సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ఆ పార్టీ నేతలు వరుస షాకులిస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఇప్పటికే పలువురు సీనియర్లు, నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనమండలి కార్యదర్శికి బుధవారం లేఖ రూపంలో ఆయన రాజీనామాను సమర్పించారు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా పేరొందిన సతీష్.. పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. 2014 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీచేసిన సతీష్.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
చదవండి: టీడీపీకి మరోషాక్.. సీనియర్ నేత రాజీనామా!
రెండు రోజలు వ్యవధిలోనే గుంటూరు జిల్లాకు చెందిన మరో నేత పార్టీని వీడడం టీడీపీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత చందు సాంబశివరావు మంగళవారమే పార్టీ పదవులను, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలవ్వడం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవ్వడంతో వరుసగా కీలక నేతలు పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment