
కొవ్వూరు : శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు తొలగించిన ప్రభుత్వానికి, మంత్రి కేఎస్ జవహర్‌కు మంచి బుద్ధిని ప్రసాదించి, విగ్రహాలు పునః ప్రతిష్టించే విధంగా చేయాలని కోరుతూ పట్టణంలో శ్రీనివాసపురం కాలనీ వాసులు శుక్రవారం గణపతి హోమం నిర్వహించారు. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలో గణపతి హోమం నిర్వహించి పూజలు చేశారు. విగ్రహాల తొలగింపు సమయంలో కనీసం సంప్రోక్షణ చేయకపోవడం ఘోర అపచారమని ఈ హోమం చేసినట్టు స్థానిక భక్తులు తెలిపారు. అక్కడే ఉన్న మరో శివలింగానికి గోదావరి నీళ్లతో భక్తులు 108 బిందెలతో అభిషేకం చేశారు. విగ్రహాలు పునఃప్రతిష్టించే విధంగా ప్రభుత్వానికి, స్థానిక మంత్రి జవహర్‌కు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరారు. అనపర్తి శివరామకృష్ణ, సిద్ధినేని రాఘవ, బిక్కిన రామకృష్ణ, మద్దూకూరి గణేష్, పి.సరోజిని దేవి, బి.వెంకటలక్ష్మి, ఆరాజ్యుల రాధాదేవి, సీహెచ్ సత్యవతి, ఎం.దుర్గ, జి.కుసుమ, జి.మల్లేశ్వరీ, పి.హేమ పాల్గొన్నారు.