APTDC
-
నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
విజయవాడ కృష్ణా నదిలో ‘సీ ప్లేన్’ ఎక్కి నేరుగా కాకినాడ వద్ద దిగాలనుకుంటున్నారా.. లేదా విశాఖ రుషికొండ నుంచి బయలుదేరి నేరుగా కోనసీమ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, మాల్దీవుల వంటి దేశాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ‘సీ ప్లేన్’లు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే.. విజయవాడ–కాకినాడ, కాకినాడ– రుషికొండ, కోనసీమ–విశాఖపట్నం, రుషికొండ–లంబసింగికి హాయిగా సీ ప్లేన్‌లో రయ్యిన దూసుకుపోయే అవకాశం కలుగుతుంది. తొలి దశలో ప్రతిపాదించిన 40 నిమిషాల ప్రయాణ షెడ్యూల్ విజయవాడ–కాకినాడ, కాకినాడ–రుíÙకొండ, రుషికొండ–లంబసింగి, లంబసింగి–రుషికొండ, రుషికొండ–కోనసీమ, కోనసీమ–విశాఖపట్నం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక గమ్యస్థానాల మధ్య దూరాన్ని చెరిపేసేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. అపార జలవనరుల మీదుగా ఆకాశంలో విహరిస్తూ సహజసిద్ధ పర్యాటక అందాలను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలోకి ‘సీ ప్లేన్’ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తద్వారా పర్యాటక ప్రాంతాలను ఒకదానికొకటి అనుసంధానించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘సీ ప్లేన్’ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి దశలో 9–10 మంది ప్రయాణ సామర్థ్యంతో ఆరు ప్రాంతాల్లో రెండు ‘ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్’లు నడిపేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు చేసింది. ప్రయాణికుల ఆసక్తికి అనుగుణంగా 19–20 సీట్లు ఉండే సర్విసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్.. ‘సీ ప్లేన్’ సేవలపై అంతర్జాతీయంగా పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మాల్దీవుల పర్యాటకంలో ఫ్లోటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా, కెనడాలోనూ పెద్ద సంఖ్యలో సీ ప్లేన్లు పని చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో 48 శాతం సీ ప్లేన్ సేవలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కెనడాలో 34 శాతం, ఐరోపాలో 8 శాతం, ఆ్రస్టేలియాలో 4 శాతం, ఇతర ప్రాంతాల్లో 6 శాతం సేవలు అందిస్తున్నాయి. కాగా, పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి. హోటళ్లు, పర్యాటక ప్రాంతాలకు గంట దూరంలోనే విమాన సేవలుండాలనే ప్రాథమిక అంశాలకు పెద్దపీట వేస్తున్నాం. అందుకే సీ ప్లేన్ సేవలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించాం. ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు సమీపంలోని నీటి వ్యవస్థలను సీ ప్లేన్లకు ల్యాండింగ్ గ్రౌండ్‌గా ఉపయోగించవచ్చు. వీటి ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తాం’ అని పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
Andhra Pradesh: సాహస పర్యాటకంపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల, సాహస క్రీడల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వివిధ జిల్లాల్లో బోటింగ్‌కు అనువైన జల వనరులను, అడ్వెంచర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్‌కు వీలుండే ప్రాంతాలను గుర్తించింది. ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించగా.. 50 ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలోనే ఏపీటీడీసీ ఆయా సంస్థలతో ఏపీటీడీసీ పూర్తిస్థాయి అగ్రిమెంట్లు పూర్తి చేసుకోనుంది. అనంతరం సుమారు రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులతో జల, సాహస క్రీడల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇలా.. విశాఖపట్నం డివిజన్లో జోడుగుళ్లపాలెం, భీమిలి, సాగర్ నగర్, హిరమండలం డ్యామ్, శృంగవరపు కోట, తాండవ రిజర్వాయర్, పూడిమడక, కొండకర్ల ఆవ, మంగమారి పేట, యండాడ, శారదా రివర్, గోస్తనీ నది, కాకినాడ డివిజన్లో భూపతిపాలెం రిజర్వాయర్, హోప్ ఐలాండ్, పాలవెల్లి, అంతర్వేది, కర్నూలు డివిజన్లో సంగమేశ్వర, సుంకేసుల, గార్గేయపురం, చిన్న చెరువు, నెల్లూరు డివిజన్లో గుండ్లకమ్మ, ఏపూరపాలెం–చీరాల, కొత్తపట్నం బీచ్, పాపాయపాలెం, కొత్తకోడూరు, మైపాడు, నెల్లూరు ట్యాంక్, కడప డివిజన్లో పీర్ గైబుషా కోట, కర్నూలు డివిజన్లో ఒంటిమిట్ట, విజయవాడ డివిజన్లో హంసలదీవి, సూర్యలంక, అనుపు–నాగార్జున సాగర్, మోటుపల్లి బీచ్, రివెరా బీచ్ రిసార్ట్ ఫ్రంట్, రామాపురం–వేటపాలెం, తిరుపతి డివిజన్లో రాయలచెరువు, కడప డివిజన్లో బుక్కరాయ చెరువు (బుక్కరాయపట్నం), చిత్రావతి రివర్ (పుట్టపర్తి) ప్రాంతాల్లో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అడ్వెంచర్, ఫన్ జోన్లు ఇలా.. విజయవాడ డివిజన్లోని బెరంపార్కు, ఎత్తిపోతల జలపాతం(పల్నాడు)లో ఫన్‌జోన్, గాలి బెలూన్ల గేమ్స్, కర్నూలు డివిజన్లోని శ్రీశైలం, విశాఖ డివిజన్ బొర్రా గుహల వద్ద వర్చువల్ క్రికెట్, 12డీ షోలు, బొర్రా గుహల ప్రాంతంలో స్కై సైకిల్, స్కై వాక్, బార్మా వంతెన, గాలికొండలో జిప్‌లైన్, కాకినాడ డివిజన్ దిండి, ద్వారకా తిరుమల, తిరుపతి డివిజన్ పులిగుండు, హార్సిలీ హిల్స్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలోని జింధగడ ట్రెక్కింగ్, నెల్లూరులోని నరసింహ కొండలో ప్రత్యేకంగా ట్రెక్కింగ్ సెంటర్లను ప్రవేశపెడుతున్నారు. -
శ్రీవారి సేవలో ఏపీటీడీసీ!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా తిరుమల వెంకన్న దర్శనంలో భక్తులకు ప్రత్యేక సేవలందించనుంది. ఏపీఎస్ ఆర్టీసీతో పాటు ఇతర రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు, ఐఆర్‌సీటీసీల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి బ్యాకెండ్ సౌకర్యాలు కల్పించనుంది. భక్తులు గంటల కొద్దీ నిరీక్షణ, కంపార్టుమెంట్లలో వేచి చూసే ఇబ్బందులు లేకుండా వెంకన్నను దర్శించుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రతి నెలా ఆయా కార్పొరేషన్లకు టీటీడీ స్పెషల్ కోటా టికెట్లను విడుదల చేస్తోంది. ఇందులో చాలా సంస్థలు భక్తులకు టికెట్ల విక్రయంతోనే చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో తిరుపతి చేరుకున్న భక్తులు కొండపైకి వెళ్లడానికి, బసకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారు. దీనిని అరికట్టేందుకు టీటీడీ.. ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్) సేవలను అందుబాటులోకి తెస్తోంది. గైడ్ సాయంతో దర్శనం.. ఏపీటీడీసీ తిరుమల స్వామి దర్శనానికి ప్యాకేజీ టూర్లను నిర్వహిస్తోంది. సొంత బస్సులతో పాటు ఏజెంట్ల ద్వారా చెన్నై, బెంగళూరు, కుంభకోణం, ఉడిపి, బళ్లారి, హైదరాబాద్ నుంచి తిరుమలకు టూర్లు నడుపుతోంది. పూర్తి రవాణా సౌకర్యంతో పాటు ప్రతి 25 మంది భక్తులకు ఒక గైడ్ సాయంతో దగ్గరుండి దర్శనం చేయిస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను తరలించి వసతి, ఆతిథ్యం కల్పిస్తోంది. ఇదే విధానాన్ని అన్ని కార్పొరేషన్లు కచ్చితంగా అమలు చేయాలని టీటీడీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బ్యాకెండ్ సేవల బాధ్యతలను ఏపీటీడీసీకి అప్పగించింది. త్వరలోనే టీటీడీ టికెట్లు పొందే కార్పొరేషన్లు ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకోనున్నాయి. దీంతో భక్తులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఏపీటీడీసీకి ఆదరణ పెరగనుంది. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విశాఖ–తిరుపతి, విజయవాడ–తిరుపతి ప్యాకేజీలను ఏపీటీడీసీ త్వరలో పునరుద్ధరించనుంది. టికెట్లు విడుదల ఇలా.. టీటీడీ స్పెషల్ కోటా కింద ప్రతి నెలా పది కార్పొరేషన్లకు సుమారు 5,400 టికెట్లను విడుదల చేస్తోంది. ఇందులో దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటోంది. శని, ఆదివారాల్లో అయితే 90శాతం పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. ఏపీటీడీసీ, ఆర్టీసీకి వెయ్యి చొప్పున, టీఎస్ఆర్టీసీకి వెయ్యి, టీఎస్‌టీడీసీకి 350, ఐఆర్సీటీసీకి 250, తమిళనాడు పర్యాటకాభివృద్ధి సంస్థకు వెయ్యి, కర్ణాటకకు 500, గోవా, పాండిచ్చేరి, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లకు 100 చొప్పున టికెట్లు కేటాయిస్తోంది. త్వరలో ఈ టికెట్లను ఒకే వేదికగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది. తద్వారా ఒకచోట టికెట్లు లేకుంటే మరో సంస్థ కోటా నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరోవైపు తిరుమల కొండపై ఏపీటీడీసీకి ప్రత్యేక గదులను సైతం టీటీడీ కేటాయించనుంది. సులభ దర్శనం.. ఇకపై తిరుమల స్వామి దర్శనంలో ఏపీటీడీసీ కీలకంగా మారనుంది. మేము అమలు చేస్తున్న దర్శన విధానం మెరుగైన ఫలితాలు ఇస్తోంది. మా దగ్గర టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకుంటున్నారు. అందుకే ఏపీటీడీసీ బ్యాకెండ్ సేవలకు ఒప్పుకుంటేనే టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ ఇతర రాష్ట్రాల కార్పొరేషన్లకు తేల్చిచెప్పింది. ఒప్పందాలు పూర్తయితే ఐఆర్సీటీసీ, ఇతర కార్పొరేషన్ల ద్వారా వచ్చే భక్తులు నేరుగా మేము తిరుపతిలో రిసీవ్ చేసుకుని.. దర్శనం చేయించి పంపిస్తాం. – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ -
టెంట్లతోనే రిసార్ట్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన అనుభూతి అందించేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చర్యలు చేపట్టింది. బీచ్‌లు, కొండ ప్రాంతాల్లో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఎకో టెంట్ రిసార్టులను ఏర్పాటు చేయబోతోంది. తొలి దశలో భాగంగా ఐదు ప్రాంతాలను ప్రతిపాదించింది. ఇందులో బాపట్ల జిల్లాలోని పెదగంజాం–నిజాంపట్నం బీచ్ కారిడార్, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం, అనకాపల్లి జిల్లాలోని ముత్యాలంపాలెం, అందలాపల్లె బీచ్‌లతో పాటు అన్నమయ్య జిల్లాలోని మల్లయ్యకొండపై టెంట్ రిసార్టులను అందుబాటులోకి తేనుంది. ఒక్కో రిసార్ట్‌లో 20 టెంట్లు.. ప్రతి ఎకో రిసార్టులో 20 టెంట్ గదులతో పాటు అనుబంధంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టెంట్ గదిలో బెడ్రూమ్కు అనుబంధంగా బాత్రూమ్, వరండా నిర్మిస్తారు. టెంట్లో ఒక కుటుంబం (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) విడిది చేసేలా తీర్చిదిద్దనున్నారు. ఏపీటీడీసీ వీటిని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) కింద నిర్వహించనుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. భూమిని లీజు ప్రాతిపదికన అద్దెకిచ్చి.. అందులో ప్రైవేటు వ్యక్తులు స్వయంగా టెంట్ రిసార్టులు ఏర్పాటు చేసి, నిర్వహించేలా ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. -
రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా గండికోటను రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీ కె.కన్నబాబు తెలిపారు. గండికోటకు స్పెషల్ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. గండికోటలో చేపట్టిన రోప్ వే పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. శ్రీకాళహస్తి, లంబసింగి, పెనుగొండ, గాలికొండ, అన్నవరంలో 20 కిలో మీటర్ల మేర రోప్ వేను రూ.1,200 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒబెరాయ్ సంస్థ రూ.1,350 కోట్లతో గండికోట, తిరుపతి, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించనుందని చెప్పారు. వైజాగ్ బీచ్ కారిడార్ అమలుకు ప్రణాళికలు రూపొందించామని, భోగాపురం, భీమిలిలో పర్యాటకుల కోసం సీ ప్లేన్, తొట్లకొండలో రూ.120 కోట్లతో అక్వేరియం టన్నెల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ భవానీ ద్వీపం అభివృద్ధికి రూ.149 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ద్వీపం వరకు 2.5 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు ఈ మాస్టర్ ప్లాన్‌లో ఉందన్నారు. లంబసింగి, పాడేరులో కొత్తగా హోటళ్ల నిర్మాణం, అన్నవరంలో ఎకో రిసార్ట్‌కు చర్యలు చేపట్టామని చెప్పారు. -
క్రేజీ.. క్యారవాన్ టూర్!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకం పరుగెడుతోంది. వినోద, విహార యాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబం, స్నేహితులతో కలిసి బడ్జెట్లో విలాస టూర్లు చేయిస్తోంది. నచ్చిన చోటుకు.. కావాల్సిన సమయంలో తీసుకెళ్తూ.. బస గురించి బెంగ లేకుండా.. సకల వసతులతో హోం స్టే అనుభూతులన్నీ అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. విస్తరిస్తున్న క్యారవాన్ సంస్కృతి.. విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ఈశాన్య భారతం, హిమాచల్ ప్రదేశ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర, గోవాలో ప్రత్యేక ప్యాకేజీల్లో మొబైల్ హౌస్ పర్యాటకం లభిస్తోంది. ఇటీవల కేరళలో ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్యారవాన్ టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే టూరిజం శాఖ క్యారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టగా.. రాష్ట్ర విభజన అనంతరం టీఎస్‌టీడీసీ దానిని నిర్వహిస్తోంది. తాజాగా ఏపీటీడీసీ తీర్థయాత్రల ప్యాకేజీలు అందిస్తున్న విధానంలోనే క్యారవాన్ టూరిజాన్ని కూడా తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. చక్రాలపై పర్యాటకం! సినిమా స్టార్స్ షూటింగ్ సమయాల్లో, రాజకీయ నాయకులు తమ పర్యటనల్లో సకల సౌకర్యాలు ఉండే క్యారవాన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ఏసీ, ఆధునిక టాయిలెట్లు, షవర్ (వేడి, చల్ల నీళ్లతో), ఎల్ఈడీ స్క్రీన్లు ఉండడమే కాకుండా ఒక రిఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్, బార్బిక్యూ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ నచ్చిన ఆహారాన్ని వండుకుని తినేందుకు పాత్రలుంటాయి. ఇందులో ఉండే సోఫాలను బెడ్లుగా కూడా మార్చుకోవచ్చు. గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. అయితే అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లడానికి వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వినోదానికి బోర్డ్ గేమ్‌లు, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. వాహనం సైజును బట్టి.. ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి 9 మంది వరకు ప్రయాణించవచ్చు. డ్రైవర్‌తో పాటు లేకుంటే సెల్ఫ్ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. -
రావోయి విహారి.. బోటింగ్‌కు సిద్ధమోయి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బోధిసిరి బోటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరమ్మతుల పేరుతో మూడేళ్లపాటు పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ డబుల్ డెక్కర్ క్రూయిజ్ వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. రూ.23 లక్షలతో మరమ్మతులు చేసిన బోధిసిరి ఇటీవల బెరంపార్క్‌లో బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సర్వహంగులు ఏర్పాటు చేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే దర్శనీయ స్థలాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో బోధిసిరి బోటు నదీ విహారానికి సిద్ధమవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బోధిసిరి బోటు వినియోగంలోకి వస్తే కృష్ణానదిలో విహరించేందుకు ఉత్సాహపడే పర్యాటకులకు ఆహ్లాదం కలిగించడమేగాక ఏపీటీడీసీకి మంచి ఆదాయం సమకూరుతుంది. పోర్ట్ అధికారుల నిబంధనల మేరకు రూపుదిద్దిన బోధిసిరి బోటుకు పోర్ట్, ఇరిగేషన్ శాఖల అనుమతులు కూడా సులువుగానే లభించాయి. బోటులో నైట్ పార్టీ.. రెండు దశాబ్దాలుగా పర్యాటకులకు సేవలందిస్తున్న బోధిసిరి బోటు 120 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. గరిష్టంగా 200 మంది వరకు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ఈ బోటును ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కూడా అద్దెకు ఇస్తారు. ఈ భారీ బోటు పైభాగంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకోవచ్చు. దీనిమీద చిన్నపాటి వేదిక కూడా ఉంది. బోటు నదిలో విహరిస్తుండగా పార్టీలు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బోటులో ఏర్పాటు చేసుకునే విద్యుత్ లైట్లతో అహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకొంటే ఆ మజానే వేరని అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇటువంటి ఫంక్షన్లతోపాటు అసోసియేషన్లు, మార్కెటింగ్ సంస్థలు వంటివాటి సమావేశాలకు కూడా అనువుగా ఉంటుంది. ఫంక్షన్‌కు లేదా సమావేశానికి వచ్చే అతిథులు భోజనాలు చేసేందుకు కింద ఏసీ సౌకర్యంతో సీటింగ్, టేబుల్స్‌తో పెద్ద హాల్ ఉంది. పైన ఆటపాటలతో కనువిందు చేస్తే కింద హాల్లో రుచికరమైన వంటకాలతో విందు భోజనం సిద్ధంగా ఉంటుంది. బోధిసిరి బోటులో నదిలో విహరించేందుకు గతంలో రెండు గంటలకు రూ.10 వేలు వసూలు చేసింది ఏపీటీడీసీ. కార్తికమాసం, పండుగలు, వారాంతపు సెలవుదినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బోధిసిరి బోటును వినియోగిస్తుంటారు. వారంలో బోటు విహారం బోధిసిరి బోటుకు సంబంధించిన పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు, స్టిక్కరింగ్, ప్లంబింగ్ పనులు మూడు, నాలుగు రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పటికే బోటు ట్రయల్ రన్ పూర్తయింది. బోటుకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బోటు షికారు వారం రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కృష్ణానదిలో బోధిసిరి కనువిందు చేయనుంది. – సీహెచ్.శ్రీనివాసరావు, డివిజనల్ మేనేజరు, ఏపీటీడీసీ -
ఒక్క రోజులో పంచారామాల సందర్శనం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పరమ శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) విజయవాడ నుంచి ఒక్క రోజు ఆధ్యాత్మిక యాత్ర (వన్ డే టూర్)ను ఏర్పాటు చేసింది. టెంపుల్ టూరిజం కింద ఏర్పాటు చేసిన ఈ ఒక్క రోజు యాత్రలో శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఏపీటీడీసీ కల్పిస్తోంది. కార్తీక సోమవారంతోపాటు ముఖ్యమైన రోజుల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు పంచారామాల యాత్ర ప్రారంభమవుతుంది. విజయవాడ బందరు రోడ్‌లోని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా) నుంచి బస్సు (నాన్ ఏసీ) బయలుదేరుతుందని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్క రోజు పంచారామాల యాత్రకుగాను పెద్దలకు రూ.1,305, పిల్లలకు రూ.1,015 చార్జిగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు యాత్రికులు 9848007025, 8499054422 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ టూర్‌కు ఆన్లైన్లో https://tourism.ap.gov.in/home వెబ్సైట్ ద్వారా బుకింగ్ సదుపాయంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 180042545454 కూడా ఉందని వివరించారు. కాగా, ఆయా ఆలయాల్లో దర్శనానికి సంబంధించిన రుసుము, భోజన ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. -
APTDC: ఏపీ పర్యాటకం.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి : పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) పర్యాటక ఆస్తులను ఆపరేషన్, మెయింటెనెన్స్(వో అండ్ ఎం) విధానంలో అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్ సంస్థలకు 34 చోట్ల లీజుకు ఇచ్చేందుకు ప్రదేశాలను ఖరారు చేసి టెండర్లు ఆహ్వానించింది. వివిధ జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌ను ప్రైవేటు నిర్వహణకు అప్పగించడం ద్వారా పర్యాటకులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రావడంతో పాటు సంస్థకు ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. నూతన పర్యాటక విధానం–2025 పెట్టుబడిదారులకు అనేక రాయితీలిస్తుండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అత్యధికంగా రెస్టారెంట్లు, రిసార్టులు.. వో అండ్ ఎం కింద 15, 20, 33 ఏళ్లపాటు లీజుకి ఇవ్వనున్నారు. వీటిల్లో అత్యధికంగా రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఉన్నాయి. ఇటీవల ఏపీటీడీసీ అధికారులు వాటి కనీస ధరను నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 25వ తేదీ బిడ్డింగ్ ప్రక్రియకు తుది గడువుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, చిత్తూరులో రెండేసి, గుంటూరులో మూడు, విశాఖలో ఐదు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏడు.. రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోటళ్లను ప్రైవేట్ ద్వారా నిర్వహించనున్నారు. మరోవైపు పర్యాటక శాఖకు చెందిన స్థలాల్లో కన్వెన్షన్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రిలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ జెట్టీ, అలిపిరిలో 103 గదులతో నిర్మాణ దశలో ఉన్న హరిత హోటల్, నెల్లూరు నగరంలోని ఎకో పార్క్, విశాఖలో యారాడ బీచ్ ఎమినిటీస్‌ను వో అండ్ ఎం ద్వారా అందుబాటులోకి తేనున్నారు. పాత టూరిజం పాలసీ ప్రకారం లీజు అద్దె అక్కడి మార్కెట్ విలువలో రెండు శాతంగా ఉండేది. దీనికి తోడు ఏటా 5 శాతం అద్దె పెరుగుతూ వచ్చేది. ఫలితంగా పెట్టుబడిదారులు ఆసక్తి చూపేవారు కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీ ప్రకారం లీజు అద్దెను ఒక శాతానికి తగ్గించడంతో పాటు.. మూడేళ్లకోసారి మాత్రమే 5 శాతం లీజు అద్దెను పెంచనున్నారు. కొత్తగా మారిటైం సమయాన్ని నెల నుంచి 4 నెలలకు పెంచారు. పర్యాటక ఆస్తుల సద్వినియోగం.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ఆస్తులను వినియోగంలోకి తెస్తున్నాం. ఈ క్రమంలోనే 34 ప్రాజెక్టులను వో అండ్ ఎం కింద ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం. తద్వారా ఆయా హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు అందుబాటులోకి రావడంతో పాటు, పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
మొదలైన పర్యాటకుల 'సందడి'
సాక్షి, అమరావతి: కరోనా కష్టాల నుంచి పర్యాటకశాఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను అనుమతించడంతో రాష్ట్రంలో చాలాచోట్ల పర్యాటక ప్రాంతాల్లో సందడి మొదలైంది. పాపికొండలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతిస్తున్నారు. పర్యాటక సందడి మొదలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నా, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామనే నమ్మకం కనిపిస్తోంది. పర్యాటకుల కోసం ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ) కొన్ని టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం హెరిటేజ్ టూర్, విశాఖ–అరకు, విశాఖ–అరసవెల్లి, విజయవాడ–శ్రీశైలం టూర్ ప్యాకేజీలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. బస్సు ఉదయం బయలుదేరి అదేరోజు రాత్రికి తిరిగి వచ్చేలా, టిఫిన్, భోజనాలకు కూడా కలిపి తక్కువ ధరకే ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్యాకేజీలను పర్యాటకులు బాగా వినియోగించుకుంటున్నారు. విజయవాడలో సీ ప్లేన్ సేవలకు అవకాశం... విజయవాడ ప్రకాశం బ్యారేజీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. గుజరాత్లో ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో పలు రాష్ట్రాల్లో ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీన్లో భాగంగా ప్రకాశం బ్యారేజీని ఎంపిక చేశారు. సీ ప్లేన్ కోసం నదిలో వాటర్ ఏరోడ్రోమ్ (కాంక్రీట్ కట్టడాన్ని) నిర్మిస్తారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా 12 చోట్ల స్టార్ హోటళ్లు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో 7 స్టార్, 5 స్టార్ హోటళ్లు నిర్మించనున్నారు. గండికోట (వైఎస్సార్ కడప), కాకినాడ, పిచుకల్లంక (తూర్పు గోదావరి), హార్సలీ హిల్స్ (చిత్తూరు), నాగార్జునసాగర్, సూర్యలంక బీచ్ (గుంటూరు), ఓర్వకల్లు (కర్నూలు), కళింగపట్నం (శ్రీకాకుళం), రుషికొండ (విశాఖపట్నం), భవానీఐల్యాండ్ (కృష్ణా), తిరుపతి–పెరూర్ (చిత్తూరు), పోలవరం (పశ్చిమగోదావరి)లలో ఈ హోటళ్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి జాతీయస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. టెంపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద శ్రీశైలంలో రూ.47.45 కోట్లు, సింహాచలం ఆలయంలో రూ.53.69 కోట్లలో పనులు చేపట్టనున్నారు. ద్వారకా తిరుమల ఆలయానికి రూ.76 కోట్లు, శ్రీముఖలింగేశ్వర ఆలయానికి రూ.55 కోట్లు, అన్నవరం ఆలయానికి రూ.48.58 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. భద్రత కోసం కంట్రోల్ రూమ్‌లు పర్యాటకుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునికమైన కంట్రోల్ రూమ్‌లలో శిక్షణ పొందిన సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. రక్షణ, భద్రతా ప్రమాణాలను పాటించేలా నిర్దేశిత ప్రొటోకాల్ ఉంటుంది. అనుకోని ఘటన జరిగితే ఏం చేయాలన్న దానిపై విపత్తు నిర్వహణ ప్రొటోకాల్ ఉంటుంది. బోటు కదలాలంటే డిపార్చర్ క్లియరెన్స్ తప్పనిసరి. ప్రయాణికులు, పర్యాటకుల వివరాలు సమగ్రంగా నమోదు చేస్తారు. రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు విశాఖలోని రుషికొండ బీచ్‌కి ఇటీవల అంతర్జాతీయస్థాయి గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు ఇచ్చే బ్లూఫాగ్ సర్టిఫికెట్ ఈ బీచ్‌కి దక్కింది. దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికకాగా వాటిలో రుషికొండ ఒకటి. బ్లూఫ్లాగ్ బీచ్‌లనే విదేశీ పర్యాటకులు ఎంపిక చేసుకుంటారు. టూర్ ప్యాకేజీలు ఏపీటీడీసీ పర్యాటకుల కోసం బ్రేక్పాస్ట్, లంచ్‌తో పాటు సాయంత్రం టీ, స్నాక్స్, మినరల్ వాటర్‌తో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. బస్సు ఉదయం బయలుదేరి రాత్రికి తిరిగి వస్తుంది. విశాఖపట్నం–అరకు: పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీతోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు చూపిస్తారు. ఆఖరులో ట్రైబల్ ధిమ్సా డ్యాన్స్‌ను తిలకించవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.1,450, పిల్లలకు రూ.1,160. విశాఖపట్నం హెరిటేజ్ టూర్: కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, ఫిషింగ్ హార్బర్ బోటింగ్, రుషికొండ బీచ్, విశాఖ సబ్‌మెరిన్ మ్యూజియం, జాతర శిల్పారామం చూడవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.675, పిల్లలకు రూ.563. విశాఖపట్నం–అరసవల్లి: టికెట్ ధర పెద్దలకు రూ.931, పిల్లలకు రూ.742. -
టూరిజం బోటింగ్ పునఃప్రారంభం
సాక్షి, విశాఖ: టూరిజం బోటింగ్ పున:ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ, హార్బర్ వద్ద నిర్వహిస్తున్న టూరిజం బోటింగ్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం రుషికొండ బీచ్ వద్ద బోటింగ్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. పర్యాటకులకు స్వర్గధామమైన విశాఖలోని రిషికొండలో నాలుగు పర్యాటక బోట్లను మంత్రి ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పర్యాటక బోట్ల నిర్వాహకులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. స్పీడ్, జెట్ స్కీ బోట్లు, లైఫ్ గార్డుల శిక్షణ, పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు, బీమా సౌకర్యంతో జల విహారాన్ని ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు నేటి నుంచి జల విహారం అందుబాటులోకి వచ్చింది. కాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు పడవ ప్రమాదం తర్వాత బోట్ల రాకపోకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. -
అతిథులకు ఆహ్వానం
సాక్షి, విశాఖపట్నం: చల్లగా తాకి వణికించే చిరుగాలులు, మిట్టమధ్యాహ్నమైనా సూరీడిని సైతం కప్పేసే దట్టమైన పొగమంచు.. సున్నా డిగ్రీల వాతావరణం.. ఇవన్నీ ఆస్వాదించాలంటే కశ్మీర్, సిమ్లా, ఖండాలా వెళ్లాల్సిన పనిలేదు. వాటిని మరిపించే హిల్‌స్టేషన్ మన రాష్ట్రంలోని లంబసింగి! విశాఖకు 135 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామం ఇది. దీని పంచాయతీ పరిధిలో 50 వరకు తండాలున్నాయి. కొండల మధ్య ఉండే వీటన్నింటిలో ఒకే రకమైన వాతావరణం కనిపిస్తుంది. పర్యాటకుల సీజన్ ప్రారంభమయ్యేలోగా ఇక్కడ వసతి సదుపాయాలను మెరుగు పరచాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఏపీటీడీసీ రిసార్ట్స్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. లంబసింగి సమీపంలోని కొండలపై ఇటీవల ట్రెక్కింగ్ కూడా నిర్వహిస్తున్నారు. తాజంగి జలాశయానికి ఇరువైపులా కొండల మధ్య రోప్ లైన్ నిర్మిస్తున్నారు. జలాశయంలో బోటింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భారత్‌లో అడుగుపెట్టే ప్రతి విదేశీ పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఏపీని ప్రముఖంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలి. 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అంతర్జా తీయంగా పేరున్న సంస్థల సహకారంతో అభివృద్ధి చేయాలి. ప్రముఖ సంస్థలు ఏపీలో హోటళ్లను ఏర్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించాలి. – ఇటీవల పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాల శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం సుదీర్ఘమైన సుందర సముద్రతీరం.. అబ్బురపరచే చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే సప్తగిరులు, ఆతిథ్యానికి పెట్టింది పేరైన తెలుగు లోగిళ్లు.. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకూ ప్రకృతి కాన్వాసుపై చిత్రించిన సుందర రమణీయ చిత్రం ఆంధ్రప్రదేశ్.. పర్యాటకం ద్వారా రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ పలు టూరిజం సర్క్యూట్లు, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. భద్రతే లక్ష్యం.. ఏపీలో పర్యాటక రంగం ఐదేళ్లుగా నిరాదరణకు గురైంది. టీడీపీ సర్కారు హయాంలో పర్యాటక రంగానికి సంబంధించి 2015 నుంచి 2017 వరకు రూ. 12 వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని, 2018లో రూ. 2,008 కోట్ల పెట్టుబడులు రానున్నాయంటూ ప్రచారం చేసుకున్నా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం పర్యాటక నిబంధనలను గాలికి వదిలేయడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు సురక్షితంగా తిరిగి వెళ్లేలా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ సర్క్యూట్లు... రాష్ట్రంలో అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా మిగిలినవి కొత్త పాలసీ ప్రకటించాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్, రాజమండ్రి హెరిటేజ్ నేచర్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్లపై డీపీఆర్ సిద్ధమైంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇవీ ప్రణాళికలు... - రాష్ట్రంలో అరకు, మారేడుమిల్లి, కాకినాడ, సూర్యలంక, హార్స్లీ హిల్స్, గండికోట తదితర 15 ప్రదేశాల్ని పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దేశ విదేశీ పర్యాటకుల కోసం ఇక్కడ మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. - ప్రైవేట్ – ప్రభుత్వ భాగస్వామ్యంతో 22 ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించారు. - పర్యాటక శాఖకు వివిధ ప్రాంతాల్లో ఉన్న 17 భవనాలు, ఆస్తులను ఆధునికీకరించి పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. - కేంద్ర పర్యాటకశాఖ ప్రకటించిన తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి పథకం (ప్రసాద్)లో భాగంగా అమరావతి, శ్రీశైలంలను అభివృద్ధి చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, సింహాచలం, అన్నవరం, అరసవల్లి, ద్వారకా తిరుమల ప్రాంతాలను కూడా పథకం కింద అభివృద్ధి చేయనున్నారు. ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు ‘ప్రసాద్’ పథకం కింద రూ.50 కోట్లు మంజూరయ్యాయి. - కేంద్ర పర్యాటకశాఖ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) పథకంలో భాగంగా అమరావతిని అభివృద్ధి చేయనున్నారు. స్టార్ హోటళ్లు.. గ్లాస్ బ్రిడ్జిలు... తిరుపతిలో 5 నక్షత్రాల హోటల్ లేదా రిసార్ట్ అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. మారేడుమిల్లి, అరకులో 5 స్టార్ రిసార్ట్స్ అభివృద్ధికి ఐటీడీఏ నుంచి భూమి సేకరించనున్నారు. గండికోట జార్జి మీదుగా గాజు వంతెన నిర్మించడంతో పాటు హోటళ్లు, రిసార్ట్లు, రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. లంబసింగి, కోటప్పకొండ రోప్‌వే అందాలతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఓర్వకల్లులో రాతి నిర్మాణాల్ని అభివృద్ధి చేయడంతోపాటు విజయవాడలో భవానీద్వీపంతో పాటు కృష్ణా నదిలో ఉన్న 6 ద్వీపాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు. సందర్శకుల స్వర్గధామంలా.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో హయత్, ఫోర్ సీజన్స్, తాజ్, ఒబెరాయ్ తదితర స్టార్ హోటళ్ల నిర్వాహకుల సహకారంతో సదుపాయాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాం. ఒక్కో ప్రాంతంలో హోటళ్లు, రిసార్ట్స్ అభివృద్ధి కోసం కనీసం 20 ఎకరాలు అవసరమని ప్రాథమిక అంచనా. ఆయా ప్రదేశాలను సందర్శకుల స్వర్గధామంలా తీర్చిదిద్దుతాం. – కె.ప్రవీణ్‌కుమార్, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ‘స్థానిక’ ఉపాధికి ఊతం.. హోటళ్లను పర్యాటకశాఖ సారథ్యంలో అభివృద్ధి చేయడంతోపాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లు నిర్వహించి యువతకు ఉపాధి కల్పిస్తాం. పర్యాటకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంతో పాటు పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటకశాఖ మంత్రి -
ఆరు ప్రైవేటు ఆర్థిక నగరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు ప్రైవేటు ఆర్థిక నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.22,280 కోట్ల వ్యయంతో 980 ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబునాయుడు ఏపీ టిడ్కో, మున్సిపల్, పరిపాలన శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వీటికి ఆమోదం తెలిపారు. పినపాక– చెవుటూరు (కృష్ణాజిల్లా), మంగళగిరి (గుంటూరు జిల్లా), అచ్యుతాపురం(విశాఖ జిల్లా), తాండ్రపాడు–తడకనపల్లి(కర్నూలు జిల్లా), రాజమండ్రి సమీపంలోని వెలుగుబండ(తూర్పుగోదావరి), వెదురువాడ(విశాఖ జిల్లా)లలో ఈ ఆర్థిక నగరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సీఎంకు వివరించారు. -
‘అన్నం’కు అధికారమదం తలకెక్కింది
ఏపీటీడీసీ సిబ్బంది ఆగ్రహం విజయవాడ (భవానీపురం): టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్‌కు అధికార మదంతో పాటు మద్యం మత్తుకూడా తలకెక్కిందని, ఆ మత్తులో విచక్షణా జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడని ఏపీటీడీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6 రాత్రి బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో ఉన్న హరిత రిసార్ట్స్‌లో డిప్యూటీ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావుపై ఎమ్మెల్సీ అన్నం, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్లో ఆదివారం చేరారు. ఆయన్ని పరామర్శించడానికి పలువురు ఏపీటీడీసీ సిబ్బంది సోమవారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం అన్నం, ఆయన అనుచరులు రిసార్ట్స్‌కు ఒక పొట్టేలును తీసుకొచ్చారని, ఆయనే దాని తల నరికి మాంసం కొట్టి వంటవారికి అప్పగించాడని చెప్పారు. పార్టీల పేరుతో గతంలో మూడు సార్లు ఇలానే బయట నుంచి ఆహార పదార్థాలను తెచ్చుకున్నారని వెల్లడించారు. ఆరోజు ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు తమ సిబ్బంది అన్నీ సరఫరా చేస్తున్నారని, రాత్రి సమయంలో శ్రీనివాసరావును పిలవడంతో అతను అన్నం గదికి వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో ఆయన శ్రీనివాసరావుపై అకారణంగా చేయి చేసుకున్నాడని, తానేం తప్పుచేశానని అడిగిన శ్రీనివాసరావుపై అన్నం మరోసారి చేయి చేసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపడుతున్నారని చెప్పారు. -
ఇదో ‘ఔట్ సోర్సింగ్’ కథ.. బక్కజీవుల వ్యథ!
ఇదీ ఏపీటీడీసీలో ఔట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పర్యాటక దినోత్సవ వేడుకలపై కార్మికుల ఆగ్రహం పీఎఫ్ మింగేసినవారిపై చర్యలేవీ? మా సొమ్ము మాకిప్పించాలంటున్న కార్మికులు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగం.. పేరు ఏదైనా వెట్టిచాకిరీ తప్పదు. పని బారెడైనా.. జీతం మాత్రం మూరెడే. బక్కజీవుల బతుకులు మారవు.. మారేం దుకు అవకాశం ఇవ్వం అన్నట్లు కొనసాగే పాలకుల వ్యవహారం.. అందుకు తగ్గట్టే యాజమాన్యాల నిర్వాకం. ఏపీటీడీసీలో ప్రస్తుతం కొనసాగుతున్న తంతుఇదే. ఈ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్లుగా పనిచేస్తున్నా తక్కువ జీతంతోనే బతుకీడుస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ కార్మికుల పీఎఫ్ సొమ్ము కు ఎసరు పెట్టినా ఎవరికీ పట్టడంలేదు. విజయవాడ (భవానీపురం) : ‘అతిథులకు ఆతిథ్యమిచ్చి వారి ఆకలి తీరుస్తూ సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాం. అయినా మా కడుపులు కాలుస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటారా? అసలే అంతంత మాత్రం వేతనాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాం. పీఎఫ్ సొమ్మును సైతం మింగేసి బోర్డు తిప్పేసిన సంస్థపై ఏం చర్యలు తీసుకున్నారు?. మా పీఎఫ్ డబ్బులు మాకు ఇప్పించేసి మీరు ఏ వేడుకలైనా చేసుకోండి’. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికుల ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డివిజన్లలో ఔట్సోర్సింగ్ కార్మికులతో పని చేయించుకుని వారి పీఎఫ్ సొమ్మును దిగమింగేయటంపై కార్మికులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఏపీటీడీసీ విజయవాడ డివిజన్లో ఎస్ఎస్బీ అనే సంస్థ కింద 51 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేశారు. ఆ సంస్థ సుమారు 5 నెలలకుపైగా తమకు చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు జమ చేయకుండా మింగేసిందని కార్మికులు చెబుతున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.50 లక్షలకుపైగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2011లో ఏపీటీడీసీలో హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎస్బీ సంస్థ ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికులతో పని చేయించుకునేందుకు ఒక ఏడాదికి కాంట్రాక్ట్ తీసుకుంది. ప్రతి ఏడాది ఈ సంస్థ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, ఇతర చెల్లింపులకు సంబంధించి సంస్థ ఇబ్బంది పెడుతున్న కారణంగా 2015 మే నెలలో ఏపీటీడీసీ అధికారులు ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. కార్మికులకు షాక్ ఇచ్చిన ఎస్ఎస్బీ కనీస వేతనాలకు కూడా నోచుకోని ఔట్సోర్సింగ్ సిబ్బంది పీఎఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాము పనిచేసే ఎస్ఎస్బీ సంస్థను రద్దు చేయడంతో పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఆ శాఖ దగ్గరకు వెళ్లిన కార్మికులు షాక్ అయ్యారు. ఐదు నెలల నుంచి పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు సంస్థ జమ చేయడం లేదని, పెండింగ్‌లో ఉన్న వాయిదాలు చెల్లిస్తేకానీ క్లియర్ చేయలేమని ఆ శాఖ చెప్పడంతో కార్మికులు ఆవాక్కయ్యారు. ఒక్కో కార్మికునికి రూ.లక్షకుపైగా పీఎఫ్ సొమ్ము రావల్సి ఉంటుంది. గతంలో వేతనాలు పెంచాలంటూ కార్మికులు 15 రోజులు సమ్మె చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఏపీటీడీసీ యాజమాన్యం హామీ ఇచ్చినా, వేతనాలను మాత్రం పెంచలేదు. చివరికి పీఎఫ్ విషయంలో కూడా తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఏపీటీడీసీ ఈడీ అమరేంద్ర, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. కాంట్రాక్ట్ సంస్థ, ఉన్నతాధికారులు లాలూచీపడి తమ పీఎఫ్ సొమ్మును దిగమింగేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ మారినా పెరగని వేతనాలు.. ఎస్ఎస్బీ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ఏపీటీడీసీ యాజమాన్యం కొత్త కాంట్రాక్ట్‌ను ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించింది. గత ఏడాది జూన్ నుంచి ఇది మనుగడలోకి వచ్చింది. సహజంగా కాంట్రాక్ట్ సంస్థ మారితే కార్మికుల వేతనాలు పెరుగుతాయి. అందుకు భిన్నంగా పాత వేతనాలతోనే కొనసాగించేందుకు ఏపీటీడీసీ యాజమాన్యం నిర్ణయించింది. -
వెన్నెల్లో హాయ్‌హాయ్
- బోటులో బ్రేక్‌ఫాస్ట్, క్యాండిల్ డిన్నర్‌కు విశేష స్పందన - ఆకర్షితులవుతున్న పర్యాటకులు - పుష్కర యాత్ర స్పెషల్స్ హౌస్‌ఫుల్ సాక్షి, విజయవాడ : పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రవేశపెట్టిన (ఏపీటీడీసీ) కొత్త ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తోంది. క్యాండిల్ డిన్నర్, బోటులో బ్రేక్‌ఫాస్ట్‌పై పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం కృష్ణానదిలో బోటులో తిరుగుతూ బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట కొవ్వొత్తుల వెలుగులో డిన్నర్ చేసే కార్యక్రమాన్ని ఏపీటీడీసీ ఇటీవలే ప్రారంభించింది. ఈనెల 5వ తేదీన తొలిసారిగా క్యాండిల్ డిన్నర్‌ను ఏర్పాటుచేయగా, 30 మంది పర్యాటకులు పాల్గొన్నారు. 12వ తేదీ ఆదివారం ఒక కంపెనీ తన సిబ్బం దికి ఆటవిడుపు కలిగించడం కోసం 50 మందితో క్యాండిల్ డిన్నర్‌కు బుకింగ్ చేసుకుంది. సాధారాణ రోజుల్లో 10-15 మంది వస్తున్నట్లు తెలిసింది. వీనుల‘విందు’ క్యాండిల్ డిన్నర్ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కృష్ణానదిలో బోటులో విహరిస్తూ చల్లనిగాలుల మధ్య వీనులవిందైన సంగీతం వింటూ రుచికరమైన వంటలు తినొచ్చు. మెనూలో రైస్‌తో పాటు పుల్కాలు, బిర్యానీ, పప్పు, రెండు రకాల కూరలు, స్వీట్స్, హాట్స్ ఉంటాయి. పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.200 చెల్లించాలి. ఉదయం పూట సూర్యుడి లేలేత కిరణాలు తాకుతుండగా, నదిలో తిరుగుతూ ఇడ్లీ, పూరి, దోసె, గారెలు వంటి రుచికరమైన వంటలు వేడివేడిగా ఆరగించొచ్చు. ప్రచారం అవసరం క్యాండిల్ డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రచారం కల్పిస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. పుష్కర ప్యాకేజీలు ఫుల్ గోదావరి పుష్కరాల కోసం నగరం నుంచి రాజమండ్రికి ఏపీటీడీసీ ఏర్పాటుచేసిన రెండు ప్యాకేజీల బస్ సర్వీస్ ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఫుల్ అయిపోయాయి. విజయవాడ-రాజమండ్రి-అంతర్వేది- పాలకొల్లు- భీమవరం-విజయవాడ, విజయవాడ-రాజమండ్రి, భీమవరం-విజయవాడ ప్యాకేజీలను భక్తులు ఎక్కువగా బుక్ చేసుకున్నారని, ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ మేనేజర్ వీవీఎస్ గంగరాజు తెలిపారు. కాగా, గోదావరి పుష్కర స్పెషల్‌కు మంచి డిమాండ్ ఏర్పడటంతో ఏసీ బస్సు కావాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఈ బస్సు వస్తే ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రోజూ నడపాలని అధికారులు భావిస్తున్నారు. -
ఏపీలో 8 దేవాలయ సర్క్యూట్లతో టూరిజం ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దేవాలయాలు అన్నింటినీ కలిపేలా పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి దేవాదాయ శాఖ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆలయాలను 8 సర్క్యూట్లుగా విభజించి, ఒక్కో సర్క్యూట్‌కు ఒక్కో టూరిస్టు ప్లాను రూపొందించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా పంచారామాలు, బౌద్ధ క్షేత్రాలు.. ఇలా అన్నింటినీ సందర్శించేందుకు వీలుగా పర్యటనలు ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను నాలుగైదు నెలల్లోనే అమలు చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. -
లాంచీ ‘కొండె’క్కనుందా?
బుద్దవనం బహుభారం - హిల్‌కాలనీ నుంచి నడిపితే మేలు - విభజన లోపే చర్యలు తీసుకుంటే మేలు నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌లో రాష్ట్ర విభజన అనంతరం లాంచీలు ఎక్కాలంటే ఇబ్బందులు తప్పేలాలేవు. లాంచీ ఎక్కి నాగార్జునకొండ చూడాలంటే గుంటూరు జిల్లాకు చెందిన రైట్బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది. ఈ నేపథ్యంలో విభజన జరిగేలోపే నల్లగొండ జిల్లా పరిధిలోని హిల్‌కాలనీ నుంచి లాంచీలను నడపితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని పర్యాటకులు సూచిస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా నాగార్జునసాగర్ రూపుదిద్దుకుంది. ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ) నుంచి టీజీ టీడీసీగా(తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ)గా విడిపోయి నూతనంగా రిజిస్ట్రేషన్ కాబోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ పర్యాటక డివిజన్లో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. సాగర్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు లాంచీ ఎక్కి నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. తప్పుదోవ పట్టిస్తున్న కన్సల్టెంట్ పర్యాటక అభివృద్ధి సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి లాంచీలు నడిపే విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. నాగార్జునకొండతో పాటు ఏలేశ్వరం ప్రాంతాలకు బుద్ధవనం నుంచి లాంచీలు నడపాలని ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ, అది సాధ్యం కాదన్నది కన్సల్టెంట్‌కు తెలిసిన విషయమే. ఎందుకంటే బుద్ధవనం నుంచి జలాశయం తీరానికి వెళ్లి లాంచీ ఎక్కాలంటే పర్యాటకులు కనీసం ఐదుకిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి లాంచీలు నడపాలంటే.. దట్టమైన అడవి కలిగిన ప్రాంతం కాబట్టి పోలీసుల అనుమతి కావాల్సి ఉంటుంది. దేశరక్షణకుగాను కోసం నిత్యం ప్రయోగాలు నిర్వహించే నావికాదళం స్టేషన్ కూడా ఇక్కడ ఉంది. అది దాటి లాంచీలు వెళ్లాలి. ప్రస్తుతం చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల పుట్టీలనే అక్కడి నుంచి రానివ్వరు. దేశ రక్షణ దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి లాంచీలను కూడా అనుమతి నివ్వరు. అదీ కాకుండా పర్యాటకుల రక్షణకుగాను ఆరుబయటి ప్రదేశం కావాలి. నావికాదళం వారు దేశ రక్షణ దృష్ట్యా ఇటు నుంచి రోడ్డునే బ్లాక్ చేయాలనే ప్రతిపాదనను ఢిల్లీకి పంపారు. బైపాస్ రోడ్డువేస్తే ఇటు ప్రత్యేకంగా పర్యాటకులు రావాల్సిందే తప్ప ఏవాహనాలు ఇక్కడి నుంచి వెళ్లవు. లాంచీస్టేషన్ నిర్మాణం ఇప్పట్లో సాధ్యం కాదు ఇప్పటికిప్పుడు కొత్తగా లాంచీలు ఏర్పాటు చేయడం, జట్టీ నిర్మాణం చేయడం అంత సులువైన పనికాదు. తెలంగాణ రాష్ట ఏర్పాటు అనంతరం లాంచీలు నడపాలంటే అనుమతుల కోసం కేంద్రం చుట్టూ తిరగాలి. ఒక లాంచీ నిర్మాణం కావాలంటే కోటిన్నర అవసరమవుతాయి. కనీసం రెండు సంవత్సరాల కాలం పడుతుంది. అన్నింటికి అన్ని ఉండి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాగసిరి లాంచీ నిర్మాణం ప్రారంభమై మూడున్నర సంవత్సరాలైనా ఇంకా ఓకొలిక్కిరాలేదు. ఇప్పటి వరకు దీని కోసం రూ. 1.30 కోట్లు ఖర్చుచేశారు. మరో రూ.30లక్షలు వరకు అవసరం ఉన్నాయి. అదేమీ లేకుండా అపాయింటెడ్ డేకు ముందుగానే బుద్ధపూర్ణిమ ఉత్సవాలలో భాగంగా హిల్‌కాలనీ నుంచే లాంచీ లను ప్రారంభించాలని పర్యాటకులు కోరుతున్నారు. పుష్కరఘాట్ నుంచి.. బుద్ధవనం నుంచి లాంచీలు నడపాలన్న ప్రతిపాదనలు మానుకోవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు లాంచీలలో మూడింటిని తెలంగాణ వాటాకింద తీసుకుని హిల్‌కాలనీలోని డౌన్ పార్కు వద్ద నిర్మించిన పుష్కర ఘాట్ నుంచే నడపడానికి వీలుగా ఉందని వారు పేర్కొంటున్నారు. బైపాస్ రోడ్డువేసినా ఆ రోడ్డు డౌన్‌పార్కు సమీపం నుంచే వెళ్తుంది. రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. హిల్‌కాలనీ బస్టాండుకు నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. ఎంతో అనువైన ప్రదేశం. అన్ని పర్యాటక యూనిట్లు కలిసి ఉండే కంటే మరో యూనిట్ ఏర్పాటవుతుంది. ఉద్యోగాల సంఖ్యా పెరుగుతుంది. రెండుచోట్ల టికెట్లు విక్రయించడం వల్ల పర్యాటక శాఖకు ఆదాయం పెరుగుతుంది. పర్యాటకులకు రెండు ప్రాంతాలను చూసిన అనుభూతి కలుగుతుంది. రక్షణ దృష్ట్యా డౌన్‌పార్కు నుంచి నాగార్జునకొండకు వెళ్లేంత వరకు లాంచీలు కనిపిస్తాయి. కొండకు వెళ్లడానికి బుద్ధవనం నుంచి వెళ్లిన దాని కన్నా నీటిపై ప్రయాణం తగ్గుతుంది. నాగార్జునకొండకు వెళ్లడానికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారు. వారికి చుట్టూ తిరిగి వెళ్లడం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. ఏడాదిలో రూ. 1.30 కోట్ల ఆదా యం లాంచీస్టేషన్‌కు వస్తే ఇందులో తెలంగాణ ప్రాంతీయు ల నుంచి వచ్చిన రెవెన్యూ రూ. కోటి ఉంటుందని పర్యాటకశాఖ అధికారుల అంచనా. గతంలో ఎన్ఎస్పీ పరిధిలో లాంచీలు ఉన్నప్పుడు కూలీలలను నాగార్జునకొండకు ఇక్కడి నుంచి తీసుకువెళ్లినట్లుగా నాటి ఉద్యోగులు తెలిపారు. మూడు లాంచీలు తీసుకుని.. సాగర్‌లో ఒకప్పుడు ఆరు లాంచీలు ఉండేవి. అందులో విజయలక్ష్మి, ఎమ్మెల్ కృష్ణ, అగస్త్య, శాంతిసిరి, నాగసిరి, జరియా. అయితే వీటిలో జరియా లాంచీని గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రాప్రాంతానికి తరలించగా, ఇక్కడ ప్రస్తుతం ఐదు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఈ ప్రాంతం కోసం మూడు లాంచీలు తీసుకోవడమే గాక, అక్కడ పనిచేసే తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పించి, అన్ని అనుమతులు తీసుకుని హిల్‌కాలనీ నుంచి లాంచీలు ప్రారంభిస్తే పర్యాటకులకు చుట్టూ తిరిగి వెళ్లే శ్రమ తప్పుతుందని పలువురు పేర్కొంటున్నారు. జట్టీ నిర్మాణం జరగాలన్నా మరో రెండు సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ప్రతి అనుమతికి ఢిల్లీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎట్లాగూ పర్యాటక అభివృద్ధి సంస్థ అప్పులు, లాంచీలు రెండుప్రాంతాలవారు పంచుకోవాల్సిందేనంటున్నారు. బుద్ధపూర్ణమి ఉత్సవాలలో భాగంగా ఇక్కడి నుంచి లాంచీల ట్రయల్న్ ్రజరపాలని తెలంగాణ ప్రాంత పర్యాటకులు కోరుతున్నారు. -
ఏపీ టూరిజంలో పలు ప్రత్యేక ప్యాకేజీలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు విదేశాల పర్యటలకు సైతం అనేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుమిత్ సింగ్ తెలిపారు. చెన్నైలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీటీడీసీ రీజినల్ డెరైక్టర్ సోయబ్, జనరల్ మేనేజర్ మనోహర్ మాట్లాడారు. పర్యాటక ప్యాకేజీల్లో గత ఏడాది రూ.8 కోట్ల టర్నోవర్ సాధించి దేశంలోనే తమ సంస్థ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. నవంబరు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పర్యాటక రంగానికి అనుకూలమైన కాలంగా పరిగణిస్తూ అనేక కొత్త ప్యాకేజీలు, పాత ప్యాకేజీల్లోనే మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలలో శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి శ్రమకోర్చి వచ్చే భక్తులు నేరుగా తిరుపతికి చేరుకుని అవస్థలు పడుతున్న అందరికీ తెలుసన్నారు. తమ సంస్థకు టీటీడీ వారు రోజుకు 900 శీఘ్రదర్శనం టికెట్లు కేటాయించారని, అందువల్ల చక్కని స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి విమానం లేదా వోల్వో బస్సు సర్వీసుల ద్వారా 24 గంటల్లో దర్శనం చేయించి వారి ప్రాంతాలకు తిరిగి చేరుస్తామని చెప్పారు. 24 గంటల్లో శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టూర్లు నడుపుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాచీన, చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల సందర్శనకు బీచ్ రిసార్టులు, స్టార్ హోటల్ స్థాయి వసతులతో సేవలు సిద్ధంగా ఉంచామని వివరించారు. ఆంధ్రా ఊటీగా పేరొందిన చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్, విశాఖపట్నం, హైదరాబాద్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని మైపాడ్ బీచ్, అనేక జిల్లాల్లో బోట్ షికారు, బీచ్ రిసార్టులు, అడ్వెంచర్ గేమ్స్, ట్రెక్కింగ్, బోట్లో ప్రయాణం తదితర అనేక ఆకర్షణలతో సేవలను అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల సందర్శనకు ఆయా రాష్ట్రాల కార్పొరేషన్లతో అనుసంధానమై ప్యాకేజీలు అందిస్తామని చెప్పారు. ఒక బృందంగా లేదా, కుటుంబంగా వెళ్లదలుచుకున్న వారికి కారవాన్ స్థాయి సౌకర్యాలు కలిగిన ప్రత్యేక వాహనాన్ని కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 42 545454, 9840580577 (చెన్నై), 099516111060 (హార్సిలీ హిల్స్), 09989588800 (నెల్లూరు)లలో సంప్రదించవచ్చని తెలిపారు. మీడియా సమావేశంలో చెన్నై అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.