భూకబ్జాలపై కొరడా | Encroachment Cleared In Govt Lands In Visakhapatnam | Sakshi
Sakshi News home page

భూకబ్జాలపై కొరడా

Published Sun, Sep 8 2019 6:42 AM | Last Updated on Sun, Sep 8 2019 6:43 AM

Encroachment Cleared In Govt Lands In Visakhapatnam - Sakshi

ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు

ఐదేళ్ల టీడీపీ హయాంలో విశాఖ పెను భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. అధికారం దన్నుతో పచ్చ నేతలు  సృష్టించిన  భూదందాల విలయం రాష్ట్రమంతటా కలకలం రేపింది. అడ్డగోలుగా డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు..ఇలా దేన్నీ వదలకుండా..  ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు.. భూహక్కుదారులు, అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. అధికారులనూ పావులను చేశారు. ఫలితంగా ఎందరో అధికారులు జైళ్లపాలయ్యారు.ఇప్పుడు పాలన మారింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే సమూల మార్పుల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆ క్రమంలోనే విశాఖలో పచ్చనేతల భూ దాహానికి బలైన సర్కారీ భూములను రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయో సర్వే చేపట్టారు. మరో పక్క ఆక్రమిత భూముల్లో ఉన్న  నిర్మాణాలను తొలగించే  పని కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్ళూ ఆక్రమణలో ఉన్న మధురవాడలోని రూ.100 కోట్ల విలువైన 10 ఎకరాలకు పైగా భూమిని  శనివారం  స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. విశాఖ.. ఈ చుట్టుపక్కల భూ ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తామని విశాఖ ఆర్డీవో కిషోర్‌ స్పష్టం చేశారు. కబ్జాదారులు స్వచ్ఛందంగా భూములు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు.

సాక్షి, మధురవాడ(భీమిలి): ‘అవినీతి, అక్రమాలు సహించం. వాటి వెనుక ఎంతటి వారున్నా.. వదిలిపెట్టేది లేదు.’ అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరికలు ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. సీఎం ఆదేశాలు తూ.చ తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్ని స్థాయిల్లో అధికారులకు ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో ఆక్రమణలు నియంత్రించడానికి రెవెన్యూ, జీవీఎంసీ, విద్యుత్‌ శాఖలు కలసి పనిచేయాలని కొద్ది రోజుల కిందటే వారిని ఏకం చేశారు. పోలీసు అధికారులు కూడా సహాయ సహకారాలు అందించడంతో ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ అధికారులు వేగం పెంచారు. ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించడంతో కాకుండా కేసులు కూడా పెట్టి, వారిని అరెస్ట్‌లు చేయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి, స్వాధీనం చేసుకున్నారు.

 విశాఖ రూరల్‌ మండలం మధురవాడ సర్వే నంబర్‌ 367, 368లలో లా కళాశాల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు నుంచి మధురవాడ మిథిలాపురి వుడా కాలనీకి వెళ్లే రోడ్డును ఆనుకుని శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌కు చేరువలో 10.5 ఎకరాలు విలువైన ప్రభుత్వ గయాలు భూమి ఉంది. ఈ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుంది. శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీల నివాసాల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిలో 70 వరకు రేకు షెడ్లు నిర్మించారు. ఈ ఆక్రమణల తొలగింపునకు రెవెన్యూ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. ఈ  క్రమంలో ఆ భూమి తమదని, వ్యవహారం కోర్టులో ఉండగా ఎలా తొలగిస్తారని ఆక్రమణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

మీరెంతా అన్న స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న విశాఖ నార్త్‌(మధురవాడ) ఏసీపీ ఆర్‌. రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుబ్బరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విశాఖ రూరల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ బెహరా రవిశంకర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఐలు సత్యనారాయణ, గ్లోరి, సర్వేయర్లు సత్యనారాయణ, వేణుగోపాల్, వీఆర్‌వోలు కె.అప్పారావు, సూరిబాబు తదితరులు ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా డీటీ రవిశంకర్‌ మాట్లాడుతూ కోర్టు వివాదంలో ఉన్న 10.5 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమిలో యథాస్థితిని కొనసాగించాల్సి ఉందన్నారు. కానీ ఇక్కడ కొందరు షెడ్ల నిర్మాణంతో పాటు భూమి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. చాలా సార్లు వారిని హెచ్చరించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ షెడ్లు తొలగించామన్నారు. పీఎంపాలెం ఎస్‌ఐ రవికుమార్, వీఆర్‌వోలు దొర, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement