venukumar
-
రైతు భరోసాకు ఈసీ బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు భరోసా పథకం కింద నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మే 13న ఎన్నికలు ముగిసి న తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశించింది. నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. రైతు భరో సా విషయంలో రాష్ట్రానికి చెందిన ఎన్.వేణుకుమార్ సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా పథకం చెల్లింపులపై చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.ఫిర్యాదును పరిశీలించిన ఈసీ, ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లఘించారని పేర్కొంది. రైతు భరోసా నిధుల విడుదలపై ఆంక్షలు విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు సమ్మతిని తెలుపుతూ నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలింగ్ పూర్తయిన తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు నిధులు విడుదలకు సంబం«ధించి ఎన్నికల కమిషన్ విధించిన షరతులను ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో.. అంతకుముందు రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్న (నవంబరు 27, 2023న) విషయం గుర్తు చేసింది. ఎన్.వేణుకుమార్ ఫిర్యాదు, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నివేదిక పరిశీలించిన తర్వాత.. నిధుల విడుదలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడటం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం గానే భావించినట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో పోలింగ్ పూర్తయిన తర్వాత 2023 రబీ సీజన్ నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తున్నట్లు తెలిపింది.ఈసీ ఆదేశాలతోనే రైతు భరోసా ఆగింది: భట్టివిక్రమార్క చౌటుప్పల్, మునుగోడు: రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో రూ.7,624 కోట్ల రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే ఐదు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని తెలిపారు. ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు సైతం సాయం అందించాలని భావించినప్పటికీ కొంతమంది ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, దాంతో ఈసీ ఆదేశాలతో నిధులు జమచేసే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం రాత్రి కార్నర్ మీటింగ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో స్థానికంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నిరుపేదలకు తిరుదర్శనం
కొల్లూరి సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ పూట గడవడమే కష్టమైన నిరుపేదలకు సుదూర దైవదర్శన యాత్రలకు వెళ్లగలిగే స్థోమత ఉంటుందా? మరి వారికే కనుక ఆ తిరుమల వెంకన్న దర్శనానికి అవకాశమొస్తే వారి ఆనందానికి అవధులు ఉంటాయా! అలాంటి అరుదైన అవకాశం కల్పిస్తున్నారు పారిశ్రామికవేత్త, శ్రీ అష్టోత్తర శత (108) చారిటబుల్ ట్రస్టు ధర్మకర్త చుక్కల వేణుకుమార్. అసలు అలాంటి ఒక సంకల్పం ఆయనలో ఎలా కలిగింది? ఆ వివరాలు, విశేషాలు ఆయన మాటల్లోనే... అంజనాద్రిలో వచ్చిన ఆలోచన నేను పుట్టి పెరిగింది భాగ్యనగరంలో. తొలిసారి 1996లో తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడి నుంచి తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాను. ఆ తర్వాత వరుసగా ఆరు పర్యాయాలు తిరుమలకు పాదయాత్ర చేశాను. అమ్మ తనూ వస్తాననడంతో ఎనిమిదోసారి ఆమెను కూడా నావెంట తీసుకెళ్లాను. ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాను. 11వసారి తిరుమలకు కాలినడకన వెళుతుంటే దారిలో అంజనాద్రి ఆలయం వద్ద అలసట తీర్చుకునేందుకు ఆగినప్పుడు అక్కడ నాకు ఓ పాత దినపత్రిక కనిపించింది. అందులోని ఓ వార్త నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. దివంగత రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ... మొత్తం 108 పర్యాయాలు తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లారనేది ఆ వార్త సారాంశం. అది నాలో స్ఫూర్తిని కలిగించింది. ఆ స్ఫూర్తితో నాటి నుంచి దాదాపు ప్రతి నెలా తిరుమల కొండకు పాదయాత్ర చేస్తూ వచ్చాను. ఇప్పటికి 142 సార్లు ఆ దేవదేవుడిని కాలినడకన దర్శనం చేసుకున్నా. 108వసారి తిరుమలకు వెళ్లినపుడు పుష్పగిరి మఠం మేనేజర్ పుండరీకాక్షుడితో పరిచయమైంది. అదే సమయంలో టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతోనూ పరిచయ భాగ్యం కలిగింది. మనసులో మెదిలింది ఇన్నిసార్లు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లిన నా మదిలో ఓ ఆలోచన మెదిలింది. జీవితంలో ఒక్కసారి కూడా తిరుమల చూడని నిరుపేద భక్తులకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇందులో భాగంగా హయత్‌నగర్ మండలం కొత్తగూడలోని కోటిలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఓ ప్రకటన పెట్టించాను. ఒక్కసారి కూడా తిరుమల చూడనివారికి ఉచిత దర్శనం కల్పిస్తామని అందులో ప్రకటించాము. అలా ఒక్కసారి కూడా వెంకన్నను చూడని భక్తులకు దర్శనావకాశం కల్పించే కార్యక్రమానికి బీజం పడింది. తొలి విడతగా మా వెంట 36 మంది తిరుపతి వచ్చారు. ఆ యాత్ర నిరుడు నా 39వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించాం. అదే రోజు 39 మంది సమక్షంలో దైవజ్ఞశర్మ నేతృత్వంలో శ్రీ అష్టోత్తర శత(108) చారిటబుల్ ట్రస్టును ప్రారంభించాం. తొలి పర్యటనలో పాల్గొన్న వారందరికీ సకల సౌకర్యాలు కల్పించాం. ఈ ఏడాది ఆగస్టులో రెండో విడత భక్తులను తిరుమలకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్ ప్రణాళిక కాళ్లు చేతులు లేని 50 మందిని ఎంపిక చేసి, వారిని కూడా తిరుమలకు తీసుకెళ్లాలని అనుకొంటున్నాం. వీరంతా తమ వెంబడి ఓ సహాయకుడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. వారికి అయ్యే ఖర్చులు కూడా మేమే భరిస్తాం. అలాగే అంధులకు దర్శనం మరో కార్యక్రమం. కళ్లులేని 51 మందిని తిరుమలకు తీసుకెళ్లాలని మేం సంకల్పిస్తున్నాం. వీరు కూడా తమ వెంట ఓ సహాయకుడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. వారి ఖర్చులు కూడా మేమే భరిస్తాం. కళ్లులేనివారు దేవుడిని చూడలేరనదేగా మీ సందేహం... వాళ్లు దేవుణ్ణి చూడలేకపోయినా.. దేవుడు వాళ్లను చూస్తాడనేది మా నమ్మకం. -
ఆగిన క్రషింగ్...రోడ్డెక్కిన రైతన్న
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీలో 24 గంటల పాటు క్రషింగ్ ఆగినా...పరిశ్రమ యజమానులు చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతసేపు రోడ్లపై నిలబడాలంటూ రోడ్డెక్కిన నిరసనకు దిగారు. వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని నినదించారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీకి 12 మండలాలకు చెందిన రైతులు చెరకును తెస్తారు. ఈసారి ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించిన ఫ్యాక్టరీ యాజమాన్యం చిన్నచిన్న కారణాలతో తరచూ క్రషింగ్‌ను నిలిపివేస్తోంది. దీంతో చెరకు రోజుల తరబడి ఫ్యాక్టరీ ఎదుట వాహనాల్లో ఉంచాల్సి వస్తోంది. దీంతో రోజురోజుకూ చెరకు బరువు గణనీయంగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు క్రషింగ్ నిలిచిపోగా, ఆదివారం ఉదయం వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు ఫ్యాక్టరీ ఎదుట నర్సాపూర్-మెదక్ ప్రధాన రహదారిపై చెరుకులోడ్‌తో ఉన్న ఎడ్లబండ్లను ఉంచి గంటపాటు రాస్తారోకోను నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వేణుకుమార్ ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనీ, ఫ్యాక్టరీ జీఎంతో తను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం ఎస్ఐ వేణుకుమార్ జీఎంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభం కావడంతో రైతులు కూడా ఆనందపడ్డారు.