ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తన సస్పెన్షన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోజా వేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. 340(2) నిబంధన కింద చర్య తీసుకోలేదని, 194 నిబంధన ప్రకారం చర్యలు తీసుకున్నారని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీని ఆధారంగా డివిజన్ బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ఓవైపు సభాహక్కుల సంఘం ద్వారా నోటీసులిస్తూనే మరోవైపు 340 నిబంధన కింద సస్పెండ్ చేశామనడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు సమాచారం. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.