టెంపుల్ టూరిజానికి క్యూ కడుతున్న జనం
ఆలయాల సందర్శనలో ఏటా గణనీయ వృద్ధి
ప్రపంచంలోనే అత్యధికులు దర్శించే క్షేత్రం స్వర్ణ దేవాలయం
తిరుమల క్షేత్రానికి రెండో స్థానం
మూడో స్థానంలో వైష్ణోదేవి క్షేత్రం.. నాలుగో స్థానంలో షిర్డీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. కార్తీక మాసంలో శైవక్షేత్రాలు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, దసరా నవరాత్రుల్లో అమ్మవారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సాధారణమే.
కానీ.. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో రోజువారీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 25, 30 ఏళ్ల కిందట సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు రోజువారీ జీవితం గడవడమే కష్టంగా ఉండేది. దీంతో సమీపంలోని ఆలయాలకు వెళ్లి.. మొక్కులు తీర్చుకునేవారు. ప్రస్తుత తరుణంలో ప్రజల ఆర్థిక, కొనుగోలు శక్తి పెరిగింది. అందులోనూ కోవిడ్ సంక్షోభం జనం ఆలోచన తీరును పూర్తిగా మార్చేసింది.
ఉన్నంతలో మంచిగా బతుకుతూ.. సంపాదించిన మొత్తంలో తమ సంతోషాలకు కొంత ఖర్చు చేయాలనే ధోరణి పెరిగింది. ఈ నేపథ్యంలో యువకులు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యత ఇస్తుంటే.. మధ్య వయసు, పెద్దవారితో పాటు ఇంటిల్లిపాది పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ప్రధాన ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.
మారిన జీవనశైలీ కారణమే
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. భార్య, భర్త, పిల్లలు మాత్రమే కుటుంబంగా ఉన్నారు. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారస్తులు వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన జీవితంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో ఒంటరి జీవితం గడుపుతున్నామనే భావనతో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఏడాదిలో కనీసం రెండుసార్లు కుటుంబంతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో మహిళలు ఆలయాలసందర్శనకే మొగ్గు చూపుతున్నారు.
స్వర్ణ దేవాలయం ప్రపంచంలోనే టాప్
అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని రోజూ సగటున లక్షమంది భక్తులు దర్శించుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుని ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించే క్షేత్రంగా పేరొందింది. తిరుమలకు రోజుకు సగటున 70 వేల మంది వెళ్తుండగా.. ఆ క్షేత్రం రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం మూడో స్థానంలో నిలిచింది. తరువాత స్థానం షిర్డీకి దక్కింది.
ఈ క్షేత్రంలో రోజుకు సగటున 25 వేల మంది భక్తులు వెళ్తున్నారు. అయోధ్యలో కొత్త రామ మందిరం నిర్మించిన తర్వాత అక్కడ కూడా ప్రస్తుతం రోజూ లక్షమందికిపైగా భక్తులు వెళ్తున్నారు. ఆ తరువాత స్థానాల్లో శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ ఆలయాలు ఉన్నాయి. ఇటీవల తిరువణ్ణామలైలోని అరుణాచలం క్షేత్రాన్ని తెలుగు వారు ఎక్కువగా దర్శించుకుంటున్నారు. దీంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం చూడాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
7.50 లక్షల ఆలయాలు
ప్రపంచంలో అత్యధిక ఆలయాలు ఉన్న దేశం భారత్. ఇక్కడ 7.50 లక్షల ఆలయాలు ఉన్నాయి. ఇవికాకుండా 25,700 చర్చిలు, 6,414 గురుద్వారాలు, 8,949 జైన్ టెంపుల్స్ ఉన్నాయి. ఆయా మతాలకు చెందిన సంబంధిత క్షేత్రాలను దర్శించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కుటుంబాలు లేదా ఒక సమూహంగా ఆలయాలను సందర్శించేందుకు వీరంతా ‘టూర్ ఆపరేటర్ల’ను కలుస్తున్నారు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై లాంటి కేంద్రాలతో పాటు జిల్లా, పట్టణ కేంద్రాల్లో కూడా టూర్ ఆపరేటర్లు ప్రత్యేక యాత్ర ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. బస్సు, రైలుతో పాటు ఈ ప్యాకేజీలలో విమానాలను చేర్చి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సౌకర్యవంతంగా చూపిస్తున్నారు.
గత ఐదేళ్లలో ప్రముఖ పుణ్యక్షేత్రాల పరిధిలోని విమానాశ్రయాలలో ప్రయాణికుల రాకపోకల సంఖ్య 11 నుంచి 75 శాతం పెరిగిందంటే టెంపుల్ టూరిజానికి డబ్బును ఖర్చు చేయడంలో ప్రజలు ఏమాత్రం వెనుకాడటం లేదని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment