కలెక్టర్ గుస్సా
- పశుసంవర్ధక శాఖ జేడీపై ఫైర్
- అవినీతి అధికారి సస్పెన్షన్ ఉత్తర్వులు..
- అరగంటలో నా టేబుల్‌పై ఉండాలి
- లేదంటే నిన్ను కూడా సస్పెండ్ చేస్తా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘అర గంటలో అవినీతి అధికారి సస్పెన్షన్ ఉత్తర్వులు నా టేబుల్‌మీద ఉండాలి. లేకపోతే సాయంత్రం వరకు నిన్ను కూడా సస్పెండ్ చేస్తా ... కలెక్టర్‌కు జేడీని సస్పెండ్ చేసే అధికారం ఉందో? లేదో? నీకే తెలుస్తుంది’ అంటూ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ విక్రం కూమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరువులో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. వాళ్ల దగ్గరే అక్రమంగా వసూళ్లు చేస్తారా? అంటూ మండి పడ్డారు. రైతుల నుంచి వసూల్లు చేసిన ఒక ఆధికారిణి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించినా.. జేడీ పెడచెవిన పెట్టడమే ఆయన ఆగ్రహానికి కారణం. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాల్లోని పశువులను రక్షించుకోవడానికి సబ్సిడీపై దాణా అందింస్తోంది.
అందులో భాగంగా తూప్రాన్ మండలానికి 230 యూనిట్ల దాణా కేటాయించారు. అవసరమైన రైతులు దాణాను కొనుక్కోవచ్చు. ప్రతి యూనిట్ దాణా ధర రూ. 1300 ఉండగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రూ. 650కే విక్రయిస్తోంది. ఆ మేరకు రైతుల నుంచి డబ్బు తీసుకోవాలి. కానీ తూప్రాన్ ఎల్‌ఎస్‌ఏ మంజుల రూ.100 అదనంగా తీసుకుంటున్నారని కొంత మంది రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
దీనిపై కలెక్టర్ విచారణ జరుపగా.. మంజుల అదనంగా తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ విక్రం కుమార్‌ను ఆదేశించారు. దీనిపై ఆయన తాత్సారం చేస్తూ వస్తున్నారు. కలెక్టర్ ఒకటికి రెండు సార్లు గుర్తు చేయడంతో శనివారం ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక ఫైల్‌ను పశుసంవర్ధక శాఖ కమిషనర్‌కు సిఫారసు చేస్తూ లేఖ రాశారు.
అదే లేఖ ప్రతిని కలెక్టర్‌కు కూడా పంపారు. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నిర్ధారణ అయిన అధికారిణి సస్పెండ్ చేయాలని ఆదేశిస్తే... కమిషనర్ అనుమతి కోసం పంపడం ఏమిటీ? నీకు చేతకాకపోతే ఉత్తర్వులు సిద్ధం చేసి పంపు నేను సంతకం చేస్తాను అంటూ మండిపడ్డారు. కలెక్టర్‌గా ఆమెనే కాదు నిన్ను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంది? తీవ్రంగా హెచ్చరించారు.