‘అన్నం’కు అధికారమదం తలకెక్కింది
ఏపీటీడీసీ సిబ్బంది ఆగ్రహం
విజయవాడ (భవానీపురం): టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్‌కు అధికార మదంతో పాటు మద్యం మత్తుకూడా తలకెక్కిందని, ఆ మత్తులో విచక్షణా జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడని ఏపీటీడీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6 రాత్రి బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో ఉన్న హరిత రిసార్ట్స్‌లో డిప్యూటీ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావుపై ఎమ్మెల్సీ అన్నం, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌లో ఆదివారం చేరారు. ఆయన్ని పరామర్శించడానికి పలువురు ఏపీటీడీసీ సిబ్బంది సోమవారం ఆస్పత్రికి వచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం అన్నం, ఆయన అనుచరులు రిసార్ట్స్‌కు ఒక పొట్టేలును తీసుకొచ్చారని, ఆయనే దాని తల నరికి మాంసం కొట్టి వంటవారికి అప్పగించాడని చెప్పారు. పార్టీల పేరుతో గతంలో మూడు సార్లు ఇలానే బయట నుంచి ఆహార పదార్థాలను తెచ్చుకున్నారని వెల్లడించారు. ఆరోజు ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు తమ సిబ్బంది అన్నీ సరఫరా చేస్తున్నారని, రాత్రి సమయంలో శ్రీనివాసరావును పిలవడంతో అతను అన్నం గదికి వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో ఆయన శ్రీనివాసరావుపై అకారణంగా చేయి చేసుకున్నాడని, తానేం తప్పుచేశానని అడిగిన శ్రీనివాసరావుపై అన్నం మరోసారి చేయి చేసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపడుతున్నారని చెప్పారు.