Annam Satish Prabhakar
-
చంద్రబాబుని నిండా ముంచిన లోకేష్..
సాక్షి, గుంటూరు : ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరపమని రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరతానని తెలిపారు. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని ఆయన కుమారుడు లోకేషే నిండా ముంచారని అభిప్రాయపడ్డారు. లోకేష్ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని చెప్పారు. ఆయన కారణంగా చాలామంది నేతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, లోకేష్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని సతీష్ వెల్లడించారు. టీడీపీ అభివృద్ధి కోసం వాల్ పోస్టర్లు కూడా అంటించానని.. సొంత నిధులు ఖర్చుపెట్టి పార్టీని నడిపించానని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌లా తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రిని కాలేదని విమర్శించారు. లోకేష్ కారణంగా త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని జోస్యం చెప్పారు. తనకు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని తెలిపారు. -
బీజేపీలో చేరిన అన్నం సతీష్ ప్రభాకర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ కాషాయ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. జేపీ నడ్డా ఈ సందర్భంగా అన్నం సతీష్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సతీష్ ప్రభాకర్ నిన్న పార్లమెంటులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా పేరొందిన సతీష్.. పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. 2014 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీచేసిన సతీష్.. వైఎస్సార్సీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చదవండి: టీడీపీకి రాజీనామా.. లోకేష్‌పై ఘాటు విమర్శలు -
టీడీపీకి రాజీనామా.. లోకేష్‌పై ఘాటు విమర్శలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్.. ఆ మరుక్షణనే నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమికి లోకేష్ వ్యవహారమే కారణమని మండిపడ్డారు. కనీస అర్హత లేని లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. లోకేష్ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయారని, అడ్డదారిలో మంత్రిపదవి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. చదవండి: టీడీపీకి షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కేతో కలిసి చట్టసభల్లో కూర్చోడానికి లోకేష్‌కు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సతీష్ సవాల్ విసిరారు. లోకేష్ పార్టీలోకి వచ్చిన తరువాత గ్రూపులను తయారుచేశారని, హెరిటేజ్ సంస్థలా పార్టీ తయారైందని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మరికొంతమంది నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. కాగా బుధవారమే ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి సతీష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చదవండి: టీడీపీకి మరోషాక్.. సీనియర్ నేత రాజీనామా! -
టీడీపీకి షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ఆ పార్టీ నేతలు వరుస షాకులిస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఇప్పటికే పలువురు సీనియర్లు, నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనమండలి కార్యదర్శికి బుధవారం లేఖ రూపంలో ఆయన రాజీనామాను సమర్పించారు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా పేరొందిన సతీష్.. పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. 2014 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీచేసిన సతీష్.. వైఎస్సార్సీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: టీడీపీకి మరోషాక్.. సీనియర్ నేత రాజీనామా! రెండు రోజలు వ్యవధిలోనే గుంటూరు జిల్లాకు చెందిన మరో నేత పార్టీని వీడడం టీడీపీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత చందు సాంబశివరావు మంగళవారమే పార్టీ పదవులను, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలవ్వడం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవ్వడంతో వరుసగా కీలక నేతలు పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. -
అడ్డొస్తే చంపేస్తా.. నేను చెప్పింది జరగాల్సిందే..!
బాపట్ల: ‘అడ్డొస్తే చంపేస్తా..నేను చెప్పింది జరగాల్సిందే..ఎవరు నన్ను అడ్డుకునేదంటూ’ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ వీరంగం చేశారు. రెచ్చిపోయి చిందులు తొక్కుతున్న అన్నంను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పట్టణ సీఐ కోటేశ్వరరావును వెనక్కి నెట్టేసి మరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైకి అన్నం సతీష్‌ప్రభాకర్ దూసుకొచ్చారు. అన్నం దూకుడును కొద్దిసేపు పోలీసులు సైతం నిలువరించలేకపోయారు. బాపట్ల పట్టణంలోని చిల్లరగొల్లపాలెం వద్ద బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నివాసం ఉంది. ఈ బజారు మీదుగా ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ ప్రచారానికి బయలు దేరారు. ఎమ్మెల్యే నివాసం వద్ద డీజే ప్రచారరథం ఉంది. అయితే తమ ప్రచారం వస్తోందని, డీజే నిలుపుదల చేయాలంటూ తెలుగుతమ్ముళ్లు చిందులు తొక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా అన్నం సతీష్ జోక్యం చేసుకుని ‘ఏరా..ఎంత బలుపు’ అంటూ ఒక్కసారిగా వాహనం దిగి వైఎస్సార్ సీపీ కార్యకర్తల పైకి దూసుకురాబోయారు. ఇది గమనించిన పోలీసులు ఆయన్ను నిలువరించేందుకు యత్నించినప్పటికీ అన్నం ఆవేశం తగ్గలేదు. కొద్దిసేపు వీరంగం చేసి నానా రగడ చేశారు. అన్నం ఆగడాల్ని చూసి ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. -
‘బురిడీ బాబు’పై కేసు పెడదామా..వద్దా..!
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బ్యాంకును బురిడీ కొట్టించిన కేసు వివాదం నుంచి ఎలా బయటపడాలనే దానిపై ఎస్బీఐ ఉన్నతాధికారులు మూడు రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. రూ.24 కోట్ల రుణం మంజూరు చేసే ప్రక్రియలో కిందిస్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టించారని, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నమ్మించారని, అందువల్ల లోతుగా పరిశీలించకుండానే రుణం మంజూరు చేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. రుణం కోసం అన్నం సతీష్ ప్రభాకర్ బ్యాంకుకు సమర్పించిన 11.66 ఎకరాలకు సంబంధించిన పత్రాల్లో ‘లింకు డాక్యుమెంట్లు’ లేవని బ్యాంకు సిబ్బందికి స్పష్టంగా తెలుసని వివరించారు. ఆస్తుల తనఖాకు ఆధారంగా సమర్పించిన ‘టైటిల్ డీడ్స్ డిపాటిట్’లో కేవలం రిజిస్ట్రేషన్లు, తప్పుడు 1బీ పత్రం సమర్పించడం వరకే ఎమ్మెల్సీ పరిమితమయ్యారు. ఒక్క ఎకరాకు కూడా లింక్ డాక్యుమెంట్లు(ఎమ్మెల్సీకి విక్రయించిన వారికి భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని నిర్ధారించే పత్రాలు) సమర్పించలేదు. బ్యాంకుకు సమర్పించిన భూముల పత్రాలన్నీ 2015–17 మధ్య రిజిస్ట్రేషన్లు చేసినవే కావడం గమనార్హం. తమకు వారసత్వంగా భూమి వచ్చినట్లుగా ఎమ్మెల్సీకి భూములు విక్రయించిన వారు రిజిస్ట్రేషన్ల పత్రాల్లో రాశారు. వారి వారసులకు ఉన్న భూయాజమాన్య హక్కు పత్రాలను గానీ, ‘సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్’లో వారి వివరాలను చూసి గానీ బ్యాంకు అధికారులు నిర్ధారించుకోలేదు. సామాన్యులు బ్యాంకు రుణం కోసం వెళితే ఇవన్నీ పక్కాగా చూస్తారు. ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా రుణం ఇవ్వరు. కానీ, ఎస్బీఐ అధికారులు ఇవేమీ చూడకుండానే అధికార పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు చెందిన ‘సతీష్ మెరైన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్’కు రూ.24 కోట్ల రుణం మంజూరు చేశారు. తొలి విడతగా అందులో రూ.5 కోట్లు రుణం విడుదల చేశారు. ఆగమేఘాలపై రుణం విడుదల ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ భూములు, ఇతర ఆస్తులను బ్యాంకుకు తనఖా (మార్ట్గేజ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్) పెట్టి 2018 అక్టోబర్ 8 రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రుణం విడుదల చేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఎస్బీఐ బాపట్ల శాఖ అందుకు భిన్నంగా వ్యవహరించింది. అక్టోబర్ 8న డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ రిజిస్ట్రేషన్‌కు నెల రోజుల ముందుగానే.. అంటే సెప్టెంబర్ నుంచే రుణం విడుదల చేయడం ప్రారంభించారు. అధికారులందరికీ లోగుట్టు తెలియదు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు రుణం మంజూరులో ‘లోగుట్టు’ బ్యాంకు అధికారులందరికీ తెలియదనే అభిప్రాయం బ్యాంకు వర్గాల్లో ఉంది. విచారణ జరిగితే తామంతా ఇరుక్కుంటామని, ఈ వివాదం నుంచి బయటపడాలంటే... బ్యాంకును మోసం చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌పై చీటింగ్ కేసు పెట్టాలని అధికారులు తొలుత నిర్ణయించారు. అయితే ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి రావడంతో చీటింగ్ కేసు విషయంలో తర్జనభర్జన జరిగింది. చీటింగ్ కేసు నమోదు చేయకుండా ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.5 కోట్ల రుణాన్ని తక్షణం తిరిగి చెల్లిస్తే, తనఖా పెట్టిన డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చేసి ‘లోన్ అకౌంట్’ను మూసేస్తామని, వివాదం సమసిపోతుందని బ్యాంకు ఉన్నతాధికారులు మధ్యేమార్గంగా ‘ఒత్తిడి చేసిన పెద్దలకు’ సూచించారని తెలిసింది. ఈ వివాదంలో బ్యాంకు ఉన్నతాధికారులు న్యాయ సలహా కూడా తీసుకున్నారు. ఇచ్చిన రుణం వసూలు చేసుకొని, ‘లోన్ అకౌంట్’ మూసేయడమే ఉత్తమమని న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. 1బీ చేతికందిన రోజే ఎమ్మెల్సీకి రిజిస్ట్రేషన్ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు భూములు రిజిస్ట్రేషన్ చేయించిన రోజే రైతులకు 1బీ పత్రాలు జారీ కావడం గమనార్హం. అంటే ఇటు చేతిలో 1బీ పత్రం తీసుకొని.. అటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూవిక్రయ పత్రాలపై సంతకాలు చేశారన్నమాట. ఉదాహరణకు 387/3 సర్వే నంబర్లో 1.06 ఎకరాలకు సంబంధించిన 1బీ పత్రం రైతుకు 2016 మార్చి 3న జారీ అయింది. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు రిజిస్ట్రేషన్(డాక్యుమెంట్ నంబర్ 1017/2016) చేయించిన తేదీ కూడా అదే కావడం గమనార్హం. 287/2 సర్వే నంబరు రైతుకు 2016 మార్చి 2న 1బీ పత్రం వస్తే.. అదే రోజు ఎమ్మెల్సీకి విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 1016/2016) చేశారు. ఇలాంటి విషయాలను బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. -
సాక్షి కార్యాలయం వద్ద అన్నం అనుచరుల దౌర్జన్యం
మంగళగిరి/బాపట్లటౌన్: ప్రభుత్వ భూములు తనఖా పెట్టి బ్యాంకును బురిడీ కొట్టించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులు సాక్షి దినపత్రికపై దౌర్జన్యానికి దిగారు. ఆదివారం ప్రచురితమైన సంచికలో తన బండారం సాక్షి బయటపెట్టిందని అక్కసు వెళ్లగక్కారు. సాక్షి కార్యాలయాలను ముట్టడించాలని అనుచరులు, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో సోమవారం వారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఉన్న సాక్షి కార్యాలయాన్ని ముట్టడించి ధ్వంసం చేయాలని పథకరచన చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సాక్షి కార్యాలయం వద్దకు చేరుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారమే ఇలాంటి పథక రచన చేయగా బాపట్ల నుంచి బయలుదేరిన ఆయన అనుచరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దూషణల పర్వం.. బాపట్ల నుంచి వాహనాల్లో అన్నం సతీష్ అనుచరులు బయలుదేరినప్పటినుంచి తమ అనుకూల మీడియాకు సమాచారం ఇస్తూ వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నినాదాలు చేసుకుంటూ సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటు సాక్షి దినపత్రికపై ఇష్టానుసారం దూషణల పర్వం కొనసాగించారు. తమతో తీసుకొచ్చిన రైతులకు ఏం మాట్లాడాలో ముందే చెప్పి మీడియాతో మాట్లాడించారు. బందోబస్తును ఛేదించి కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులు గట్టిగా ప్రతిఘటించడంతో కార్యాలయం గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అన్నం యువసేన సత్తా ఏమిటో వైఎస్ జగన్‌కు, సాక్షికి చూపిస్తామంటూ బెదిరించారు. గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ చింతా రవిబాబు, రూరల్ ఎస్ఐ వీరనాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది సిబ్బంది, క్యూఆర్టీ బృందంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పత్రికలపై దాడి సరికాదు: కోన రఘుపతి పత్రికలో వార్త వస్తే వాటి కార్యాలయాలపై దాడి చేయటం, యాజమాన్యాలను దూషించడం సరికాదని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాక్షిలో ప్రచురించిన కథనంపై అధికార పార్టీ నాయకులు పత్రిక కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. విలేకరులు వారికున్న ఆధారాలతో వార్తలు రాస్తారని, అధికారంలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వారి దగ్గరున్న ఆధారాలను చూపిస్తూ సమాధానం చెప్పుకోవాలన్నారు. రైతులకు రుణం ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెట్టే బ్యాంకు అధికారులు.. అధికార పార్టీ నేత విషయంలో జాగ్రత్త వహించకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు నరాలశెట్టి ప్రకాశరావు, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు. సాక్షి కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు -
ఉలిక్కిపడ్డ ‘బురిడీ బాబు’
సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్/చేబ్రోలు/కర్లపాలెం: టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బ్యాంకును బురిడీ కొట్టించిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం (23–12–2018)న ‘టీడీపీ బ్యాచ్‌లో మరో బురిడీ బాబు’ శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నం సతీష్ ప్రభాకర్ ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకులను బురిడీ కొట్టించి కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని సాక్షి వివరించింది. దీంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. తన వ్యవహారం వెలుగులోకి రావడంతో అన్నం సతీష్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తప్పును ఎలా కప్పిపుచ్చుకోవాలా అని అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆదివారం మధ్యాహ్నం వరకు తర్జనభర్జన పడ్డారు. అప్పటి వరకూ పార్టీ పెద్దలతో సంప్రదింపులు కొనసాగించారు. ఆ తర్వాత అన్నం సతీష్ కొత్త డ్రామాకు తెరలేపారు. సాక్షిలో వచ్చిన కథనం అవాస్తవమని ఖండించడానికి ప్రయత్నించారు. సాక్షి కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలోని టీడీపీ నేతలకు ఫోన్ చేసి నాయకులు, కార్యకర్తలను సమీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఎవ్వరూ స్పందించకపోవడంతో చేసేది లేక ఆయన సొంత నియోజకవర్గం బాపట్ల నుంచి టీడీపీ కార్యకర్తలు వాహనాల్లో గుంటూరు అంకిరెడ్డిపాలెంలోని సాక్షి యూనిట్, అరండల్‌పేట మూడో లైన్‌లోని సిటీ కార్యాలయాలకు బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అన్నం అనుచరులను మధ్యలోనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా చేబ్రోలు పోలీస్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ అనుచరులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. రాస్తారోకోతో ప్రజలకు ఇబ్బందులు... చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అన్నం సతీష్ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి హడావుడి చేశారు. రాస్తారోకో పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు అన్నం సతీష్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు సాక్షి కార్యాలయాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంకిరెడ్డిపాలెం, అరండల్‌పేటల్లో కార్యాలయాల వద్ద అరండల్‌పేట, నల్లపాడు సీఐలు శ్రీనివాసరావు, బాలమురళి ఆధ్వర్యంలో సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులతో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ బందోబస్తు నిర్వహించారు. కాగా, తమ ఇష్టపూర్వకంగానే భూములు ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్‌కు అమ్ముకున్నామని గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామ రైతులు తెలిపారు. కర్లపాలెం టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ కన్వీనర్ నక్కల వెంకటస్వామి ఆధ్వర్యంలో రైతులు మీడియాతో మాట్లాడారు. తమకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయని, కంపెనీ ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే భూములు విక్రయించామని చెప్పారు. -
టీడీపీ బ్యాచ్‌లో మరో బురిడీ బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బాటలో ఆ పార్టీ నేతలు నడుస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఎస్బీఐను బురిడీ కొట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి ఆ బ్యాంక్ నుంచి రూ. 24 కోట్లు రుణం తీసుకోవడానికి వేసిన ప్రణాళికను సతీష్ ప్రభాకర్ విజయవంతంగా అమలు చేశారు. బ్యాంకును మోసగించి.. తొలి విడతగా రూ. 5 కోట్లు రుణం ఇప్పటికే తీసుకున్నారు. మిగిలిన రూ. 19 కోట్ల రుణం తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. రైతులను భయపెట్టి.. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు సాగుచేసుకున్నంత మాత్రాన భూ యాజమాన్య హక్కులు రావని, ఎప్పుడైనా వాటిని కోల్పోవాల్సిందేనని స్థానిక రైతులను ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ భయపెట్టారు. తనకు విక్రయిస్తే.. కొంతమొత్తమయినా చేతికి వస్తుందని, భూమి మొత్తం కోల్పోవడం కంటే తనకు అమ్మడమే మేలని వారిని ప్రలోభపెట్టారు. దీంతో భయపడ్డ చాలా మంది రైతులు ఆయనకు భూములు అమ్మేశారు. ఆ భూములను ‘సతీష్ మెరైన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ సర్వే నంబర్లను నిషేధిత భూముల జాబితాలో లేకుండా చేసి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో లాలూచీపడి రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. ఈమేరకు 11.66 ఎకరాలకు 1బి (భూ యాజమాన్య హక్కు నిర్దారించే పత్రం) పొందారు. ఖాతా నంబర్ 3310 కింద 1బి జారీ చేశారు. సతీష్ ప్రభాకర్ భయభ్రాంతులకు గురిచేయడంతో రెవెన్యూ అధికారులు ఆయన చెప్పినట్లు చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2018 మార్చి 13న ‘మీ సేవ’లో 11.66 ఎకరాలకు 1బీ పత్రం తీసుకున్నారు. బ్యాంకును ఎలా బురిడీ కొట్టించారంటే.. దొడ్డిదారిలో 11.66 ఎకరాల ప్రభుత్వ భూములకు ‘1బి’ పత్రం పొందిన తర్వాత.. ఆ భూములను 2018 అక్టోబర్ 8న ఎస్బీఐలో తనఖా పెట్టారు. తన కంపెనీ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ. 24 కోట్లు రుణం కావాలని దరఖాస్తు చేశారు. 11.66 ఎకరాల భూమి, ఆ భూమిలో నిర్మిస్తున్న యూనిట్‌ను సెక్యూరిటీగా పెట్టారు. రుణం కోసం దరఖాస్తు చేసింది అధికారపార్టీ ఎమ్మెల్సీ కాబట్టి.. ఎస్బీఐ అధికారులు వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత రుణం మంజూరు చేశారు. తొలి విడతగా రూ. 5 కోట్లు కూడా విడుదల చేశారు. బ్యాంకు రుణం మంజూరయ్యే వరకు 11.66 ఎకరాలకు 1బి పత్రం మీ సేవలో ఆన్లైన్లో కనిపించింది. తర్వాత.. తాము ఇరుక్కుంటామని తెలిసి రెవెన్యూ అధికారులు 1బిలో గుట్టు చప్పుడు కాకుండా మార్పులు చేశారు. అదే ఖాతా నంబరు (3310) కింద 4.15 ఎకరాలు మాత్రమే ఉందని చూపించారు. మళ్లీ ఆ 4.15 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మీ సేవలో 3310 ఖాతా వివరాలు కనిపించకుండా చేశారు. అంతా కుమ్మక్కై ఇలా బ్యాంకు రుణం తీసుకున్న తర్వాత భూముల వివరాలను ఆన్లైన్లో మాయం చేశారు. ప్రస్తుతం మీ సేవలో ఆ ఖాతా నంబర్ చూస్తే.. తహసీల్దార్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉందని చూపుతోంది. పార్టీ నేతల బాటలో.. ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాల్లో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మోసం బయటపడిన విషయం తెలిసిందే. సుమారు 120 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకులను రూ. 6 వేల కోట్లకు బురిడీ కొట్టించారు. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులనే ఆ డొల్ల కంపెనీల డైరెక్టర్లగా చూపి బ్యాంకులను మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది. తీసుకున్న రుణం చెల్లించని కారణంగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఆస్తులు గతేడాది ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులకు రూ. 200 కోట్ల మేర బకాయి పడిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి ష్యూరిటీ కింద మంత్రి గంటా ఆస్తులు కుదువ పెట్టగా.. రుణం వసూలుకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మంత్రి స్పందించలేదు. దీంతో మంత్రి కుదువ పెట్టిన ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అన్నం సతీష్ ప్రభాకర్ వ్యవహారం వెలుగులోకి రావడంతో బ్యాంకులను మోసగించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
బాపట్ల: విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పావని మృత్యువాత. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని గతంలో అనేక కథనాలు సాక్షిలో ప్రచురించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో ఓ నిండు ప్రాణం విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యానికి బలైంది. మండలంలోని చెరువుజమ్ములపాలెం వద్ద బోయిన పావని విద్యుత్ వైర్లు తగులుకొని మృతి చెందినప్పటికి అధికారులు ఇంకా కళ్లుతెరవలేదు. భర్తీపూడి, ముత్తాయపాలెం జిల్లాపరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల మధ్యలో రోడ్డుపక్కనే ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదభరితంగా ఉంది. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం పోయిందని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. మండలంలోని చెరువుజమ్ములపాలెంలో మంగళవారం రాత్రి మృతి చెందిన బోయిన పావని మృతదేహాన్ని బుధవారం పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పినా ఫలితం లేదని పావని తండ్రి నాగరాజుతోపాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోన రఘుపతి విద్యుత్ అధికారులను మందలించారు. నియోజకవర్గంలో ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించాలని సూచించారు. ఈవిషయంపై విద్యుత్ శాఖను నివేదిక కోరటంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పారు. నరాలశెట్టి ప్రకాశరరావు, కోకి రాఘవరెడ్డి, ఆట్ల ప్రసాద్‌రెడ్డి,రాజా ఉన్నారు. ఎమ్మెల్సీ అన్నం పరామర్శ విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన బోయిన పావని మృతదేహాన్ని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ పరామర్శించారు. కుటుంభ సభ్యులను ఓదార్చటంతోపాటు ప్రభుత్వ పరమైన సాయం అందేవిధంగా చూస్తామని చెప్పారు. -
‘అన్నం’కు అధికారమదం తలకెక్కింది
ఏపీటీడీసీ సిబ్బంది ఆగ్రహం విజయవాడ (భవానీపురం): టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్‌కు అధికార మదంతో పాటు మద్యం మత్తుకూడా తలకెక్కిందని, ఆ మత్తులో విచక్షణా జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడని ఏపీటీడీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6 రాత్రి బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో ఉన్న హరిత రిసార్ట్స్‌లో డిప్యూటీ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావుపై ఎమ్మెల్సీ అన్నం, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్లో ఆదివారం చేరారు. ఆయన్ని పరామర్శించడానికి పలువురు ఏపీటీడీసీ సిబ్బంది సోమవారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం అన్నం, ఆయన అనుచరులు రిసార్ట్స్‌కు ఒక పొట్టేలును తీసుకొచ్చారని, ఆయనే దాని తల నరికి మాంసం కొట్టి వంటవారికి అప్పగించాడని చెప్పారు. పార్టీల పేరుతో గతంలో మూడు సార్లు ఇలానే బయట నుంచి ఆహార పదార్థాలను తెచ్చుకున్నారని వెల్లడించారు. ఆరోజు ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు తమ సిబ్బంది అన్నీ సరఫరా చేస్తున్నారని, రాత్రి సమయంలో శ్రీనివాసరావును పిలవడంతో అతను అన్నం గదికి వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో ఆయన శ్రీనివాసరావుపై అకారణంగా చేయి చేసుకున్నాడని, తానేం తప్పుచేశానని అడిగిన శ్రీనివాసరావుపై అన్నం మరోసారి చేయి చేసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపడుతున్నారని చెప్పారు. -
టీడీపీ విందు రాజకీయం
బాపట్ల, న్యూస్‌లైన్: బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్‌ప్రభాకర్ విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. సూర్యలంక వెళ్లేదారిలోని ఆయన కళాశాలకు చెందిన బస్సులో బుధవారం డ్వాక్రాకు సంబంధించిన విలేజి ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్(వీవోఏ)లను కళాశాలకు తరలించారు. అక్కడ వారితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతా జయప్రకాశ్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ పాల్గొన్నారు. టీడీపీకి మీ ఓట్లతో పాటు మీ పరిధిలోని గ్రూపుల మహిళలతో ఓట్లు వేయిస్తే మీ ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తామంటూ వారిని ప్రలోభ పెట్టారు. గ్రామాల్లో మా పార్టీకి మీరే ప్రతినిధులు, అక్కడ పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా మీ ద్వారానే చేస్తామంటూ వారిని ఆకాశానికి ఎత్తేశారు. చక్కని విందు అందించారు. ఆనక ఆటోల్లో ఇళ్లకు పంపించారు. ఏపీవో చెబితేనే వచ్చాం... మహిళా సమాఖ్య ఏపీవో శ్రీనివాసరెడ్డి ప్రతి డ్వాక్రా వీవోఏకు ఫోన్ చేసి టీడీపీ మీటింగ్‌కు వెళ్లకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పడం వల్లనే తాము ఇక్కడికి వచ్చామని వీవోఏలు న్యూస్‌లైన్‌కు చెప్పారు. దీంతో ఇది ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన మీటింగ్ అనుకుని వచ్చామని కొందరు వీవోఏలు వాపోయారు. -
పీఛే.. ముడ్!
పార్టీలో సామాజిక న్యాయం వట్టిమాటే కార్యకర్తల్లో పెరుగుతున్న అసహనం నియోజకవర్గాల్లో వర్గపోరుతో అతలాకుతలం 17 సీట్లలో ఓటమి ఖాయమని తేల్చిన నాయకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రముఖుల చేరిక టీడీపీకి మూడురోజుల మురిపెమే అవుతోంది. కొందరు నాయకులు పార్టీలోకి వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతోందని వారు భావించడమే ఇందుకు కారణం. టికెట్టు ఇప్పిస్తామంటూ తొలుత జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు నగరంలోని ప్రముఖుల వద్దకు వెళ్లడం, తర్వాత పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లి అట్టహాసంగా కండువాలు కప్పి పార్టీలో చేర్పించడం తర్వాత వారిని విస్మరించడం అనవాయితీగా మారింది. ఆ తర్వాత అసలు విషయాన్ని గ్రహించి చేరిన నాయకులందరూ పార్టీని వీడుతున్నారు. తొలినుంచి పార్టీ జెండా మోసిన వారికి మొండి చెయ్యిచూపించడంతో వారు సైతం పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ ఆర్యవైశ్య ప్రముఖుడు కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే టీడీపీలో చేరిన మరో ప్రముఖుడు తొందరపడి పార్టీలో చేరవద్దని తామే బయటకు వస్తున్నామని ఆయనకు తెలిపినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీలో చేరలేదు. అలాగే తొలుత ఆ సామాజిక వర్గానికి టికెట్టు ఇస్తారంటూ ప్రచారం చేసినా ఇప్పుడు ఆ స్థానం ముస్లింలకే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పార్టీలో చేరి లక్షలు ఖర్చుచేసిన నాయకులు గగ్గోలు పెడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరు ఈస్ట్ టికెట్టును తమకు ఇస్తామని చేసి న వాగ్ధానాన్ని మరచిపోయారని ఆ సామాజిక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతపై కాపుల గుర్రు.. తమకు జిల్లాలో రెండు సీట్లివ్వాలని ఆది నుంచి కోరుతున్న కాపులకు బాపట్ల సీటు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై కూడా నియోజకవర్గంలోని ఇతర నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇక మిగిలిన తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఒకటైనా సీటు కేటాయించాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీకి ఎప్పటి నుంచో సేవలందిస్తున్న దాసరి రాజామాష్టారుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయించలేదు. ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామంటూ అధిష్టానం సర్దిచెప్పింది. పశ్చిమ నియోజకవర్గంలో తులసి రామచం ద్ర ప్రభుకు టిక్కెట్టు ఇస్తున్నట్లు ప్రచారం చేసి చివరి నిముషంలో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి సీటు కేటాయించారు. దీంతో తులసీ రామచంద్ర ప్రభు, ఆయన అభిమానులు పిలిచి తమను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్లలో అంతర్గత కుమ్ములాటలు... జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. కేవలం ఆర్థిక పరపతి ఉన్నవారికే టిక్కెట్లు కేటాయిస్తుండటంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు సత్తెనపల్లి కేటాయించడంతో ఎప్పటి నుంచో ఇక్కడ పోటీ చేయాలని భావించిన నియనిమ్మకాయల రాజనారాయణ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రచారానికే సామాజిక న్యాయం.. ఆర్యవైశ్య, కాపు, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తామని చేస్తున్న ప్రచారానికి భిన్నంగా జిల్లాలో పరిస్థితి ఉంది. కాపులకు ఒక సీటు కేటాయిస్తే, బీసీలకు సీట్లు తగ్గుతాయని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పరిస్థితిపై నివేదికలు పంపే వారు సైతం సామాజిక న్యాయం కింద అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించకుంటే పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని తెలపడం కొసమెరుపు. ఇప్పటివరకూ ప్రకటించిన జాబితాలో ఒక్కరైనా మహిళ లేకపోవడంపై ఆ వర్గం నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక నూర్‌బాషాలు సైతం తమ వర్గానికి రాష్ట్రంలో ఐదు సీట్లు కేటాయిస్తామన్న చంద్రబాబు మొండిచెయ్యి చూపడంపై వారూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంటే ఏమిటో ఈ ఎన్నికల్లో చూపుతామంటున్నారు.