Suspension Issue
-
ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో.. వెళ్లి చూడగా.. షాక్!
సాక్షి, నల్గొండ/సూర్యాపేట: బాత్రూంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం కాలనీలో నివాసముంటున్న అనుములపురి స్వరూపరాణి(53) సూర్యాపేట మండలంలోని కాసరబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. ఒక కుమార్తె ఉండగా ఆమెకు వివాహం చేసింది. స్వరూపరాణి ఒంటరిగానే ఉంటుంది. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో కాలనీవాసులు వెళ్లి చూడగా బాత్రూంలో స్వరూపరాణి ముఖం కాలిపోయి అప్పటికే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వరూపరాణి బాత్రూంలో కరెంట్ షాక్‌తో కిందపడి చనిపోయిందా.. లేదా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి కూడా చదవండి: తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి.. -
కలెక్టర్ గుస్సా
పశుసంవర్ధక శాఖ జేడీపై ఫైర్ అవినీతి అధికారి సస్పెన్షన్ ఉత్తర్వులు.. అరగంటలో నా టేబుల్‌పై ఉండాలి లేదంటే నిన్ను కూడా సస్పెండ్ చేస్తా సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘అర గంటలో అవినీతి అధికారి సస్పెన్షన్ ఉత్తర్వులు నా టేబుల్మీద ఉండాలి. లేకపోతే సాయంత్రం వరకు నిన్ను కూడా సస్పెండ్ చేస్తా ... కలెక్టర్‌కు జేడీని సస్పెండ్ చేసే అధికారం ఉందో? లేదో? నీకే తెలుస్తుంది’ అంటూ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ విక్రం కూమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువులో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. వాళ్ల దగ్గరే అక్రమంగా వసూళ్లు చేస్తారా? అంటూ మండి పడ్డారు. రైతుల నుంచి వసూల్లు చేసిన ఒక ఆధికారిణి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించినా.. జేడీ పెడచెవిన పెట్టడమే ఆయన ఆగ్రహానికి కారణం. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాల్లోని పశువులను రక్షించుకోవడానికి సబ్సిడీపై దాణా అందింస్తోంది. అందులో భాగంగా తూప్రాన్ మండలానికి 230 యూనిట్ల దాణా కేటాయించారు. అవసరమైన రైతులు దాణాను కొనుక్కోవచ్చు. ప్రతి యూనిట్ దాణా ధర రూ. 1300 ఉండగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రూ. 650కే విక్రయిస్తోంది. ఆ మేరకు రైతుల నుంచి డబ్బు తీసుకోవాలి. కానీ తూప్రాన్ ఎల్ఎస్ఏ మంజుల రూ.100 అదనంగా తీసుకుంటున్నారని కొంత మంది రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణ జరుపగా.. మంజుల అదనంగా తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ విక్రం కుమార్‌ను ఆదేశించారు. దీనిపై ఆయన తాత్సారం చేస్తూ వస్తున్నారు. కలెక్టర్ ఒకటికి రెండు సార్లు గుర్తు చేయడంతో శనివారం ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక ఫైల్‌ను పశుసంవర్ధక శాఖ కమిషనర్‌కు సిఫారసు చేస్తూ లేఖ రాశారు. అదే లేఖ ప్రతిని కలెక్టర్‌కు కూడా పంపారు. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నిర్ధారణ అయిన అధికారిణి సస్పెండ్ చేయాలని ఆదేశిస్తే... కమిషనర్ అనుమతి కోసం పంపడం ఏమిటీ? నీకు చేతకాకపోతే ఉత్తర్వులు సిద్ధం చేసి పంపు నేను సంతకం చేస్తాను అంటూ మండిపడ్డారు. కలెక్టర్‌గా ఆమెనే కాదు నిన్ను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంది? తీవ్రంగా హెచ్చరించారు. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తన సస్పెన్షన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోజా వేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. 340(2) నిబంధన కింద చర్య తీసుకోలేదని, 194 నిబంధన ప్రకారం చర్యలు తీసుకున్నారని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీని ఆధారంగా డివిజన్ బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ఓవైపు సభాహక్కుల సంఘం ద్వారా నోటీసులిస్తూనే మరోవైపు 340 నిబంధన కింద సస్పెండ్ చేశామనడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు సమాచారం. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
'రాజకీయంగా సర్వనాశనం చేయాలనుకుంటున్నారు'
హైదరాబాద్: కక్షసాధింపుతో తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులకు న్యాయం జరిగేందుకు గొంతు విప్పిన తనపై అన్యాయంగా కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీని కాపాడుకునేందుకు మహిళలను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తన సస్పెన్షన్ పై న్యాయస్థానంలో పోరాడతానని రోజా స్పష్టం చేశారు. ఆమె ఇంకా ఏం మాట్లారంటే... రోజాను ఏం చేయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనంతటికీ కారణం ఏంటి అధికార పక్షానికి ఓట్లేసి, వాళ్లను అధికారంలో కూర్చోబెట్టేది వాళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని వాళ్లమీద ఒత్తిడి తేవడం కోసం ప్రతిపక్షం ఉంటుంది కానీ టీడీపీ చేస్తున్న తప్పులు, సీఎం ఉన్న ఇంటి దగ్గరే, విజయవాడ చుట్టుపక్కల కాల్‌మనీ సెక్స్ రాకెట్ విజృంభించి, దానిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఏడాది సస్పెండ్ చేశారు. 17వ తేదీన 344 కింద వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాము 3 కోట్ల మంది మహిళలకు సంబంధించిన విషయమిది చర్చ కోసం అడిగితే రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి సభలోకి వచ్చాక అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చి, దాన్ని పక్కదోవ పట్టించారు. 18వ తేదీ మరోసారి ఇదే అంశంపై నోటీసు ఇచ్చాం అంబేద్కర్ కూడా ఇలాంటి అంశంపై చర్చ సాగించాలనే చెప్పేవారు 58 మందిని 344(2) ప్రకారం సస్పెండ్ చేశారు అదే సమయానికి అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకే తెలుసు. కేవలం కాల్‌మనీ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే ప్రయత్నించారు చంద్రబాబు ఒక ప్రకటన చేస్తానన్నారు. కానీ అలా ప్రకటన చేస్తే తర్వాత దానిపై సమగ్ర చర్చ అనేది ఉండదు ప్రతిపక్షంగా దీనిపై మేం పూర్తిగా పోరాడాం కా.మ. సీఎం అన్నాను కాబట్టి నన్ను ఏడాది సస్పెండ్ చేశాననడం ఎంత దారుణమో అంతా గమనించాలి పాత స్పీకర్లు, న్యాయ నిపుణులు ప్రతి ఒక్కరూ అది తప్పన్నారు కా.మ. అని రాసిన ఈనాడు పేపర్ వాళ్లకు ఎందుకు ప్రివిలేజి నోటీసు ఇవ్వలేదు, సభకు ఎందుకు పిలవలేదు? 58 మంది నినాదాలు చేస్తే ఒక్క రోజాను సస్పెండ్ చేయడం సరికాదని జగన్ చెప్పినా ఒప్పుకోలేదు రోజా బయటకు వెళ్లేవరకు మీకు మైకివ్వం అని పట్టుబట్టారు విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తనకొచ్చిన ఫిర్యాదు ప్రకారం రైడ్ చేస్తే.. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం మొత్తం బయటపడింది. ఇది సాక్షి వాళ్లో, వైఎస్ఆర్సీపీ వాళ్లో చేసింది కాదు ఇంట్లో భర్త ఉండగానే భార్యను, కూతురిని ఎత్తుకెళ్లిపోయారు కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులు ఆత్మహత్యాయత్నాలు చేశారు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నించిన నన్ను అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు జరిగింది చెప్పుకోవడానికి అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వస్తే మార్షల్స్ తో నన్ను గెంటించేశారు ప్రివిలేజ్ కమిటీలో ఉన్న ఇష్యూ అనితకు సంబంధించినది సస్పెన్షన్ మాత్రం కా.మ. సీఎం అన్నందుకు చేశారు సస్పెన్షన్ పై న్యాయస్థానంలో పోరాడతా అనితను పావుగా వాడుకుంటున్నారు. ఆమెపై ఎటువంటి కోపం లేదు గతంలో వైఎస్సార్, చిరంజీవి మీదకు మమ్మల్ని ఉసిగొల్పారు తన పార్టీని సేవ్ చేసుకోవడానికి అనితను పావుగా వాడుకుంటున్నారు -
రోజా సస్పెన్షన్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు
- ఏపీ శాసన వ్యవహారాల ముఖ్య కార్యదర్శి అప్పీల్ అనుమతి - హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ - సింగిల్ జడ్జి ముందు అభ్యర్థనకు రోజాకు స్వేచ్ఛ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేస్తూ శాసనసభ నిబంధన 340(2) కింద చేసిన తీర్మానం అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఏపీ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది. నిబంధనను తప్పుగా ప్రస్తావించినంత మాత్రాన సభ్యుల సస్పెన్షన్ విషయంలో సభకు అధికారాలు లేకుండా పోవని పేర్కొంది. సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ రోజా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 28లోగా కౌంటర్లు దాఖలు చేయండి తనపై ఏడాదిపాటు సస్పెషన్ వేటు వేస్తూ శాసనసభ నిబంధన 340(2) కింద చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి.. సస్పెన్షన్ తీర్మానం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శానస వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సోమవారం పూర్తిస్థాయి వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఓ నిబంధనను తప్పుగా ప్రస్తావించినంత మాత్రాన సభకున్న అధికారం లేకుండా పోదని, చూడాల్సింది అధికారాన్నే తప్ప నిబంధనను కాదంటూ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.పి.రావు చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. రోజా సస్పెన్షన్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొనసాగించడమంటే ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అనుమతించినట్లే అవుతుందని ధర్మాసనం తన తీర్పులో అభిప్రాయపడింది. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలంటూ సింగిల్ జడ్జిని అభ్యర్థించే స్వేచ్ఛను రోజాకు ఇచ్చింది. రిట్ పిటిషన్‌పై ఈ నెల 28వ తేదీ లోపు కౌంటర్లు దాఖలు చేయాలని శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శులను ధర్మాసనం ఆదేశించింది. తీర్పు చెప్పడం ముగిసిన తరువాత రోజా తరఫు న్యాయవాది నర్మద స్పందిస్తూ... తీర్పు కాపీ కోసం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఉన్న ఈ తీర్పును టైప్ చేసేందుకు స్టెనోగ్రాఫర్‌కు తగినంత సమయం ఇవ్వాలి, తరువాత అందులో తప్పులు ఉంటే సరిదిద్దాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇదంతా పూర్తయ్యేందుకు సమయం పడుతుందని వెల్లడించింది. బుధవారం సాయంత్రం కల్లా తీర్పు కాపీ అందుబాటులో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. -
హాంకాంగ్ క్రికెటర్‌పై తాత్కాలిక నిషేధం
హాంకాంగ్: ఐసీసీ అవినీతి వ్యతిరేక కోడ్‌ను ఉల్లంఘించినందుకు హాంకాంగ్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పాక్ మాజీ క్రికెటర్ నసీమ్ గుల్జార్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం గతంలో ఇర్ఫాన్‌ను సంప్రదించాడు. అయితే ఈ ఆఫర్‌ను తను తిరస్కరించినా విషయాన్ని మాత్రం ఐసీసీ ఏసీయూ అధికారులకు చేరవేయలేదు. దీంతో ఐసీసీ ఈ 26 ఏళ్ల ఆటగాడిపై తాత్కాలిక నిషేధం విధించింది. విచారణలో దోషిగా తేలితే రెండు నుంచి ఐదేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే హాంకాంగ్ జట్టులో ఇర్ఫాన్ కూడా ఉన్నాడు. అయితే ఈ విషయంలో ఐసీసీతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఇర్ఫాన్ లాయర్ కెవిన్ ఈగన్ అన్నారు. మరోవైపు ఇర్ఫాన్ ఉదంతం ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదని హాంకాంగ్ క్రికెట్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కట్లర్ అన్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై సర్కారు కొరడా
సాక్షి, హైదరాబాద్: ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేస్తున్న ఎల్బీనగర్ అధికారుల భూ భాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్లు ఏవీ లేకుండానే సుమారు 18 ఎకరాల భూమిని ఎల్బీనగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఒకరి భూమిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. విషయం తెలుసుకున్న భూమి హక్కుదారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో సదరు సబ్ రిజిస్ట్రార్‌పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. అసలు ఏం జరిగిందంటే.. ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని బాలాపూర్ సర్వే నంబరు 144లో డాక్టర్ మధుమతి 2006లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో రెవెన్యూ రికార్డుల్లోనూ మ్యుటేషన్ చేయించారు. 2009లో రెవెన్యూ అధికారుల నుంచి తన పేరిట, తన కుమారుని పేరిట పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్‌ను కూడా పొందారు. అదే సర్వే నంబర్లో సుమారు 18 ఎకరాలను తాము కొనుగోలు చేశామని, మధుమతి కొనుగోలు చేసిన భూమి కూడా తమదేనంటూ కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టుకొచ్చారు. వీటిపై ఆరా తీసిన మధుమతి, ఇది అక్రమ రిజిస్ట్రేషన్ అంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎల్బీనగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న వి.హన్మంతరావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి పట్టాదారు పాస్‌బుక్, టైటిల్‌డీడ్ లేకుండానే 13467/2014 డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హన్మంతరావుపై గురువారం సస్పెన్షన్ వేటు వేసింది. సిరీస్ భూములపై విచారణకు ఆదేశం... సర్కారు కేటాయించిన భూములను సిరీస్ సంస్థ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ భూమి విలువను సగానికి సగం తగ్గించడం.. తదితర అంశాలపై ‘ఎనీవేర్ దందా’ శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి సర్కారు స్పందించింది. తక్షణం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని రంగారెడ్డి జిల్లా(ఈస్ట్) రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్ శనివారం ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది.