మంత్రులూ పారా హుషార్
► ఉద్యాన వర్సిటీ మనదేనా
► పొరుగు జిల్లాకు తరలుతుందా
► సిరిసిల్లలో ఐఐఎం ప్రతిపాదనలు
► సాధ్యాసాధ్యాలపైనే సందేహాలు
ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఊరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హార్టికల్చర్ యూనివర్సిటీ... ప్రతిష్టాత్మకమైన ఐఐఎం ఏర్పాటుకు ఆగమేఘాలపై స్థల సర్వే చేపట్టడం జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ రెండు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పితే... జాతీయ స్థాయిలోనే కరీంనగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు జిల్లా ప్రజలకు చేరువవుతాయి. మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ ప్రత్యేకంగా జిల్లాపై దృష్టి కేంద్రీకరించటంతో వీటిని మన జిల్లాలోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంతకీ రెండు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి..? యూనివర్సిటీ పొరుగు జిల్లాకు తరలివెళుతుందా..? ఐఐఎం ఏర్పాటుకు అనువైన సదుపాయాలు అందుబాటులో లేవా..? అనే సందేహాలు చర్చనీయాంశంగా మారాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీకి చోటు కల్పించింది. దీంతో యూనివర్సిటీ ఏర్పాటుకు అనువుగా ఒకే చోట 500 ఎకరాల విస్తీర్ణపు స్థలం కావాలని... ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వివరాలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు కథలాపూర్, సిరిసిల్ల, రామగుండం మండలాల్లో అనువైన స్థలాన్ని గుర్తించారు. ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్వయంగా వెళ్లి ఈ స్థలాలను పరిశీలించారు.
► కథలాపూర్ మండలంలోని గంభీర్‌పూర్‌లో 413 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో యూనివర్సిటీకి అనుకూలంగా ఉంటుందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెల 7న జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించినపుడు ఉద్యానశాఖ కార్యదర్శికి ఈ నివేదికను అందించినట్లు సమాచారం.
► జగిత్యాల డివిజన్‌లో వ్యవసాయ పరిశోధన కేంద్రం, అగ్రికల్చర్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, చల్‌గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రం ఉంది. వీటికి సమీపంగా కథలాపూర్ మండలంలో యూనివర్సిటీ నెలకొల్పితే భవిష్యత్తులో ఈ ప్రాంతం అగ్రికల్చర్ హబ్‌గా వెలుగొందే అవకాశముంది.
► ఈలోగా హార్టికల్చర్ యూనివర్సిటీ పొరుగున ఉన్న మెదక్ జిల్లాకు తరలివెళుతుందనే ప్రచారం జోరందుకుంది. సిద్ధిపేట ప్రాంతంలో ఏర్పాటుకు ఉన్నత స్థాయి అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. సొంత జిల్లా కావటంతో పాటు అక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో సీఎం సిద్ధిపేటకే మొగ్గు చూపుతున్నట్లు ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది.
► ఈలోగా ఐఐఎం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు మరో లేఖ అందింది. దీనికి సైతం 500 ఎకరాల స్థలం కావాలని సూ చించింది. అప్పటికే సర్వే చేసిన రెవెన్యూ యంత్రాంగం ఈ మూడు ప్రాంతాల్లోనే అంత భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో ఐఐఎం ఏర్పాటుకు సిరిసిల్ల మండలంలోని పెద్దూరు, సర్దాపూర్ పరిసర ప్రాంతాలను సర్వే చేసింది. దాదాపు 1600 ఎకరాల స్థలం ఉందని ప్రభుత్వానికి నివేదించింది.
► కానీ... కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐఐఎం ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇటీవలి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఐఐఎం ప్రస్తావన లేదు. ఐఐఎం లేని రాష్ట్రాలన్నింటా కొత్తగా ఐఐఎం నెలకొల్పే ఆలోచన ఉందని.. అందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భరోసా ఇచ్చారు.
► తెలంగాణలో ఐఐఎం నెలకొల్పాలని ఎంపీ కవిత, మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి నుంచి అందిన విజ్ఞప్తులపై మంత్రి రాజ్యసభలో ఆ సమాధానమిచ్చారు. దీంతో భవిష్యత్తులో ఐఐఎం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నా.. సిరిసిల్ల ప్రాంతం అనువైంది కాదని ఉన్నతాధికార వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
► హైదరాబాద్ నుంచి సిరిసిల్ల 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. ఐఐఎం జాతీయ స్థాయి విద్యాసంస్థ కావటంతో విమానాశ్రయంతో పాటు రోడ్డు, రైల్వే రవాణా మార్గాలుండే ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లేదా పరిసర ప్రాంతాల్లో ఐఐఎం ఏర్పాటుకు అనువైన సదుపాయాలు ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.