Crushing
-
కరిగిపోతున్న ప్రకృతి సంపద: అప్పుడలా.. ఇప్పుడిలా!
సాక్షి, కరీనంగర్: ప్రకృతి సంపద కరిగిపోతోంది.. ఆహ్లాదం పంచే గుట్టలు కనుమరుగవుతున్నాయి.. గ్రానైట్, క్రషింగ్ తదితర చర్యలతో అంతరించిపోతోంది. సహజసిద్ధమైన గుట్టలపై ఉన్న చెట్ల సంపద కూడా తరిగిపోతుంది. గుట్టలు తవ్వి అక్రమార్కులు రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. పెద్ద మొత్తంలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. క్వారీలు, క్రషర్ల పేరుతో అలనాటి పచ్చదనం కాస్త కాంట్రాక్టర్లకు పసిడి తనంగా మారిపోతుంది. అక్రమార్కుల చేతిలో కొండలు, గుట్టలు రోజురో జుకూ కరిగిపోతున్నాయి. 2017 లో సగం వరకు ‘సాక్షి’ కెమెరాకు కనిపించిన బసంత్‌నగర్ సమీపంలోని అతిపెద్ద గుట్ట క్రషింగ్‌తో ఆగస్టు 2, 2021 వరకు ఇలా అడుగంటి అంతరించిపోతోంది.. మరో నాలుగేళ్లకు ఇక్కడ గుట్ట ఉండేదట అని చెప్పుకోవాల్సిన వస్తోందని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు అనుకుంటున్నారు. క్వారీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పర్యావరణానికి తీరని నష్టం వాటిలుతున్న ఎవ్వరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు మాత్రం పట్టింపులేకుండా పోతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పెరుగుతోంది
జిల్లాలో 2274 హెక్టార్లలో పెరిగిన చెరకు సాగు రెండు జిల్లాల్లో రైతులకు చెల్లించాల్సిన పాత బకాయి రూ. 9.85 కోట్లు క్రషింగుకు ముందే చెల్లించాలంటున్నఅన్నదాత బొబ్బిలి : జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. నాలుగైదు ఏళ్లుగా బకాయిల కోసం ధర్మయుద్దం చేసిన అన్నదాతలకు ఇప్పుడు యాజమాన్య వైఖరిపై నమ్మకం కుదిరింది. జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కోట్లతో ఉండడం, యాజమాన్యం వైఖరి వల్ల అవి తీరకపోవడం, పైగా రైతుల పేరుతో యాజమాన్యం కోట్ల రూపాయల బినామీ రుణాలు వాడుకోవడం వంటివి చోటు చేసుకోవడంతో రైతులు తిరగబడ్డారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేసింది. గత ఏడాది వరకూ ఎన్సీఎస్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోని 18 మండలాల్లో 4335 హెక్టార్లలో సాగులో ఉండే చెరకు ఈ ఏడాది గణనీయంగా ఒకే సారి 2274 హెక్టార్లు పెరిగింది. గత ఏడాది సాగు చేసిన చెరుకుకు యాజమాన్యం టన్నుకు రూ.‡2300ల ధరను నిర్ణయించింది. దానికి సంబంధించి రూ. 2 వేల వరకూ చెరుకును సరçఫరా చేసిన రైతులకు చెల్లించారు. చెల్లింపులు జరగడంతో ఉత్సాహంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెంచారు. ఈ ఏడాది 3 లక్షల 60 వేల టన్నుల చెరుకును క్రషింగుచేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని జామి మండలం భీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది చెరుకు సాగు విస్తీర్ణం తగ్గింది. గతేడాది 2208 హెక్టార్లలో చెరుకు సాగయితే ఈ ఏడాది 2061 విస్తీర్ణంలో వేశారు. లక్షా 3 వేల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంకిలి ఫ్యాక్టరీ పరిధిలోనూ ఈ ఏడాది విస్తీర్ణం తగ్గింది. ] ఎన్సీఎస్ బకాయి 4 కోట్లు ఎన్సీఎస్ ఇంకా టన్నుకు రూ. 3 వందల బకాయి రైతులకు చెల్లించాల్సి ఉంది. గతేడాది 2 లక్షల 20 వేల టన్నులకు రూ. 2300లు వంతున చెల్లించాల్సి ఉండగా... రూ. 2 వేలు వంతునే చెల్లించారు. దాదాపు వెయ్యి మందికి రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రెండు నెలల్లో క్రషింగు సీజను మొదలు కానుండడంతో ఆ లోగా చెల్లించాలని యాజమాన్యం యోచిస్తోంది. కొనుగోలు పన్ను బకాయి రూ. 5.85 కోట్లు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మూడు ఫ్యాక్టరీల పరిధిలో రూ. 5 కోట్ల 85 లక్షల వరకూ కొనుగోలు పన్ను బకాయిలు రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సి ఉంది. టన్నుకు 60 రూపాయలు చొప్పున ఫ్యాక్టరీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును రైతులకు అందాలి. ఎన్సీఎస్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో 2.27 లక్షల టన్నులకు రూ. 1.36 కోట్లు, భీమసింగిలో 91 వేల టన్నులకు రూ. 54 లక్షలు, శ్రీకాకుళం జిల్లా సంకిలిలో 6 లక్షల 58 వేల టన్నులకు రూ. 3 కోట్ల 95 లక్షలు రైతులకు చెల్లించాలి. వీటిని చెల్లించాలంటూ ప్రభుత్వం జీఓ విడుదల చేయాల్సి ఉంది. వాటికోసం రైతులు ఎదురు చూస్తున్నారు. -
ఎన్డీఎస్ఎల్ కథ కంచికేనా?
లేఆఫ్ ప్రకటించి...కార్మికుల వేతనాలను నిలిపివేసిన యాజమాన్యం ఈయేడు కూడా క్రషింగ్ భరోసాలేదు ఫ్యాక్టరీ పరిధిలో 20వేల ఎకరాల్లో చెరకుసాగు గానుగకు దగ్గర పడుతున్న సమయం ఆధారం కోసం దిక్కులు చూస్తున్న అన్నదాతలు మెదక్: ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం రెండేళ్లుగా క్రషింగ్ నిలిపివేయడంతో చెరకు రైతులు అయోమయంలో పడ్డారు. యాజమాన్యం ఏడు నెలల క్రితం లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులకు వేతనాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు అప్పటినుంచి ఫ్యాక్టరీ గేటు ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంకాని, యాజమాన్యంగాని స్పందంచడంలేదు. మంభోజిపల్లి శివారులోని ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ పరిధిలో మెదక్, కొల్చారం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, కౌడిపల్లి, టేక్మాల్‌తో పాటు 12 మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు లేకపోవడంలో రైతులు చెరకు సాగు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభంలో సీజన్లో 5లక్షల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాడేది. 600 మంది కార్మికులు పనిచేసేవారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టాలను సాకుగా చూపి మెదక్, బోధన్, మెట్పల్లి యూనిట్లను ప్రైవేట్ సంస్థకు 51 శాతం వాటాను అప్పగించారు. నాటి నుంచి కార్మికులకు, రైతులకు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది చెరుకు సీజన్లో ఫ్యాక్టరీని ప్రారంభించక పోవడంతో లక్షలాది టన్నుల చెరుకు ఖండసారి ఫ్యాక్టరీలకు తరలించి నష్టపోయారు. ఈసారి క్రషింగ్‌కు నెలన్నర సమయమే ఉన్నందున గత ఏడాది పరిస్థితే కొనసాగుతుందా.. అనే ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పట్టించుకోని ప్రభుత్వం ఫ్యాక్టరీలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా లేఆఫ్ ప్రకటించడం, కార్మికులకు వేతనాలు ఎగ్గొట్టడం, క్రషింగ్ చేపట్టక పోవడం, కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బులు ఇవ్వక పోవడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతేడాది కార్మికులతో ఫ్యాక్టరీ లోపల పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించే పనులు చేయించారు. అయినప్పటికీ కార్మికులు కూలీలు చేసే పనులు చేశారు. ఇదే సమయంలో ఎన్డీఎస్ఎల్ నుంచి ఆరుగురు కార్మికులు పదవీవిరమణ చేశారు. ఆ సమయంలో వారు దాచుకున్న పీఎఫ్ డబ్బులు ఇవ్వక పోవడంతో ముగ్గురు కార్మికులు గుండె ఆగి చనిపోయారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కార్మికులకు, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
చెరుకు రైతుకు తీపి కరువేనా?
2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎన్‌డీఎస్‌ఎల్‌గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. బోధన్‌లోని శక్కర్‌నగర్, ముత్యంపేట (కరీంనగర్) ముంబోజీపల్లి (మెదక్) యూనిట్లు ప్రైవేట్ కంపెనీ గుప్పెట్లోకి వెళ్లాయి. వారి లాభాపేక్షతో చెరుకు రైతుల బతుకులు చితికిపోతున్నాయి. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం 2015–16 క్రషింగ్ సీజన్ నడుపకుండా చేతులెత్తెసింది. ప్రతి ఏటా నవంబర్– డిసెంబర్ నెలల్లో క్రషింగ్ ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీల నిర్వహణకు వెనుకంజ వేసింది. ఫ్యాక్టరీ నిర్వహణ అసాధ్యమనే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో సాగు చేసిన చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు మళ్లించేందుకు నిర్ణయం తీసుకుంది. 2015 నవంబర్ 23న హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్, ముత్యంపేట, ముంబోజీపల్లి ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకును అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, నిజాంసాగర్ మండలంలోని మాగి ఫ్యాక్టరీలకు మళ్లించాలని నిర్ణయించారు. రైతులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే రవాణా చార్జీలు చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆయా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు చెరుకును తరలించారు. లక్ష మెట్రిక్ టన్నుల చెరుకు సరఫరా బోధన్, ముత్యంపేట, ముంబోజీపల్లి ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు గాయత్రి, మాగి ఫ్యాక్టరీలకు చెరుకును తరలించారు. గాయత్రి ఫ్యాక్టరీకి 65 వేల మెట్రిక్ టన్నులు, మాగి ప్యాక్టరీకి 43 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల చెరుకును రైతులు సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రవాణా చార్జీల చెల్లింపు ఎప్పుడో.. రైతులు ట్రాక్టర్లు, లారీల ద్వారా చెరుకును తరలించారు. చెరుకు తోట నుంచి ఫ్యాక్టరీకి దూరా న్ని పరిగణనలోకి తీసుకుని చార్జీలు చెల్లించాల్సి ఉంది. టన్నుకు రూ. 170 నుంచి రూ. 300 వరకు రవాణా చార్జీలను నిర్ణయించారు. కానీ బోధన్ నుంచి పిట్లం మండలంలోని మాగి ఫ్యాక్టరీ సుమారు 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. మంజీర నదీ తీరాన ఉన్న మారుమూల గ్రామాలైన బోధన్ మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న రైతులు చెరుకు తరలించేం దుకు పడ్డకష్టాలు వర్ణనాతీతం. ఈ మూడు గ్రామాల కొందరు రైతులు పొరుగున ఉన్న నాందేడ్ జిల్లా పరిధిలోని నార్సి, నాయగావ్ పట్టణ కేంద్రాలకు సమీపంలో ఉన్న కుంటూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకును తరలించారు. సుమారు 16 వేల టన్నులకుపైగా చెరుకును తరలించారు. ఈ ఫ్యాక్టరీ సుమారు 75 కిలో మీటర్ల దూరంలో ఉంది. తరలించేందు కు టన్నుకు రూ. 400 వరకు ఖర్చు అయ్యింద ని, 12 టన్నుల లోడ్ ట్రాక్టర్‌కు సుమారు రూ. 5 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని చెరుకు ఫ్యాక్టరీలకు తరలించిన లక్షకుపైగా టన్నుల చెరుకుకు సంబంధించి రైతులకు రవాణా చార్జీల కింద సుమారు రూ. 2 కోట్ల 45 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మాగి ఫ్యాక్టరీ ఫిబ్రవరి 28, అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీలో మార్చి 28న క్రషింగ్ ముగిసింది. క్రషింగ్ సీజన్ ముగిసి నాలుగు నెలలు గడిచిపోయినా రవాణా చార్జీల చెల్లింపుపై ప్రభుత్వం స్పందించడం లేదు. రవాణా చార్జీలను ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర ఫ్యాక్టరీలకు చెరుకు తరలించిన రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. కోట్లలో చెరుకు కొనుగోలు పన్ను బకాయిలు.. చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు టన్నుకు రూ. 60 చొప్పున కొనుగోలు పన్ను చెల్లిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రభుత్వ కొనుగోలు పన్నును కలుపుకుని టన్ను ధరను చెల్లిస్తూ వస్తున్నాయి. 2015–16 క్రషింగ్ సీజన్‌కుగాను అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ టన్నుకు రూ. 2,766, మాగి ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ. 2,600 చెల్లించాయి. ఇందులో చెరుకు కొనుగోలు పన్నును కలపలేదని రైతులు అంటున్నారు. ఫ్యాక్టరీలు సుమారు రూ. 4 కోట్ల వరకు చెరుకు కొనుగోలు పన్ను చెల్లించాల్సి ఉంది. అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ పరిధిలో రూ. 2 కోట్ల 53 లక్షల 58 వేల 225, మాగి ఫ్యాక్టరీ పరిధిలో రూ. కోటీ 44 లక్షల 55 వేల 260 వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం నివేదికలిచ్చారు. కొనుగోలు పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులంటున్నారు. వెంటనే బకాయిలు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మహారాష్ట్రకు తరలించాను.. మాగి ఫ్యాక్టరీ సకాలంలో పర్మిట్లు ఇవ్వలేదు. దీం తో చెరుకు ఎండిపోతుందని మహారాష్ట్రలోని కుం టూర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాను. మా ఊరు నుంచి 75 కిలో మీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ టన్ను ధర రూ. 2,600 చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకు రూ. 2,200 చెల్లించారు. బకాయిలు బిల్లు లు చెల్లించడంలేదు. 12 టన్నుల లోడ్ ట్రాక్టర్‌ను ఫ్యాక్టరీకి తరలించేందుకు రూ. 4,800 వరకు ఖర్చుఅయ్యింది. సర్కారు మాకు రవాణా ఖర్చులు ఇవ్వాలి. – చిదురపు లక్ష్మణ్, చెరుుకు రైతు, ఖాజాపూర్, బోధన్ మండలం నివేదిక పంపించాం చెరుకు రవాణా చార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించాం. అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి, నిజాంసాగర్ మాగి ఫ్యాక్టరీలకు మూడు ఎన్డీఎస్ఎల్ యూనిట్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల వరకు చెరుకు సరఫరా అయ్యింది. రైతులకు రవాణా చార్జీల రూపంలో సుమారు రూ. 2 కోట్ల 45 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కొనుగోలు పన్నుతో కలిపి రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై కేన్ కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపించాం. – సీహెచ్ వెంకట రవి, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం చెరుకు రవాణా చార్జీలు, కొనుగోలు పన్ను బకాయిల చెల్లింపు అంశాలను ఇటీవల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. బకాయిలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొనుగోలు పన్ను బకాయిలు త్వరలోనే విడుదల అవుతాయని మంత్రి తెలిపారు. – శ్రీనివాస్‌రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, బోధన్ -
బిల్లులు ఎప్పుడిస్తారో
ఆశగా ఎదురుచూస్తున్న రైతులు క్రషింగ్ ముగిసి ఐదు నెలలవుతున్నా అందని డబ్బులు టన్నుకు రూ.145ల వంతున బకాయి పడిన ట్రైడెండ్ యాజమాన్యం జహీరాబాద్ :క్రషింగ్ ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా బిల్లులు చెల్లించకుండా ట్రైడెంట్ యాజమాన్యం జాప్యం చేస్తోంది. దీంతో తాము సాగు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్(బి) గ్రామంలోని ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 201516 క్రషింగ్ సీజన్‌కు గాను 3లక్షల టన్నులు గానుగాడించింది. టన్నుకు రూ.2,600ల మేర చెరకు ధరను చెల్లించేందుకు నిర్ణయించింది. రైతులు చెరకును సరఫరా చేసినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులను చెల్లించలేదు. టన్నుకు రూ.145వంతున యాజమాన్యం రైతులకు బకాయి పడింది. క్రషింగ్ చేసిన మేరకు కర్మాగారానికి చెరకును సరఫరా చేసిన రైతులకు రూ.3.35 కోట్ల మేర యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో యాజమాన్యం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా బిల్లులను బకాయి పడుతోందన్నారు. 201415 క్రషింగ్ సీజన్‌కు సంబంధించిన బిల్లులను ఈ సంవత్సరం సీజన్ ప్రారంభమైన అనంతరమే చెల్లించిందన్నా చెరకు సాగు కోసం అప్పులు తెచ్చి పెడుతున్నట్లు, సకాలంలో బిల్లులు రాక పోవడంతో వడ్డీ కట్టక తప్పడం లేదంటున్నారు. దీంతో పంటపై వచ్చే లాభం కూడా అప్పుల రూపంలో రాకుండా పోతోందన్నారు. ఇప్పటికైనా కర్మాగారం యాజమాన్యం, అధికారులు స్పందించి చెరకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెట్టుబడుల కోసం ఇబ్బందులు వ్యవసాయం కోసం పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వస్తోందని, దీంతో బయట నుంచి అప్పులు తెచ్చుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంట సాగు కోసం విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టక తప్పడం లేదంటున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం తమ బిల్లులను చెల్లిస్తే పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుంటుందన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో యాజమాన్యం సరిగా స్పదించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
తేలని గానుగాట
సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చిన చక్కెర శాఖ అధికారులు క్రషింగ్ పై ఎమ్మెల్యే ఆశ నేడు ఆప్కాబ్ అధికారుల చర్చలు రేపు కేబినెట్ సమావేశంలో మరింత స్పష్టత అనకాపల్లి: రాష్ట్రంలో ఈ సీజన్లో క్రషింగ్‌కు అనుమతి పొందని సహకార చక్కెర కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారం భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన సహకార చక్కెర కర్మాగారాల గానుగాట మూహూర్తాలు ఖరారు కావడంతో సన్నాహాలు జరుగుతుండగా తుమ్మపాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. నేడు, రేపు కీలకం... తుమ్మపాల చక్కెర కర్మాగార క్రషింగ్‌పై ఇప్పటికే చక్కెర శాఖ ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడంతో డోలాయమానంలో పడిన కర్మాగార ఎండీ వాస్తవాలను బయటకు చెప్పలేక బంతిని ఎమ్మెల్యే కోర్టులోకి నెట్టివేశారు. ప్రస్తుతం తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం అనకాపల్లి ఎమ్మెల్యే పీలాకు చిక్కుముడిని తెచ్చిపెట్టింది. సాంకేతికంగా ఈ సీజన్లో క్రషింగ్‌కు అవకాశాలు ఏమాత్రం లేనప్పటికీ గతంలో ఎమ్మెల్యే పీలా ఇచ్చిన హామీ మేరకు కడదాకా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందులను రెట్టింపు చేసింది. ఈ ప్రతికూల పరిణాల నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేక తుమ్మపాల క్రషింగ్ ఎలాగైనా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెబుతూ ఉంటే చక్కెర శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మపాల కర్మాగార యాజమాన్యం సన్నాహాలపై నీళ్లు చల్లారు. ఇక్కడ నెలకొన్న నైరాశ్యం వీడాలంటే ఆర్థిక చిక్కుముళ్లు తొలగిపోవాలి. ఈ క్రమంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆప్కాబ్ ఏజీఎం సోమవారం సందర్శించి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కర్మాగార ఆర్థిక స్థితిగతుల తోపాటు గోదాముల్లో ఉన్న చక్కెర నిల్వలపై తనిఖీలు జరిపారు. మంగళవారం విశాఖలో ఆప్కాబ్ అధికారులు నిర్వహించనున్న సమావేశంలో తుమ్మపాల అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం అప్పులు ఆప్కాబ్‌కు సైతం చికాకు తెప్పిస్తుంటే కొత్తగా ఎలా అప్పులివ్వాలని ఆప్కాబ్ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈనెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో సహకార చక్కెర కర్మాగారాలపై చర్చకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో తుమ్మపాలపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీయే ఆఖరి అవకాశం తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు క్రషింగ్ జరగకపోతే పరిణామాలు మూతపడే స్థితికి చేరుస్తాయని కర్మాగార వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రషింగ్ జరుగుతుందని హామీలు వస్తున్నా తుమ్మపాల పరిధిలోని చెరకును ఏటికొప్పాక కర్మాగారానికి తరలించవచ్చనే ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయని తెలిసింది. ఈ ఏడాది గానుగాటకు సంబంధించి సుగర్కేన్ కమిషనర్ సూచనలు ప్రతికూలంగా ఒకవైపు ఉంటే గానుగాటపై తమ భవితవ్యాన్ని ఊహించుకుంటూ కార్మికులు, రైతులు తీపికబురు కోసం ఎదురు చూస్తున్నారు. కార్మికుల దయనీయ స్థితి తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు సంబంధించి 30 మంది రెగ్యులర్ కార్మికులు, 150 మంది ఎన్ఎంఆర్ కార్మికులు పనిచేస్తున్నారు. గానుగాటపై దారులు మూసుకున్న నేపథ్యంలో ఓవర్‌హాలింగ్ కోసం ఖర్చు చేసిన 40 లక్షలు, ఎన్‌ఎంఆర్‌లకు చెల్లించాల్సిన జీతాలు మరింత భారం కానున్నాయి. ఇదే సమయంలో కార్మికుల ఉద్యోగ బకాయిలు 2.76 కోట్లు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 2 కోట్లు, కార్మికుల పీఎఫ్ కోటి 40 లక్షలు, గ్రాడ్యుటీ కోటి 15 లక్షలు, ఆప్కాబ్ రుణం 3.5 కోట్లు, ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 4 కోట్లతో పాటు, విద్యుత్ చార్జీలు, పెండింగ్ బిల్లులు లక్షల్లో పేరుకుపోయాయి. దీంతో ఆర్థికంగా పరపతి కోల్పోయిన తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఆర్థిక కష్టాలు మరింత జటిలమయ్యాయి. ఈ కారణంగా భవితవ్యంపై ఆందోళనతో ఉన్న కొందరు ఎన్ఎంఆర్ కార్మికులు జీతాలు లేక అలమటిస్తూ రాత్రుళ్లు పరవాడ ఫార్మాసిటీలో అదనంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
త్రిశంకుస్వర్గంలో తుమ్మపాల
నేడు హైదరాబాద్‌లో డెరైక్టర్ ఆఫ్ సుగర్స్తోఎమ్డీల సమావేశం భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం అనకాపల్లి: జిల్లాలో తుమ్మపాల చక్కెరమిల్లు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కష్టకాలంలో రుణాలివ్వాల్సిన ఆప్కాబ్ మొండికేయడం, షూరిటీ విషయంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం వంటి పరిణామాలతో దీని పరిస్థితి త్రిశంకుస్వర్గమైంది. వందలాది మంది కార్మికులు, వేలాది మంది రైతులకు చేదును పంచే పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులకు జీతాలు, చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులు యాజమాన్యం చేపట్టలేకపోవడంతో ఇప్పటికే పరపతి దెబ్బతింది. గానుగాటకు ముహూర్తం ముంచుకొస్తున్నా స్పష్టత లేని దుస్థితి. డోలాయమానంలో ఉన్న ఈ కర్మాగారంపై గురువారం స్పష్టత రానుందని అంతా భావిస్తున్నారు. డెరైక్టర్ ఆఫ్ సుగర్స్ గురువారం హైదరాబాద్‌లో సహకార చక్కెర మిల్లుల ఎమ్‌డీలతో సమావేశమవుతున్నారు. ఈ సీజన్లో క్రషింగ్‌పై సమీక్షించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాలు ఇప్పటికే గానుగాటకు సిద్ధమయ్యాయి. తుమ్మపాలకు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదు. జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో క్రషింగ్‌పై ఆచితూచి వ్యవహరించాలని ఎమ్‌డీకి జిల్లా అధికారులు సూచించడంతో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. మిల్లును మూసేస్తారంటూ ఇటీవల సుగర్కేన్ కమిషనర్ నుంచి వచ్చిన లేఖ కర్మాగార వర్గాల్లో అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. మిల్లు పరిస్థితిపై అంతా గోప్యం : మిల్లు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మూలకు చేరిన యంత్రాలతోపాటు అమూల్యమైన స్థలాలతో కలిపి కర్మాగార ఆస్తులను లెక్కిస్తే ప్రభుత్వ గణాంకాల మేరకు రూ.40 కోట్లుపైబడి ఉంటుందని అంచనా. అప్పులు, బకాయిలు రూ.15కోట్లు ఉంటాయి. మిల్లుకు సంబంధించిన డాక్యూమెంట్లన్నింటినీ తనాఖా కింద ఒక సహకార బ్యాంకు తనవద్దే ఉంచుకుందని సమాచారం. వేలాదిమంది రైతుల షేర్ధనంతో ఊపిరి పోసుకున్న మిల్లు ఆర్థికస్థితిగతులపై సహకారరంగ అధికారులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. వాస్తవాలు బయటపెట్టకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాకు చెందిన ఒక మంత్రి చేసిన వ్యాఖ్యల మేరకు కర్మాగారాన్ని మాక్స్ చట్టం కింద ఒక సహకార వ్యవస్థ అధినేతకు అప్పగిస్తారన్న వాదన వ్యక్తమైంది. ఇప్పుడున్న పరిస్థితిలో స్వయంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని ఫ్యాక్టరీకి భారీస్థాయిలో నిధులు కేటాయిస్తే తప్ప ఉపశమనం కలగదు. ఇప్పటికే మిల్లు పరిధిలోని చెరకును పొరుగు జిల్లాలోని కర్మాగారానికి తరలించుకుపోతున్నారు. గతేడాది బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు బెల్లం తయారీకే మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రషింగ్‌కు అవసరమైన చెరకు లేనందున గానుగాట చేపట్టి నిధులు వృథా చేయెద్దని జిల్లాకు చెందిన అధికారి ఒకరు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు తమకు జీతం బకాయిలు, ఫీఎఫ్ చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించే పనిలో పడ్డారు. ఈపరిణామాల నేపథ్యంలో గురువారంనాటి సమావేశంలో ఎమ్డీ రూపొందించిన నివేదికను చక్కెరశాఖ డెరైక్టర్ పరిశీలించి తుమ్మపాల గానుగాటపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. -
బిల్లు అందదు.. చింత తీరదు
క్రషింగ్ ముగిసినా అందని చెరకు బిల్లులు - మూడు నెలలుగా పేరుకుపోయిన బకాయిలు - ట్రైడెంట్, ఎన్డీఎస్ఎల్ తీరుపై రైతుల ఆందోళన చెరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు మొదలు పెట్టిన నాటి నుంచి దిగుబడులను ఫ్యాక్టరీకి తోలే వరకే కాదు... బిల్లులు వచ్చేంతవరకు వారిని సమస్యలు వీడడం లేదు. గిట్టుబాటు ధర రాక.. యాజమాన్యం ప్రకటించిన ధర మొత్తం ఒకేసారి అందక సతమతమవుతున్నారు. ఏటా యాజమాన్యం కొంత మొత్తాన్ని పెండింగ్‌లో పెట్టడం కూడా వీరిని ఇబ్బందుల పాల్జేస్తోంది. మెదక్‌లోని ఎన్డీఎస్ఎల్ను ఎత్తేస్తారనే ప్రచారం సాగుతోండడంతో అక్కడి రైతులు బిల్లుల కోసం ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఎస్ఎల్.. రూ.27 కోట్లకుగాను రూ.7 కోట్లే చెల్లించింది. ఇక ట్రైడెంట్ రూ.53.63 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ. 53 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. జహీరాబాద్: స్థానికంగా గల ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలోని రైతులు చెరకు బిల్లుల కోసం నానా తంటాలు పడుతున్నారు. గురువారం రాత్రితో క్రషింగ్ ముగిసినా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జనవరి 22 వరకు మాత్రమే బిల్లులు చెల్లించిందని రైతులు పేర్కొంటున్నారు. జనవరి 31వరకు చెరకు బిల్లులను బ్యాంకులకు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. చెరకును సరఫరా చేసిన 14 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నా యాజమాన్యం తుంగలో తొక్కి ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు పేర్కొంటున్నారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ట్రైడెంట్ కర్మాగారం రూ.53.63 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ. 53 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ సీజన్లో 5.54 లక్షల టన్నుల క్రషింగ్... ఈ సీజన్లో కర్మాగారం 5.54 లక్షల టన్నుల చెరకును గానుగాడించింది. ఈ లెక్కన పూర్తి స్థాయి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా ఆ మేరకు జరగలేదు. పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని చూస్తే యాజమాన్యం ప్రకటించిన ధర ఏ మాత్రం గిట్టుబాటుగా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. అది కూడా పూర్తిగా చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెరకు కోత, రవాణా ఖర్చుల కింద టన్నుకు రూ.1,000 వరకు ఖర్చు చేసుకోవాల్సి వచ్చిందని, ఇందుకోసం కూడా అప్పులు చేయాల్సి వచ్చిందని వారంటున్నారు. ఇచ్చే బిల్లుల్లో సైతం కోత.. రైతులకు యాజమాన్యం చెల్లిస్తున్న చెరకు బిల్లుల్లో కూడా కోత విధిస్తోంది. టన్నుకు రూ.2,600 ధర చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం రైతులకు టన్నుకు రూ.2,340 మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి బిల్లులు చెల్లిస్తే సౌలభ్యంగా ఉండేదని రైతులంటున్నారు. కోత విధించిన మిగతా మొత్తం (టన్నుకు రూ.260 చొప్పున) ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. గత ఏడాది సైతం టన్నుకు రూ.200 చొప్పున బకాయి పడిన మొత్తాన్ని క్రషింగ్ ఆరంభంలో చెల్లించినట్టు వారు తెలిపారు.ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూడాలంటున్నారు. పంట దిగుబడులు పడిపోయాయని, పెట్టుబడుల వ్యయం కూడా పెరిగిందన్నారు. క్రషింగ్ ముగిసినందున పూర్తి బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు పన్నూ యాజమాన్యం ఖాతాలోనే... చెరకు కొనుగోలు పన్నును ప్రభుత్వం యాజ మాన్యాలకే చెల్లిస్తుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.60 కొనుగోలు పన్ను చెల్లిస్తోంది. యాజ మాన్యం మాత్రం ప్రభుత్వం ఇచ్చే ఈ పన్నును కలుపుకొని ధర నిర్ణయిస్తోంది. ఈ రకంగా కూడా తాము నష్టపోతున్నామని రైతులంటున్నారు. కొనుగోలు పన్నును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. -
గానుగాట ప్రశ్నార్థకం
తగ్గిన చెరకు దిగుబడి షాషింగ్ లక్ష్యం 11లక్షల టన్నులు {పస్తుతమున్న చెరకు 7 లక్షల టన్నులే.. నాన్ మెంబర్ల నుంచి సేకరణకు సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలు సహకార చక్కెర మిల్లుల పరిస్థితి దయనీయంగా ఉంది. లక్ష్యం మేరకు గానుగాటకు చెరకు లభ్యమవుతుందో లేదో అన్న బెంగ ఆయా యాజమాన్యాలను పీడిస్తోంది. దిగుబడి తగ్గిపోవడం ఇందుకు కారణం. పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం భాగా పెరిగింది. క్రషింగ్‌కు ఢోకా ఉండదని అంతా మురిసిపోయాయి. ఇటు పంచదార, అటు బెల్లం దిగుబడి బాగుంటుందని ఆశించారు. హుద్‌హుద్ కక్కిన విషంతో అంతా తలకిందులైంది. లక్ష్యం మేరకు క్రషింగ్ ప్రశ్నార్థకంగా మారింది. చోడవరం: జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది సుమారు 45 వేల హెక్టార్లలో రైతులు ఈ పంటను చేపట్టారు. నాలుగు ఫ్యాక్టరీల్లో చోడవరం, ఏటికొప్పాక, తాండవ 11ల క్షల టన్నులకు మించి క్రషింగ్‌కు లక్ష్యంగా పెట్టుకున్నాయి. తుమ్మపాల పరిస్థితి దయనీయంగా ఉన్నవిషయం తెలిసిందే. దానిని తప్పిస్తే ఒక్క గోవాడ ఫ్యాక్టరీయే గతేడాది 5.48లక్షల టన్నుల చెరకు గానుగాడింది. ఈ ఏడాది 6లక్షల టన్నుల వరకు క్రషింగ్ చేయగలమని ఆశించింది. ఇందు కోసం ఈ ఏడాది ముందుగానే క్రషింగ్‌ను మూడు ఫ్యాక్టరీలు ప్రారంభించాయి. పంట పెరుగుదల సమయంలో హుద్‌హుద్ పంజా విసిరింది. దాని ధాటికి ఇటు ఫ్యాక్టరీలు, అటు చెరకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుగర్స్‌కు ఈ పరిణామం కోలుకోలేని దెబ్బ అయింది. అత్యధికంగా చెరకు పండించే చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే తుఫాన్‌కు చెరకు తోటలన్నీ నేలమట్టమయ్యాయి. అనంతరం వర్షాల జాడలేకుండా పోయింది. దిగుబడి ఘోరంగా తగ్గిపోయింది. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో పక్వానికి వచ్చిన 2లక్షల టన్నుల చెరకు తోటలు నేలకొరిగి నీరుపట్టాయి. జడచుట్టు దశలోని వేలాది ఎకరాల్లో తోటలు ఒరిగిపోవడంతో చెరకు గెడ ఎదుగుదల తగ్గిపోయింది. ఎకరాకు సాధారణంగా 25 నుంచి 35టన్నులు, మంచి పల్లం భూముల్లో అయితే 45టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఎకరాకు 20టన్నులకు మించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సర్వేచేసిన ఫ్యాక్టరీలు తాము పెట్టుకున్న క్రషింగ్ లక్ష్యాలను ఎలా ఛేదించాలనే ఆలోచనలో పడ్డాయి. నాలుగు ఫ్యాక్టరీలు కలిసి ఈ సీజన్లో 7లక్షల టన్నులైనా క్రషింగ్చేయలే ని దుస్థితి. భారీక్ష్యాలతో క్రషింగ్ ప్రారంభించిన గోవాడ ఫ్యాక్టరీ 3.5లక్షలకు మించి గానుగాడలేని పరిస్థితి. ఇక తాండవ, ఏటికొప్పాక, పరిస్థితి నామమాత్రం. తుమ్మపాల పరిధిలో మరీ ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది నాన్ మెంబర్ల నుంచి కూడా చెరకు తీసుకోవాలని ఫ్యాక్టరీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటనలు కూడా చేశాయి. దిగుబడి తగ్గడంతో ఫ్యాక్టరీలు ఈ విధంగా బాధపడుతుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితిలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి రాదు నాది మాడుగుల మండలం కేజేపురం. నాలుగు ఎకరాల్లో చెరకు తోట వేశాను. తుఫాన్‌కు సగానికి పైగా తోట నేలకొరిగిపోయింది. తర్వాత వర్షాలులేక ఎదుగుదల లేకుండా పోయింది. సుమారు రూ.1.3లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 20టన్నులు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గిట్టుబాటు ధర ఎంత ఇస్తారో తెలియదు. ఈ ఏడాది కనీసం టన్నుకు రూ.2500 నుంచిరూ.3వేలు వరకు మద్దతు ధర ఇస్తే తప్పా పెట్టుబడి కూడా దక్కేలా లేదు. -జి. అప్పలనాయుడు, చెరకు రైతు -
చేదు కబురు
మెదక్ రూరల్: ఇప్పుడు..అప్పుడంటూ..ఇన్నాళ్లూ క్రషింగ్ తేదీలను వాయిదా వేస్తూ వచ్చిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్డీఎస్ఎల్) శనివారం చెరకు రైతులకు చేదు వార్త చెవిన వేసింది. వాతావరణ పరిస్థితుల వల్ల క్రషింగ్ సమయానికి ఇంకొంత సమయం పడుతుందని, అందువల్ల ఫ్యాక్టరీకి తెచ్చిన చెరకును బోదన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలని సూచించింది. దీంతో చేసేది లేక నాలుగు రోజులుగా ఫ్యాక్టరీ వద్ద పడిగాపులుగాచిన రైతులు చెరకును తీసుకుని బోధన్ బాట పట్టారు. మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో 12 మండలాల చెరకు రైతుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాతికేళ్ల క్రితం ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని నిర్మించింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు ప్రభుత్వం నష్టాలను సాకుగా చూపుతూ ఆ ఫ్యాక్టరీని దక్కన్ పేపర్ మిల్లు యజమానికి చాలా తక్కువకు విక్రయించింది. నాటి నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులతో పాటు ఈ ప్రాంత చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రషింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభించడం...డబ్బు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో చెరకు రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నెల ఆలస్యమన్నారు...ఇపుడు అదీలేదు ఎన్డీఎస్ఎల్లో ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి వారంలో క్రషింగ్‌ను ప్రారంభించాల్సి ఉండగా, ఈ సంవత్సరం డిసెంబర్ 10న క్రషిం గ్ను ప్రారంభించారు. అయితే ఇంతవరకు టన్ను చెరకును కూడా గానుగ ఆడించలేదు. అయితే క్రషింగ్ తేదీని యాజమాన్యం ముందుగానే ప్రకటించడంతో 12 మండలాల నుంచి వందలాది మంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలతో చెరకును ఫ్యాక్టరీకి తరలించారు. తీరా నాలుగు రోజులు గడిచాక, వాతావరణం చల్లగా ఉందన్న సాకును చూపుతూ క్రషింగ్ ప్రారంభించలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. ఎన్డీఎస్ఎల్లో క్రషింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున రైతులంతా తమ చెరకును బోధన్‌లోని ఫ్యాక్టరీకి తీసుకువెళ్లాలని సూచించింది. కావాలంటే బోధన్ వరకు రవాణా చార్జీల కింద టన్నుకు రూ.400 చొప్పున చెల్లిస్తామని వెల్లడించింది. దీంతో ఇప్పటికే నాలుగురోజులుగా ఫ్యాక్టరీ ఎదుట చెరకుతో నిరీక్షిస్తున్న రైతులు ఏం చేయాలో తెలియని స్థితిలో బోధన్ బాటపట్టారు. అయితే 100 కి.మీ దూరం తీసుకెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారిందని, పైగా చెరకు బరువు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాలకులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా నడిచేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అధికారి వివరణ ఈ విషయంపై ఫ్యాక్టరీ జీఎం నాగరాజును వివరణ కోరగా వాతావరణ చల్లగా ఉన్నందున క్రషింగ్ నడవటం లేదు. అందుకే నాలుగు రోజులుగా నిలువ ఉన్న చెరకును బోధన్ పంపుతున్నామని తెలిపారు. -
చిమ్నీ ఎక్కిన కార్మికులు
వేతన సవరణ చేశాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బోధన్ చక్కెర కర్మాగారం (ఎన్డీఎస్ఎల్)లో పలువురు కార్మికులు పొగ గొట్టం పైకి ఎక్కారు. తమ డిమాండును అంగీకరించపోతే దూకుతామని హెచ్చరించారు. వారికి మద్దతుగా సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనంపల్లి ఎల్లం అక్కడి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లా డారు. జనవరి 31 లోగా మధ్యంతర భృతి, బాయిలు చెల్లిస్తామని, వేతన సవరణ కూడా చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు కిందికి దిగి వచ్చారు. - పొగ గొట్టం ఎక్కిన ఎన్డీఎస్ఎల్ కార్మికులు - జనవరి 31 వరకు అమలు చేస్తామని అసిస్టెంట్ కేన్ కమిషనర్ హామీ బోధన్ టౌన్ : యాజమాన్యం వేతన సవరణను దాటవేస్తూ కార్మికులను విస్మరిస్తోందని ఎన్డీఎస్ఎల్ కర్మాగారంలో బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. పొగగొట్టం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సీఐ టీయూ కార్మిక సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఫ్యాక్టరీలో ఆందోళనకు దిగారు. వేతన సవరణ చేపట్టాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో విధులకు వచ్చిన కార్మికులు సాయిలు, శ్రీనివాస్ కర్మాగారంలో 160 ఫీట్లు గల పొగ గొట్టం ఎక్కి వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, సీటీయూ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అక్కడికి చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొనగా, సీఐ రామకృష్ణ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. యాజమాన్యం దిగి వచ్చి వేతన సవరణ చేయాలని పట్టుబట్టారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనం పల్లి ఎల్లం అక్కడికి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు. నేరుగా యాజమాన్యంతో మాట్లాడి తమకు వేతన సవరణపై హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. వేతన సవరణపై స్పష్టమైన హా మీ ఇవ్వాలని యాజమాన్యాన్ని బల్దియా చైర్మన్ ఎల్లం, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు కోరారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో కార్మిక సంఘంతో యాజమాన్యం చర్చ లు జరిపిందన్నారు. చర్చల్లో కార్మికులు 14 నెలల ఐఆర్, ఏరియర్స్ నాలుగు విడతలుగా ఇవ్వాలని, మార్చి అనంతరం వేతన సవరణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారని తెలిపారు. దీనికి కార్మిక సంఘం నాయకులు, యాజమాన్యం ఒప్పుకున్నాయన్నారు. అయినా కార్మికులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు కుమార స్వామి, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ తమకు వేతన సవరణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చెరకు ఉత్పత్తి దారుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్మిక సంఘాల నాయకులు క్రషింగ్‌కు సహకరించాలని, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించాలన్నారు. తాముసైతం కార్మికులకు అండగా ఉండి వేతన సవరణ అయ్యే వరకు పోరాడుదామని కార్మికులను సముదాయించే ప్రయత్నం చేశారు. కార్మికులు ససేమిరా అనడంతో చర్చించి సమస్య పరిష్కరించుకుందామని తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ కేన్ కమిషనర్ జాన్ విక్టర్ కర్మాగారానికి చేరుకొని చర్చలు జరిపారు. కార్మికులకు నాలుగు విడతలుగా ఇస్తామన్న ఐఆర్, ఏరియర్స్ రెండు విడతల్లో జనవరి 31 వరకు చెల్లిస్తామని, దీంతో పాటు వేతన సవరణ సైతం అప్పటి వరకు చేస్తామని హామీ ఇచ్చారు. క్రషింగ్ కు అందరు సహకరించాలని కోరారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. -
సహకారానికి ప్రై‘వేటు’..!
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72 ప్రైవేటు పంచదార కంపెనీలు ఉండగా, అందులో 15 షోలాపూర్‌లోనే ఉన్నాయి. ఇక్కడ సహకార కంపెనీల కంటే కంటే ప్రైవేటు కంపెనీల సంఖ్య పెరుగుతోంది. షోలాపూర్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 30 కంపెనీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ క్రషింగ్ సమయంలో జిల్లాలో మరిన్ని ప్రైవేట్ కంపెనీలు వెలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మంగళవేడా తాలూకాలోని కచరెవాడేలో యుటోపియన్, లవంగిలో భైరవనాథ్ షుగర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో మూడు ప్రారంభ దిశలో ఉన్నాయి. దీంతో జిల్లాలో ప్రైవేటు కంపెనీల సంఖ్య 20కి పెరగనుంది. రాష్ట్రంలో తక్కువగా వర్షపాతం నమోదైన షోలాపూర్, ఉస్మానాబాద్, లాతూర్ ప్రాంతాల్లోనే ప్రైవేట్ కార్ఖాణాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఏర్పాటైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు విజయవంతమవ్వడమే కాకుండా కొన్నివేల మందికి ఉపాధిని కలిగించాయి. అయితే ప్రస్తుతం సహకార ఫ్యాక్టరీల పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో వాటిలో చాలావరకు మూతదశకు చేరుకున్నాయి. 36 సహకార చక్కెర కర్మాగారాలు లిక్విడేటర్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. అలాగే మరో 28 కంపెనీలు సహకారం నుంచి ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదిలాఉండగా, వర్షపాతం తక్కువగా ఉన్న కొల్హాపూర్ ప్రాంతంలో 5 ప్రైవేటు ఫ్యాక్టరీలున్నాయి. అలాగే పుణేలో 5, సతారా 3, సంగ్లీ 3, అహ్మద్‌నగర్ ప్రాంతంలో 5 చొప్పున ప్రైవేటు పంచదార కంపెనీలు వెలిశాయి. మరాట్వాడాలోని ఉస్మానాబాద్ జిల్లాలో 6, లాతూర్‌లో 4 ప్రైవేట్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. -
ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్.. చిత్తూరులో పెండింగ్
* నేటి నుంచి శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమలో క్రషింగ్.. * చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌పై నీలినీడలు * 30న ఎండీలతో సీఎం కీలక సమావేశం.. * బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకోకపోతే సహకార పరిశ్రమలకు కష్టకాలమే సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెరకు రైతుకు ఒకింత తీపి కబురు.. మరింత చేదువార్త..! క్రషింగ్కూ రికవరీకి ముడిపెట్టి డిసెం బర్ 25 తర్వాతే సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్ ప్రారంభించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం సడలించింది. రేణిగుం ట మండలం గాజులమండ్యంలోని శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమ(ఎస్వీ షుగర్స్)లో గురువారం క్రషింగ్ ప్రా రంభించనున్నారు. కానీ.. చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ(చిత్తూరు షుగర్స్)లో మాత్రం క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. రెండేళ్ల నుంచి బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఎస్వీ షుగర్స్‌కు చెరకును సరఫరా చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమల మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో బకాయిలను చెల్లించే లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సహకార పరిశ్రమలకు.. రైతులకూ ప్రయోజనం. లేదంటే ఇరు వర్గాలకూ కష్టకాలమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లాలో 87,004 హెక్టార్లలో చెరకు పంటనుసాగుచేశారు. హెక్టారుకు కనిష్ఠంగా 80 టన్నుల చొప్పున 69.6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో మూడు ప్రైవేటు, రెండు సహకార చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. ప్రైవేటు చక్కెర పరిశ్రమల్లో అక్టోబర్ నాలుగో వారం నుంచే క్రషింగ్‌ను ప్రారంభించారు. సహకార చక్కెర పరిశ్రమల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ.. డిసెంబర్ 25 తర్వాత క్రషింగ్ చేస్తే రికవరీ పర్సంటేజీ అధికంగా ఉంటుందని, అప్పుడే క్రషింగ్ ప్రారంభించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కానీ.. 1.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌కు ఎస్వీ షుగర్స్, 50 వేల టన్నుల క్రషింగ్‌కు చిత్తూరు షుగర్స్ రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. డిసెంబర్ 25 వరకూ క్రషింగ్ ప్రారంభించకపోతే.. ప్రైవేటు ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో చెరకును కొనుగోలు చేస్తాయని సహకార ప్యాక్టరీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించాయి. దాంతో ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించింది. కానీ.. చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌కు అనుమతించలేదు. మద్దతు ధరపై మీనవేషాలు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టన్ను చెరకుకు ఆయా ప్రభుత్వాలు రూ.2,650ను మద్దతు ధరగా ప్రకటించాయి. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా చెరకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించలేదు. ఎస్వీ షుగర్స్ యాజమాన్యం టన్ను చెరకును కనిష్ఠంగా రూ.1,450 నుంచి గరిష్ఠంగా రూ.1,550 వరకూ ఖరీదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెరకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తే.. ధరను పెంచాలని భావిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న ప్రైవేటు చక్కెర పరిశ్రమలు చెరకు రైతును లూటీ చేస్తున్నాయి. టన్ను చెరకు కనిష్ఠంగా రూ.1,850 నుంచి రూ.1,950 వరకూ ఖరీదు చేస్తూ చెరకు రైతును నట్టేట ముంచుతున్నాయి. గతేడాది కేన్ కమిషనర్ బెన్హర్ ఎక్కా ప్రతిపాదనల మేరకు టన్ను చెరకు రూ.2,650ను మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే మనుగడ.. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లో టన్ను చెరకుకు ప్రభుత్వం రూ.2,100ను మద్దతు ధరగా ప్రకటించింది. సహకార చక్కెర పరిశ్రమలు రైతులకు టన్ను రూ.1800 చెల్లించగా. రూ.300ను ప్రభుత్వం చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. కానీ.. ప్రభుత్వం తాను చెల్లిస్తానన్న రూ.300 రెండేళ్లుగా రైతులకు చెల్లించలేదు. గత రెండేళ్లకు గాను ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.5 కోట్ల మేర బకాయిపడింది. బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ ఏడాది క్రషింగ్ సజావుగా సాగకపోతే సహకార ఫ్యాక్టరీలకు మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార పరిశ్రమలను తెగనమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఈనెల 30న సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
ఏటికొప్పాక మద్దతు ధర రూ.2384
ఎస్.రాయవరం : ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లుకు రానున్న సీజన్‌కు టన్ను చెరకు ధర రూ. 2384.64లుగా యాజమాన్యం ప్రకటించింది. ఫ్యా క్టరీ ప్రాంగణంలో సోమవారం 82వ మహాజన సభ నిర్వహించారు. గతేడాది, రానున్న సీజన్లకు సంబంధించి క్రషింగ్, రికవరీ, లావాదేవీల నివేదికలను ఎమ్డీ కెఆర్ విక్టర్‌రాజు చదివి వినిపించారు. అనంతరం సభలో చైర్మర్ రాజాసాగి రాంభద్రరాజు మాట్లాడుతూ రానున్న సీజన్లో 2 లక్షల టన్నులు క్రషింగ్‌కు అవకాశం ఉందన్నారు. కాగా కొందరు రైతులు సభావేదిక వద్దకు దూసుకొచ్చి పంచదార బస్తాలు చోరీకి గురవుతంటే యాజమాన్యం ఏం చేస్తున్నదని నిలదీశారు. చోరీకి పాల్పడిన వారిపై కేసు ఎందుకు పెట్టలేదని దుయ్యబట్టారు. టన్ను చెరకుకు మద్దతు ధర రూ.3200లు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొందరు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వేదికపైకి వచ్చి వివరించారు. ఏటా సర్వసభ్య సమావేశాలప్పుడు ప్రకటిస్తున్న హామీలు ఏవీ నెరవేర్చడం లేదని వాపోయారు. దీంతో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. చివరిగా గత సీజన్లో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతలకు ప్రోత్సాహాక భహుమతులు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డివీ సూర్యనారాయణరాజు, డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
క్రషింగ్‌కు సిద్ధమవుతున్న ఎన్సీఎస్
బొబ్బిలి : చెరకు రైతుల అనుమానాలకు అధికారులు తెరదించారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న వేలాది ఎకరాల చెరకును అదే ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల కష్ట, నష్టాలు, ఇబ్బందులను గుర్తించిన అధికారులు స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది క్రషింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చెరకు అభివృద్ధి మండలి అధికారులు, ఉద్యోగులు దగ్గరుండి మిల్లు అయిలింగ్ పనులను చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యాజ మాన్యం మూడేళ్లగా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లింపు పూర్తిగా నిలిపి చేయడంతో ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి విధితమే. రైతులతో పాటు, బ్యాంకులు, కార్మికులు, కూలీలకు దాదాపు రూ.50 కోట్ల వరకూ యాజమాన్యం చెల్లించవలసి ఉంది. ఆర్ఆర్ యాక్టు ప్రకారం ఎన్సీఎస్ ఆస్తులను వేలంవేయడానికి కూడా రెవెన్యూ శాఖ సిద్ధమైంది. ఫ్యాక్టరీ ఎండీ., డైరక్టర్లును పోలీసులు అరె స్టు చేశారు. దాదాపు 20రోజుల తరువాత వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈఫ్యాక్టరీలో క్రషింగ్ జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వేలాది ఎకరాల్లో చెరుకు పండించామని ఇప్పుడు తమగతేంకానని వా పోరారు. దీంతో అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. జిల్లాలో బీమసింగి వద్ద సహకార రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారంలో లచ్చయ్యపేట పరిధిలోని రైతులు సంబంధించిన చెరకును రోజుకు రెండు వందల టన్నులు ఆడేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే దీనివల్ల రవాణా ఖర్చు పెరగడంతో పాటు చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు మరీ అధికమవుతాయని భావించిన అధికారులు లచ్చయ్యపేట ఫ్యాక్టరీ ద్వారా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయించాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయడానికి సుముఖత వ్యక్తంచేస్తూ ఈ నెల 3న అధికారులకు లేఖ పంపింది. దీంతో చెరకు అభివృద్ధి మండలి అధికారులు దగ్గరుండి ఆయిలింగ్ పనులు చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలో కొన్ని ప్రధానమైన భాగాలు పాడైతే వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ ఆయిలింగ్ పనులకు దాదాపు కోటీ 25 లక్షల రూపాయల వరకూ ఖర్చు కానుంది. ఎండీ, డైరక్టర్లు బెయిల్‌పై బయటకు వచ్చేశారు కాబట్టి ఫ్యాక్టరీని క్రషింగు చేయడానికి, ఇతర విషయాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈఏడాది క్రషింగ్‌కు చెరుకు తీసుకువచ్చిన వారికి బిల్లులు వెంట వెంటనే చెల్లించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో 17 మండలాలకు చెందిన దాదాపు 16 వేల మంది రైతులు 6వేల 900 హెక్టార్లలో చెరకు పంటను వేశారు. దాని ద్వారా సుమారు 3 లక్షల 61 వేల టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రోజుకు 4 వేల నుంచి 4200 టన్నుల వరకూ క్రషింగును చేస్తుంది. -
పాపం తుమ్మపాల
సీఎం ప్రకటనతో డోలాయమానంలో రైతులు వచ్చే సీజన్ క్రషింగ్‌పై నీలినీడలు మిల్లు భవితవ్యం సందిగ్ధం కాలం చెల్లిన యంత్రాలతో నెట్టుకొస్తున్న తుమ్మపాల చక్కెర మిల్లుపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయే పరిస్థితులు కానరావడం లేదు. రైతులు,ఉద్యోగులు, కార్మికులు, చివరకు రాజకీయనాయకులు దీనిని సమస్యల నుంచి గట్టెక్కించేందుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఏడాదికేడాది తగ్గిపోతున్న రికవరీ, దయనీయంగా క్రషింగ్ సామర్థ్యం వెరశి మిల్లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కర్మాగారాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు కూడా మూడు నెలల్లో కమిటీ నివేదిక అంటూ చెప్పి వెళ్లిపోవడంతో అన్ని వర్గాల్లో పరిస్థితి ఏమిటన్న వాదన వ్యక్తమవుతోంది. అనకాపల్లి: సహకార రంగంలోని తుమ్మపాల చక్కెరమిల్లు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఆధారపడి ఉన్న అన్ని వర్గాల్లోనూ కలవరం మొదలయింది. కర్మాగారం కష్టాల నుంచి తాత్కాలికంగా గట్టెక్కడానికి రూ.12 కోట్లు అవసరమని యాజమాన్యం ఇటీవల కర్మాగారాన్ని సందర్శించి సీఎం చంద్రబాబునాయుడుకు విన్నవించింది. మూడు నెలల కమిటీ నివేదిక మేరకు న్యాయం చేస్తామంటూ చెప్పి ఆయన వెళ్లిపోయారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు హయాంలోనే ఇది రెండేళ్లు మూతపడింది. మళ్లీ అధికారం చేపట్టిన చంద్రబాబు మిల్లు విషయంలో గతంలో చేసిన తప్పిదాలను సవరించుకుంటారని అంతా భావించినప్పటికీ ఊరటనిచ్చే ప్రకటన చేయలేదు. గతేడాదికి సంబంధించిన బకాయిలు టన్నుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామని ఇటీవల యాజమాన్యం ప్రకటించింది. మిగిలిన మద్దతు ధర కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఫ్యాక్టరీ పరిధిలో13,400 మంది సభ్య రైతులు ఉన్నారు. మద్దతు ధర విషయంలో నమ్మకం లేని వీరంతా తుమ్మపాలకు చెరకు సరఫరాకు ఆసక్తి చూపడంలేదు. దీనికి తోడు ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదు. ఉద్యోగ విరమణ చేసినవారికి పీఎఫ్ వంటి బకాయిల చెల్లింపు పెండింగ్‌లోనే ఉంది. ఇక వచ్చే సీజన్‌కు సమాయత్తం కావాలి. పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగాటకు రైతులు నవంబర్ నుంచి మిల్లుకు తరలిస్తుంటారు. అంటే ఈలోగా ఫ్యాక్టరీలో ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి చేసి మిషనరీని సిద్ధం చేయాలి. కాలం చెల్లిన మిషనరీ ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని దుస్థితి. రెండేళ్లుగా ఈశాన్య రుతుపవనాలు వరదలు సృష్టించడంతో చెరకు పంటకు నష్టం వాటిల్లుతోంది. రికవరీ శాతం పడిపోతోంది. ఇన్ని సమస్యలతో మిల్లు యాజమాన్యం కొట్టుమిట్టాడుతుండగా.. సీఎం మూడు నెలల కమిటీ ఎప్పుడు వస్తుందో..? నివేదిక ఎలా ఉంటుందో? తదుపరి ప్రభుత్వం స్పందన ఏమిటో రైతులకు అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న క్రషింగ్ సీజన్‌పై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఓవ ర్హాలింగ్ పనులకు నిధుల కొరత ప్రస్తుతం వేధిస్తుంది. సీఎం తన పర్యటనలో మిల్లు గురించి కొద్దిసేపు ఆరా తీసి తాత్కాలిక ఉపశమనం కోసం రూ.12కోట్లు సర్దుబాటు చేసి ఉంటే ఊపిరిపోసినట్టయ్యేది. మూడు నెలల కమిటీ ప్రకటన పుణ్యమా అని ఇప్పటికిప్పుడు కర్మాగారానికి నిధులు సర్దుబాటు అనుమానమే. నవంబర్ లోపు ప్రభుత్వ స్పందన వేగంగా లేకుంటే రానున్న సీజన్‌పై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రైతులకు, ఉద్యోగులకు కష్టాలు తప్పవని కర్మాగారం వర్గాలు మదనపడుతున్నాయి. -
గోవాడ క్రషింగ్‌కు మళ్లీ అంతరాయం
కేఎస్ఎన్ నామినేషన్ కోసం పాలకవర్గం నిర్వాకమని రైతుల ఆందోళన కాటాల వద్ద 450 టన్నుల చెరకు ఎండిపోతోందంటూ రైతుల ఆగ్రహం బుచ్చెయ్యపేట/చోడవరం,న్యూస్‌లైన్: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి మళ్లీ క్రషిం గ్‌కు బ్రేక్ పడింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు క్రషింగ్ పునరుద్ధరించారు. పది హేను రోజుల కాలంలో క్రషింగ్ నిలిచిపోవడం ఇది ఏడోసారి. క్రషింగ్ నిలిచిపోవడంతో కాటా ల వద్ద దాదాపు 450 టన్నుల చెరకు పేరుకుపోయింది. మండే ఎండల్లో చెరకు ఎం డిపోతోందని, దీనివల్ల దిగుబడి తగ్గిపోతుం దని రైతులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉండడంతో పాలకవర్గమే ఈ తతంగానికి తెరతీసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ‘లాభాల్లో ఉన్న సుగర్స్‌ను నష్టాలపాల్జేసే లక్ష్యంతోనే యాజమాన్యం, అధికారులు కలిసి పనిచేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలే వేసవి కాలం, పది నిమిషాలు ఎండలో నిలబడలేకపోతున్నాం, అలాంటిది రెండు మూడురోజుల పాటు రాత్రి, పగలు నిద్రాహారం లేక చెరకు కాటాల వద్ద పశువులు, మేము నిరీక్షించాల్సి వస్తోంది’ అని రైతులు అద్దెపల్లి అప్పారావు, రామారావు, గొంప పెదబాబు, పిళ్లా వెంకటరమణ, మాణిక్యం, ఒంటెద్దు రమ ణ, సయ్యపురెడ్డి రమణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డాది, బుచ్చెయ్యపేట చెరకు కాటాల వద్ద టన్నుల కొద్ది చెర కు అన్లోడింగ్ అవ్వక ఎండుతోంది. దీంతో బుచ్చెయ్యపేట, వడ్డాది కాటాల పరిధిలోని 20 గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ కోసమా? గురువారం చోడవరం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి లారీల ద్వారా జనాన్ని తరలించాలని నిర్ణయించారని, జనసమీకరణ కోసం వ్యూహాత్మకంగానే క్రషింగ్ నిలిపివేశారని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు నామినేషన్‌కు రావాలని పథకం ప్రకారమే బుధవారం రాత్రి నుంచి లారీలను చెరకు కాటాలకు పంపించలేదని ధ్వజమెత్తారు. ‘ఫ్యాక్టరీకి టీడీపీకి చెందిన పాలకవర్గం వచ్చినప్పటి నుంచి రైతులకు పాట్లు తప్పడం లేదు. సక్రమంగా కటింగ్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. పలుమార్లు క్రషింగ్‌కు అంతరాయం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం’ అని బుచ్చెయ్యపేట, వడ్డాది, ఎల్.బి.పురం, పేట, దిబ్బిడి, అయితంపూడి, లోపూడి, వీరవల్లి, పోతనపూడి తదితర గ్రామాల చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు కాటాలకు లారీలు తిరగకపోవడం, చెరకు తరలింపు ఎక్కడికక్కడ నిలిచిపోవడంపై ఫ్యాక్టరీ సిబ్బందిని వివరణ కోరగా క్రషింగ్‌లో అంతరాయం వల్లేనని, మరమ్మతులు అనంతరం చెరకు తరలిస్తామని తెలిపారు. -
ఆగిన క్రషింగ్...రోడ్డెక్కిన రైతన్న
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీలో 24 గంటల పాటు క్రషింగ్ ఆగినా...పరిశ్రమ యజమానులు చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతసేపు రోడ్లపై నిలబడాలంటూ రోడ్డెక్కిన నిరసనకు దిగారు. వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని నినదించారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీకి 12 మండలాలకు చెందిన రైతులు చెరకును తెస్తారు. ఈసారి ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించిన ఫ్యాక్టరీ యాజమాన్యం చిన్నచిన్న కారణాలతో తరచూ క్రషింగ్‌ను నిలిపివేస్తోంది. దీంతో చెరకు రోజుల తరబడి ఫ్యాక్టరీ ఎదుట వాహనాల్లో ఉంచాల్సి వస్తోంది. దీంతో రోజురోజుకూ చెరకు బరువు గణనీయంగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు క్రషింగ్ నిలిచిపోగా, ఆదివారం ఉదయం వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు ఫ్యాక్టరీ ఎదుట నర్సాపూర్-మెదక్ ప్రధాన రహదారిపై చెరుకులోడ్‌తో ఉన్న ఎడ్లబండ్లను ఉంచి గంటపాటు రాస్తారోకోను నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వేణుకుమార్ ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనీ, ఫ్యాక్టరీ జీఎంతో తను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం ఎస్ఐ వేణుకుమార్ జీఎంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభం కావడంతో రైతులు కూడా ఆనందపడ్డారు. -
తీపి చేసేవారికి చేదు
=నాలుగు నెలలుగా పస్తులు =జీతానికి నోచుకోని ‘తుమ్మపాల’ కార్మికులు =రూ. కోటికి పైగా బకాయిలు =నేటి నుంచి క్రషింగ్ అందరికీ తీపిని పంచుతారు.. చెరకు నుంచి చక్కెర తయారు చేస్తారు.. వారు మాత్రం చేదు దిగమింగి బతుకంతా ఉసూరం టారు. శ్రమించి చక్కెరను ఉత్పత్తి చేసే తుమ్మపాల సుగర్స్ ఉద్యోగులు చేదును చవి చూస్తున్నారు. పనిచేస్తున్న కర్మాగారం భవితవ్యంపై నీలినీడలు అలుముకుంటూ ఉండడంతో బితుకుబితుకుగా కాలం గడుపుతున్నారు. జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ అష్టకష్టాలతో నెట్టుకొస్తున్నారు. అనకాపల్లి, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర గల తుమ్మపాల సుగర్స్ అనేక రకాల సమస్యలతో సతమతమవుతోంది. ఆర్థిక భారంతో కుంగిపోతోంది. దాంతో ఉద్యోగులు కర్మాగారం భవితవ్యంపై కలవరపడుతున్నారు. మరోవైపున నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం కాలం గడపడంతో విలవిలలాడుతున్నారు. కర్మాగారం పరిధిలో 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 120 మంది ఎన్ఎంఆర్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ నాలుగు నెలలుగా జీతాలు లేవు. యాజమాన్యం రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. మరో మూడు రోజులు గడిస్తే బకాయిలు ఐదు నెలలకు చేరుతాయి. దీంతో ఉద్యోగుల కుటుంబాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మరోవైపున శనివారం నుంచి క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. మరో 302 మందిని సీజనల్ ఉద్యోగులుగా విధుల్లోకి తీసుకుంటారు. వీరికీ జీతాలివ్వాలి. గానుగాట చేపట్టాక ఉత్పత్తయిన పంచదార బస్తాలను తాకట్టు పెట్టి ఆప్కాబ్ ద్వారా రుణం తీసుకుని ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు యాజమాన్యం యోచిస్తోంది. సుమారు రూ. 40 కోట్లకు పైబడిన అప్పుల్లో యాజమాన్యం ఇప్పటికే కూరుకుపోయింది. రుణం చెల్లించాలంటూ ఏపీఐడీసీ, ఆప్కాబ్ ఒత్తిడి తెస్తున్నాయి. మిల్లు ఆధునికీకరణకు రూ.7.54 కోట్లు రుణంగా ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా ఆ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. గతేడాది రూ. 63 లక్షల బకాయిలను రైతులకు ఇప్పటికీ చెల్లించలేదు. నేటి నుంచి గానుగాట 99వేల టన్నుల గానుగాట లక్ష్యంగా తుమ్మపాల సుగర్స్ శనివారం నుంచి గానుగాట ప్రారంభించబోతోంది. ఉదయం 8-41 గంటలకు క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు టన్నుకు రూ. 2100 మద్దతు ధర చెల్లించాల్సి ఉంది. పురాతన యంత్రాల కారణంగా రికవరీ తగ్గిపోవడంతో బస్తా పంచదార ఉత్పత్తికి రూ.3,200 ఖర్చవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బస్తా పంచదార రూ. 2650 మాత్రమే ధర పలుకుతోంది. క్రషింగ్ చేపట్టినా నష్టాలు తప్పని పరిస్థితుల్లో రైతుల మనోభావాలు దెబ్బతినకుండా గానుగాటకు యాజమాన్యం సిద్ధమైంది. జాతీయ చక్కెర సహకార సమాఖ్య సూచనల మేరకు రుణం మంజూరయితే మరో పదేళ్ల వరకు గానుగాట జరపొచ్చుననేది అధికారుల అభిప్రాయం -
క్రషింగ్ ప్రారంభం
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : ఉయ్యూరు కేసీపీ కర్మాగారంలో 2013-14 సీజన్‌కు సంబంధించి క్రషింగ్ ప్రారంభమైంది. సంస్థ చైర్మన్ వినోద్.ఆర్.సేథి సోమవారం రాత్రి 9.58 గంటలకు స్వీచాన్ చేసి లాంఛనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా కర్మాగార ఆవరణలో చెరుకు లోడుతో ఉన్న ట్రక్కుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి పర్మిట్ విడుదల చేశారు. సేథి మాట్లాడుతూ చెరుకు రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థ పనిచేస్తున్నట్లు చెప్పారు. టన్ను మద్దతు ధర రూ.2400 ప్రకటించామన్నారు. దేశంలో ఏ కర్మాగారమూ అమలు చేయని రాయితీలను ఇక్కడ రైతులకు ఇస్తున్నామన్నారు. రైతు ఆపదలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆదుకునే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కర్మాగారానికి లాభాలు వచ్చినప్పుడు వాటిలో కొంత రైతులకు పంచుతున్న ఘనత తమదేనన్నారు. రైతులకు సీజన్ ముగిసేలోపే పూర్తి చెల్లింపులు జరుపుతున్నామన్నారు. 14 రోజులకే తొలి పేమెంట్ అందిస్తున్నామన్నారు. ఈ విధంగా చెల్లింపులు మరెక్కడా లేవన్నారు. రైతులంతా కర్మాగారానికి సకాలంలో చెరుకు రవాణా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), కే కృష్ణ (పరిపాలన), సీకే వసంతరావు (ఫైనాన్స్), హరిబాబు (ప్రాసెస్), డీజీఎం సీతారామారావు (ఇంజినీరింగ్), సీడీసీ చైర్మన్ నెరుసు సతీష్, కార్యదర్శి సత్యనారాయణ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావు, కార్యదర్శి భాగ్యనిరంజనరావు తదితరులు పాల్గొన్నారు.