అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తుండడంతో నీళ్లు పారడానికి నిర్మించిన కాలువలు కన్నీరు పెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు భూములను ఆక్రమించారు. చెరువులనూ ఆక్రమించారు. నాలాలనూ వదలలేదు. ఇప్పుడు అక్రమార్కుల కన్ను కాలువలపై పడింది. మట్టి తెచ్చి కాలువలను ‘మటుమాయం’ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు ఇప్పుడు మట్టిగుట్టలతో దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలు వచ్చి వరదలు వస్తే నీళ్లు పారేందుకు కాలువ లేక తీవ్రమైన ఇబ్బందులు రానున్నాయి. అయినా అధికారులకు చీమ కుట్టినట్టుగా లేదు.
పటాన్‌చెరు: పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్ మండలాల పరిధిలో చెరువుల కాలువలు, వాగులను వదిలిపెట్టకుండా జోరుగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కాలువలను పూడ్చివేస్తే భవిష్యత్‌లో తలెత్తే ప్రమాదాన్ని ఎవరూ గుర్తించడం లేదు. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు కాలువల ఆవశ్యకత ఏంఓట స్పష్టమవుతుంది. కాలువలు పూడ్చి కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆ కాలువల ప్రాముఖ్యతను గుర్తించి కాలనీల ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపం కారణంగా కాలువలు కబ్జారాయుళ్ల పరమవుతున్నాయి. అమీన్‌పూర్ పెద్ద చెరువు నుంచి బందంకొమ్ము చెరువుకు నీళ్లు వదలాలని జిల్లా అధికారులు ఇటీవల సూచించారు.
అయితే మధ్యలో ఉన్న వెంచర్ నిర్వాహకులు, కాలనీల్లో కాల్వలను పూడ్చివేశారు. స్థానిక అధికారులు ఆ కాల్వలను పునరుద్ధరించి నీళ్లను వదలాల్సిన పరిస్థితి ఎదురైంది. అమీన్‌పూర్ మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ఓ వెంచర్ నిర్వాహకుడు దర్జాగా కాలువలపై చిన్న సైజులో పైపులు వేసి కాలువ రూపురేఖలను మార్చివేశారు. అలాగే అమీన్‌పూర్‌లోనే శివసాయినగర్ కాలనీలో మరో వెంచర్ యజమాని కాల్వను పూడ్చివేసి రోడ్లు వేశారు. అలాగే బీరంగూడ రామచంద్రాపురం శివారు ప్రాంతంలో చిన్న వాగును పూడ్చివేసి ప్లాట్లుగా మార్చారు. అక్కడ అతి వేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఇదేమంటే తమ పంట పొలాలు ఉండేవని వాటిని అమ్ముకుంటున్నామని స్థానిక రైతులు వాదిస్తున్నారు. గతంలోనే చిన్నవాగు పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ వంటి నిబంధనలేవి పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారు. కానుకుంట నుంచి బీరంగూడ వరకు కాల్వ సైజు బాగా తగ్గిపోయింది. దాంతో వరద వచ్చినప్పుడల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం ప్రతి వానాకాలంలో జరుగుతోంది. తాజాగా జరుగుతున్న కబ్జాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. ముత్తంగి, చిట్కుల్ శివారులో నక్కవాగును దర్జాగా పూడ్చేస్తున్నారు. అక్కడ ఓ వెంచర్ నిర్వాహకులు కాలువ దిశనే మార్చి రాత్రింబవళ్లు యంత్రాలతో దాన్ని పూడ్చే పనిలో పడ్డారు.
అక్కడ ఓ వంతెనను నిర్మిస్తున్నారు. కాలువ దిశను మారుస్తూ వంతెన నిర్మాణం చేపడుతున్నారు. కాలువలకు ఇరువైపులా తొమ్మిది మీటర్ల దూరం బఫర్ జోన్ వదిలి నిర్మాణాలు చేసుకోవాలనే నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. బఫర్ జోన్‌ను యథేచ్చగా తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో గజం జాగా విలువ వేలల్లో ఉండడంతో కాలువ ప్రాంతాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఆ తంతంగాన్ని ఆపాలని స్థానికులు కోరుతున్నారు. కాలువల పరిరక్షణపై అధికారులు సరైన విధంగా స్పందించడం లేదు. కాలువల రక్షణ బాధ్యత తమది కాదనే ధోరణితో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయమై ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ బి.రమణారెడ్డిని వివరణ కోరగా కాలువల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ ఏఈలను పంపి వివరాలు తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment