దీపం కనెక్షన్‌లను సద్వినియోగం చేసుకోవాలి
కొవ్వూరు: దీపం పథకం ద్వారా సబ్సిడీపై అందించే గ్యాస్ కనెక్షన్ లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కోరారు. కొవ్వూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి హెచ్‌పీ గ్యాస్ రెండో ఏజెన్సీని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన కనెక్షన్ లు తీసుకున్న వినియోగదారులకు మంత్రి చేతుల మీదుగా స్టౌవ్‌లు అందజేశారు. పొగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొవ్వూరు, రాజమహేంద్రవరంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, హెచ్‌పీసీఎల్ చీఫ్ రీజనల్ మేనేజర్ కె.చంద్రశేఖర్, డెప్యూటీ మేనేజర్ (సేల్స్) వీవీ రవికుమార్, చాగల్లు ఎంపీపీ కోడూరి రమామణి తదితరులు పాల్గొన్నారు.