టీడీపీ బ్యాచ్‌లో మరో బురిడీ బాబు | TDP Leader Annam Satish mortgaged the government land to SBI | Sakshi
Sakshi News home page

టీడీపీ బ్యాచ్‌లో మరో బురిడీ బాబు

Published Sun, Dec 23 2018 3:25 AM | Last Updated on Sun, Dec 23 2018 4:11 AM

TDP Leader Annam Satish mortgaged the government land to SBI - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బాటలో ఆ పార్టీ నేతలు నడుస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఎస్‌బీఐను బురిడీ కొట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి ఆ బ్యాంక్‌ నుంచి రూ. 24 కోట్లు రుణం తీసుకోవడానికి వేసిన ప్రణాళికను సతీష్‌ ప్రభాకర్‌ విజయవంతంగా అమలు చేశారు. బ్యాంకును మోసగించి.. తొలి విడతగా రూ. 5 కోట్లు రుణం ఇప్పటికే తీసుకున్నారు. మిగిలిన రూ. 19 కోట్ల రుణం తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.

రైతులను భయపెట్టి..
గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు సాగుచేసుకున్నంత మాత్రాన భూ యాజమాన్య హక్కులు రావని, ఎప్పుడైనా వాటిని కోల్పోవాల్సిందేనని స్థానిక రైతులను ఎమ్మెల్సీ సతీష్‌ ప్రభాకర్‌ భయపెట్టారు. తనకు విక్రయిస్తే.. కొంతమొత్తమయినా చేతికి వస్తుందని, భూమి మొత్తం కోల్పోవడం కంటే తనకు అమ్మడమే మేలని వారిని ప్రలోభపెట్టారు. దీంతో భయపడ్డ చాలా మంది రైతులు ఆయనకు భూములు అమ్మేశారు. ఆ భూములను ‘సతీష్‌ మెరైన్‌ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేయడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ సర్వే నంబర్లను నిషేధిత భూముల జాబితాలో లేకుండా చేసి, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో లాలూచీపడి రిజిస్ట్రేషన్‌ పూర్తిచేశారు. ఈమేరకు 11.66 ఎకరాలకు 1బి (భూ యాజమాన్య హక్కు నిర్దారించే పత్రం) పొందారు. ఖాతా నంబర్‌ 3310 కింద 1బి జారీ చేశారు. సతీష్‌ ప్రభాకర్‌ భయభ్రాంతులకు గురిచేయడంతో రెవెన్యూ అధికారులు ఆయన చెప్పినట్లు చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2018 మార్చి 13న ‘మీ సేవ’లో 11.66 ఎకరాలకు 1బీ పత్రం తీసుకున్నారు. 
బ్యాంకును ఎలా బురిడీ కొట్టించారంటే..
దొడ్డిదారిలో 11.66 ఎకరాల ప్రభుత్వ భూములకు ‘1బి’ పత్రం పొందిన తర్వాత.. ఆ భూములను 2018 అక్టోబర్‌ 8న ఎస్‌బీఐలో తనఖా పెట్టారు. తన కంపెనీ ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి రూ. 24 కోట్లు రుణం కావాలని దరఖాస్తు చేశారు. 11.66 ఎకరాల భూమి, ఆ భూమిలో నిర్మిస్తున్న యూనిట్‌ను సెక్యూరిటీగా పెట్టారు. రుణం కోసం దరఖాస్తు చేసింది అధికారపార్టీ ఎమ్మెల్సీ కాబట్టి.. ఎస్‌బీఐ అధికారులు వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత రుణం మంజూరు చేశారు. తొలి విడతగా రూ. 5 కోట్లు కూడా విడుదల చేశారు. బ్యాంకు రుణం మంజూరయ్యే వరకు 11.66 ఎకరాలకు 1బి పత్రం మీ సేవలో ఆన్‌లైన్‌లో కనిపించింది. తర్వాత.. తాము ఇరుక్కుంటామని తెలిసి రెవెన్యూ అధికారులు 1బిలో గుట్టు చప్పుడు కాకుండా మార్పులు చేశారు. అదే ఖాతా నంబరు (3310) కింద 4.15 ఎకరాలు మాత్రమే ఉందని చూపించారు. మళ్లీ ఆ 4.15 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మీ సేవలో 3310 ఖాతా వివరాలు కనిపించకుండా చేశారు. అంతా కుమ్మక్కై ఇలా బ్యాంకు రుణం తీసుకున్న తర్వాత భూముల వివరాలను ఆన్‌లైన్‌లో మాయం చేశారు. ప్రస్తుతం మీ సేవలో ఆ ఖాతా నంబర్‌ చూస్తే.. తహసీల్దార్‌ వెరిఫికేషన్, అప్రూవల్‌ కోసం పెండింగ్‌లో ఉందని చూపుతోంది. 

పార్టీ నేతల బాటలో.. 
ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాల్లో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మోసం బయటపడిన విషయం తెలిసిందే. సుమారు 120 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకులను రూ. 6 వేల కోట్లకు బురిడీ కొట్టించారు. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులనే ఆ డొల్ల కంపెనీల డైరెక్టర్లగా చూపి బ్యాంకులను మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది. తీసుకున్న రుణం చెల్లించని కారణంగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఆస్తులు గతేడాది ఇండియన్‌ బ్యాంక్‌ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యాంకులకు రూ. 200 కోట్ల మేర బకాయి పడిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి ష్యూరిటీ కింద మంత్రి గంటా ఆస్తులు కుదువ పెట్టగా.. రుణం వసూలుకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మంత్రి స్పందించలేదు. దీంతో మంత్రి కుదువ పెట్టిన ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అన్నం సతీష్‌ ప్రభాకర్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో బ్యాంకులను మోసగించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement