సాక్షి, హైదరాబాద్: ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేస్తున్న ఎల్‌బీనగర్ అధికారుల భూ భాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్‌లు ఏవీ లేకుండానే సుమారు 18 ఎకరాల భూమిని ఎల్‌బీనగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఒకరి భూమిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. విషయం తెలుసుకున్న భూమి హక్కుదారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో సదరు సబ్ రిజిస్ట్రార్‌పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది.
అసలు ఏం జరిగిందంటే..
ఎల్‌బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని బాలాపూర్ సర్వే నంబరు 144లో డాక్టర్ మధుమతి 2006లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో రెవెన్యూ రికార్డుల్లోనూ మ్యుటేషన్ చేయించారు. 2009లో రెవెన్యూ అధికారుల నుంచి తన పేరిట, తన కుమారుని పేరిట పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్‌ను కూడా పొందారు. అదే సర్వే నంబర్‌లో సుమారు 18 ఎకరాలను తాము కొనుగోలు చేశామని, మధుమతి కొనుగోలు చేసిన భూమి కూడా తమదేనంటూ కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టుకొచ్చారు. వీటిపై ఆరా తీసిన మధుమతి, ఇది అక్రమ రిజిస్ట్రేషన్ అంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎల్‌బీనగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించారు.
జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న వి.హన్మంతరావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి పట్టాదారు పాస్‌బుక్, టైటిల్‌డీడ్ లేకుండానే 13467/2014 డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హన్మంతరావుపై గురువారం సస్పెన్షన్ వేటు వేసింది.
సిరీస్ భూములపై విచారణకు ఆదేశం...
సర్కారు కేటాయించిన భూములను సిరీస్ సంస్థ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ భూమి విలువను సగానికి సగం తగ్గించడం.. తదితర అంశాలపై ‘ఎనీవేర్ దందా’ శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి సర్కారు స్పందించింది. తక్షణం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని రంగారెడ్డి జిల్లా(ఈస్ట్) రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్ శనివారం ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది.
అక్రమ రిజిస్ట్రేషన్లపై సర్కారు కొరడా
Published Mon, Aug 3 2015 1:29 AM | Last Updated on Thu, Mar 28 2019 4:57 PM
Advertisement