సొసైటీని ఎందుకు రద్దు చేశారు?
సొసైటీని ఎందుకు రద్దు చేశారు?
Published Sat, Oct 1 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
* అధికారులను ప్రశ్నించిన
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ
* యడవల్లి భూములపై విచారణ
చిలకలూరిపేట రూరల్ : మండలంలోని యడవల్లి గ్రామంలో ఎస్సీలకు చెందిన ప్రభుత్వ భూముల రద్దు విషయంపై జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీలో నిర్వహించిన విచారణకు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారి పాండురంగారావు, డివిజన్ సొసైటీ అధికారి పురుషబాబు, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, చిలకలూరిపేట తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్య హాజరైనట్లు ఏపీ గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనునాయక్ చెప్పారు. కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నిర్వహించిన విచారణలో కమిషన్ సభ్యురాలైన కమలమ్మ సంబంధిత అధికారులను సొసైటీని రద్దు చేసినందుకు గల కారణాలను ప్రశ్నించినట్లు చెప్పారు. సొసైటీ ఎన్నికలను నిర్వహించకపోవటం, సంబంధిత విషయాలను సభ్యులకు తెలియచెప్పకపోవటం తదితర విషయాలపై అధికారులను కమలమ్మ ప్రశ్నించారన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ సొసైటీకి సంబంధించిన రికార్డులు తమవద్ద లేవని పేర్కొన్నారన్నారు. దీనిపై కమలమ్మ స్పందిస్తూ రైతుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తే అధికారుల పనితీరు తెలుస్తుందన్నారు. అధికారుల వద్ద ఉన్న రికార్డులను రైతులకు అందించి, తాము నోటీసులు జారీ చేసిన సమయంలో తిరిగి హాజరు కావాలని సూచించినట్లు తెలిపారన్నారు. విచారణలో రైతులకు, కమిషన్‌కు సమన్వయ కర్తగా ఫోరంఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు కె.నారాయణ వ్యవహరించారన్నారు. విచారణకు గ్రామానికి చెందిన యడవల్లి వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ అధ్యక్షులు తాళ్ళూరి వెంకట్రావు, సభ్యులు పరిశపోగు శ్రీనివాసరావు, కోండ్రు షడ్రక్‌బాబు, వేల్పుల రమేష్, పెనుముల చిట్టి, శ్రీనివాస్‌లు హాజరయ్యారన్నారు.
Advertisement