సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సర్కారు స్థలాలపై పర్యవేక్షణ కరువైంది. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకంతో ప్రభుత్వ స్థలాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ప్రభుత్వ స్థలం అంటూ సైన్ బోర్డులు ఉన్నా.. వాటిని సైతం తొలగిస్తూ దర్జాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఒత్తిడితో కూడిన ఫిర్యాదులు వస్తే గానీ రెవెన్యూ అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్ర«భుత్వ స్థలంపై నిర్మించిన అక్రమ కట్టడం సక్రమ కట్టడం జాబితాలో క్రమంగా చేరిపోతున్నా... రెవెన్యూ వ్యవస్థ ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఒకవేళ రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే మాత్రం అక్రమార్కులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. అనేక ఆక్రమిత స్థలాలపై అవసరమైన ఆధారాలు, సమగ్ర వాదనలు లేక కోర్టులో కేసులు వీగిపోతున్నాయనే విమర్శలూ లేకపోలేదు.
మొక్కుబడి చర్యలు..
గతంలో రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూముల పరిరక్షణకు పలు చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే తయారైంది. పలుమార్లు ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆన్‌లైన్ మానిటరింగ్, ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో భద్రపర్చే చర్యలతో పాటు పర్యవేక్షణ బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందికి అప్పగించారు. వాస్తవంగా వీఆర్వోలు ప్రతిరోజూ భూములపై పర్యవేక్షణతో పాటు పక్షం రోజులకు ఒకసారి తనిఖీ చేసి తగిన సమాచారాన్ని సంబంధిత తహసీల్దార్లు, భూ పరిరక్షణ అధికారులకు అందించాలి. కానీ ఆచరణలో అలా చేయడంలేదు. చాలా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములకు కంచె, పూర్తి స్థలాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని స్థలాల ఆక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు వెలసిన తర్వాత ఫిర్యాదులు, ఒత్తిడికి వస్తే గానీ స్పందించక పోవడం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది.
ల్యాండ్ పార్శిల్స్..
హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో 16 మండలాలు ఉండగా, వాటి పరిధిలో 1075 ల్యాండ్ పార్శిల్స్‌లున్నాయి. మొత్తం మీద 890 ల్యాండ్ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 4066914.08 చదరపు గజాల విస్తీర్ణం ఖాళీ స్థలం, మరో 1145334.95 చదరపు గజాల విసీర్ణం ఖాళీ స్థలం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల్లో సుమారు 169 పార్శిల్స్‌లోని దాదాపు 1193595.12 చదరపు గజాల ఖాళీ స్థలంతో పాటు 445098.64 చదరపు గజాల ఆక్రమిత భూమి ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment