కుమార్తెను బతికించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన కుటుంబ సభ్యులు
గుంటూరు సమగ్ర వైద్యశాలలో వెంటిలేటర్‌పై బాధితురాలు
పరామర్శించిన మేరుగ నాగార్జున, అన్నాబత్తుని
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తెనాలి రూరల్: టీడీపీకి చెందిన రౌడీషీటర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం తెనాలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తెనాలి అయితానగర్‌కు చెందిన 26 ఏళ్ల యువతి ఓ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ సెంటర్‌లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం డ్యూటీకి వెళ్లిన బాధితురాలిని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ (కొంతకాలంగా తెనాలిలో నివాసం ఉంటున్నాడు) తన పుట్టిన రోజు అని నమ్మించి వెంట తీసుకువెళ్లాడు.
కొద్ది గంటల అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. అనంతరం అక్కడకు చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్ సహా పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. వెంటిలేటర్‌పై ఉన్న బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు..
తమ కుమార్తెపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని.. మెడ, తల కమిలిపోయిందని, దాడి చేసి గాయపర్చినట్లు నల్ల మచ్చలు శరీరంపై ఉన్నాయని బాధితురాలి తల్లి విలపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెమ్మసాని అనుచరుడిగా..
బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు నవీన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల్లో పెమ్మసాని తరఫున ప్రచారం నిర్వహించాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నిస్సార్ బాషా తెలిపారు.
పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోందని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ముచ్చుమర్రి, హిందూపురం, పిఠాపురం, బద్వేలు, ఇప్పుడు తెనాలిలో మహిళలపై వరుసగా దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు.
Comments
Please login to add a commentAdd a comment