govt lands
-
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రీ సర్వే.. రంగంలోకి సర్వేయర్లు
హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం సర్కారు భూములపై రీ సర్వేకు సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జాల కట్టడికి ఉపక్రమించింది. ఇప్పటికే ల్యాండ్ బ్యాంకులో ఉన్న పార్శిల్స్ సైతం ఆక్రమణకు గురవుతుండడాన్ని తీవ్రంగా పరిగణించింది. సర్వేయర్లను రంగంలోకి దింపి మరోమారు ప్రభుత్వ భూములు రీ సర్వే చేయించాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో పార్శిల్స్ వారిగా భూములను పరిశీలించి సమగ్ర నివేదికలు రూపొందించాలని నిర్ణయించింది. రెండు రోజుల క్రితం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో మండలాల సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు. తాజాగా ప్రభుత్వ భూములన్నింటిని పరిశీలించి సంబంధిత స్థలంలో కొలతలు చేసి వివరంగా మ్యాపులను తయారుచేయాలని ఆదేశించారు.రంగంలో 17 మంది సర్వేయర్లు అధికార యంత్రాంగం సర్కారు భూముల రీ సర్వే కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలోని 16 మండలాల్లో సుమారు 17 మంది సర్వేయర్లు ఉన్నారు. గోల్కొండ మండలానికి మాత్రం ఇద్దరు సర్వేయర్లు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పార్శిల్ వారిగా సర్వే నిర్వహించి ఈ నెల 31 వరకు నివేదిక సమర్పించేలా ఆదేశించారు.ఇదీ పరిస్థితి u హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో సుమారు 16 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 1075 ల్యాండ్ పార్శిల్స్లున్నట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. u అందులో 890 ల్యాండ్ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 40,66,914.08 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఉంది. u మిగితా పార్శిల్స్‌లో సుమారు 11,45,334.95 చదరపు గజాల విసీర్ణం గల ఖాళీ స్థలం ఆక్రమణకు గురై ఉన్నట్లు తెలుస్తోంది. u సుమారు 169 పార్శిల్స్లోని దాదాపు 11,93,595.12 చదరపు గజాల విస్తీర్ణ గల ఖాళీ స్ధలంతోపాటు 445098.64 చదరపు గజాలా ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: ‘బిల్డర్ల’ బాధితులకు హైడ్రా అండ -
సర్కారు స్థలాలకు రక్షణ కరువు
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సర్కారు స్థలాలపై పర్యవేక్షణ కరువైంది. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకంతో ప్రభుత్వ స్థలాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ప్రభుత్వ స్థలం అంటూ సైన్ బోర్డులు ఉన్నా.. వాటిని సైతం తొలగిస్తూ దర్జాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఒత్తిడితో కూడిన ఫిర్యాదులు వస్తే గానీ రెవెన్యూ అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్ర«భుత్వ స్థలంపై నిర్మించిన అక్రమ కట్టడం సక్రమ కట్టడం జాబితాలో క్రమంగా చేరిపోతున్నా... రెవెన్యూ వ్యవస్థ ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఒకవేళ రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే మాత్రం అక్రమార్కులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. అనేక ఆక్రమిత స్థలాలపై అవసరమైన ఆధారాలు, సమగ్ర వాదనలు లేక కోర్టులో కేసులు వీగిపోతున్నాయనే విమర్శలూ లేకపోలేదు. మొక్కుబడి చర్యలు.. గతంలో రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూముల పరిరక్షణకు పలు చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే తయారైంది. పలుమార్లు ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ మానిటరింగ్, ఫొటోలు తీసి వెబ్సైట్లో భద్రపర్చే చర్యలతో పాటు పర్యవేక్షణ బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందికి అప్పగించారు. వాస్తవంగా వీఆర్వోలు ప్రతిరోజూ భూములపై పర్యవేక్షణతో పాటు పక్షం రోజులకు ఒకసారి తనిఖీ చేసి తగిన సమాచారాన్ని సంబంధిత తహసీల్దార్లు, భూ పరిరక్షణ అధికారులకు అందించాలి. కానీ ఆచరణలో అలా చేయడంలేదు. చాలా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములకు కంచె, పూర్తి స్థలాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని స్థలాల ఆక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు వెలసిన తర్వాత ఫిర్యాదులు, ఒత్తిడికి వస్తే గానీ స్పందించక పోవడం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. ల్యాండ్ పార్శిల్స్.. హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో 16 మండలాలు ఉండగా, వాటి పరిధిలో 1075 ల్యాండ్ పార్శిల్స్లున్నాయి. మొత్తం మీద 890 ల్యాండ్ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 4066914.08 చదరపు గజాల విస్తీర్ణం ఖాళీ స్థలం, మరో 1145334.95 చదరపు గజాల విసీర్ణం ఖాళీ స్థలం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల్లో సుమారు 169 పార్శిల్స్లోని దాదాపు 1193595.12 చదరపు గజాల ఖాళీ స్థలంతో పాటు 445098.64 చదరపు గజాల ఆక్రమిత భూమి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫిలింసిటీ గోడలు బద్దలు కొడతాం.. రామోజీరావు కబ్జాకోరు, అరెస్టు చేసి జైల్లో పెట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ భూములను కబ్జా చేసి రామోజీరావు ఫిలింసిటీని నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై కేసులు నమోదు చేసి, రామోజీని అరెస్టు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఫిలింసిటీ గోడలు బద్దలుకొట్టి ప్లాట్లు స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి సర్వే నంబర్ 189, 203లలో 675 మందికి ఇళ్లస్థలాలు కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడారు. ‘‘రామోజీరావు భూకబ్జాకోరు. పేదల పాలిట రాక్షసుడు. తమకు కేటాయించిన స్థలాల్లోకి పేదలను రాకుండా రామోజీ అడ్డుకోవడం సరికాదు. పేదలు పోరాటాలు చేసి గుడిసెలు వేసుకుంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు కేసు పెట్టాల్సింది రామోజీపై. రామోజీ లాంటి పెట్టుబడిదారులు భూములు ఆక్రమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం ఏమిటి?’’అని ప్రశ్నించారు. అధికారంలోకి రాక ముందు లక్ష నాగళ్లతో ఫిలింసిటీని దున్నిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మౌనం వహిస్తున్నారేమని విమర్శించారు. తెలంగాణలో భూదాన్, సీలింగ్, సర్కార్, పొరంబోకు భూములు పదిన్నర లక్షల ఎకరాలు ఉన్నాయని.. తమ ప్రాణాలు పణంగా పెట్టి అయినా పేదలకు స్థలాలు ఇప్పించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రామోజీ సొంత భూములేం అడగడం లేదు పేద ప్రజలు రామోజీ సొంత భూములేమీ అడగడం లేదని.. ఫిలింసిటీలోని 172 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వా లని కోరుతున్నామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ దారుల కోసమే అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు. తోపులాట.. ఉద్రిక్తత.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు తోపులాట జరిగింది. కాసేపటికి సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. తర్వాత 10మంది నేతలు, కార్యకర్తలు వెళ్లి అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.జగదీశ్, సామేలు, జిల్లా కమిటీ సభ్యుడు కందుకూరి జగన్, మండల కార్యదర్శి సీహెచ్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మొద్దు.. అన్యాక్రాంతం కానీయొద్దు
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్/ఖమ్మం: ప్రభుత్వ భూముల అమ్మకం, అసైన్డ్, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సీపీఐ పోరుబాట పట్టింది. గురువారం కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించింది. ఖమ్మం కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జాలపై విచారణ జరిపి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 16 వేల ఎకరాల ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకోవడంలో సర్కార్ వెనుకంజ వేస్తోందని మండిపడ్డారు. వేలం ఆపకపోతే ఎర్రజెండాలు పాతి పేదలకు పంచుతామని హెచ్చరించారు. రాష్ట్ర సహాయకార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాలో, కూనంనేని సాంబశివరావు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, బీఎస్ బోస్ హైదరాబాద్‌లో, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు ఖమ్మంలో, పశ్య పద్మ కామారెడ్డిలో, బాలమల్లేశ్ మేడ్చల్ జిల్లాలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. -
ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు సమకూర్చే లక్ష్యంలో భాగంగా వచ్చే ఉగాది రోజున 25 లక్షల మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ దస్తావేజులతో కూడిన పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని సీసీఎల్ఏ, ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 22 లక్షల వరకూ లబ్ధిదారుల గుర్తింపు పూర్తయ్యిందని, మిగిలిన లబ్ధిదారుల గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉన్న భూములేమిటనేది గుర్తించాలన్నారు. లిటిగేషన్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కోర్టుకు అఫిడవిట్ సమర్పించి ఆ భూములను కూడా ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గుర్తించిన భూములన్నీ గ్రామాల వారీ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాలను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల వివరాలను, వివిధ పట్టణాభివృద్ధి సంస్థల వద్ద ఇళ్ల స్థలాలకు ఉద్దేశించిన భూముల వివరాలను కూడా సేకరించాలని కోరారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలకై ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేటాయించిన భూములను, భూదాన భూముల స్థితిగతులను కూడా తెలుసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కమిషనర్ హరినారాయణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం ఇప్పటివరకూ 23,180 ఎకరాల భూమిని గుర్తించామని, ఇంకా అవసరమైన భూమిని త్వరగా గుర్తించాలన్నారు. -
భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందని ఏపీ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో బుధవారం నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. బోస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డ వారికి 3 సెంట్ల భూమి ఇచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ప్లాస్టరింగ్ చేయించుకోలేని స్థితిలో పలువురు పేదలున్నారని, ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నవరత్నాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, నవాజ్ బాషా, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి పాల్గొన్నారు. -
భూకబ్జాలపై కొరడా
ఐదేళ్ల టీడీపీ హయాంలో విశాఖ పెను భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. అధికారం దన్నుతో పచ్చ నేతలు సృష్టించిన భూదందాల విలయం రాష్ట్రమంతటా కలకలం రేపింది. అడ్డగోలుగా డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు..ఇలా దేన్నీ వదలకుండా.. ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు.. భూహక్కుదారులు, అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. అధికారులనూ పావులను చేశారు. ఫలితంగా ఎందరో అధికారులు జైళ్లపాలయ్యారు.ఇప్పుడు పాలన మారింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే సమూల మార్పుల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆ క్రమంలోనే విశాఖలో పచ్చనేతల భూ దాహానికి బలైన సర్కారీ భూములను రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయో సర్వే చేపట్టారు. మరో పక్క ఆక్రమిత భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించే పని కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్ళూ ఆక్రమణలో ఉన్న మధురవాడలోని రూ.100 కోట్ల విలువైన 10 ఎకరాలకు పైగా భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. విశాఖ.. ఈ చుట్టుపక్కల భూ ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తామని విశాఖ ఆర్డీవో కిషోర్ స్పష్టం చేశారు. కబ్జాదారులు స్వచ్ఛందంగా భూములు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు. సాక్షి, మధురవాడ(భీమిలి): ‘అవినీతి, అక్రమాలు సహించం. వాటి వెనుక ఎంతటి వారున్నా.. వదిలిపెట్టేది లేదు.’ అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలు ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. సీఎం ఆదేశాలు తూ.చ తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్ని స్థాయిల్లో అధికారులకు ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో ఆక్రమణలు నియంత్రించడానికి రెవెన్యూ, జీవీఎంసీ, విద్యుత్ శాఖలు కలసి పనిచేయాలని కొద్ది రోజుల కిందటే వారిని ఏకం చేశారు. పోలీసు అధికారులు కూడా సహాయ సహకారాలు అందించడంతో ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ అధికారులు వేగం పెంచారు. ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించడంతో కాకుండా కేసులు కూడా పెట్టి, వారిని అరెస్ట్‌లు చేయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి, స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నంబర్ 367, 368లలో లా కళాశాల మాస్టర్ ప్లాన్ రోడ్డు నుంచి మధురవాడ మిథిలాపురి వుడా కాలనీకి వెళ్లే రోడ్డును ఆనుకుని శ్రీరామ్ ప్రోపర్టీస్‌కు చేరువలో 10.5 ఎకరాలు విలువైన ప్రభుత్వ గయాలు భూమి ఉంది. ఈ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుంది. శ్రీరామ్ ప్రోపర్టీస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీల నివాసాల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిలో 70 వరకు రేకు షెడ్లు నిర్మించారు. ఈ ఆక్రమణల తొలగింపునకు రెవెన్యూ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ భూమి తమదని, వ్యవహారం కోర్టులో ఉండగా ఎలా తొలగిస్తారని ఆక్రమణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మీరెంతా అన్న స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న విశాఖ నార్త్(మధురవాడ) ఏసీపీ ఆర్. రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుబ్బరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విశాఖ రూరల్ డిప్యూటీ తహసీల్దార్ బెహరా రవిశంకర్ ఆధ్వర్యంలో ఆర్ఐలు సత్యనారాయణ, గ్లోరి, సర్వేయర్లు సత్యనారాయణ, వేణుగోపాల్, వీఆర్వోలు కె.అప్పారావు, సూరిబాబు తదితరులు ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా డీటీ రవిశంకర్ మాట్లాడుతూ కోర్టు వివాదంలో ఉన్న 10.5 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమిలో యథాస్థితిని కొనసాగించాల్సి ఉందన్నారు. కానీ ఇక్కడ కొందరు షెడ్ల నిర్మాణంతో పాటు భూమి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. చాలా సార్లు వారిని హెచ్చరించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ షెడ్లు తొలగించామన్నారు. పీఎంపాలెం ఎస్ఐ రవికుమార్, వీఆర్వోలు దొర, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. -
కాలు వలవల
అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తుండడంతో నీళ్లు పారడానికి నిర్మించిన కాలువలు కన్నీరు పెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు భూములను ఆక్రమించారు. చెరువులనూ ఆక్రమించారు. నాలాలనూ వదలలేదు. ఇప్పుడు అక్రమార్కుల కన్ను కాలువలపై పడింది. మట్టి తెచ్చి కాలువలను ‘మటుమాయం’ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు ఇప్పుడు మట్టిగుట్టలతో దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలు వచ్చి వరదలు వస్తే నీళ్లు పారేందుకు కాలువ లేక తీవ్రమైన ఇబ్బందులు రానున్నాయి. అయినా అధికారులకు చీమ కుట్టినట్టుగా లేదు. పటాన్చెరు: పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ మండలాల పరిధిలో చెరువుల కాలువలు, వాగులను వదిలిపెట్టకుండా జోరుగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కాలువలను పూడ్చివేస్తే భవిష్యత్‌లో తలెత్తే ప్రమాదాన్ని ఎవరూ గుర్తించడం లేదు. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు కాలువల ఆవశ్యకత ఏంఓట స్పష్టమవుతుంది. కాలువలు పూడ్చి కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆ కాలువల ప్రాముఖ్యతను గుర్తించి కాలనీల ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపం కారణంగా కాలువలు కబ్జారాయుళ్ల పరమవుతున్నాయి. అమీన్పూర్ పెద్ద చెరువు నుంచి బందంకొమ్ము చెరువుకు నీళ్లు వదలాలని జిల్లా అధికారులు ఇటీవల సూచించారు. అయితే మధ్యలో ఉన్న వెంచర్ నిర్వాహకులు, కాలనీల్లో కాల్వలను పూడ్చివేశారు. స్థానిక అధికారులు ఆ కాల్వలను పునరుద్ధరించి నీళ్లను వదలాల్సిన పరిస్థితి ఎదురైంది. అమీన్పూర్ మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ఓ వెంచర్ నిర్వాహకుడు దర్జాగా కాలువలపై చిన్న సైజులో పైపులు వేసి కాలువ రూపురేఖలను మార్చివేశారు. అలాగే అమీన్‌పూర్‌లోనే శివసాయినగర్ కాలనీలో మరో వెంచర్ యజమాని కాల్వను పూడ్చివేసి రోడ్లు వేశారు. అలాగే బీరంగూడ రామచంద్రాపురం శివారు ప్రాంతంలో చిన్న వాగును పూడ్చివేసి ప్లాట్లుగా మార్చారు. అక్కడ అతి వేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదేమంటే తమ పంట పొలాలు ఉండేవని వాటిని అమ్ముకుంటున్నామని స్థానిక రైతులు వాదిస్తున్నారు. గతంలోనే చిన్నవాగు పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ వంటి నిబంధనలేవి పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారు. కానుకుంట నుంచి బీరంగూడ వరకు కాల్వ సైజు బాగా తగ్గిపోయింది. దాంతో వరద వచ్చినప్పుడల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం ప్రతి వానాకాలంలో జరుగుతోంది. తాజాగా జరుగుతున్న కబ్జాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. ముత్తంగి, చిట్కుల్ శివారులో నక్కవాగును దర్జాగా పూడ్చేస్తున్నారు. అక్కడ ఓ వెంచర్ నిర్వాహకులు కాలువ దిశనే మార్చి రాత్రింబవళ్లు యంత్రాలతో దాన్ని పూడ్చే పనిలో పడ్డారు. అక్కడ ఓ వంతెనను నిర్మిస్తున్నారు. కాలువ దిశను మారుస్తూ వంతెన నిర్మాణం చేపడుతున్నారు. కాలువలకు ఇరువైపులా తొమ్మిది మీటర్ల దూరం బఫర్ జోన్ వదిలి నిర్మాణాలు చేసుకోవాలనే నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. బఫర్ జోన్‌ను యథేచ్చగా తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో గజం జాగా విలువ వేలల్లో ఉండడంతో కాలువ ప్రాంతాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఆ తంతంగాన్ని ఆపాలని స్థానికులు కోరుతున్నారు. కాలువల పరిరక్షణపై అధికారులు సరైన విధంగా స్పందించడం లేదు. కాలువల రక్షణ బాధ్యత తమది కాదనే ధోరణితో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయమై ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ బి.రమణారెడ్డిని వివరణ కోరగా కాలువల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ ఏఈలను పంపి వివరాలు తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కృష్ణార్పణం
అది మారుమూల ప్రాంతం. అక్కడ ఏం జరిగినా.. ఏం చేసినా తొంగిచూసే దిక్కులేదు.. అడ్డుకునే చేతుల్లేవు.. అదే అధికార పార్టీనేతకు కలిసొచ్చింది. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాడు. ఇదే అదునుగా ఆక్రమణకు తెగబడ్డాడు. అడ్డగోలు దందా సాగించాడు. ఎకరాల కొద్దీ చదును చేసి సాగులోకి తెచ్చుకున్నాడు. ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు ఒత్తిళ్లకు చిత్తయ్యారు. ఇష్టారాజ్యంగా పట్టాలిచ్చి చేతులు దులుపు కున్నారు. అన్నీ తెలిసినా జిల్లా ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం గమనార్హం. సాక్షి, చిత్తూరు: పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం బూడిదవేడు రెవెన్యూ గ్రామం పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి పెద్దఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఎకరాల వరకు స్వాహా చేశాడు. రాళ్లురప్పలను తొలగించాడు. మొక్కలు, కంప చెట్లను తీసేసి యంత్రాలతో చదును చేశాడు. ట్రాక్టర్లతో దున్నకాలు చేపట్టి దర్జాగా జామ, అల్ల నేరేడు తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఇప్పటికే పది ఎకరాల్లో దానిమ్మ నేరేడు సాగులోకి తెచ్చాడు. అనధికారికంగా బోర్లు కూడా వేసుకున్నాడు. సాక్షి పరిశోధనతో వెలుగులోకి.. వాల్మీకిపురం మండలంలో అధికార పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి ఆగడాల గురించి గతంలో కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో పర్యటించి శోధిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బూడిదవేడు రెవెన్యూ గ్రామం 521/1, 560/2 సర్వే నంబర్లలో 16.98 ఎకరాలు, 483, 497, 521/3, 561 సర్వే నంబర్లలో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. అనుమతి లేకుండా బోర్లు వేశాడు. దర్జాగా ముళ్లపొదలతో కంచె వేసుకొని సాగు చేసుకుంటున్నాడు. ఒకే ఇంట్లో నలుగురికి.. కృష్ణారెడ్డికి భూములు అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు నిబంధనలను గాలికొదిలేశారు. కృష్ణారెడ్డి, ఆయన భార్య, కూతురు, అమ్మకు విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. ఎలాంటి ఆసరాలేని వారికే ప్రభుత్వ భూమిని ఇవ్వాలని నిబంధన. కానీ కృష్ణారెడ్డికి భూమి ఇచ్చే విషయంలో ప్రాథమిక నిబంధనలు కూడా పాటించలేదు. 560/2 సర్వే నంబరులో కృష్ణారెడ్డి భార్య లక్ష్మీదేవికి 4.92 ఎకరాలు, 521/1 సర్వే నెంబరులో కృష్ణారెడ్డి తల్లి సరస్వతమ్మకు 4.92 ఎకరాలు, కృష్ణారెడ్డి కూతురు బిందుకు 522/4,522/2,523/4 సర్వే నంబర్లలో4.93 ఎకరాలు, సర్వే నంబరు 560/1లో 2.21 ఎకరాలు కృష్ణారెడ్డి సమీప బంధువుకు రెవెన్యూ అధికారులు అప్పనంగా రాసిచ్చేశారు. టీడీపీ నాయకుల చేతుల్లో.. విలువైన ప్రభుత్వ భూములన్నీ టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లోకి వెళుతున్నాయి. వీరి ధాటికి కొండలు గుట్టలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిన అధికారులు ఒత్తిళ్లకు లొంగుతున్నారు. సాక్షాత్తు జిల్లా అత్యున్నతాధికారే టీడీపీ నాయకుల భూ కబ్జాలపై మౌనంగా ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు చేశా పైన పేర్కొన్న భూములను వెంకటరమణ, చిన్నప్ప, నారాయణ తదితరుల నుంచి కొనుగోలు చేశా. వాటిని కూడా వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు కూడా సర్వే చేసుకుని వెళ్లారు. భూమి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తీసుకోమని చెప్పాను. నాపై బురద చల్లడానికే కబ్జా ఆరోపణలు. – కె.కృష్ణారెడ్డి, టీడీపీ నాయకుడు, వాల్మీకిపురం సర్వే చేశాం.. రిపోర్టు సిద్ధం చేస్తున్నాం.. కృష్ణారెడ్డి ఆక్రమించారు అంటున్న భూములపై ఇప్పటికే విచారణ జరిపాం. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకా నివేదిక సమర్పించలేదు. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఆలస్యమవుతోంది. రెండు మూడు రోజుల్లో నివేదికను సబ్ కలెక్టర్‌కు సమర్పిస్తాం.– కళావతి, తహసీల్దార్, వాల్మీకిపురం కిశోర్ అండ ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురికాకుండా రక్షణ కల్పించాల్సిన వారే భూ దోపిడీకి సహకరిస్తున్నారు. పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కిశోర్‌కుమార్ రెడ్డి అండతో కృష్ణారెడ్డి రెచ్చిపోతున్నారు. కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈయన భూ బాగోతంపై అప్పటి సబ్‌కలెక్టర్ గుణభూషణ్ రెడ్డి గత సంవత్సరం ఏప్రిల్ 19న విచారణ చేయాలని వాల్మీకిపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం సర్వేయర్‌ను కూడా పంపిన దాఖలాలు లేవు. విచారణ ఆపేయాలని తహసీల్దార్‌పై పెద్ద ఎత్తున కిశోర్‌కుమార్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. రోడ్డు సర్వే, రైల్వే ట్రాక్ సర్వే అంటూ విచారణ వాయిదా వేస్తున్నారు. -
ఓట్ల పథకమే
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వాలు తెస్తున్న పథకాన్ని ఓటు బ్యాంకు పథకంగా హైకోర్టు అభివర్ణించింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఇలాంటి పథకాలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బహుమానంగా ఇస్తున్నాయని ఆక్షేపించింది. తద్వారా చట్టాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని పేర్కొంది. ఇలాంటి పథకాలు రాజ్యాంగ సూత్రాలు, ఆదేశిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈమేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మనుగడలో ఉండగా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని మోసగించడమే... ‘ప్రభుత్వం తొలుత దారిద్య్ర రేఖకు దిగువన ఉంటూ ఎలాంటి నివాసం లేని కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు క్రమబద్ధీకరణ పథకాన్ని తెచ్చింది. ఆ తరువాత పేద, ధనిక, పల్లె, పట్టణం అనే తేడాలు లేకుండా 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి పేరుతో క్రమబద్ధీకరిస్తోంది. ఇందుకు ఉచితంగా లేదా నామమాత్రంగా రుసుము వసూలు చేస్తోంది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని స్పష్టం చేసింది. విశాఖ, హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి... విశాఖపట్నం, హైదరాబాద్‌లో పేద, ధనిక అనే తేడా లేకుండా ఉచితంగా 100 చదరపు గజాల వరకు సర్కారు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయని హైకోర్టు పేర్కొంది. ఆక్రమణదారుడికి అప్పటికే ఇల్లు ఉందా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఉచితంగా భూమిని క్రమబద్ధీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాయితీ కలిగిన పౌరులు, ఖజానాకు చేటు చేసే దిశగా రాజకీయ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా శాశ్వతంగా ఉండేæ అధికార యంత్రాంగం నడుచుకోవడం దురదృష్టకరమని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎమ్మార్వో సలహాతోనే.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పునాదిని నిర్మించుకునేందుకు అక్రమార్కులకు క్రమబద్ధీకరణ లాంటి తాయిలాలు ఇస్తూ చట్టాన్ని గౌరవించే పౌరులను బాధితులుగా మారుస్తున్నారని, ఇందుకు తాము ఎంత మాత్రం అంగీకరించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో విశాఖ జిల్లా భీమునిపట్నం మండల తహసీల్దార్ ఇచ్చిన సలహాతోనే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పిటిషనర్ బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాస్తవానికి ఆమెకు ఈ ఐడియా లేదని వ్యాఖ్యానించింది. ఆమె ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తే కాకుండా రాజకీయ నాయకురాలు (విజయనగరం జిల్లా చెరుకుపల్లి గ్రామ సర్పంచ్) కూడా అని గుర్తు చేసింది. రాజకీయ వర్గాలకు సైతం క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుందా? లేదా? అన్నది ప్రభుత్వానికి పట్టడం లేదంది. హైకోర్టులో పలు వ్యాజ్యాలు... బైరెడ్ల చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ జి.రాము 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భీమునిపట్నం మండల తహసీల్దార్‌ను ఆదేశించింది. అయితే తహసీల్దార్ ఇచ్చిన సలహా మేరకు.. తాను అక్రమించుకున్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించాలంటూ బైరెడ్ల చిన్నా దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే భీమునిపట్నం మండలం తగరపువలస గ్రామం బంగ్లామెట్ట వద్ద సర్వే నెంబర్ 1–49–182/1లో చిన్నా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నించారు. దీనిపై చిన్నా 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని జీవీఎంసీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ 2018లో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. చనిపోయిన కుమారుడికి చిన్నా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉన్నందున రెండు వారాల పాటు నిర్మాణాల కూల్చివేతపై స్టే విధిస్తున్నట్లు గత ఏడాది ఫిబ్రవరి 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధిక్కార పిటిషన్ దాఖలు... అయితే ఆ తరువాత ఈ ఉత్తర్వులను హైకోర్టు పొడిగించలేదు. చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో అధికారులు చర్యలు తీసుకోలేదంటూ రాము కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు 2016లో జారీ చేసిన జీవో 118 ప్రకారం ఆక్రమిత భూమి క్రమబద్ధీకరణకు 2016 ఆగస్టులో చిన్నా దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండగానే ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం 2017 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జీవో 388 తెచ్చింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల తుది తీర్పు వెలువరించారు. వన్‌టైం అంటూ మళ్లీ మళ్లీ.. ‘సి.కుల్సుంరెడ్డి కేసులో రాష్ట్రప్రభుత్వం తదుపరి ఎటువంటి క్రమబద్ధీకరణ పథకాలను తీసుకురాబోమంటూ వాగ్దానం చేసేం దుకు సిద్ధమైంది. అయితే ఈ హైకోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ వ్యవహార శైలే ఇందుకు కారణం. ప్రతిసారీ వన్‌టైం పథకం కింద తీసుకొస్తున్నామని చెప్పడం తరువాత మళ్లీ మరో కొత్త పథకం తీసుకురావడం చేస్తూ వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ అదే కొనసాగిస్తోంది. ప్రస్తుత కేసు విషయాని కొస్తే చిన్నా అమాయకంగా ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా భావించి కొన్నా రు. ఇందులో ఎటువంటి అనుమతుల్లేకుండా జీ ప్లస్ టూ నిర్మాణం చేపట్టారు. 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూమిని క్రమ బద్ధీకరిస్తామని సర్కారు పేర్కొంది. అందులో చేపట్టే నిర్మాణాల గురించి చెప్పలేదు. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను సమర్పించకుంటే నిర్మాణాలకు మునిసిపల్ అధికారులు అనుమ తులివ్వడానికి వీల్లేదు. దీనిప్రకారం సర్కారు తెచ్చిన క్రమబద్ధీకరణ పథకాన్ని చూస్తుంటే ప్రభుత్వ భూముల్ని దర్జాగా అక్రమించుకుని అందులో నిర్మాణాలు చేపట్టిన వారికి బహుమానంగా ఇచ్చేందుకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న పిటిషనర్ రాము వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఎలా చూసినా రాజ్యాంగ విరుద్ధమే.. ఏ రకంగా చూసినా కూడా ఈ క్రమబద్ధీకరణ పథకం రాజ్యాంగ విరుద్ధమని, అయితే ఈ పథకాన్ని తమ ముందు సవాలు చేయనందున తాము ఆ మేరకు ప్రకటన చేయడం లేదని హైకోర్టు తెలిపింది. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి పథకాల గురించి ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు కొత్త పథకం వచ్చేంత వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తులపై నిద్రపోవడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సరికాదంది. బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ దరఖాస్తు విషయంలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు వారాల్లోపు తగిన నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిష్కరించే వరకు ఆమె చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేయరాదని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. -
టీడీపీ బ్యాచ్‌లో మరో బురిడీ బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బాటలో ఆ పార్టీ నేతలు నడుస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఎస్బీఐను బురిడీ కొట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి ఆ బ్యాంక్ నుంచి రూ. 24 కోట్లు రుణం తీసుకోవడానికి వేసిన ప్రణాళికను సతీష్ ప్రభాకర్ విజయవంతంగా అమలు చేశారు. బ్యాంకును మోసగించి.. తొలి విడతగా రూ. 5 కోట్లు రుణం ఇప్పటికే తీసుకున్నారు. మిగిలిన రూ. 19 కోట్ల రుణం తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. రైతులను భయపెట్టి.. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు సాగుచేసుకున్నంత మాత్రాన భూ యాజమాన్య హక్కులు రావని, ఎప్పుడైనా వాటిని కోల్పోవాల్సిందేనని స్థానిక రైతులను ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ భయపెట్టారు. తనకు విక్రయిస్తే.. కొంతమొత్తమయినా చేతికి వస్తుందని, భూమి మొత్తం కోల్పోవడం కంటే తనకు అమ్మడమే మేలని వారిని ప్రలోభపెట్టారు. దీంతో భయపడ్డ చాలా మంది రైతులు ఆయనకు భూములు అమ్మేశారు. ఆ భూములను ‘సతీష్ మెరైన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ సర్వే నంబర్లను నిషేధిత భూముల జాబితాలో లేకుండా చేసి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో లాలూచీపడి రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. ఈమేరకు 11.66 ఎకరాలకు 1బి (భూ యాజమాన్య హక్కు నిర్దారించే పత్రం) పొందారు. ఖాతా నంబర్ 3310 కింద 1బి జారీ చేశారు. సతీష్ ప్రభాకర్ భయభ్రాంతులకు గురిచేయడంతో రెవెన్యూ అధికారులు ఆయన చెప్పినట్లు చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2018 మార్చి 13న ‘మీ సేవ’లో 11.66 ఎకరాలకు 1బీ పత్రం తీసుకున్నారు. బ్యాంకును ఎలా బురిడీ కొట్టించారంటే.. దొడ్డిదారిలో 11.66 ఎకరాల ప్రభుత్వ భూములకు ‘1బి’ పత్రం పొందిన తర్వాత.. ఆ భూములను 2018 అక్టోబర్ 8న ఎస్బీఐలో తనఖా పెట్టారు. తన కంపెనీ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ. 24 కోట్లు రుణం కావాలని దరఖాస్తు చేశారు. 11.66 ఎకరాల భూమి, ఆ భూమిలో నిర్మిస్తున్న యూనిట్‌ను సెక్యూరిటీగా పెట్టారు. రుణం కోసం దరఖాస్తు చేసింది అధికారపార్టీ ఎమ్మెల్సీ కాబట్టి.. ఎస్బీఐ అధికారులు వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత రుణం మంజూరు చేశారు. తొలి విడతగా రూ. 5 కోట్లు కూడా విడుదల చేశారు. బ్యాంకు రుణం మంజూరయ్యే వరకు 11.66 ఎకరాలకు 1బి పత్రం మీ సేవలో ఆన్లైన్లో కనిపించింది. తర్వాత.. తాము ఇరుక్కుంటామని తెలిసి రెవెన్యూ అధికారులు 1బిలో గుట్టు చప్పుడు కాకుండా మార్పులు చేశారు. అదే ఖాతా నంబరు (3310) కింద 4.15 ఎకరాలు మాత్రమే ఉందని చూపించారు. మళ్లీ ఆ 4.15 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మీ సేవలో 3310 ఖాతా వివరాలు కనిపించకుండా చేశారు. అంతా కుమ్మక్కై ఇలా బ్యాంకు రుణం తీసుకున్న తర్వాత భూముల వివరాలను ఆన్లైన్లో మాయం చేశారు. ప్రస్తుతం మీ సేవలో ఆ ఖాతా నంబర్ చూస్తే.. తహసీల్దార్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉందని చూపుతోంది. పార్టీ నేతల బాటలో.. ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాల్లో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మోసం బయటపడిన విషయం తెలిసిందే. సుమారు 120 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకులను రూ. 6 వేల కోట్లకు బురిడీ కొట్టించారు. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులనే ఆ డొల్ల కంపెనీల డైరెక్టర్లగా చూపి బ్యాంకులను మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది. తీసుకున్న రుణం చెల్లించని కారణంగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఆస్తులు గతేడాది ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులకు రూ. 200 కోట్ల మేర బకాయి పడిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి ష్యూరిటీ కింద మంత్రి గంటా ఆస్తులు కుదువ పెట్టగా.. రుణం వసూలుకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మంత్రి స్పందించలేదు. దీంతో మంత్రి కుదువ పెట్టిన ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అన్నం సతీష్ ప్రభాకర్ వ్యవహారం వెలుగులోకి రావడంతో బ్యాంకులను మోసగించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సాక్షి’ కథనాలు వాస్తవమే
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుని, తప్పుడు పాసు పుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని రాష్ట్ర ప్రభు త్వం అంగీకరించింది. వీరిలో టీఆర్ఎస్ నేత తో పాటు పలువురు ఇతరులున్నారని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ హైకోర్టుకు నివేదించారు. ‘‘ఒక్క టీఆర్ఎస్ ఎంపీపీ భర్త గడ్డం భీమా గౌడ్ కుటుంబం స్వాధీనంలోనే 32.11 ఎకరాలుంది. జిల్లాలో మన్నెగూడెం, జోగా పూర్, గొల్లపల్లి, ఘన్పూర్, మైలారం, ఖమ్మంపల్లి, పుప్పాలవానిపేట గ్రామాల్లో మొత్తం 88 కేసుల్లో అనర్హులకు అధికారులు భూములు కట్టబెట్టి, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినట్లు తేలింది. ఈ కేటాయింపులను, పాసు పుస్తకాలను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశాలిచ్చాం. తప్పుడు పాసు పుస్తకాల ద్వారా తీసుకున్న రుణాలను వసూలు చేసుకోవాలని బ్యాంకులకు చెప్పాం. నిబంధనలకు విరుద్ధంగా పాసు పుస్తకాలు ఇచ్చిన అప్పటి తహసీల్దార్లు పి.హరి కృష్ణ, జి.వీరన్న, డి.రాజేశ్వర్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కలెక్టర్ నివేదికపై అభ్యంతరాలుంటే పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి స్పష్టంచేస్తూ.. విచారణను కోర్టు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భీమా గౌడ్‌కు నోటీసులిచ్చింది. సాక్షి కథనాల ఆధారంగా పిల్ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడమే గాక వాటి ద్వారా గ్రామీ ణ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందుతున్న వైనంపై ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన వరుస కథనాలు మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ గొల్లపల్లికి చెందిన ఇందూరి రామ్మోహనరావు ‘సాక్షి’ కథనాల ఆధారంగా హైకోర్టులో పిల్ వేశారు. ఈ వైనంపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. -
‘ధరణి’కి స్పందనేదీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూరికార్డుల నిర్వహణ కోసం ప్రభుత్వం రూపొందించిన ‘ధరణి’ వెబ్సైట్ డిజైన్ టెండర్లకు స్పందన కరువయింది. ఈనెల 29న టెండర్ దాఖలు గడువు ముగియగా, కేవలం రెండంటే రెండు బిడ్లే వచ్చినట్టు సమాచారం. అందులోనూ ఓ సంస్థ టెండర్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఇప్పుడు రేసులో ఒకే సంస్థ మిగిలింది. ఈ వెబ్సైట్ సాఫ్ట్వేర్ తయారీకోసం మైక్రోసాఫ్ట్, విప్రోలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావించినా అనుభవలేమి కారణంగా ఆయా సంస్థలు బిడ్ దాఖలు చేయలేదు. దీంతో వచ్చిన ఒక్క కంపెనీకి టెండర్ కట్టబెట్టాలా.. లేదా రద్దు చేసి మళ్లీ నిబంధనలు మార్చి టెండర్ పిలవాలా అనే విషయంలో రెవెన్యూ వర్గాలు ఏమీ తేల్చుకోలేకపోతున్నాయి. అయితే, ఈ విషయంపై తుది నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌కు వదిలేసినట్టు సమాచారం. క్లిష్ట నిబంధనలే కారణమా? : ‘ధరణి’వెబ్సైట్ డిజైన్ టెండర్లకుగాను ప్రభుత్వం చాలా నిబంధనలు విధించింది. ఈ వెబ్సైట్ ద్వారా బహుళ ప్రయోజనార్థ భూరికార్డుల నిర్వహణ ఉండాలనే ఆలోచనతో వాటిని రూపొందించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా అంచనాతో రూపొందించే ఈ సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 4కోట్ల సర్వే నంబర్లలోని భూముల వివరాలు పొందుపరచాల్సి ఉంది. మొదటి దశలో మ్యుటేషన్ సర్వీసులు, రెండో దశలో సర్వీసుల ఇంటిగ్రేషన్, మూడో దశలో జీఐఎస్, నాలుగో దశలో బ్లాక్ చెయిన్ విధానాలను అమల్లోకి తేవాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 600 రెవెన్యూ కార్యాలయాల్లో 600 మంది సాంకేతిక నిపుణులను కూడా ఈ సంస్థే సమకూర్చాలని నిబంధన విధించారు. పట్టణ ప్రాంతాల్లోని రికార్డులు కూడా నిర్వహించాలని, భూముల్లో వేసిన పంటల వివరాలతో పాటు కోర్‌బ్యాంకింగ్ సదుపాయం ఉండేలా సాఫ్ట్వేర్ తయారు చేయాలని పేర్కొన్నారు.భూరికార్డుల నిర్వహణకోసం ఉద్దేశించిన ఇలాంటి ప్రాజెక్టును చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కారణంగానే బిడ్ దాఖలు చేయడంలో కొన్ని సంస్థలు వెనుకడుగు వేసినట్టు సమాచారం. ఇప్పుడేం చేయాలి..? : ప్రాజెక్టుకు టెండర్ల దశలోనే నిరాశ ఎదురవడంతో ఇప్పుడేం చేయాలన్న దానిపై రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బెంగళూరుతో పాటు ఇతర దేశాల్లో భూములకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించిన సంస్థ ఒకటి టెండర్లలో పాల్గొన్న నేపథ్యంలో ఆ సంస్థ టెక్నికల్ ప్రజెంటేషన్లను పరిశీలిస్తున్న రెవెన్యూ యంత్రాంగం వచ్చిన ఒక్క సంస్థకే టెండర్ ఇవ్వాలా... లేదా మరోసారి టెండర్లు పిలవాలా అన్న సందిగ్ధంలో ఉంది. -
‘పట్టా’ పరేషాన్
మణుగూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు పెట్టుబడి పథకం ఫలాలు పట్టాదారులకు మాత్రమే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా ఉన్న రైతులకే పెట్టుబడి నగదును అందించేలా ప్రణాళిక రూపొందించడంతో కాస్తుదారులైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామసభల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించేటప్పుడు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం చర్చల సమయంలో కేవలం పట్టాదారులనే లెక్కలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గల పట్టాదారు రైతులు (1బీలో నమోదైన పట్టాదారు మాత్రమే) ‘ఏ’ కేటగిరి కింద సుమారు 71.75 లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ప్రభుత్వం అంచనాకు వచ్చింది. పట్టాదారు రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేస్తుండటంతో ఈ పథకం కొంతమంది రైతులకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా గల 23 మండలాల్లో కాస్తుదారుల్లో కొనసాగుతున్న రైతులకు, కౌలుదారులకు, రెవెన్యూ, భూదాన సమితి, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు ఎలాంటి సహాయం అందే అవకాశాలు లేవు. జిల్లాలో 50 శాతం భూములకే పట్టాలు.. జిల్లా వ్యాప్తంగా 3, 25, 182 ఎకరాల భూమి సాగులో ఉండగా 1,04, 616 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. సాగు భూమి(1/70 చట్టం పరిధిలో)లో 50 శాతం భూములకే పట్టాలు ఉన్నట్లు భూ ప్రక్షాళనలో అధికారులు గుర్తించారు. పలు రకాల ప్రభుత్వ (వ్యవసాయ) భూముల్లో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా పంటలు సాగు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ సాయం పట్టాదారులకే దక్కితే ఆర్థిక ఇబ్బందులు ఉండి, సరైన భూ హక్కులు లేని నిరుపేద రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. వారసత్వం, పసుపు కుంకుమ, విక్రయాలకు సంబంధించిన అంశాల ప్రక్షాళన విషయంలో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కానీ పలు రకాల ప్రభుత్వ భూములు సాగు చేసే బీద రైతులకు మాత్రం రెవెన్యూ రికార్డుల్లో స్థానం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు దూరం అవుతుండగా, తాజాగా రైతు పెట్టుబడి సహాయానికి కూడా అర్హత లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏజెన్సీలో రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకం... రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రైతులు పొందలేకపోతున్నారు. సుమారు 70, 80 సంవత్సరాలుగా (తరతరాలుగా) ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటూ జీవనాధారం కోసం నిరుపేద రైతులు ప్రభుత్వ భూములు(రెవెన్యూ, దేవాదాయ, భూదాన సమితి, అటవీ భూములు) సాగు చేసుకుంటున్నారు. కాగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో మైదాన ప్రాంతాలకు సంబంధించిన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో పొలాలు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు తరుచూ అన్యాయం జరుగుతోంది. జిల్లాలో 23 మండలాల్లో (జిల్లా మొత్తం) గల భూములకు 1/70 చట్టం అమల్లో ఉండటం గమనార్హం. ప్రభుత్వం పకడ్భందీగా చేపట్టిన భూ ప్రక్షాళనలో కూడా గిరిజనేతర రైతులకు పేర్లు మార్చే అవకాశాలు లేవు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక శాతం భూముల్లో సాగుచేసే సన్న, చిన్నకారు గిరిజనేతర రైతులకు ప్రభుత్వ సహాయం అందటం లేదు. సాగు చేస్తున్న భూములకు పూర్తిస్థాయిలో హక్కులు లేక, కనీసం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా పొందే అవకాశం లేకపోవడంతో బీద రైతులు ఆవేదన చెందుతున్నారు. -
భూమి @ కొత్త సాఫ్ట్వేర్!
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం సరిచేసిన రికార్డులను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. భవిష్యత్తులో భూముల క్రయ, విక్రయ లావాదేవీలను పారదర్శకంగా జరిపేం దుకు వీలుగా వెబ్‌ల్యాండ్ స్థానంలో ఈ సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను అందుబాటులోకి తేవా లని నిర్ణయించింది. ఇందుకు సీఎం కార్యాలయ అధికారులు ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వారం రోజుల్లో పోర్టల్ తయారీకి సాఫ్ట్వేర్ సంస్థల నుంచి టెండర్లు పిలవాలని, 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వెబ్‌ల్యాండ్.. ఇక పాత ముచ్చటే ప్రస్తుతం రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ వెబ్‌ల్యాండ్ అనే పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ డేటా ఆధారంగానే భూముల మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వల్ల మ్యుటేషన్ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కార్యాలయంలో సీనియర్ అధికారి టి.నర్సింగరావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, వాకాటి కరుణతో పాటు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు రఘునందన్‌రావు, వెంకట్రామిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జి.రవితో సమావేశం నిర్వహించారు. అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈ పోర్ట ల్ తయారీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్లాంటి కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. దీనినే భవిష్యత్తులో భూరికార్డుల నిర్వహణకు ఉపయోగించనున్నారు. బ్యాంకులకు, జనబాహుళ్యానికి కూడా ఈ పోర్టల్‌ను రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే తహశీల్దార్ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసులు, జాతీయ బ్యాం కులకు కూడా అనుసంధానం చేయనున్నారు. పంట రుణాలిచ్చే విషయంలో బ్యాంకులకు ఈ పోర్టల్‌లోని డేటానే ఆధారమయ్యేలా తయారు చేయనున్నారు. మ్యుటేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులో ముగిసేలా పోర్టల్‌ను రూపొందించడంతో పాటు జన బాహుళ్యానికి కూడా సులువుగా రికార్డుల వివరాలు అందుబాటులోకి వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. ఇప్పటికే దాదాపు భూరికార్డుల ప్రక్షాళన పూర్తి కాగా, ఈ వివరాలను ఎల్‌ఆర్‌యూపీ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇందులోని వివరాలను కొత్త పోర్టల్‌లోకి మార్చనున్నారు. ఈ పోర్టల్ తయారీకి కనీసం మరో 2 నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో జనవరి 26 నుంచి చేపట్టనున్న కొత్త పాస్ పుస్తకాల జారీకి మాత్రం ఎల్‌ఆర్‌యూపీలో నమోదైన డేటానే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయాన్ని కొత్త పోర్టల్‌లోని డేటా ఆధారంగానే అందించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదు!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన భూముల్ని శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని శ్మశానంగా వాడుకోవడంపై సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ ఖబరస్తాన్ ఇంత్జామియా అసోసియేషన్ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో పాటు ఈ స్థలంపై మరెవరికీ చట్టపరమైన హక్కు లేనందున శ్మశానంగా వాడుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా వాడుకునే హక్కు ఎవరికీ లేదనీ, కోర్టు ఆదేశాలను అన్ని పక్షాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. -
‘నకిలీ’లపై క్రిమినల్ కేసులు!
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వెలుగులోకి వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న, ఇతర ప్రయోజనాలు పొందుతున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని, బ్యాంకుల సిఫార్సు ఆధారంగా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. ఇక ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్లో లబ్ధిదారులు కాకుండా.. వేరేవారు కబ్జాలో ఉంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ దీనిపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక కోసం ఎదురుచూస్తోంది. నివేదిక అందగానే కబ్జాలో ఉన్నవారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి వారికి మళ్లీ అసైన్ చేయా లని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైతే అసైన్డ్ భూముల చట్టంలో సవరణలు చేయనుంది. రుణాలు కడుతున్నారా..? భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా బయటపడుతున్న నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూమి లేకుండానే పాస్ పుస్తకాలు సృష్టించి వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నట్లుగా ప్రక్షాళన సందర్భంగా బయటపడింది. ముఖ్యంగా నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వేల ఎకరా ల భూముల పేరిట నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీటితో తీసుకున్న బ్యాంకు రుణా లను తిరిగి తీర్చేస్తున్నారా అన్న కోణంలో పరిశీలన జరపనుంది. ఇలా రుణాలు తీసుకున్న వారు చెల్లించని పక్షంలో బ్యాంకుల సిఫారసు మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ తెరపైకి జీవో నం 59 గతంలో దరఖాస్తులు స్వీకరించిన భూముల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన నేపథ్యంలో.. ఆ దరఖాస్తుల పరిష్కారానికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 125 గజాలకుపైగా ప్రభుత్వ భూముల్లో కబ్జాలుంటే వాటిని మార్కెట్ ధరతో క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబర్లో జీవో నం 59 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. అసైన్డ్ భూముల్లో కబ్జాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రాంతాన్ని బట్టి మార్కెట్ ధర ఎక్కువగా ఉండటంతో నాలుగు విడతల్లో సొమ్ము చెల్లించే అవకాశం కల్పించింది. కానీ నిర్దేశిత గడువులోపు 1, 2 వాయిదాలు చెల్లించిన కొందరు.. మిగతా మొత్తాన్ని చెల్లించలేకపోయారు. దాంతో వారికి ఆ భూములను క్రమబద్ధీకరించలేదు, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయలేదు. ఈ నేపథ్యంలో జీవో నం 59కి అనుగుణంగా అనుమతి పొంది పాక్షిక చెల్లింపులు చేసిన దరఖాస్తులకు మరో అవకాశం ఇవ్వాలని.. మిగతా సొమ్మును మరో ఏడాదిలోపు చెల్లించే వెసులుబాటు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ భూముల్లో కబ్జాలుంటే.. భూరికార్డుల ప్రక్షాళనలో వెలుగులోకి వస్తున్న మరో అంశం ప్రభుత్వ భూముల కబ్జా. రికార్డులు సరిగా లేకపోవడం, ప్రభుత్వ భూములపై పర్యవేక్షణ లేకపోవడం, కొందరు అక్రమార్కులు రెవెన్యూ వర్గాలతో చేతులు కలపడం వంటి కారణాలతో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లు ప్రక్షాళనలో వెల్లడైంది. ఇలాంటి కబ్జాల్లో ఉన్న నివాసస్థలాలను వారి సామాజిక, ఆర్థిక హోదాను బట్టి వారికే కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మండల, జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కబ్జాలను మాత్రం క్రమబద్ధీకరించ కూడదని ప్రభుత్వం భావిస్తోంది. విలువైన ఆ భూములను ప్రజావసరాలకు వినియోగించుకోవాలని.. పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు, ఇతర సమూహాల చేతుల్లో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. -
మంత్రి కుమారుడి నిర్వాకం...
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ భూమిపై అధికార టీడీపీ పెద్దల కన్ను పడింది. పర్యాటకం ముసుగులో ఆ భూములు కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక మంత్రి చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన రిసార్టులు, బార్ అండ్ రెస్టారెంట్, ఫుడ్‌కోర్టుల నిర్మాణానికి సంబంధించిన సబ్ కాంట్రాక్ట్‌ను మంత్రి కుమారుడే దక్కించుకున్నాడు. దీంతో మంత్రిగారు చక్రం తిప్పి ఆ ప్రాంతంలో ఉన్న శివుడు, వినాయకుడు, నందీశ్వరుడితో పాటు రావణబ్రహ్మ విగ్రహాలు తొలగించడం వివాదాస్పదంగా మారింది. విగ్రహాల తొలగింపుపై భక్తులు మూడురోజులుగా ఆందోళన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీలు ఆందోళనకు మద్దతు తెలిపాయి. అయితే అక్కడ రావణాసురుడి విగ్రహాన్ని పూజించరు కాబట్టి తొలగించామని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కుంటిసాకులు చెబుతున్నారు. అక్కడ ఉన్న శివలింగానికి రావణబ్రహ్మ పూజలు చేస్తున్నట్లుగా ఉందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా సమాధానం కరువైంది. ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి... మంత్రి కుమారుడి నిర్వాకం... పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ పాత రైలువంతెన నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జి వరకు గోదావరి నదీతీరంలో 9.90 ఎకరాల భూమి ఉంది. జలవనరుల శాఖకి చెందిన ఈ భూమిని ఇటీవలే పర్యాటక శాఖకి బదలాయించారు. ఈ భూముల్లో కాటేజ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్, పుడ్ కోర్టులతో పాటు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రూ.7.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులకు గత నెలలోనే టెండర్లు ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్ (ఎన్.జనార్ధన్‌రావు) కనస్ట్రక్షన్స్ పనులు దక్కించుకున్నట్టు పర్యాటక శాఖ అ«ధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ పనులను బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో అధికార పార్టీ నేతలే సొంతం చేసుకున్నారు. దీనిలో రాష్ట్ర మంత్రి కుమారుడికి వాటా ఉందన్న ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి జవహర్ స్పందిస్తూ తన కుమారుడు సబ్‌కాంట్రాక్ట్ తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం ఆయన కనుసన్నల్లో జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ భూముల్లో కాటేజ్‌లు, రెస్టారెంట్, కల్చరల్ సొసైటీ వంటి నిర్మాణాలు ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన తర్వాత వీటి నిర్వహణను 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పర్యాటక అధికారులు మాత్రం లీజు వ్యవహారంపై నోరుమెదపడం లేదు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు. కేవలం ఈ భూముల్లో నిర్మాణాల వరకే తాము పరిమితమంటున్నారు. ఇప్పటికే ఈ భూములను శుభ్రం చేసే పనులు పూర్తయ్యాయి. ఈ భూముల్లో ప్రస్తుతం 24 కాటేజీలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మాణం చేస్తున్నారు. విగ్రహాల తొలగింపు వివాదాస్పదం శ్రీనివాస స్నానఘట్టంలో ఈ భూములను ఆనుకుని ఉన్న శివుడు, వినాయకుడు, నందీశ్వరుడితో పాటు రావణబ్రహ్మ విగ్రహాలు తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గడిచిన 3 రోజుల నుంచి విగ్రహాల తొలగింపుపై భక్తులు, వైఎస్సార్సీపీ మద్దతుతో ఆందోళనలు చేస్తున్నారు. గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సైతం విగ్రహాల తొలగింపుని తప్పుబట్టింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ ఆందోళనలకు మద్దతు పలికారు. పనులు ప్రారంభించాం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్ పనులు దక్కించుకుంది. ఇటీవలే పనులు ప్రారంభించాం. జంగిల్ క్లియరెన్స్ చేశాం. రూ.7.75 కోట్లతో ఈ భూముల్లో కాటేజీలు, రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మిస్తాం. డిజైన్లు రాగానే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. – జి.భీమశంకర్, రిజినల్ డైరెక్టర్, ఏపీ టూరిజం విగ్రహాలు తొలగించడంపై చింతిస్తున్నా: జవహర్ కొవ్వూరు: కొవ్వూరులో శ్రీనివాస స్నానఘట్టంలో ఏర్పాటు చేసిన శివలింగం, నందీశ్వరుడు, గణపతి విగ్రహాల తొలగింపు విషయం పత్రికల్లో చూశానని, దేవతామూర్తుల విగ్రహాల తొలగింపునకు చింతిస్తున్నానని మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. విగ్రహాలు తొలగించిన నాలుగు రోజుల తరువాత, శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనను హిందూ వ్యతిరేకిగా చూపించానే దురుద్దేశంతో కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విగ్రహాల ఏర్పాటుకి కమిటీ రాతపూర్వకంగా వినతిపత్రం అందజేస్తే స్థలం కేటాయిస్తామన్నారు. -
అంతా పక్కా స్కెచ్
సాక్షి, అమరావతి: అధికార పార్టీ పెద్దలు, కీలక నేతలు పకడ్బందీ స్కెచ్‌తోనే ప్రభుత్వ భూములను కొట్టేశారని స్పష్టమవుతోంది. రికార్డులను మాయం చేసి ట్యాంపరింగ్ చేసి విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకునేందుకు సుదీర్ఘ కాలం కిందటే ప్లాన్ చేసుకున్నారు. నిషేధిత ఆస్తుల (క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయకూడని) జాబితా (పీఓబీ) వివరాలను 2016 మార్చిలోగా సమర్పించాలని హైకోర్టు 2015 డిసెంబరులో ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కడం వెనుక ఆంతర్యం ఇదే. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2016 మార్చిలో పీఓబీ జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులు వెబ్సైట్లో పెడితే తర్వాత వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వ భూములను కైవశం చేసుకునే ఆస్కారం ఉండదు. అందువల్లే 2016లో పీఓబీ జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులకు ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని అధికార పక్ష నేతలు కట్టడి చేశారు. విలువైన స్థలాలు/ భూములపై కన్నేసి రికార్డులు తారుమారు చేశారు. బినామీ పేర్లతో కైవసం చేసుకునే వరకూ ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్, గ్రామ మ్యాపులు, ఇతర రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయనే విషయం ప్రభుత్వానికి 2016 జూలైలోనే తెలుసు. భూ రికార్డుల డిజిటలైజేషన్ సందర్భంగా రికార్డులు కనిపించని విషయాన్ని క్షేత్ర స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇది గత ఏడాది చివర్లోకలెక్టర్ల కాన్ఫరెన్సులో కూడా ప్రస్తావనకు వచ్చింది. అయినా ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించకుండా ఉండడాన్ని బట్టే కీలక నేతలు ఉద్దేశపూర్వకంగానే దీనిని దాచి ఉంచారని, ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకున్న తర్వాత ఏమీ ఎరుగనట్లు విచారణ పేరుతో నాటకం ఆడుతున్నారని తేటతెల్లమవుతోంది. -
భూ కుంభకోణంలో ముగ్గురు అరెస్టు
హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిన మూసాపేట సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అప్పనంగా భూములను పొందిన గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రతినిధి పార్థసారథిని, అకౌంటెంట్ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొంతమంది బిల్డర్ల అరెస్టు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. -
భూకబ్జాదారులపై చర్యలకు డిమాండ్
పోరుమామిళ్ల: మండలంలో ప్రభుత్వ భూములు అక్రమణకు గురయ్యాయి. అక్రమార్కులు అంతటితో ఆగక చెరువులు, కుంటలు కూడా కబ్జాచేశారు. అలాంటి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు వీరశేఖర్, చంద్రశేఖర్ మంగళవారం పోరుమామిళ్లకు వచ్చిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది అండతోనే ఆక్రమణలు పెరిగుతున్నాయన్నారు. ఆక్రమించుకున్న భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సిబ్బంది కళ్లప్పగించి చూస్తున్నారే తప్పచర్యలు లేవన్నారు. ఇంటిస్థలం కోసం పేదలు దరఖాస్తు చేసుకొని సంవత్సరాల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు న్యాయం చేయడం లేదని వివరించారు. విసుగు చెందిన పేదలు సర్వేనంబరు 1008లో గుడిసెలు వేసుకున్నారని అక్కడ వారికి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ నాయకుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్ బయటకు వచ్చి కార్యాలయం ముందు కూర్చున్న పేదలతో మాట్లాడారు. ఆక్రమణలకు అనుమతి ఇవ్వమని, ఎక్కడ ఎవరు ఆక్రమణకు పాల్పడ్డా సహించమన్నారు. అర్హులైన పేదల గురించి విచారించి రెండునెలల్లో న్యాయం చేస్తామన్నారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు జకరయ్య, మండల కార్యదర్శి సుబ్రమణ్యం, నాయకులు బాలు, మస్తాన్, సోమయ్య, మత్తయ్య, షఫి, ఫిరోజ్, చెన్నయ్య, విశ్వాసమ్మ, తదితరులున్నారు. -
సొసైటీని ఎందుకు రద్దు చేశారు?
* అధికారులను ప్రశ్నించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ * యడవల్లి భూములపై విచారణ చిలకలూరిపేట రూరల్ : మండలంలోని యడవల్లి గ్రామంలో ఎస్సీలకు చెందిన ప్రభుత్వ భూముల రద్దు విషయంపై జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీలో నిర్వహించిన విచారణకు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారి పాండురంగారావు, డివిజన్ సొసైటీ అధికారి పురుషబాబు, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, చిలకలూరిపేట తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్య హాజరైనట్లు ఏపీ గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనునాయక్ చెప్పారు. కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నిర్వహించిన విచారణలో కమిషన్ సభ్యురాలైన కమలమ్మ సంబంధిత అధికారులను సొసైటీని రద్దు చేసినందుకు గల కారణాలను ప్రశ్నించినట్లు చెప్పారు. సొసైటీ ఎన్నికలను నిర్వహించకపోవటం, సంబంధిత విషయాలను సభ్యులకు తెలియచెప్పకపోవటం తదితర విషయాలపై అధికారులను కమలమ్మ ప్రశ్నించారన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ సొసైటీకి సంబంధించిన రికార్డులు తమవద్ద లేవని పేర్కొన్నారన్నారు. దీనిపై కమలమ్మ స్పందిస్తూ రైతుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తే అధికారుల పనితీరు తెలుస్తుందన్నారు. అధికారుల వద్ద ఉన్న రికార్డులను రైతులకు అందించి, తాము నోటీసులు జారీ చేసిన సమయంలో తిరిగి హాజరు కావాలని సూచించినట్లు తెలిపారన్నారు. విచారణలో రైతులకు, కమిషన్‌కు సమన్వయ కర్తగా ఫోరంఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు కె.నారాయణ వ్యవహరించారన్నారు. విచారణకు గ్రామానికి చెందిన యడవల్లి వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ అధ్యక్షులు తాళ్ళూరి వెంకట్రావు, సభ్యులు పరిశపోగు శ్రీనివాసరావు, కోండ్రు షడ్రక్‌బాబు, వేల్పుల రమేష్, పెనుముల చిట్టి, శ్రీనివాస్‌లు హాజరయ్యారన్నారు. -
రియల్ మాయాజాలం
– పెబ్బేరులో ప్రభుత్వ భూమిపై కన్ను – సర్వే పేరుతో వ్యాపారులకు సహకారం – ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు పెబ్బేరు : మండల కేంద్రం నుంచి వనపర్తికి వెళ్లే ప్రధాన రోడ్డులో కొందరు రియల్ వ్యాపారులు వివేకానందనగర్ పేరుతో ఇటీవల ఏడెకరాల్లో వెంచర్ ఏర్పాటుచేశారు. ఆ పక్కనే ప్రభుత్వ భూమి ఉండటంతో వారి కన్ను దీనిపై పడింది. అందూలోనూ దర్జాగా ప్లాట్లను చేసి అమ్మకానికి పెట్టారు. అక్కడ అక్రమంగా పార్కు నిర్మిస్తుండడాన్ని స్థానిక అంబేద్కర్‌కాలనీ వాసులు గమనించారు. వారం రోజుల క్రితమే ఈ పనులను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వెంచర్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. సర్వే నం.3లో 14గుంటలు, ఇంకా ఇతర సర్వే నంబర్లలోనూ ప్రభుత్వ భూములున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఈశ్వర్, గోవిందు, రాముడు ఆరోపించారు. కాగా, నాలుగు రోజుల క్రితం సర్వే చేసేందుకుగాను ఆర్ఐ లావణ్య, సర్వేయర్ రామకష్ణ అక్కడికి వచ్చినా కాసేపు అటు ఇటు తిరిగి పాయింట్ దొరకడం లేదంటూ వెళ్లిపోయారు. పెబ్బేరు–వనపర్తి ప్రధాన రోడ్లో ఉన్న ఈ ప్రభుత్వ భూమి ప్రస్తుతం రూ.లక్షల్లో పలుకుతుండటంతో స్థానిక రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తహసీల్దార్ దత్తాద్రీని వివరణ కోరగా త్వరలో ఆ స్థలాన్ని పకడ్బందీగా సర్వే చేయిస్తామన్నారు. హద్దులు ఏర్పాటుచేసి ప్రభుత్వ భూమిని తమ అధీనంలోకి తీసుకుంటామన్నారు. -
కీసరలో ప్రభుత్వ భూములు స్వాధీనం
కీసర: రంగారెడ్డి జిల్లాలో రూ. 5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీసర మండలం అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన బండ్ల పోచయ్య, రాములు, నారాయణలకు వ్యవసాయ నిమిత్తం అధికారులు ఎనిమిదెకరాల 17 గుంటల భూమిని కేటాయించారు. అయితే వీరు ఆ భూమిని ఇతరులకు విక్రయించినట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగారం గ్రామపరిధిలో రూ. కోటి విలువ చేసే మరో స్థలాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
సీఆర్డీఏ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే ఆర్కే ఆందోళన
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం సీఆర్డీఏ ఆఫీసు ఎదుట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఆందోళనకు దిగారు. ఏడున్నర ఎకరాల ఎసైన్డ్ భూమిని ఇతరుల పేర్లతో నమోదు చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారని ఆర్కే మండిపడ్డారు. వివాదాస్పద భూమి వివరాలను పది రోజుల్లో ఇస్తామని ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు.