minister ks jawahar
-
అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా?
కొవ్వూరు: టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది. మంత్రి ఎదుటే నాయకులు అసంతృప్తి గళం వినిపించడం చర్చనీయాంశమైంది. పార్టీలో మొదటి నుంచి కష్టించి పనిచేసే వాళ్లకు గుర్తింçపునివ్వడం లేదని ఓ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు సమావేశంలో బయట పడ్డాయి. నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబుకు తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని ఓ నాయకుడు నిలదీసినట్టు సమాచారం. తమ గ్రామంలో రేషన్ దుకాణం కేటాయింపు విషయంలోనూ అన్యాయం చేశారని ఆ నాయకుడు ఆరోపించినట్టు చెబుతున్నారు. ఇటీవల వాడపల్లిలో నిర్వహించిన జనచైతన్య యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అచ్చిబాబు ఫొటో ఎక్కడా ప్రచురించక పోవడానికి గల కారణం ఏమిటని ఆయన నిలదీసినట్టు తెలిసింది. జవహర్‌కి టికెట్ కేటాయింపు సమయంలో అచ్చిబాబు పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించిన విషయం మరిచిపోవద్దంటూ హితవు పలికినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అచ్చిబాబు రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు ఆయన ప్రాధాన్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది. కేవలం తాను అచ్చిబాబు మనిషి అన్న కారణంతోనే జిల్లాలో కీలక పదవి నుంచి తనను తొలగించారని ఆ నాయకుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. పార్టీ సభ్వత్వాల కోసం మూడు నెలలు అహ ర్నిశలు కష్టపడ్డానని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలకు గుర్తింపునివ్వ డంలేదని మండిపడినట్టు సమాచారం. అభివృద్ధి పనుల్లోనూ అన్యాయం అభివృద్ధి పనులు కేటాయింపులోను ప్రతిపక్ష నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం కుడా పార్టీ నాయకులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ కోసం ఇన్నాళ్లు పని చేసిన కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తున్నారని నిలదీసినట్టు తెలుస్తోంది. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న ఆ నాయకుడి ప్రశ్నలకు ఏ ఒక్కరు నోరు మెదపలేదని సమాచారం. అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా? ఇటీవల చోటు చేసు కుంటున్న పరిణామాలు చూస్తుంటే అచ్చిబాబుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్టే ప్రచారం సాగుతోంది. ఇటీవల మండలంలోని ఓ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కొవ్వూరు నాయకులు తమ గ్రామంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతోనే సమావేశానికి రాలేదని ఓ ముఖ్య నాయకుడు ఆరోపించడంపైనా పట్టణానికి చెందిన ప్రముఖ నాయకులు నియోజకవర్గ సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కాలేదని, అంతమాత్రాన ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తారా అని నిలదీసినట్టు తెలిసింది. దీంతో సమావేశం రసాభాసగానే ముగిసింది. సమావేశంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి కేవీకే రంగారావు, జడ్పీటీసీ కైగాల మంగాభవానీ, కైగాల శ్రీనివాసరావు,కాకర్ల బ్రహ్మాజీ, అనుపిండి చక్రధరరావు, కోడూరి ప్రసాద్, వట్టికూటి వెంకటేశ్వరరావు, పాలడుగుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
కొవ్వూరులో దేవుడు విగ్రహాల తొలగింపు
-
మంత్రి కుమారుడి నిర్వాకం...
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ భూమిపై అధికార టీడీపీ పెద్దల కన్ను పడింది. పర్యాటకం ముసుగులో ఆ భూములు కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక మంత్రి చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన రిసార్టులు, బార్ అండ్ రెస్టారెంట్, ఫుడ్‌కోర్టుల నిర్మాణానికి సంబంధించిన సబ్ కాంట్రాక్ట్‌ను మంత్రి కుమారుడే దక్కించుకున్నాడు. దీంతో మంత్రిగారు చక్రం తిప్పి ఆ ప్రాంతంలో ఉన్న శివుడు, వినాయకుడు, నందీశ్వరుడితో పాటు రావణబ్రహ్మ విగ్రహాలు తొలగించడం వివాదాస్పదంగా మారింది. విగ్రహాల తొలగింపుపై భక్తులు మూడురోజులుగా ఆందోళన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీలు ఆందోళనకు మద్దతు తెలిపాయి. అయితే అక్కడ రావణాసురుడి విగ్రహాన్ని పూజించరు కాబట్టి తొలగించామని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కుంటిసాకులు చెబుతున్నారు. అక్కడ ఉన్న శివలింగానికి రావణబ్రహ్మ పూజలు చేస్తున్నట్లుగా ఉందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా సమాధానం కరువైంది. ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి... మంత్రి కుమారుడి నిర్వాకం... పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ పాత రైలువంతెన నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జి వరకు గోదావరి నదీతీరంలో 9.90 ఎకరాల భూమి ఉంది. జలవనరుల శాఖకి చెందిన ఈ భూమిని ఇటీవలే పర్యాటక శాఖకి బదలాయించారు. ఈ భూముల్లో కాటేజ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్, పుడ్ కోర్టులతో పాటు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రూ.7.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులకు గత నెలలోనే టెండర్లు ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్ (ఎన్.జనార్ధన్‌రావు) కనస్ట్రక్షన్స్ పనులు దక్కించుకున్నట్టు పర్యాటక శాఖ అ«ధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ పనులను బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో అధికార పార్టీ నేతలే సొంతం చేసుకున్నారు. దీనిలో రాష్ట్ర మంత్రి కుమారుడికి వాటా ఉందన్న ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి జవహర్ స్పందిస్తూ తన కుమారుడు సబ్‌కాంట్రాక్ట్ తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం ఆయన కనుసన్నల్లో జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ భూముల్లో కాటేజ్‌లు, రెస్టారెంట్, కల్చరల్ సొసైటీ వంటి నిర్మాణాలు ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన తర్వాత వీటి నిర్వహణను 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పర్యాటక అధికారులు మాత్రం లీజు వ్యవహారంపై నోరుమెదపడం లేదు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు. కేవలం ఈ భూముల్లో నిర్మాణాల వరకే తాము పరిమితమంటున్నారు. ఇప్పటికే ఈ భూములను శుభ్రం చేసే పనులు పూర్తయ్యాయి. ఈ భూముల్లో ప్రస్తుతం 24 కాటేజీలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మాణం చేస్తున్నారు. విగ్రహాల తొలగింపు వివాదాస్పదం శ్రీనివాస స్నానఘట్టంలో ఈ భూములను ఆనుకుని ఉన్న శివుడు, వినాయకుడు, నందీశ్వరుడితో పాటు రావణబ్రహ్మ విగ్రహాలు తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గడిచిన 3 రోజుల నుంచి విగ్రహాల తొలగింపుపై భక్తులు, వైఎస్సార్సీపీ మద్దతుతో ఆందోళనలు చేస్తున్నారు. గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సైతం విగ్రహాల తొలగింపుని తప్పుబట్టింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ ఆందోళనలకు మద్దతు పలికారు. పనులు ప్రారంభించాం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్ పనులు దక్కించుకుంది. ఇటీవలే పనులు ప్రారంభించాం. జంగిల్ క్లియరెన్స్ చేశాం. రూ.7.75 కోట్లతో ఈ భూముల్లో కాటేజీలు, రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మిస్తాం. డిజైన్లు రాగానే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. – జి.భీమశంకర్, రిజినల్ డైరెక్టర్, ఏపీ టూరిజం విగ్రహాలు తొలగించడంపై చింతిస్తున్నా: జవహర్ కొవ్వూరు: కొవ్వూరులో శ్రీనివాస స్నానఘట్టంలో ఏర్పాటు చేసిన శివలింగం, నందీశ్వరుడు, గణపతి విగ్రహాల తొలగింపు విషయం పత్రికల్లో చూశానని, దేవతామూర్తుల విగ్రహాల తొలగింపునకు చింతిస్తున్నానని మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. విగ్రహాలు తొలగించిన నాలుగు రోజుల తరువాత, శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనను హిందూ వ్యతిరేకిగా చూపించానే దురుద్దేశంతో కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విగ్రహాల ఏర్పాటుకి కమిటీ రాతపూర్వకంగా వినతిపత్రం అందజేస్తే స్థలం కేటాయిస్తామన్నారు. -
మంత్రికి మంచిబుద్ధి ప్రసాదించాలని..
కొవ్వూరు : శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు తొలగించిన ప్రభుత్వానికి, మంత్రి కేఎస్ జవహర్‌కు మంచి బుద్ధిని ప్రసాదించి, విగ్రహాలు పునః ప్రతిష్టించే విధంగా చేయాలని కోరుతూ పట్టణంలో శ్రీనివాసపురం కాలనీ వాసులు శుక్రవారం గణపతి హోమం నిర్వహించారు. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలో గణపతి హోమం నిర్వహించి పూజలు చేశారు. విగ్రహాల తొలగింపు సమయంలో కనీసం సంప్రోక్షణ చేయకపోవడం ఘోర అపచారమని ఈ హోమం చేసినట్టు స్థానిక భక్తులు తెలిపారు. అక్కడే ఉన్న మరో శివలింగానికి గోదావరి నీళ్లతో భక్తులు 108 బిందెలతో అభిషేకం చేశారు. విగ్రహాలు పునఃప్రతిష్టించే విధంగా ప్రభుత్వానికి, స్థానిక మంత్రి జవహర్‌కు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరారు. అనపర్తి శివరామకృష్ణ, సిద్ధినేని రాఘవ, బిక్కిన రామకృష్ణ, మద్దూకూరి గణేష్, పి.సరోజిని దేవి, బి.వెంకటలక్ష్మి, ఆరాజ్యుల రాధాదేవి, సీహెచ్ సత్యవతి, ఎం.దుర్గ, జి.కుసుమ, జి.మల్లేశ్వరీ, పి.హేమ పాల్గొన్నారు. -
పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి
కొవ్వూరు రూరల్ : రైతులు పొలాల్లో పంట కుంటలు తవ్వేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆదేశించారు. శనివారం కొవ్వూరులోని మంత్రి కార్యాలయంలో ఇంకుడు గుంతలు, పంటకుంటలపై మండల పరిషత్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ చాగల్లు మండలంలోని మల్లవరం, చిక్కాల గ్రామాల్లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. నీరు–ప్రగతి కార్యక్రమంలో చెరువుల పూడికతీత, కాలువల ఆధునికీకరణ, ఇంకుడుగుంతలు, ఫామ్పాండ్ల తవ్వకం ద్వారా భూగర్భ జలాలలను పెంపొందించుకోవచ్చన్నారు. దీనికి సంబంధించి గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి తహసీల్దార్లు కె.విజయకుమార్, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు ఎ.రాము, కె.పురుషోత్తమరావు, జ్యోతిర్మయి పాల్గొన్నారు. -
దీపం కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవాలి
కొవ్వూరు: దీపం పథకం ద్వారా సబ్సిడీపై అందించే గ్యాస్ కనెక్షన్ లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కోరారు. కొవ్వూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి హెచ్‌పీ గ్యాస్ రెండో ఏజెన్సీని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన కనెక్షన్ లు తీసుకున్న వినియోగదారులకు మంత్రి చేతుల మీదుగా స్టౌవ్‌లు అందజేశారు. పొగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొవ్వూరు, రాజమహేంద్రవరంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, హెచ్‌పీసీఎల్ చీఫ్ రీజనల్ మేనేజర్ కె.చంద్రశేఖర్, డెప్యూటీ మేనేజర్ (సేల్స్) వీవీ రవికుమార్, చాగల్లు ఎంపీపీ కోడూరి రమామణి తదితరులు పాల్గొన్నారు.