
ఏసీబీకి చిక్కిన డీటీ భాస్కర్ , స్వాధీనం చేసుకున్న నగదు రూ.50 వేలు
రావికమతం(చోడవరం): ఏసీబీ వలకు రెవెన్యూ అవినీతి చేప చిక్కింది. రావికమతం మండల డిప్యూటీ తహసీల్దార్ జె.భాస్కర్ మంగళవారం సాయత్రం మధ్యవర్తి సాయంతో రూ.50వేలు తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికిపోయారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు సెలవులో ఉండటంతో భాస్కర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. కొత్తకోటకు చెందిన రైతు గుర్రాల శ్రీనివాస్, ఆతని అన్నదమ్ములు ముగ్గురికి వారసత్వంగా వచ్చిన 9.35 ఎకరాల భూమి ఉంది. దానికి పాసుపుస్తకాలకు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. డీటీ రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.నాలు గున్నర లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.
అడ్వాన్సుగా రూ.50 వేలు ఇవ్వాలని షరతు పెట్టడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు వారు వల పన్నారు. మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో రైతుశ్రీనివాస్ నగదు తెచ్చానని డీటీకి ఫోన్ చేశారు. ఇంటికి వెళ్లిపోతున్నందున రావికమతంలో మెగా కంప్యూటర్ నిర్వాహకుడు కొశిరెడ్డి ప్రసాద్‌కు ఇవ్వాలని చెప్పారు. ఆ మేరకు ఆ నగదును ప్రసాద్‌కు రైతు ఇచ్చాడు. వెంటనే అక్కడే ఉన్న ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ, సీఐ రమణమూర్తి, ఇతర అధికార్లు కంప్యూటర్ నిర్వాహకుడ్ని పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. డీటీ భాస్కర్‌ను అక్కడకు రప్పించి గంటపాటు విచారణ చేపట్టి, ఆపై అరెస్ట్ చేశామని సీఐ రమణమూర్తి తెలిపారు. మధ్యవర్తిగా వ్యవహరించిన కంప్యూటర్ నిర్వాహకుడు ప్రసాద్‌ను అధికారులు విచారిస్తున్నారు.
15 రోజులుగా స్కెచ్..ఫోన్ ట్యాప్..
కొత్తకోటకు చెందిన రైతు గుర్రాల శ్రీనివాస్ 15 రోజుల క్రితమే డీటీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పుడే అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. అడ్వాన్స్‌గా చెల్లింపునకు నగదు అందలేదంటూ ఇన్నాళ్లూ వాయిదా వేస్తూ వచ్చాడు. రైతుతో పాటు మధ్యవర్తి ప్రసాద్, డీటీ భాస్కర్ మాట్లాడుకోవడాన్ని ఏసీబీ అధికారులు ఫోన్‌ట్యాప్ చేసి రికార్డు చేశారు. మంగళవారం వలపన్ని పట్టుకున్నారు.