Nizam Deccan Sugar Factory
-
దూకుడు పెంచుతున్న టీజేఎసీ
-
అసెంబ్లీలో ‘ఇందూరు’ సమస్యలు
నిజామాబాద్ అర్బన్ : అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన పలు అంశాలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనంపై ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని నిలదీశారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న విషయం ఎంతవరకు వాస్తవమో చెప్పాలన్నారు. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. డేల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్‌తో ఎన్ఎస్ఎల్ ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ అభిప్రాయూన్ని కోరామన్నారు. రోడ్డు విస్తరణపై.. నిజామాబాద్ -డిచ్పల్లి రోడ్డు విస్తరణపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడారు. మాధవనగర్ సమీపంలోని రైల్వేవంతెనపై రోడ్డు వంతెన నిర్మించే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయూ? ఉంటే అంచనా వ్యయంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల వివరాలు ఏమిటి? పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. నిజామాబాద్ -డిచ్పల్లి మార్గంలో 14.20 కిలోమీటర్ల పొడవులో 10.20 కిలోమీటర్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మిగతా నాలుగు కిలోమీటర్ల కోసం టెండర్లను పిలిచామని తెలిపారు. రెండు వరుసల ఆర్వోబీ కోసం అంచనా వ్యయం రూ. 44.07 కోట్లు అని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో అలైన్మెంట్, జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ పని పూర్తరుు్యందన్నారు. పనులు ప్రారంభించిన ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తామన్నారు. -
భూములెక్కడ
బోధన్‌లోని నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. వేలాది మంది కార్మికులకు, రైతులకు, కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. చంద్రబాబు పుణ్యమా అని ఇపుడు ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. పాలకుల నిరాదరణకు గురవుతోంది. ఈ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నిజాం కేటాయించిన 16వేల ఎకరాల భూములు ఏమయ్యాయో, ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు వాటి గురించి ఆరా తీస్తున్నారు. బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ఇటీవల జరిగిన ఓ సమీక్ష సమావేశం లో కలెక్టర్ రొనాల్డ్ రోస్ తహసీల్దార్ల నుంచి ప్యాక్టరీ భూ ములపై నివేదికలు కోరినట్టు సమాచారం. ఈ మేరకు వారు భూముల వివరాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. వేల ఎకరాల సాగు భూములు పదిలంగా ఉన్నా యా, లేదా అనే అంశాలతోపాటు అమ్మకాలకు పోను, అసలు మిగిలిన భూమి ఎంత అనే వివరాలను సేకరించే పనిలో పడిపోయారు. విచిత్రమేమిటంటే రెవెన్యూ శాఖ వద్ద కూడా ఈ భూములకు సంబంధించిన సమాచారం లేదు. దీంతో అధికారులు, నిజాం షుగర్స్ ఆస్తులు, భూ ముల పరిరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోర్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ భూముల పంపిణీ, కేటాయింపులలో గందరగో ళం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు భూములు ఎంతంటే 1938లో బోధన్‌లో నిజాం పాలకులు ఆసియా ఖండంలో నే అతి పెద్ద వ్యవసాయధారిత పరిశ్రమగా ‘నిజాం షుగ ర్స్’ను ఏర్పాటు చేశారు. దీని అభివృద్ధి కోసం చెరుకు సాగును ప్రోత్సహించేందుకు 16 వేల ఎకరాల భూముల ను కేటాయించారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలో గల బోధన్, రెంజల్, కోటగిరి, వర్ని మండలాల పరిధిలో ఈ భూములున్నాయి. వీటి పరిధిలో 14 వ్యవసా య ఫారాలను నెలకొల్పారు. దీంతో రైతులు చెరుకును సాగుచేసి లాభాలను ఆర్జించారు. చక్కెర ఫ్యాక్టరీ కూడా లాభాలతో ముందుకు నడిచింది. ప్రపంచస్థాయిలో పేరు సంపాదించుకుంది. వేలాది మంది కార్మికులు, రైతులు, కూలీలకు జీవనాధారంగా నిలిచింది. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలూ విస్తరించాయి. కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులూ సమకూరాయి. ఇలా కరిగిపోయింది నిజాం పాలన అంతరించి, ప్రజాప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీ క్షీణదశ ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు దీనిని అసలు పట్టించుకోలేదు. దీంతో కర్మాగారం నష్టాలబాట పట్టింది. దీనిని సాకుగా చూపి 1999 - 2000 నుంచి సారవంతమైన ఫ్యాక్టరీ సాగు భూములను అమ్మడం ప్రారంభించారు. అప్పటిలో అధికారంలో ఉన్న చంద్రబాబు దీనికి శ్రీకారం చుట్టారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా భూములను కొనుగోలు చేయించి దళితులు, గిరి జనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ పేదలకు ఎకరం చొప్పున కేటాయించారు. ఇందులో కూడా గందరగోళం నెలకొంది. చాలా మంది పేదలకు పలు గ్రామాలలో పట్టా లు ఇవ్వలేదు. వారంతా ఇప్పటికీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని గ్రామాలలో పట్టాలు ఒక చోట, భూములు మరో చోట ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేసిన పేదల భూములను కొంత మంది ధనికవర్గాలవారు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల స్థలాలు, ప్రభు త్వ విద్యా సంస్థలు, మోడల్ ఇందిరమ్మ ఇళ్ళ కాలనీలు, పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూములను కేటాయిం చారు. దీంతో ఫ్యాక్టరీ భూమి కరిగిపోయింది. ఎవరెవరికి ఎంత భూమిని కేటాయించారనేది స్పష్టంగా తెలియడం లేదు. 16 వేల ఎకరాలలో ప్రస్తుతం ఐదు లేదా ఆరువంద ల ఎకరాలకు మించి ఉండదని అంటున్నారు. గతంలో పలు ప్రజా సంఘాలు ఫ్యాక్టరీ భూముల అమ్మకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పరిశ్రమల పేరిట పంపిణీ బోధన్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే ప్రధానరహదారికి ఆనుకుని ఆచన్‌పల్లి శివారులోని విలువైన ఫ్యాక్టరీ భూమి దాదాపు తొమ్మిది ఎకరాలను ఏపీఐడీసీ ద్వారా పరిశ్ర మలకు కేటాయించారు. ఏళ్లు గడిచినా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. విలువైన భూమి మాత్రం ఆయా కంపెనీల చేతిలోనే ఉంది. 2002లో చంద్రబాబు హయాం లో నిజాం షుగర్స్‌ను ప్రయివేటీకరించారు. దీంతో నిజాం షుగర్స్.. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ ఆస్తులు, భూముల పరరక్షణకు కోర్ కమిటీని నియమించారు. కోర్ కమిటీ హయాంలోనే విలువైన భూములు అమ్ముడుపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మకాలలో అనేక అక్రమా లు చోటు చేసుకున్నాయనే విమర్శలూ ఉన్నాయి. బోధన్ పట్టణ పరిసరాలలో కోట్ల రూపాయల విలువైన భూము లు ధనికవర్గాల చేతిలోకి వెళ్లాయని అంటున్నారు. మొత్తా నికి ఈ అంశం తేనె తుట్టెలాగా మారింది. దీన్ని కదిలిస్తే భూములు అమ్మకాలలో అక్రమాలు బహిర్గతమవుతాయని రైతు నాయకులు అంటున్నారు. -
‘బోధన్ షుగర్స్’ను సర్కార్ స్వాధీనం చేసుకోవాలి
బోధన్ : బోధన్ నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు కార్మికులు, రైతులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలతో కలసి ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. షుగర్స్ మజ్ధూర్ సంఘ్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మందకృష్ణ మాదిగ, బీఎంఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. 2001లో టీడీపీ ప్రభుత్వం నిజాం చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటిం చిన తరుణంలో బోధన్‌లో ఓ బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ ఫ్యాక్టరీ గేటు తాకినా తెలంగాణలోని లక్షలాది మంది కార్మికులతో ఫ్యాక్టరీని ముట్టడిస్తామని అన్నారని గుర్తుచేశారు. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అవుతుంటే మాట్లాడలేదు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం, ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్‌లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ తెలంగాణలోని నిజాం చక్కెర ఫ్యాక్టరీని అప్పనంగా ఆంధ్ర పెట్టుబడి దారులకు అప్పగించారని, దా నిని అధికారంలోకి వచ్చిన రెండు మాసాల్లోనే స్వా ధీనం చేసుకొని, పునర్ వైభవాన్ని తెప్పిస్తామని మా యమాటలు చెప్పారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిని దళితున్ని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట మార్చి దళితులను మోసం చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్‌కు వచ్చిన ఎంపీ కవిత ప్రజల సాక్షిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మన ఫ్యాక్టరీని మనం తీసుకుందామని, తిరిగిమన పిల్లలకు ఉద్యోగాలు రప్పించుకుందామన్నారని తెలిపారు. ఫ్యాక్టరీ గేటు ముందు కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఫ్యాక్టరీని టేకోవర్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదన్నారు. ఫ్యాక్టరీ స్వాధీనానికి కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమంలో ప్రభుత్వం కుట్రలు పన్నితే ప్రజా ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. న్యాయపరమైన ఉద్యమాలు తప్పక విజయాన్ని సాధిస్తాయన్నారు.33 శాతం మహిళలకు కేటాయిస్తున్నామని ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ తన కేబినెట్లో ఎంత మంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు. జాయింట్ వెంచర్‌ను రద్దు చేసి ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంత వరకు సుదీర్ఘ పోరాటం సాగిస్తామన్నారు. సభాసంఘం నివేదికను అమలు చేయాలి - యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీపై శాసన సభాసంఘం ఇచ్చిన నివేదికను ప్రభుత్వం త్వరిత గతిన అమలు చేసి కార్మికుల, రైతులను కాపాడాల్సి ఉందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి కార్మికులను రోడ్డు పడేశారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని కార్మికులను, రైతులను ఆదుకోవాలన్నారు. ఫ్యాక్టరీ స్వాధీనానికి అడ్డంకులు ఉంటే అవి కార్మికుల, ప్రజల దృష్టికి తీసుకు రావాలన్నారు. రిలే దీక్షల్లో షుగర్స్ మజ్ధూర్ సంఘ్ కార్మిదర్శి రాజయ్య, కార్మికులు జగదీశ్వర్‌రెడ్డి, అస్లాం, లక్ష్మీనారాయణ, గంగాధర్, ఇస్మాయిల్, సర్వర్ మక్దూమ్, లక్ష్మి, శోభ లు కూర్చున్నారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కొండా సాయిరెడ్డి, ఎంఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషన్‌జీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, బీజేపీ నాయకులు డాక్టర్ శివప్పా, సుభాష్, వీహెచ్పీఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, కౌన్సిలర్లు రామారాజు, ధర్మపురి, ఎమ్మార్పీఎస్ నాయకులు మానికోల్ల గంగాధర్, గందమాల చంద్రయ్య, గడ్డం రమేష్, కార్మికులు పాల్గొన్నారు. -
నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ‘చంద్ర’ గ్రహణం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కాలం మొత్తం జిల్లా అభివృద్ధికి గ్రహణం పట్టింది. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతు ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో లక్షల మంది నోళ్లను తీపి చేసే చెరకు ైరైతు బతుకు చేదుగా మారింది. రూ. 600 కోట్ల విలువ గల మూడు నిజాం షుగర్ ప్యాక్టరీలను టెండర్ లేకుండా రూ. 65.40 కోట్లకే అమ్మేశారు. దీంతో నామ మాత్రపు ధరలకు ఫ్యాక్టరీలు ప్రైవేటు పరమయ్యాయి. సగం మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. చెరకు రైతు ప్రయోజనాలు ప్రైవేటు యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నియమించిన సభాసంఘం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ పరం చేయాలని సిఫార్సు చేసినా ఇంకా అమలుకు నోచుకోలేదు. ఫ్యాక్టరీ అమ్మకాలపై సీనియర్ ఐఏఎస్ అధికారి పరేఖ్ ఇటీవల ఓ పుస్తకంలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు నిర్ణయాలపై విచారణ జరిపిస్తామని ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తిరిగి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వివాదంపై చర్చ మొదలైంది. రూ. 600 కోట్ల ఫ్యాక్టరీలను, ఆస్తులను రూ.65.40 కోట్లకు అమ్మేశారు చెరకు రైతుకు..చేదుబతుకు ఉపాధి కోల్పోయిన కార్మికులు మెదక్, జహీరాబాద్, న్యూస్‌లైన్: అనాదిగా మెతుకు సీమ చెరకు పంటకు ప్రసిద్ధి. దీంతో 1987లో మంబోజిపల్లిలో నిజాం దక్కన్ షుగర్ ప్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ విజయవంతంగా నడవడంతో అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి లాభాలు వచ్చాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చెరకు ఫ్యాక్టరీలు నష్టాల్లో కూరుకు పోవడం, రాష్ట్ర సలహా ద్వారా కొనుగోలు ట్యాక్స్, ప్రోత్సాహక ధర పెంపు తదితర పరిణామాల నేపథ్యంలో వాటిప్రభావం తెలంగాణలోని ఫ్యాక్టరీలపైనా పడింది. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా మెట్పల్లి, శక్కర్‌నగర్, మంభోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీలను ఎలాంటి టెండర్లు లేకుండానే ప్రభుత్వం గోల్డ్‌స్టోన్ కంపెనీకి రూ.65.40 కోట్లకే కట్టబెట్టింది. ఈ విషయంలో అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఫరేఖ్ విభేదించినప్పటికీ ఆయన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా మంత్రుల సిఫార్సు మేరకు చంద్రబాబు ఫ్యాక్టరీలను అమ్మేశారని ‘‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్’’ అనే పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాక్టరీల వాటా 51శాతం గోల్డ్‌స్టోన్ కంపెనీకి, 49శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా 2002లో ఒప్పందం జరిగింది. ఏనిమిదేళ్లలో పూర్తి డబ్బును ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించి ఫ్యాక్టరీలను కైవసం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పొయిన 235మంది చెరకు ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించే సమయంలో సుమారు 235 మంది ఉద్యోగాలు కోల్పోయారు. చెరకు బిల్లులు కూడా సమయానుకూలంగా చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. చెరుకు క్రషింగ్‌లో ఆలస్యమవుతుండటంతో చెరకు పంట ఎండి రైతులు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. యాజమాన్యం రైతుల పేరిట బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫ్యాక్టరీలోని స్క్రాప్ కూడా అమ్ముకున్నారని రైతులు అప్పట్లో ఆందోళనకు దిగారు. సభా సంఘం సిఫార్సు వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక 2006 ఏర్పాటు చేసిన సభా సంఘం ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో అవకతవకలు జరిగాయని తేల్చింది. వెంటనే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు చెరకు రైతు పోరాట సమితి నాయకులు కోర్టును ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చివరి రోజుల్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకొని నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయం తేల్చాలని సూచించారు. కొంతమంది మంత్రులు ప్రైవేటీకరణ కోసం ప్రయత్నిస్తున్నారంటూ పోరాట సమితి 2014 జనవరి 9న కోర్టును ఆశ్రయించింది. అదేరోజు మంత్రివర్గ సంఘ సభ్యులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలని సిఫార్సు చేశారు. అయితే ఈ సిఫార్సును ఆమోదించినట్లు వార్తలు వెలువడినప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దీంతో రైతులు మాత్రం వెంటనే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కారు చౌకగా అమ్మేశారు జహీరాబాద్: జహీరాబాద్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని కూడా చంద్రబాబు అప్పనంగా అమ్మేశారు. ప్రభుత్వ ఆస్తులు కారు చౌకగా అమ్మడమే కాకుండా కర్మాగారంలో పనిచేసే కార్మికుల బతుకులు రోడ్డుపాలయ్యాయి. ఈ కర్మాగారాన్ని చంద్రబాబు కేవలం రూ.18.5 కోట్లకే విక్రయించారు. 2002 నవంబర్‌లో నిజాం చక్కెర కర్మాగారం ప్రైవేటుపరమైంది. కర్మాగారం, కర్మాగారం కింద 72.10 ఎకరాల భూమి ఉంది. 30 ఎకరాల విస్తీర్ణంలో క్వార్టర్లు ఉన్నాయి. అంతా కలిపి వంద ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇంత మేర ఉన్న ఆస్తులను ఇంత తక్కువ ధరకు విక్రయించడం వెనుక స్వ ప్రయోజనాలున్నాయనే విమర్శలున్నాయి. కొనుగోలు కోసం సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారం యాజమాన్యం బిడ్ వేసి దక్కించుకుంది. 2006లో గణపతి చక్కెర కర్మాగారం యాజమాన్యం విక్రయానికి పెట్టింది. తమిళనాడులోని రాజశ్రీ గ్రూప్ కర్మాగారం 2006 ఏప్రిల్‌లో దీనిని కొనుగోలు చేసింది. రాజశ్రీ యాజమాన్యం కర్మాగారాన్ని రూ.61 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కర్మాగారం, ఆస్తులు కలుపుకుని రూ.200 కోట్లకు పైగా ఉంటుందని చెరకు రైతుల అంచనా. విలువైన ఆస్తులను ఇంత తక్కువ ధరకు విక్రయించడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలున్నాయని చెరకు రైతులు ఆరోపిస్తున్నారు. కార్మికుల బతుకులు రోడ్డుపాలు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడంతో కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల బతుకులు వీధుల పాలయ్యాయి. కర్మాగారంలో 400 మంది కార్మికులు, అధికారులు పని చేసే వారు. కర్మాగారాన్ని కొనుగోలు చేసిన యాజమాన్యం కార్మికులకు వీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో 290 మంది వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారికి ఎక్కడా అవకాశాలు లభించక పోవడంతో రోడ్డున పడ్డారు. వీఆర్ఎస్లో తీసుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోయి బతుకులు దిన దిన గండంగా మారాయి. వీరిలో 15 మంది మానసికంగా కృంగిపోయి మరణించారని తోటి కార్మికులు చెప్పారు. రైతుల పాలిట శాపం జహీరాబాద్ ప్రాంతంలో చెరకును రైతులు అధికంగా సాగు చేస్తున్నందున 1972లో నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 12వేల మంది చెరకు రైతులున్నారు. ప్రభుత్వ పరంగా కర్మాగారాన్ని నిర్వహించి ఉంటే చెరకు పంటకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉండేదంటున్నారు. చక్కెర ధర అధికంగా ఉన్నా ప్రైవేటు యాజమాన్యం చెరకు పంటకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడం లేదంటున్నారు. కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా ఉండి ఉంటే గిట్టుబాటు ధర లభించేదన్నారు. -
ఆగిన క్రషింగ్...రోడ్డెక్కిన రైతన్న
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీలో 24 గంటల పాటు క్రషింగ్ ఆగినా...పరిశ్రమ యజమానులు చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతసేపు రోడ్లపై నిలబడాలంటూ రోడ్డెక్కిన నిరసనకు దిగారు. వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని నినదించారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీకి 12 మండలాలకు చెందిన రైతులు చెరకును తెస్తారు. ఈసారి ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించిన ఫ్యాక్టరీ యాజమాన్యం చిన్నచిన్న కారణాలతో తరచూ క్రషింగ్‌ను నిలిపివేస్తోంది. దీంతో చెరకు రోజుల తరబడి ఫ్యాక్టరీ ఎదుట వాహనాల్లో ఉంచాల్సి వస్తోంది. దీంతో రోజురోజుకూ చెరకు బరువు గణనీయంగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు క్రషింగ్ నిలిచిపోగా, ఆదివారం ఉదయం వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు ఫ్యాక్టరీ ఎదుట నర్సాపూర్-మెదక్ ప్రధాన రహదారిపై చెరుకులోడ్‌తో ఉన్న ఎడ్లబండ్లను ఉంచి గంటపాటు రాస్తారోకోను నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వేణుకుమార్ ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనీ, ఫ్యాక్టరీ జీఎంతో తను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం ఎస్ఐ వేణుకుమార్ జీఎంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభం కావడంతో రైతులు కూడా ఆనందపడ్డారు. -
‘దక్కన్’ దక్కేనా?
మెదక్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యాజమాన్య హక్కులపై అనిశ్చితి నెలకొంది. దక్కన్ దక్కేనా? లేక ప్రైవేటుపరం కానుందా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. అయితే దీనిపై ప్రభుత్వం వేసిన మంత్రుల కమిటీకి తెలంగాణ వచ్చాకే తమ నిర్ణయాన్ని తెలపాలని రైతులు వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఎన్డీఎస్ఎల్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమకు అనుకూలమైన నిర్ణయం ఉంటుందన్న ఆశతో అన్నదాతలు ఉన్నారు. ప్రైవేటీకరణకు కారణమేంటి? మంభోజిపల్లి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమనేది అన్నదాతల ఆరోపణ. రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న హిందూపూర్, బొబ్బిలి, శాతనగరం, లచ్చయ్యపేట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొనుగోలు చేసి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలకు అప్పగించారు. దీంతో ఆ ఫ్యాక్టరీల నష్టాల ప్రభావం తెలంగాణలోని వాటిపై పడిందని వారి భావన. వీటికి తోడు కొనుగోలు పన్ను 22నుంచి 90 శాతం పెంచడంతో మరింత భారం పడింది. దీంతో రూ.750 కోట్ల విలువైన మంభోజిపల్లి, బోధన్, మెట్పల్లి ఫ్యాక్టరీలను జాయింట్ వెంచర్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.65.45 కోట్లకే డెల్టా పేపర్ మిల్స్‌కు విక్రయించినట్లు చెరకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి నాగిరెడ్డి చెబుతున్నారు. 51 శాతం ప్రైవేట్ యాజమాన్యానికి, 49 శాతం ప్రభుత్వానికి వాటాలు విభజించి డబ్బులు చెల్లింపు సమయం కూడా ప్రైవేట్ యాజమాన్యానికి అనుకూలంగా 8 ఏళ్ల వ్యవధి ఇచ్చిందనేది మరో ఆరోపణ. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ ఆరోపణలపై స్పందిస్తూ 18 మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కమిటీ వేశారు. జూవ్వాడి రత్నకర్‌రావు ఆధ్వర్యంలో వేసిన కమిటీ టీడీపీ సర్కార్ విక్రయించిన మూడు ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. కానీ అమలుకు నోచుకోలేదు. ఇదిలా ఉండగా మంభోజిపల్లి, మెట్పల్లి, బోధన్‌లోని షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వమైనా స్వాధీనం చేసుకోవాలని, లేదంటే పూర్తిగా తమకైనా అప్పజెప్పాలని డెల్టా యాజమాన్యం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఆరు మంది మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రైతుల అభిప్రాయాలను తెలుసుకొని నిర్ణయం ప్రకటించేందుకు సర్కార్ సన్నద్ధమైంది. తెలంగాణపై ఆశలు నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ భవితవ్యంపై తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోవాలంటూ రైతులు మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతుల వద్దకు వెళ్లి ఎన్డీఎస్ఎల్ ప్రైవేటీకరణకు మద్దతు తెలిపితేనే పర్మిట్లు ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఎన్డీఎస్ఎల్ జీఎం నాగరాజును వివరణ కోరగా విషయం నిజమేనని స్పష్టం చేశారు. దీంతో రైతులంతా ఆయనపై మండిపడ్డారు. కొంతమంది రైతులు ప్రైవేటీకరణకు అనుకూలం వ్యక్తం చేయగా, మరికొంతమంది రైతులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలని డిమాండ్ చేశారు. వాదోపవాదాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఫ్యాక్టరీ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి నాగిరెడ్డి, సీడీసీ చైర్మన్ నరెందర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు దుర్గారెడ్డి, జనార్ధన్‌రావు, ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రామాయంపేట ఏఎంసీ చైర్మన్ రమణ, సీడీసీ డెరైక్టర్ ఆంజనేయులు, ఆత్మ చైర్మన్ ఏసురెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి బాబాన్న, రైతు నాయకులు బస్వరాజ్, నర్సింహారెడ్డి, సిద్ధిరాంరెడ్డి, వెంకట్రెడ్డిలతోపాటు సుమారు వంద మంది రైతులు పాల్గొన్నారు.