మెదక్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యాజమాన్య హక్కులపై అనిశ్చితి నెలకొంది. దక్కన్ దక్కేనా? లేక ప్రైవేటుపరం కానుందా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. అయితే దీనిపై ప్రభుత్వం వేసిన మంత్రుల కమిటీకి తెలంగాణ వచ్చాకే తమ నిర్ణయాన్ని తెలపాలని రైతులు వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఎన్డీఎస్‌ఎల్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమకు అనుకూలమైన నిర్ణయం ఉంటుందన్న ఆశతో అన్నదాతలు ఉన్నారు.
ప్రైవేటీకరణకు కారణమేంటి?
మంభోజిపల్లి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమనేది అన్నదాతల ఆరోపణ. రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న హిందూపూర్, బొబ్బిలి, శాతనగరం, లచ్చయ్యపేట్‌లను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొనుగోలు చేసి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలకు అప్పగించారు. దీంతో ఆ ఫ్యాక్టరీల నష్టాల ప్రభావం తెలంగాణలోని వాటిపై పడిందని వారి భావన. వీటికి తోడు కొనుగోలు పన్ను 22నుంచి 90 శాతం పెంచడంతో మరింత భారం పడింది. దీంతో రూ.750 కోట్ల విలువైన మంభోజిపల్లి, బోధన్, మెట్‌పల్లి ఫ్యాక్టరీలను జాయింట్ వెంచర్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.65.45 కోట్లకే డెల్టా పేపర్ మిల్స్‌కు విక్రయించినట్లు చెరకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి నాగిరెడ్డి చెబుతున్నారు. 51 శాతం ప్రైవేట్ యాజమాన్యానికి, 49 శాతం ప్రభుత్వానికి వాటాలు విభజించి డబ్బులు చెల్లింపు సమయం కూడా ప్రైవేట్ యాజమాన్యానికి అనుకూలంగా 8 ఏళ్ల వ్యవధి ఇచ్చిందనేది మరో ఆరోపణ. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ ఆరోపణలపై స్పందిస్తూ 18 మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కమిటీ వేశారు.
జూవ్వాడి రత్నకర్‌రావు ఆధ్వర్యంలో వేసిన కమిటీ టీడీపీ సర్కార్ విక్రయించిన మూడు ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. కానీ అమలుకు నోచుకోలేదు. ఇదిలా ఉండగా మంభోజిపల్లి, మెట్‌పల్లి, బోధన్‌లోని షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వమైనా స్వాధీనం చేసుకోవాలని, లేదంటే పూర్తిగా తమకైనా అప్పజెప్పాలని డెల్టా యాజమాన్యం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఆరు మంది మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రైతుల అభిప్రాయాలను తెలుసుకొని నిర్ణయం ప్రకటించేందుకు సర్కార్ సన్నద్ధమైంది.
తెలంగాణపై ఆశలు
నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ భవితవ్యంపై తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోవాలంటూ రైతులు మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతుల వద్దకు వెళ్లి ఎన్డీఎస్‌ఎల్ ప్రైవేటీకరణకు మద్దతు తెలిపితేనే పర్మిట్లు ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఎన్డీఎస్‌ఎల్ జీఎం నాగరాజును వివరణ కోరగా విషయం నిజమేనని స్పష్టం చేశారు. దీంతో రైతులంతా ఆయనపై మండిపడ్డారు.
కొంతమంది రైతులు ప్రైవేటీకరణకు అనుకూలం వ్యక్తం చేయగా, మరికొంతమంది రైతులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలని డిమాండ్ చేశారు. వాదోపవాదాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఫ్యాక్టరీ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి నాగిరెడ్డి, సీడీసీ చైర్మన్ నరెందర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌లు దుర్గారెడ్డి, జనార్ధన్‌రావు, ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రామాయంపేట ఏఎంసీ చైర్మన్ రమణ, సీడీసీ డెరైక్టర్ ఆంజనేయులు, ఆత్మ చైర్మన్ ఏసురెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి బాబాన్న, రైతు నాయకులు బస్వరాజ్, నర్సింహారెడ్డి, సిద్ధిరాంరెడ్డి, వెంకట్‌రెడ్డిలతోపాటు సుమారు వంద మంది రైతులు పాల్గొన్నారు.
‘దక్కన్’ దక్కేనా?
Published Wed, Dec 18 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement