మెదక్ రూరల్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్(ఎన్‌డీఎస్‌ఎల్) ఫ్యాక్టరీలో 24 గంటల పాటు క్రషింగ్ ఆగినా...పరిశ్రమ యజమానులు చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతసేపు రోడ్లపై నిలబడాలంటూ రోడ్డెక్కిన నిరసనకు దిగారు. వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని నినదించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...
ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీకి 12 మండలాలకు చెందిన రైతులు చెరకును తెస్తారు. ఈసారి ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించిన ఫ్యాక్టరీ యాజమాన్యం చిన్నచిన్న కారణాలతో తరచూ క్రషింగ్‌ను నిలిపివేస్తోంది. దీంతో చెరకు రోజుల తరబడి ఫ్యాక్టరీ ఎదుట వాహనాల్లో ఉంచాల్సి వస్తోంది. దీంతో రోజురోజుకూ చెరకు బరువు గణనీయంగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు క్రషింగ్ నిలిచిపోగా, ఆదివారం ఉదయం వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు ఫ్యాక్టరీ ఎదుట నర్సాపూర్-మెదక్ ప్రధాన రహదారిపై చెరుకులోడ్‌తో ఉన్న ఎడ్లబండ్లను ఉంచి గంటపాటు రాస్తారోకోను నిర్వహించారు.
దీంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ వేణుకుమార్ ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనీ, ఫ్యాక్టరీ జీఎంతో తను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం ఎస్‌ఐ వేణుకుమార్ జీఎంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభం కావడంతో రైతులు కూడా ఆనందపడ్డారు.