జేసీకి వ్యతిరేకంగా ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపురం: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి దళితుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు హెచ్చరించారు. ‘నా శవయాత్ర చేశారు.. నాకు అంతమంది కొడుకులు ఉన్నారని తెలీదు.. శవాన్ని తీసుకెళ్లి ఊరేగించి, దహనం చేసేది కొడుకులే.. జిల్లాలో ఇంత మంది కొడుకులను నేను ఎప్పుడు కనింటినో ఏమో నాకే తెలీదు’ అంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం స్థానిక ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో జరిగిన మహానాడులో ఎరుకుల కులస్తులను కించపరిచేలా ఎంపీ మాట్లాడారని, తాజాగా దిష్టిబొమ్మను శవయాత్ర చేసిన ఎస్సీలను తనకు పుట్టారా? అంటూ సంబోధించడం ఆయన దిగజారుడు వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు.
ఎస్సీ,ఎస్టీల ఓట్లు లేకుండా ఇన్నేళ్లు తాడిపత్రిలో గెలిచారా? అని ప్రశ్నించారు. దళిత జాతిపై జేసీ తన దుహంకారాన్ని బయట పెట్టారన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలందరినీ ఏకం చేసి, వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా జేసీ కుటుంబానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసనలు తెలియజేసే హక్కు ఉందనే విషయం ప్రజాప్రతినిధిగా ఉన్న జేసీకి తెలీదా? అని ప్రశ్నించారు. ఆయనలా మాట్లాడడం అందరికీ చేతనవుతుందని, అయితే సభ్యత, సంస్కారం అడ్డు వస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, తాడిపత్రి నియోజవకర్గ నాయకులు పైలా నరసింహయ్య, సాకే చంద్రశేఖర్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, మహిళా విభాగం నగర అధ్యక్షరాలు కృష్ణవేణి, ఎస్సీ సెల్ నాయకులు కనకారాం, నరేష్, అమర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment