ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్.. చిత్తూరులో పెండింగ్
* నేటి నుంచి శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమలో క్రషింగ్..
* చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌పై నీలినీడలు
* 30న ఎండీలతో సీఎం కీలక సమావేశం..
* బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకోకపోతే సహకార పరిశ్రమలకు కష్టకాలమే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెరకు రైతుకు ఒకింత తీపి కబురు.. మరింత చేదువార్త..! క్రషింగ్‌కూ రికవరీకి ముడిపెట్టి డిసెం బర్ 25 తర్వాతే సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్ ప్రారంభించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం సడలించింది. రేణిగుం ట మండలం గాజులమండ్యంలోని శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమ(ఎస్వీ షుగర్స్)లో గురువారం క్రషింగ్ ప్రా రంభించనున్నారు. కానీ.. చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ(చిత్తూరు షుగర్స్)లో మాత్రం క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు.
రెండేళ్ల నుంచి బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఎస్వీ షుగర్స్‌కు చెరకును సరఫరా చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమల మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో బకాయిలను చెల్లించే లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సహకార పరిశ్రమలకు.. రైతులకూ ప్రయోజనం. లేదంటే ఇరు వర్గాలకూ కష్టకాలమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
జిల్లాలో 87,004 హెక్టార్లలో చెరకు పంటనుసాగుచేశారు. హెక్టారుకు కనిష్ఠంగా 80 టన్నుల చొప్పున 69.6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో మూడు ప్రైవేటు, రెండు సహకార చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. ప్రైవేటు చక్కెర పరిశ్రమల్లో అక్టోబర్ నాలుగో వారం నుంచే క్రషింగ్‌ను ప్రారంభించారు. సహకార చక్కెర పరిశ్రమల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ.. డిసెంబర్ 25 తర్వాత క్రషింగ్ చేస్తే రికవరీ పర్సంటేజీ అధికంగా ఉంటుందని, అప్పుడే క్రషింగ్ ప్రారంభించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
కానీ.. 1.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌కు ఎస్వీ షుగర్స్, 50 వేల టన్నుల క్రషింగ్‌కు చిత్తూరు షుగర్స్ రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. డిసెంబర్ 25 వరకూ క్రషింగ్ ప్రారంభించకపోతే.. ప్రైవేటు ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో చెరకును కొనుగోలు చేస్తాయని సహకార ప్యాక్టరీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించాయి. దాంతో ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించింది. కానీ.. చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌కు అనుమతించలేదు.
మద్దతు ధరపై మీనవేషాలు..
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టన్ను చెరకుకు ఆయా ప్రభుత్వాలు రూ.2,650ను మద్దతు ధరగా ప్రకటించాయి. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా చెరకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించలేదు. ఎస్వీ షుగర్స్ యాజమాన్యం టన్ను చెరకును కనిష్ఠంగా రూ.1,450 నుంచి గరిష్ఠంగా రూ.1,550 వరకూ ఖరీదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెరకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తే.. ధరను పెంచాలని భావిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న ప్రైవేటు చక్కెర పరిశ్రమలు చెరకు రైతును లూటీ చేస్తున్నాయి. టన్ను చెరకు కనిష్ఠంగా రూ.1,850 నుంచి రూ.1,950 వరకూ ఖరీదు చేస్తూ చెరకు రైతును నట్టేట ముంచుతున్నాయి. గతేడాది కేన్ కమిషనర్ బెన్‌హర్ ఎక్కా ప్రతిపాదనల మేరకు టన్ను చెరకు రూ.2,650ను మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బకాయిలు చెల్లిస్తేనే మనుగడ..
2012-13, 2013-14 క్రషింగ్ సీజన్‌లో టన్ను చెరకుకు ప్రభుత్వం రూ.2,100ను మద్దతు ధరగా ప్రకటించింది. సహకార చక్కెర పరిశ్రమలు రైతులకు టన్ను రూ.1800 చెల్లించగా. రూ.300ను ప్రభుత్వం చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. కానీ.. ప్రభుత్వం తాను చెల్లిస్తానన్న రూ.300 రెండేళ్లుగా రైతులకు చెల్లించలేదు. గత రెండేళ్లకు గాను ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.5 కోట్ల మేర బకాయిపడింది. బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ ఏడాది క్రషింగ్ సజావుగా సాగకపోతే సహకార ఫ్యాక్టరీలకు మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార పరిశ్రమలను తెగనమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఈనెల 30న సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.