సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ భూమిపై అధికార టీడీపీ పెద్దల కన్ను పడింది. పర్యాటకం ముసుగులో ఆ భూములు కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక మంత్రి చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన రిసార్టులు, బార్ అండ్ రెస్టారెంట్, ఫుడ్‌కోర్టుల నిర్మాణానికి సంబంధించిన సబ్ కాంట్రాక్ట్‌ను మంత్రి కుమారుడే దక్కించుకున్నాడు. దీంతో మంత్రిగారు చక్రం తిప్పి ఆ ప్రాంతంలో ఉన్న శివుడు, వినాయకుడు, నందీశ్వరుడితో పాటు రావణబ్రహ్మ విగ్రహాలు తొలగించడం వివాదాస్పదంగా మారింది. విగ్రహాల తొలగింపుపై భక్తులు మూడురోజులుగా ఆందోళన చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీలు ఆందోళనకు మద్దతు తెలిపాయి. అయితే అక్కడ రావణాసురుడి విగ్రహాన్ని పూజించరు కాబట్టి తొలగించామని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కుంటిసాకులు చెబుతున్నారు. అక్కడ ఉన్న శివలింగానికి రావణబ్రహ్మ పూజలు చేస్తున్నట్లుగా ఉందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా సమాధానం కరువైంది. ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి...
మంత్రి కుమారుడి నిర్వాకం...
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ పాత రైలువంతెన నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జి వరకు గోదావరి నదీతీరంలో 9.90 ఎకరాల భూమి ఉంది. జలవనరుల శాఖకి చెందిన ఈ భూమిని ఇటీవలే పర్యాటక శాఖకి బదలాయించారు. ఈ భూముల్లో కాటేజ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్, పుడ్ కోర్టులతో పాటు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రూ.7.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులకు గత నెలలోనే టెండర్లు ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్ (ఎన్.జనార్ధన్‌రావు) కనస్ట్రక్షన్స్ పనులు దక్కించుకున్నట్టు పర్యాటక శాఖ అ«ధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ పనులను బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో అధికార పార్టీ నేతలే సొంతం చేసుకున్నారు.
దీనిలో రాష్ట్ర మంత్రి కుమారుడికి వాటా ఉందన్న ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి జవహర్ స్పందిస్తూ తన కుమారుడు సబ్‌కాంట్రాక్ట్ తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం ఆయన కనుసన్నల్లో జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ భూముల్లో కాటేజ్‌లు, రెస్టారెంట్, కల్చరల్ సొసైటీ వంటి నిర్మాణాలు ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన తర్వాత వీటి నిర్వహణను 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పర్యాటక అధికారులు మాత్రం లీజు వ్యవహారంపై నోరుమెదపడం లేదు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు. కేవలం ఈ భూముల్లో నిర్మాణాల వరకే తాము పరిమితమంటున్నారు. ఇప్పటికే ఈ భూములను శుభ్రం చేసే పనులు పూర్తయ్యాయి. ఈ భూముల్లో ప్రస్తుతం 24 కాటేజీలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మాణం చేస్తున్నారు.
విగ్రహాల తొలగింపు వివాదాస్పదం
శ్రీనివాస స్నానఘట్టంలో ఈ భూములను ఆనుకుని ఉన్న శివుడు, వినాయకుడు, నందీశ్వరుడితో పాటు రావణబ్రహ్మ విగ్రహాలు తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గడిచిన 3 రోజుల నుంచి విగ్రహాల తొలగింపుపై భక్తులు, వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఆందోళనలు చేస్తున్నారు. గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సైతం విగ్రహాల తొలగింపుని తప్పుబట్టింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ ఆందోళనలకు మద్దతు పలికారు.
పనులు ప్రారంభించాం
టెండర్ల ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్స్ పనులు దక్కించుకుంది. ఇటీవలే పనులు ప్రారంభించాం. జంగిల్ క్లియరెన్స్ చేశాం. రూ.7.75 కోట్లతో ఈ భూముల్లో కాటేజీలు, రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మిస్తాం. డిజైన్లు రాగానే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
– జి.భీమశంకర్, రిజినల్ డైరెక్టర్, ఏపీ టూరిజం
విగ్రహాలు తొలగించడంపై చింతిస్తున్నా: జవహర్
కొవ్వూరు: కొవ్వూరులో శ్రీనివాస స్నానఘట్టంలో ఏర్పాటు చేసిన శివలింగం, నందీశ్వరుడు, గణపతి విగ్రహాల తొలగింపు విషయం పత్రికల్లో చూశానని, దేవతామూర్తుల విగ్రహాల తొలగింపునకు చింతిస్తున్నానని మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. విగ్రహాలు తొలగించిన నాలుగు రోజుల తరువాత, శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనను హిందూ వ్యతిరేకిగా చూపించానే దురుద్దేశంతో కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విగ్రహాల ఏర్పాటుకి కమిటీ రాతపూర్వకంగా వినతిపత్రం అందజేస్తే స్థలం కేటాయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment