సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా నది జల విహారం పర్యాటకులకు మరింతగా ఆహ్లాదాన్ని పంచనుంది. నదీ తీరంలోని ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.
ఇందులో భాగంగా విజయవాడ చుట్టు పక్కల ఉన్న 7 ప్రధాన దేవాలయాలను ఒకే రోజు సందర్శించేలా ఏపీ ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కృష్ణా నది ద్వారా టెంపుల్ టూరిజంకు సంబంధించిన జెట్టీల నిర్మాణం, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో పర్యాటక, దేవాలయాలను కలిపే విధంగా ప్రణాళిక రచించింది. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, జలవిహారం చేస్తూ 80 కిలోమీటర్లు ప్రయాణం చేయటం ద్వారా7 ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ లాండ్ వాటర్ వేస్ చర్యలు తీసుకొంటోంది. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చూస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో పిల్లలకు ఆట వస్తువులు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, ఓపెన్, ఎడ్వంచర్ గేమ్స్‌ను ఏర్పాటు చేస్తోంది.
జలవిహారం సాగనుంది ఇలా...
♦ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం ఉదయం దుర్గాఘాట్ నుంచి భవానీ ద్వీపానికి జెట్టీ వెళ్తుంది. అక్కడ గంట సేపు ద్వీపం అందాలను ఆస్వాదించవచ్చు.
♦ అక్కడ నుంచి జెట్టీ పవిత్ర సంగమంకు చేరుకుంటుంది. కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురంలో ఉన్న వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు.
♦ అక్కడ నుంచి అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళతారు. ఆ తరువాత జగ్గయ్యపేట వద్దనున్న వేదాద్రికి చేరుకొని లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. సాయంత్రానికి ముక్త్యాల భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడంతో జలవిహారం ముగుస్తుంది. అక్కడ స్వామి వారి దర్శనం పూర్తయిన తర్వాత ..బస్సులో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుస్తారు.
మౌలిక వసతులకు ప్రతిపాదనలు...
ప్రస్తుతం ఆయా ప్రదేశాల్లో జెట్టీ నిర్మాణాలు, దేవస్థానాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గాలు,వెయిటింగ్ లాంజ్‌లు, టికెట్ కౌంటర్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి ఓ జెట్టీ, ముక్త్యాల నుంచి ఓ జెట్టీ ప్రతి రోజు ఉదయం బయలుదేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రతిపాదనలు ఇలా..
2 యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు అయ్యే ఖర్చు: రూ.22 కోట్లు
7 ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకు: రూ.24 కోట్లు
జెట్టీలు ని ర్మించే ప్రాంతంలో రూఫ్‌టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి: రూ. 4 కోట్లు
మొత్తం అయ్యే ఖర్చు : రూ.50 కోట్లు
జలవిహారానికి ఏర్పాట్లు...
కృష్ణా నదిలో జలవిహారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. పర్యాటకులను ఆకర్షించే విధంగా టెంపుల్‌టూరిజం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో 80 కిలోమీటర్ల మేర జలవిహారం చేస్తూ, ఏడు ప్రదేశాలను సందర్శించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో వెళ్లే విధంగా లాంచీ సర్విసులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. – ఎస్‌వీకే రెడ్డి, సీఈవో, ఏపీ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ
Comments
Please login to add a commentAdd a comment