ఏపీ టూరిజంలో పలు ప్రత్యేక ప్యాకేజీలు
Published Fri, Nov 1 2013 4:10 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు విదేశాల పర్యటలకు సైతం అనేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుమిత్ సింగ్ తెలిపారు. చెన్నైలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీటీడీసీ రీజినల్ డెరైక్టర్ సోయబ్, జనరల్ మేనేజర్ మనోహర్ మాట్లాడారు. పర్యాటక ప్యాకేజీల్లో గత ఏడాది రూ.8 కోట్ల టర్నోవర్ సాధించి దేశంలోనే తమ సంస్థ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. నవంబరు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పర్యాటక రంగానికి అనుకూలమైన కాలంగా పరిగణిస్తూ అనేక కొత్త ప్యాకేజీలు, పాత ప్యాకేజీల్లోనే మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలలో శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి శ్రమకోర్చి వచ్చే భక్తులు నేరుగా తిరుపతికి చేరుకుని అవస్థలు పడుతున్న అందరికీ తెలుసన్నారు. తమ సంస్థకు టీటీడీ వారు రోజుకు 900 శీఘ్రదర్శనం టికెట్లు కేటాయించారని, అందువల్ల చక్కని స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి విమానం లేదా వోల్వో బస్సు సర్వీసుల ద్వారా 24 గంటల్లో దర్శనం చేయించి వారి ప్రాంతాలకు తిరిగి చేరుస్తామని చెప్పారు. 24 గంటల్లో శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టూర్లు నడుపుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాచీన, చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల సందర్శనకు బీచ్ రిసార్టులు, స్టార్ హోటల్ స్థాయి వసతులతో సేవలు సిద్ధంగా ఉంచామని వివరించారు.
ఆంధ్రా ఊటీగా పేరొందిన చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్, విశాఖపట్నం, హైదరాబాద్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని మైపాడ్ బీచ్, అనేక జిల్లాల్లో బోట్ షికారు, బీచ్ రిసార్టులు, అడ్వెంచర్ గేమ్స్, ట్రెక్కింగ్, బోట్‌లో ప్రయాణం తదితర అనేక ఆకర్షణలతో సేవలను అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల సందర్శనకు ఆయా రాష్ట్రాల కార్పొరేషన్లతో అనుసంధానమై ప్యాకేజీలు అందిస్తామని చెప్పారు. ఒక బృందంగా లేదా, కుటుంబంగా వెళ్లదలుచుకున్న వారికి కారవాన్ స్థాయి సౌకర్యాలు కలిగిన ప్రత్యేక వాహనాన్ని కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 42 545454, 9840580577 (చెన్నై), 099516111060 (హార్సిలీ హిల్స్), 09989588800 (నెల్లూరు)లలో సంప్రదించవచ్చని తెలిపారు. మీడియా సమావేశంలో చెన్నై అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement