
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పరమ శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) విజయవాడ నుంచి ఒక్క రోజు ఆధ్యాత్మిక యాత్ర (వన్ డే టూర్)ను ఏర్పాటు చేసింది. టెంపుల్ టూరిజం కింద ఏర్పాటు చేసిన ఈ ఒక్క రోజు యాత్రలో శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఏపీటీడీసీ కల్పిస్తోంది. కార్తీక సోమవారంతోపాటు ముఖ్యమైన రోజుల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు పంచారామాల యాత్ర ప్రారంభమవుతుంది.
విజయవాడ బందరు రోడ్‌లోని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా) నుంచి బస్సు (నాన్ ఏసీ) బయలుదేరుతుందని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్క రోజు పంచారామాల యాత్రకుగాను పెద్దలకు రూ.1,305, పిల్లలకు రూ.1,015 చార్జిగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు యాత్రికులు 9848007025, 8499054422 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ టూర్‌కు ఆన్‌లైన్‌లో https://tourism.ap.gov.in/home వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ సదుపాయంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 180042545454 కూడా ఉందని వివరించారు. కాగా, ఆయా ఆలయాల్లో దర్శనానికి సంబంధించిన రుసుము, భోజన ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుందని తెలిపారు.