temple tourism
-
అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్దికి..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. కార్తీక మాసంలో శైవక్షేత్రాలు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, దసరా నవరాత్రుల్లో అమ్మవారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సాధారణమే. కానీ.. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో రోజువారీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 25, 30 ఏళ్ల కిందట సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు రోజువారీ జీవితం గడవడమే కష్టంగా ఉండేది. దీంతో సమీపంలోని ఆలయాలకు వెళ్లి.. మొక్కులు తీర్చుకునేవారు. ప్రస్తుత తరుణంలో ప్రజల ఆర్థిక, కొనుగోలు శక్తి పెరిగింది. అందులోనూ కోవిడ్ సంక్షోభం జనం ఆలోచన తీరును పూర్తిగా మార్చేసింది. ఉన్నంతలో మంచిగా బతుకుతూ.. సంపాదించిన మొత్తంలో తమ సంతోషాలకు కొంత ఖర్చు చేయాలనే ధోరణి పెరిగింది. ఈ నేపథ్యంలో యువకులు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యత ఇస్తుంటే.. మధ్య వయసు, పెద్దవారితో పాటు ఇంటిల్లిపాది పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ప్రధాన ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. మారిన జీవనశైలీ కారణమే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. భార్య, భర్త, పిల్లలు మాత్రమే కుటుంబంగా ఉన్నారు. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారస్తులు వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన జీవితంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో ఒంటరి జీవితం గడుపుతున్నామనే భావనతో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఏడాదిలో కనీసం రెండుసార్లు కుటుంబంతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో మహిళలు ఆలయాలసందర్శనకే మొగ్గు చూపుతున్నారు. స్వర్ణ దేవాలయం ప్రపంచంలోనే టాప్ అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని రోజూ సగటున లక్షమంది భక్తులు దర్శించుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుని ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించే క్షేత్రంగా పేరొందింది. తిరుమలకు రోజుకు సగటున 70 వేల మంది వెళ్తుండగా.. ఆ క్షేత్రం రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం మూడో స్థానంలో నిలిచింది. తరువాత స్థానం షిర్డీకి దక్కింది. ఈ క్షేత్రంలో రోజుకు సగటున 25 వేల మంది భక్తులు వెళ్తున్నారు. అయోధ్యలో కొత్త రామ మందిరం నిర్మించిన తర్వాత అక్కడ కూడా ప్రస్తుతం రోజూ లక్షమందికిపైగా భక్తులు వెళ్తున్నారు. ఆ తరువాత స్థానాల్లో శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ ఆలయాలు ఉన్నాయి. ఇటీవల తిరువణ్ణామలైలోని అరుణాచలం క్షేత్రాన్ని తెలుగు వారు ఎక్కువగా దర్శించుకుంటున్నారు. దీంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం చూడాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 7.50 లక్షల ఆలయాలు ప్రపంచంలో అత్యధిక ఆలయాలు ఉన్న దేశం భారత్. ఇక్కడ 7.50 లక్షల ఆలయాలు ఉన్నాయి. ఇవికాకుండా 25,700 చర్చిలు, 6,414 గురుద్వారాలు, 8,949 జైన్ టెంపుల్స్ ఉన్నాయి. ఆయా మతాలకు చెందిన సంబంధిత క్షేత్రాలను దర్శించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కుటుంబాలు లేదా ఒక సమూహంగా ఆలయాలను సందర్శించేందుకు వీరంతా ‘టూర్ ఆపరేటర్ల’ను కలుస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై లాంటి కేంద్రాలతో పాటు జిల్లా, పట్టణ కేంద్రాల్లో కూడా టూర్ ఆపరేటర్లు ప్రత్యేక యాత్ర ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. బస్సు, రైలుతో పాటు ఈ ప్యాకేజీలలో విమానాలను చేర్చి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సౌకర్యవంతంగా చూపిస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రముఖ పుణ్యక్షేత్రాల పరిధిలోని విమానాశ్రయాలలో ప్రయాణికుల రాకపోకల సంఖ్య 11 నుంచి 75 శాతం పెరిగిందంటే టెంపుల్ టూరిజానికి డబ్బును ఖర్చు చేయడంలో ప్రజలు ఏమాత్రం వెనుకాడటం లేదని స్పష్టమవుతోంది. -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్‌లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్‌సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్‌ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్‌లో 26 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 24 శాతం, బీహార్‌లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్‌కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నదిలో విహరిస్తూ...దేవాలయాలను దర్శిస్తూ..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా నది జల విహారం పర్యాటకులకు మరింతగా ఆహ్లాదాన్ని పంచనుంది. నదీ తీరంలోని ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ చుట్టు పక్కల ఉన్న 7 ప్రధాన దేవాలయాలను ఒకే రోజు సందర్శించేలా ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కృష్ణా నది ద్వారా టెంపుల్ టూరిజంకు సంబంధించిన జెట్టీల నిర్మాణం, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో పర్యాటక, దేవాలయాలను కలిపే విధంగా ప్రణాళిక రచించింది. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, జలవిహారం చేస్తూ 80 కిలోమీటర్లు ప్రయాణం చేయటం ద్వారా7 ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ లాండ్ వాటర్ వేస్ చర్యలు తీసుకొంటోంది. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చూస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో పిల్లలకు ఆట వస్తువులు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్, ఎడ్వంచర్ గేమ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. జలవిహారం సాగనుంది ఇలా... ♦ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం ఉదయం దుర్గాఘాట్ నుంచి భవానీ ద్వీపానికి జెట్టీ వెళ్తుంది. అక్కడ గంట సేపు ద్వీపం అందాలను ఆస్వాదించవచ్చు. ♦ అక్కడ నుంచి జెట్టీ పవిత్ర సంగమంకు చేరుకుంటుంది. కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురంలో ఉన్న వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. ♦ అక్కడ నుంచి అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళతారు. ఆ తరువాత జగ్గయ్యపేట వద్దనున్న వేదాద్రికి చేరుకొని లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. సాయంత్రానికి ముక్త్యాల భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడంతో జలవిహారం ముగుస్తుంది. అక్కడ స్వామి వారి దర్శనం పూర్తయిన తర్వాత ..బస్సులో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుస్తారు. మౌలిక వసతులకు ప్రతిపాదనలు... ప్రస్తుతం ఆయా ప్రదేశాల్లో జెట్టీ నిర్మాణాలు, దేవస్థానాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గాలు,వెయిటింగ్ లాంజ్‌లు, టికెట్ కౌంటర్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి ఓ జెట్టీ, ముక్త్యాల నుంచి ఓ జెట్టీ ప్రతి రోజు ఉదయం బయలుదేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదనలు ఇలా.. 2 యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు అయ్యే ఖర్చు: రూ.22 కోట్లు 7 ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకు: రూ.24 కోట్లు జెట్టీలు ని ర్మించే ప్రాంతంలో రూఫ్‌టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి: రూ. 4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ.50 కోట్లు జలవిహారానికి ఏర్పాట్లు... కృష్ణా నదిలో జలవిహారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. పర్యాటకులను ఆకర్షించే విధంగా టెంపుల్‌టూరిజం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో 80 కిలోమీటర్ల మేర జలవిహారం చేస్తూ, ఏడు ప్రదేశాలను సందర్శించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో వెళ్లే విధంగా లాంచీ సర్విసులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. – ఎస్వీకే రెడ్డి, సీఈవో, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ -
కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. కొల్లేరు మండలాల్లో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లు ఖర్చు కాగల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అటవీ, పర్యాటక శాఖల అధికారులు ఇప్పటికే 20 పర్యాటక ప్రాంతాలను కొల్లేరులో గుర్తించారు. రానున్న రోజుల్లో కొల్లేరు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంటుందని పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఒబెరాయ్, నోవాటెల్, హయత్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు కావడంతో విదేశీ పర్యాటకులు సైతం కొల్లేరు పర్యటనకు ఇష్టపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం సర్కిల్‌గా కొల్లేరు కొల్లేరు అందాలకు అదనపు ఆకర్షణగా టెంపుల్ టూరిజం మారనుంది. రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమాసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికే కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అనివేటి మండపం నిర్మిస్తున్నారు. మరోవూపు కైకలూరు మండలం సర్కారు కాలువ వంతెన వద్ద రూ.14.70 కోట్ల నిధులతో వారధి నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ వంతెన ద్వారా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. నేరుగా ఆర్టీసీ బస్సులు కొల్లేరు గ్రామాలకు రానున్నాయి. పర్యాటకానికి పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే కొల్లేరులో టూరిస్ట్ పాయింట్లను గుర్తించాం. ఎకో, టెంపుల్ టూరిజాలకు కొల్లేరు చక్కటి ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం. – ఎండీహెచ్ మెహరాజ్, పర్యాటక శాఖ అధికారి పక్షుల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాల్లో యాత్రికుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షుల విహార చెరువు గట్లను పటిష్టపరిచాం. ఎక్కువగా విదేశీ, స్వదేశీ పక్షులు విహరిస్తున్న, పర్యాటకులు చూసే అవకాశం కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్థి పనులను చేయిస్తున్నాం. – జె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కైకలూరు పర్యాటక రంగానికి ఊతం కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198.50 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.2 కోట్లతో కొరటూరు రిసార్ట్స్, జల్లేరు జలాశయం, జీలకర్రగూడెం గుంటుపల్లి గుహలు, పేరుపాలెం బీచ్, సిద్ధాంతం, పట్టిసీమ వంటి ప్రాంతాల్లో పర్యాటక శాఖ వివిధ అభివృద్థి పనులు చేపట్టింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి పర్యాటకాభివృద్ధి కోసం సుమారు రూ.800 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ప్రతిపాదనల నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు సమర్పించారు -
ఆర్టీసీ బస్సు ఎక్కండి, తీర్థయాత్రలు పూర్తి చేసుకోండి
సాక్షి, విశాఖపట్నం : ఆదాయం పెంపు కోసం ఆర్టీసీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికుల ద్వారా వచ్చే రాబడికంటే దానికయ్యే ఖర్చే అధికంగా ఉంటోంది. అయినప్పటికీ సేవా దృక్పథంతో ప్రజల కోసం బస్సులను నడుపుతోంది. దీంతో ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే లాజిస్టిక్స్ ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. కొత్తగా కార్గోలో డోర్ డెలివరీ, పికప్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదార్ల నుంచి ఆదరణ బాగుంటోంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా టెంపుల్ టూరిజంపై ఫోకస్ పెట్టింది. ఇందులోభాగంగా విశాఖపట్నం నుంచి తమిళనాడులోని అరుణాచలం, పొరుగున ఒడిశాలో ఉన్న పూరీ సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి అరుణాచలానికి 120 వరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ప్రతి పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖ (ద్వారకా బస్‌స్టేషన్) నుంచి అరుణాచలానికి ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మే 5 నాటి పౌర్ణమికి 3వ తేదీ నుంచే ఇక్కడ నుంచి ఈ బస్సులు బయలుదేరేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అరుణాచలం వెళ్లేటప్పుడే కాణిపాకం, శ్రీపురం, కంచి, శ్రీకాళహస్తి దేవాలయాలను కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పౌర్ణమి దర్శనం అయ్యాక ఏడో తేదీన విశాఖలో చేరుస్తామన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.4,000, ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ.5,000 చొప్పున ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. పూరీ, భువనేశ్వర్‌లకు కూడా.. మరోవైపు పొరుగున ఒడిశాలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా స్పెషల్ ప్యాకేజీతో బస్సులను నడపనున్నట్టు ఈడీ రవికుమార్ తెలిపారు. పూరీలోని జగన్నాథస్వామి, భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, చిలక సరస్సుల సందర్శనకు ప్రతి వారాంతం (శనివారం)లో వీటిని నడుపుతామన్నారు. ఈనెల 29 నుంచి ఈ బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ ప్యాకేజీలో (సూపర్ లగ్జరీ) టిక్కెట్టు ధర రూ.2,350గా నిర్ణయించామని చెప్పారు. డిమాండ్‌ను బట్టి ఏసీ సర్వీసులను కూడా ప్రవేశపెడతామన్నారు. అరుణాచలంతో పాటు ఒడిశా పుణ్యక్షేత్రాలకు ఏడాది పొడవునా ఈ టెంపుల్ టూరిజం బస్సులు నడుపుతామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ డీపీటీవో బలిజి అప్పలనాయుడు, డిప్యూటి సీటీఎం జి.సత్యనారాయణ, విశాఖ డిపో మేనేజర్ గంగాధరరావులు పాల్గొన్నారు. -
సింహగిరి నుంచి తిరునగరి వరకు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం(టెంపుల్ టూరిజం) అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సారూప్యత కలిగిన దేవాలయాలను అనుసంధానం చేస్తూ యాత్రలకు శ్రీకారం చుడుతోంది. అలాగే పర్యాటకులు ప్రముఖ దేవాలయాలతో పాటు చిన్నచిన్న పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 100 దేవాలయాలతో జాబితా రూపొందించింది. వీటిని 16 సర్క్యూట్లుగా విభజించి.. ఒక్కో సర్క్యూట్లో 3 నుంచి పదికి పైగా ఆలయాల దర్శనాన్ని కల్పించనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 5 సర్క్యూట్లలో అమలు చేయనుంది. ఈ సర్క్యూట్ల ఎంపికపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తోంది. ప్రజలకు భగవంతుడిని మరింత చేరువ చేసేలా .. రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలున్నాయి. వీటిని పర్యాటకంగా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రెలిజియస్ టూరిజం కింద ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రవ్యాప్త సర్క్యూట్లతో పాటు జిల్లాల పరిధిలోనూ దర్శనీయ స్థలాలను చుట్టివచ్చేలా వీలు కల్పించనుంది. ఒకటి నుంచి మూడు రోజుల పాటు యాత్ర కొనసాగేలా ప్యాకేజీలను రూపొందిస్తోంది. రవాణా, వసతి సౌకర్యాలతో పాటు భగవంతుడి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించేందుకు.. ఆలయాల వారీగా ప్రత్యేక వెబ్‌పోర్టల్స్, మొబైల్ అప్లికేషన్లను పర్యాటక శాఖ వినియోగించనుంది. భక్తులు, పర్యాటకులకు సమగ్ర సమాచారం ఇచ్చేందుకు ఎంపిక చేసిన ఆలయాల వద్ద రిలీజియస్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సుమారు 500 నుంచి 1,000 చదరపు అడుగుల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా వీటిని నిరి్మంచనుంది. ఇందులో ప్రత్యేక డిస్ప్లేలు, కియోస్‌్కల ద్వారా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్త ఆలయాల సమాచారం అందుబాటులో ఉంచుతారు. ఆలయాల విశిష్టతను వివరించేందుకు గైడ్లు కూడా ఉంటారు. భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపేలా.. మన రాష్ట్రంలో ఎన్నో విశిష్ట దేవాలయాలున్నాయి. వీటికి పర్యాటక ప్రాంతాలను అనుసంధానించి.. మన రాష్ట్రంతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపే వాతావరణాన్ని అందించనున్నాం. ఇందులో భాగంగా రెలిజియస్ టూరిజాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రజల అభీష్టానికి అనుగుణంగా దేవాలయాల సందర్శన యాత్రల ప్యాకేజీలను తీసుకొస్తాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
పుణ్యక్షేత్రాలకు టూరిజం కళ..
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో పర్యాటకం మళ్లీ పుంజుకుంటోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వాటిని సందర్శించేందుకు ఆసక్తి కనపరుస్తున్న వారి సంఖ్య 35–40 శాతం మేర పెరిగింది. ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తమ పోర్టల్, యాప్‌లలో ప్రయాణికులు చేసే ఎంక్వైరీల నెలలవారీ ధోరణులను విశ్లేషించి ఇక్సిగో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆధ్యాత్మిక ప్రాంతాలకు పర్యటనలపై ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో కట్రా (83 శాతం), తిరుపతి (73 శాతం), హరిద్వార్ (36 శాతం), రిషికేష్ (38 శాతం శాతం) రామేశ్వరం (34 శాతం) ఆగ్రా (29 శాతం), ప్రయాగ్‌రాజ్ (22 శాతం) వారణాసి (14 శాతం) మొదలైనవి ఉన్నాయి. ఐఆర్సీటీసీ తాజాగా రామాయణ యాత్ర రైలు టూర్, బుద్ధిస్ట్ సర్క్యూట్ రైళ్లు, జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర, ఢిల్లీ–కాట్రా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదలైనవి నిర్వహిస్తుండటం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగేందుకు దోహదపడుతోంది. అయితే సంఖ్యాపరంగా మాత్రం ఎంత మంది వెడుతున్నారన్నది మాత్రం సర్వేలో వెల్లడి కాలేదు. బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి రావడం కూడా పర్యాటకుల్లో.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లలో ప్రయాణాలపై ధీమా పెరిగేందుకు దోహదపడుతున్నట్లు ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో అలోక్ బాజ్‌పాయ్ తెలిపారు. కన్ఫర్మ్‌టికెట్‌లోనూ అదే ధోరణి.. టికెట్ల సెర్చి ఇంజిన్ కన్ఫర్మ్టికెట్ నిర్వహించిన అధ్యయనంలో కూడా దాదాపు ఇలాంటి ధోరణులే వెల్లడయ్యాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే రైళ్ల కోసం తమ యాప్, వెబ్సైట్లలో ఎంక్వైరీలు 35–40 శాతం మేర పెరిగినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ కుమార్ కొత్తా తెలిపారు. రామేశ్వరం విషయంలో ఎంక్వైరీలు 47 శాతం పెరిగాయి. కట్రా (వైష్ణోదేవి)కి సంబంధించి 36 శాతం, ప్రయాగ్‌రాజ్.. వారణాసికి చెరి 8 శాతం, హరిద్వార్ (30 శాతం), రిషికేష్ (29 శాతం), తిరుపతి (7 శాతం) మేర ఎంక్వైరీలు పెరిగినట్లు దినేష్ వివరించారు. ఆధ్యాత్మిక అనుభూతి కోసమే కాకుండా యోగా, ఆయుర్వేద స్పాలు మొదలైన వాటితో ప్రశాంతత, పునరుత్తేజం పొందేందుకు కూడా పర్యాటకులు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. చదవండి: భారతీయులు వీటి కోసం ఖర్చుకు వెనకాడలేదు! -
ఒక్క రోజులో పంచారామాల సందర్శనం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పరమ శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) విజయవాడ నుంచి ఒక్క రోజు ఆధ్యాత్మిక యాత్ర (వన్ డే టూర్)ను ఏర్పాటు చేసింది. టెంపుల్ టూరిజం కింద ఏర్పాటు చేసిన ఈ ఒక్క రోజు యాత్రలో శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఏపీటీడీసీ కల్పిస్తోంది. కార్తీక సోమవారంతోపాటు ముఖ్యమైన రోజుల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు పంచారామాల యాత్ర ప్రారంభమవుతుంది. విజయవాడ బందరు రోడ్‌లోని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా) నుంచి బస్సు (నాన్ ఏసీ) బయలుదేరుతుందని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్క రోజు పంచారామాల యాత్రకుగాను పెద్దలకు రూ.1,305, పిల్లలకు రూ.1,015 చార్జిగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు యాత్రికులు 9848007025, 8499054422 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ టూర్‌కు ఆన్లైన్లో https://tourism.ap.gov.in/home వెబ్సైట్ ద్వారా బుకింగ్ సదుపాయంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 180042545454 కూడా ఉందని వివరించారు. కాగా, ఆయా ఆలయాల్లో దర్శనానికి సంబంధించిన రుసుము, భోజన ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. -
ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు!
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా ‘వన్డే’, ప్రత్యేక టూర్లకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో వచ్చి, వెళ్లేలా కూడా ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి సర్క్యూట్ల వారీగా దేవాలయాలు, సందర్శనీయ ప్రాంతాలను కలుపుతూ షెడ్యూల్ తయారు చేసింది. ప్రస్తుతం విశాఖ నుంచి ప్రతి సోమవారం పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శైవక్షేత్రాలను సందర్శించేందుకు పెద్దలకు రూ.1,685, పిల్లలకు రూ.1,350 టికెట్ ధరలతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే విజయవాడ నుంచి కూడా ప్రతి సోమవారం పంచారామాలను దర్శించుకునేందుకు పెద్దలకు రూ.1,430, పిల్లలకు రూ.1,190 ధరలతో పర్యాటక శాఖ టూర్ ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తణిని సందర్శించేందుకు పెద్దలకు రూ.2,040, రూ.2,330, రూ.3,130, పిల్లలకు రూ.1,635, రూ.1,865, రూ.2,505 టికెట్ రేట్లతో(రెండు రాత్రులు, ఒక పగలు) యాత్రలకు రూపకల్పన చేసింది. ప్యాకేజీలకు అనుగుణంగా రవాణాతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. రాయలసీమ సర్క్యూట్లో ఇలా.. ఒక్క రోజు యాత్ర: తిరుపతిలోని టీటీడీ శ్రీనివాసం నుంచి ప్రతి సోమవారం తలకోన సిద్ధేశ్వరాలయం, గుడిమల్లం పరుశురామేశ్వరాలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, తొండవాడ అగస్తేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. వీటికి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. అలాగే ప్రతి రోజూ తిరుపతి సమీపంలోని ఆలయాలకు గైడ్ సౌకర్యంతో రూ.175, రూ.375 టికెట్ రేట్లతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, తలకోనకు విడివిడిగా స్థానిక ఆలయాలను కూడా సందర్శించేలా రూ.375తో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల యాత్ర: శ్రీశైలం, మహానందికి ప్రతి మంగళవారం టీటీడీ శ్రీనివాసం నుంచి రెండు రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీశైలం, మహానంది, నందవరం, యాగంటి, బెలూం గుహలు, అల్లాడుపల్లి దేవాలయాలను సందర్శించవచ్చు. పెద్దలకు టికెట్ ధర రూ.3,960, పిల్లలకు రూ.3,165గా నిర్ణయించింది. ఉత్తరాంధ్రను చుట్టేసేలా.. విశాఖ నుంచి లంబసింగి, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మత్స్యగుండం, మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించేందుకుగాను పెద్దలకు రూ.1,970, రూ.1,850, పిల్లలకు రూ.1,575, రూ.1,480గా టికెట్ ధరలను పర్యాటక శాఖ నిర్ణయించింది. శక్తిపీఠాలైన పిఠాపురం, ద్రాక్షారామంతో పాటు అన్నవరం సందర్శనకు పెద్దలకు రూ.1,180, రూ.1,200, రూ.1,375, రూ.1,200, పిల్లలకు రూ.945, రూ.960 టికెట్ రేట్లతో వివిధ ప్యాకేజీలు ప్రకటించింది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనలో భాగంగా(రెండు రాత్రులు, ఒక పగలు) అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, దిండి, అంతర్వేది, ద్వారకా తిరుమల, విజయవాడ సందర్శనకు పెద్దలకు రూ.4,425, రూ.5,025, పిల్లలకు రూ.3,540, రూ.4,020 టికెట్ ధరగా నిర్ణయించింది. బెంగళూరు నుంచి కూడా.. పర్యాటక శాఖ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి శ్రీశైలానికి(రాత్రి, పగలు/రెండు రాత్రులు, రెండు పగళ్లు) వివిధ ప్యాకేజీల్లో మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు రోప్‌వే, సందర్శన స్థలాల వీక్షణం, హరిత హోటల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పించనుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి (రెండు రాత్రులు, ఒక పగలు)శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో కూడిన ప్యాకేజీ కూడా తీసుకొస్తోంది. విజయవాడ, బెంగళూరు నుంచి గండికోట(రెండు రోజులు), విజయవాడ నుంచి సూర్యలంక(రాత్రి బస, పగలు వీక్షణం), విజయవాడ నుంచి తూర్పుగోదావరిలోని పిచ్చుకలంకకు ఉదయం బయలుదేరి సాయంత్రానికి చేరుకునేలా.. వేదాద్రి నరసింహస్వామి, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి, ముక్త్యాల కోట, తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనాలతో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఏపీటీడీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేలా.. రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా పర్యాటకులు వచ్చి వెళ్లేలా ‘వన్డే’ టూర్ ప్లాన్ చేస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. పర్యాటకులు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు, దేవాలయాలు, సందర్శనీయ స్థలాలను తక్కువ సమయంలో చుట్టివచ్చేలా పర్యాటక ప్యాకేజీలు తీసుకొచ్చాం. అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ -
శ్రీశైలానికి హెలికాప్టర్ సర్వీసు
– శ్రీశైలం టు హైదరాబాద్ రాను, పోను రూ.15వేలు – జాయ్‌ట్రిప్‌కు రూ.2,500 శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా టెంపుల్ టూరిజంలో భాగంగా శ్రీశైలానికి హెలికాప్టర్ సర్వీసు శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమ్మిట్ ఏవియేషన్ సంస్థ డైరెక్టర్ ఎన్.వి.ఆర్.సురేష్ విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున రానుపోను చార్జీ నిర్ణయించామన్నారు. హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు భక్తులను ఇన్నోవా వాహనంలో దేవాలయానికి తీసుకెళ్లి ఒక ఏసీ గదిని ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన, స్వామి వార్లకు అభిషేకం నిర్వహిస్తారన్నారు. అనంతరం రోప్‌వే ద్వారా కృష్ణానది(పాతాళగంగ)కి తీసుకెళ్లి నదిలో బోటింగ్ ఏర్పాటు చేసి తిరిగి ప్రయాణికులను హెలికాప్టర్ వద్దకు చేరుస్తారని.. ఇందుకోసం దేవస్థానం అదనంగా ఒక్కొక్కరి నుంచి రూ.2వేలను వసూలు చేస్తుందన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు కూడా హెలికాప్టర్లో నల్లమల అందాలు, కృష్ణమ్మ సోయగాలను హెలికాప్టర్ నుంచి వీక్షించేందుకు 10 నిమిషాల జాయ్ ట్రిప్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.2,500 వసూలు చేస్తామన్నారు. ఇతర వివరాలకు దేవస్థానం సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్ లేదా ఏవియేషన్ సంస్థకు చెందిన 94402 57312 మొబైల్ నెంబర్‌ను సంప్రదించాలన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే ప్రతి రోజూ హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 45 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. తొలి రోజున దేవస్థానం ఈఓ నారాయణ భరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డిలు కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో జాయ్‌ట్రిప్‌ను ఎంజాయ్ చేశారు. -
ఏపీలో 8 దేవాలయ సర్క్యూట్లతో టూరిజం ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దేవాలయాలు అన్నింటినీ కలిపేలా పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి దేవాదాయ శాఖ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆలయాలను 8 సర్క్యూట్లుగా విభజించి, ఒక్కో సర్క్యూట్‌కు ఒక్కో టూరిస్టు ప్లాను రూపొందించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా పంచారామాలు, బౌద్ధ క్షేత్రాలు.. ఇలా అన్నింటినీ సందర్శించేందుకు వీలుగా పర్యటనలు ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను నాలుగైదు నెలల్లోనే అమలు చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది.