నిరుపేదలకు తిరుదర్శనం
కొల్లూరి సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్
పూట గడవడమే కష్టమైన నిరుపేదలకు సుదూర దైవదర్శన యాత్రలకు వెళ్లగలిగే స్థోమత ఉంటుందా? మరి వారికే కనుక ఆ తిరుమల వెంకన్న దర్శనానికి అవకాశమొస్తే వారి ఆనందానికి అవధులు ఉంటాయా! అలాంటి అరుదైన అవకాశం కల్పిస్తున్నారు పారిశ్రామికవేత్త, శ్రీ అష్టోత్తర శత (108) చారిటబుల్ ట్రస్టు ధర్మకర్త చుక్కల వేణుకుమార్. అసలు అలాంటి ఒక సంకల్పం ఆయనలో ఎలా కలిగింది? ఆ వివరాలు, విశేషాలు ఆయన మాటల్లోనే...
అంజనాద్రిలో వచ్చిన ఆలోచన
నేను పుట్టి పెరిగింది భాగ్యనగరంలో. తొలిసారి 1996లో తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడి నుంచి తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాను. ఆ తర్వాత వరుసగా ఆరు పర్యాయాలు తిరుమలకు పాదయాత్ర చేశాను. అమ్మ తనూ వస్తాననడంతో ఎనిమిదోసారి ఆమెను కూడా నావెంట తీసుకెళ్లాను. ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాను. 11వసారి తిరుమలకు కాలినడకన వెళుతుంటే దారిలో అంజనాద్రి ఆలయం వద్ద అలసట తీర్చుకునేందుకు ఆగినప్పుడు అక్కడ నాకు ఓ పాత దినపత్రిక కనిపించింది. అందులోని ఓ వార్త నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. దివంగత రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ... మొత్తం 108 పర్యాయాలు తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లారనేది ఆ వార్త సారాంశం. అది నాలో స్ఫూర్తిని కలిగించింది. ఆ స్ఫూర్తితో నాటి నుంచి దాదాపు ప్రతి నెలా తిరుమల కొండకు పాదయాత్ర చేస్తూ వచ్చాను. ఇప్పటికి 142 సార్లు ఆ దేవదేవుడిని కాలినడకన దర్శనం చేసుకున్నా. 108వసారి తిరుమలకు వెళ్లినపుడు పుష్పగిరి మఠం మేనేజర్ పుండరీకాక్షుడితో పరిచయమైంది. అదే సమయంలో టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతోనూ పరిచయ భాగ్యం కలిగింది.
మనసులో మెదిలింది
ఇన్నిసార్లు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లిన నా మదిలో ఓ ఆలోచన మెదిలింది. జీవితంలో ఒక్కసారి కూడా తిరుమల చూడని నిరుపేద భక్తులకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇందులో భాగంగా హయత్‌నగర్ మండలం కొత్తగూడలోని కోటిలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఓ ప్రకటన పెట్టించాను. ఒక్కసారి కూడా తిరుమల చూడనివారికి ఉచిత దర్శనం కల్పిస్తామని అందులో ప్రకటించాము. అలా ఒక్కసారి కూడా వెంకన్నను చూడని భక్తులకు దర్శనావకాశం కల్పించే కార్యక్రమానికి బీజం పడింది. తొలి విడతగా మా వెంట 36 మంది తిరుపతి వచ్చారు. ఆ యాత్ర నిరుడు నా 39వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించాం. అదే రోజు 39 మంది సమక్షంలో దైవజ్ఞశర్మ నేతృత్వంలో శ్రీ అష్టోత్తర శత(108) చారిటబుల్ ట్రస్టును ప్రారంభించాం. తొలి పర్యటనలో పాల్గొన్న వారందరికీ సకల సౌకర్యాలు కల్పించాం. ఈ ఏడాది ఆగస్టులో రెండో విడత భక్తులను తిరుమలకు తీసుకెళ్తున్నాం.
భవిష్యత్ ప్రణాళిక
కాళ్లు చేతులు లేని 50 మందిని ఎంపిక చేసి, వారిని కూడా తిరుమలకు తీసుకెళ్లాలని అనుకొంటున్నాం. వీరంతా తమ వెంబడి ఓ సహాయకుడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. వారికి అయ్యే ఖర్చులు కూడా మేమే భరిస్తాం. అలాగే అంధులకు దర్శనం మరో కార్యక్రమం. కళ్లులేని 51 మందిని తిరుమలకు తీసుకెళ్లాలని మేం సంకల్పిస్తున్నాం. వీరు కూడా తమ వెంట ఓ సహాయకుడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. వారి ఖర్చులు కూడా మేమే భరిస్తాం. కళ్లులేనివారు దేవుడిని చూడలేరనదేగా మీ సందేహం... వాళ్లు దేవుణ్ణి చూడలేకపోయినా.. దేవుడు వాళ్లను చూస్తాడనేది మా నమ్మకం.