- ఏపీ శాసన వ్యవహారాల ముఖ్య కార్యదర్శి అప్పీల్ అనుమతి
- హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
- సింగిల్ జడ్జి ముందు అభ్యర్థనకు రోజాకు స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేస్తూ శాసనసభ నిబంధన 340(2) కింద చేసిన తీర్మానం అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఏపీ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది. నిబంధనను తప్పుగా ప్రస్తావించినంత మాత్రాన సభ్యుల సస్పెన్షన్ విషయంలో సభకు అధికారాలు లేకుండా పోవని పేర్కొంది. సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ రోజా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
28లోగా కౌంటర్లు దాఖలు చేయండి
తనపై ఏడాదిపాటు సస్పెషన్ వేటు వేస్తూ శాసనసభ నిబంధన 340(2) కింద చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి.. సస్పెన్షన్ తీర్మానం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శానస వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సోమవారం పూర్తిస్థాయి వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఓ నిబంధనను తప్పుగా ప్రస్తావించినంత మాత్రాన సభకున్న అధికారం లేకుండా పోదని, చూడాల్సింది అధికారాన్నే తప్ప నిబంధనను కాదంటూ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.పి.రావు చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
రోజా సస్పెన్షన్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొనసాగించడమంటే ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అనుమతించినట్లే అవుతుందని ధర్మాసనం తన తీర్పులో అభిప్రాయపడింది. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలంటూ సింగిల్ జడ్జిని అభ్యర్థించే స్వేచ్ఛను రోజాకు ఇచ్చింది. రిట్ పిటిషన్‌పై ఈ నెల 28వ తేదీ లోపు కౌంటర్లు దాఖలు చేయాలని శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శులను ధర్మాసనం ఆదేశించింది.
తీర్పు చెప్పడం ముగిసిన తరువాత రోజా తరఫు న్యాయవాది నర్మద స్పందిస్తూ... తీర్పు కాపీ కోసం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఉన్న ఈ తీర్పును టైప్ చేసేందుకు స్టెనోగ్రాఫర్‌కు తగినంత సమయం ఇవ్వాలి, తరువాత అందులో తప్పులు ఉంటే సరిదిద్దాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇదంతా పూర్తయ్యేందుకు సమయం పడుతుందని వెల్లడించింది. బుధవారం సాయంత్రం కల్లా తీర్పు కాపీ అందుబాటులో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.