
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే బిహార్‌తో పాటు మిజోరాం, నాగాలాండ్‌లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది.
ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం
ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment