులకు చెల్లించడానికి మాత్రమే ఈ సొమ్మును వినియోగించాలి. రైతుల పాత బకాయిలనూ తీర్చవచ్చు. గత మూడేళ్లలో చక్కెర మిల్లులు చెల్లించిన ఎక్సైజ్ సుంకానికి సమాన స్థాయిలో రుణాలలిస్తారు. వీటిని ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి. రుణ చెల్లింపుపై తొలి రెండేళ్లు మారటోరియం సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అంటే మూడో ఏట నుంచి రుణ చెల్లింపు ప్రారంభించవచ్చు. పరిమాణపరంగా ఎలాంటి ఆంక్షల్లేకుండా పంచదార ఎగుమతులను కొనసాగించాలన్న ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. దేశీయ మార్కెట్లో అవసరానికి మించి చక్కెర నిల్వలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ చెప్పారు. బొగ్గు గనుల నుంచి గ్యాస్ ఉత్పత్తికి అనుమతి తమ అధీనంలోని బొగ్గు గనుల సహజ వాయువు ఉత్పత్తి చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్‌కు లెసైన్స్ ఇవ్వాలని సీసీఈఏ నిర్ణయించింది. కోల్ ఇండియాకు చెందిన బొగ్గు గనుల్లో కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) అన్వేషణ, ఉత్పత్తికి అనుమతించినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. ఆహార భద్రతా ప్రణాళిక, వాణిజ్య సహకార ఒప్పందాలపై ఇటీవలి డబ్ల్యుటీఓ సదస్సులో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని సీసీఈఏ సమర్థించింది. భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలపై శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఈ అంశాన్ని సవాలు చేయరాదని బాలిలో జరిగిన డబ్ల్యుటిఓ సదస్సులో నిర్ణయించారు.