incharge collector
-
17న తీరం దాటే అవకాశం
సాక్షి, విజయనగరం: రేపు మధ్యాహ్నానికి పెథాయ్ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశముందని విజయనగరం ఇంచార్జ్ కలెక్టర్ వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఈనెల 17న సాయంత్రం ఒంగోలు- కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందన్నారు. గంటకు 90 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తోన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో తుపానుకు అందకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేశామని చెప్పారు. జిల్లాలోని 34 మండలాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. సముద్రతీర మండలాలే కాకుండా ఎస్.కోట, సాలూరు మండలాల్లో కూడా తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామని వివరించారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, తాగునీరు, పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాలకు ఇప్పటికే వెళ్లి ప్రత్యేక అధికారులు సమీక్షిస్తున్నారని అన్నారు. హెల్ఫ్‌లైన్ నెంబర్లు కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. హెల్ఫ్‌లైన్ నెంబర్లు 08922276713(విజయనగరం కలెక్టరేట్) 08922276888(ఆర్డీఓ ఆఫీసు విజయనగరం) 089632207207(పార్వతీపురం సబ్ కలెక్టర్) -
ఇన్చార్జి కలెక్టర్‌గా జేసీ?
నేడు విజయవాడకు విజయమోహన్ – 24లోపు బాధ్యతల స్వీకరించనున్న కొత్త కలెక్టర్ సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్(జేసీ) హరికిరణ్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. జిల్లా నుంచి విజయవాడకు సర్వే సెటిల్మెంట్ అండ్ భూ రికార్డుల స్పెషల్ కమిషనర్‌గా విజయమోహన్ బదిలీ అయ్యారు. ఆ మేరకు ఆయన బుధవారం(నేడు) విజయవాడకు వెళ్లనున్నట్టు సమాచారం. మరోవైపు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సత్యనారాయణ ఈ నెల 24వ తేదీలోపు బాధ్యతలు తీసుకోనున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యనారాయణ మొదటిసారి 1996లో సంగారెడ్డి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పెద్దాపురం ఆర్డీఓగా బదిలీ అయ్యారు. అనంతరం అదే జిల్లాలోనే డ్వామా పీడీగా, జెడ్పీ సీఈఓగా పనిచేశారు. అనంతపురం జేసీగా పనిచేసిన ఈయన.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జేసీగా పనిచేస్తున్నారు. పదోన్నతిపై ఆయన కర్నూలు జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ నెల 24వ తేదీలోపు ఏదో ఒక రోజు బాధ్యతలు తీసుకుంటానని ‘సాక్షి’కి సత్యనారాయణ తెలిపారు. కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ కాలేజీలో సత్యనారాయణ చదువుకున్నారు. మంచి పోస్టింగ్ కోసం...! వాస్తవానికి తనకు మంచి పోస్టింగు దక్కుతుందని ఆశించిన విజయమోహన్ చివరకు లూప్‌లైన్ పోస్టు దక్కడంతో అవమానంతో రగిలిపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంచి పోస్టింగ్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడకు వెళ్లి ప్రయత్నాలు చేయనున్నట్టు సమాచారం. వాస్తవానికి పంచాయతీరాజ్ కమిషనర్‌గా నియమితులవుతున్నారనే ప్రచారం జరిగింది. తనకు బదిలీ ఉండదని.. తననెవ్వరూ బదిలీ చేయలేరని కూడా గతంలో ఈయన వ్యాఖ్యానించారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే, ఇందుకు భిన్నంగా ఏ మాత్రం పెద్దగా పనిలేని పోస్టులో నియమితులవడం ఆయనకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఉద్యోగులతో వ్యవహరించిన తీరుతో పాటు ఇతర పలు వ్యక్తిగత కారణాలు కూడా సీఎం దృష్టికి పోవడంతోనే లూప్‌లైన్ పోస్టు ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. -
24 నాటికి సర్వే పూర్తికావాలి
ఏలూరు (మెట్రో) జిల్లాలో ప్రజాసాధికారిత సర్వేలో ప్రజల వివరాలను ఈనెల 24వ తేదీ సాయంత్రంలోగా నూరు శాతం నమోదు పూర్తికావాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని సబ్కలెక్టర్లు, ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధికారిత సర్వేలో జిల్లాలో ఇంకా సుమారు 5లక్షల 50వేల మంది డేటాను నమోదు చేయాల్సి ఉందనీ, అందులో 4లక్షల 50వేల మంది అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారన్నారు. ఈనెల 24వ తేదీ ఆఖరు తేదీ అయినందున 24వ తేదీ సాయంత్రంలోగా నూరుశాతం డేటా నమోదు పూర్తి చేయాలని లేకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నిలుపుదల అయి ఆపై ఎవరి డేటాను నమోదు చేయడానికి వీలు పడదన్నారు. జిల్లాలో ఏ ఒక్క కు9టుంబం ఏ ఒక్క వ్యక్తి డేటా నమోదు కాకుండా మిగిలిపోయినా దీనికి కారణమైన సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాలి9స ఉంటుందని అటువంటిఒ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజాధికారిత సర్వే వల్ల భవిష్యత్‌లో ప్రజలకు అందాల్సిన సంక్షేమ అభివద్ధి ఫలాలు సులభతరంగా అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పి సిఇఒ డి.సత్యనారాయణ, డిఆర్డిఎ పీడీ కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పీడీ చంద్రశేఖర్, ఎన్ఐసి అధికారి శర్మ పాల్గొన్నారు. -
‘90 వేల ఎకరాలకు రక్షక తడి’
అనంతపురం అర్బన్: జిల్లాలో వర్షాభావంతో ఎండుతున్న 90 వేల ఎకరాల్లోని వేరుశనగ పంటకు రక్షక నీటి తడులను అందించామని ఇన్చార్జి కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,33,598 ఎకరాల్లో వేరుశనగ బెట్ట పరిస్థతుల్లో ఉందని తెలిపారు. రైతుల బోర్ల నుంచి పక్కనున్న 72,981 ఎకరాలకు, కెనాల్ ద్వారా నీటిని సేకరించి 8,352 ఎకరాలకు రెయిన్గన్ల ద్వారా తడులు ఇచ్చామని వివరించారు. -
మంత్రులూ పారా హుషార్
► ఉద్యాన వర్సిటీ మనదేనా ► పొరుగు జిల్లాకు తరలుతుందా ► సిరిసిల్లలో ఐఐఎం ప్రతిపాదనలు ► సాధ్యాసాధ్యాలపైనే సందేహాలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఊరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హార్టికల్చర్ యూనివర్సిటీ... ప్రతిష్టాత్మకమైన ఐఐఎం ఏర్పాటుకు ఆగమేఘాలపై స్థల సర్వే చేపట్టడం జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ రెండు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పితే... జాతీయ స్థాయిలోనే కరీంనగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు జిల్లా ప్రజలకు చేరువవుతాయి. మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ ప్రత్యేకంగా జిల్లాపై దృష్టి కేంద్రీకరించటంతో వీటిని మన జిల్లాలోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంతకీ రెండు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి..? యూనివర్సిటీ పొరుగు జిల్లాకు తరలివెళుతుందా..? ఐఐఎం ఏర్పాటుకు అనువైన సదుపాయాలు అందుబాటులో లేవా..? అనే సందేహాలు చర్చనీయాంశంగా మారాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీకి చోటు కల్పించింది. దీంతో యూనివర్సిటీ ఏర్పాటుకు అనువుగా ఒకే చోట 500 ఎకరాల విస్తీర్ణపు స్థలం కావాలని... ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వివరాలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు కథలాపూర్, సిరిసిల్ల, రామగుండం మండలాల్లో అనువైన స్థలాన్ని గుర్తించారు. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్వయంగా వెళ్లి ఈ స్థలాలను పరిశీలించారు. ► కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్లో 413 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో యూనివర్సిటీకి అనుకూలంగా ఉంటుందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెల 7న జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించినపుడు ఉద్యానశాఖ కార్యదర్శికి ఈ నివేదికను అందించినట్లు సమాచారం. ► జగిత్యాల డివిజన్లో వ్యవసాయ పరిశోధన కేంద్రం, అగ్రికల్చర్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రం ఉంది. వీటికి సమీపంగా కథలాపూర్ మండలంలో యూనివర్సిటీ నెలకొల్పితే భవిష్యత్తులో ఈ ప్రాంతం అగ్రికల్చర్ హబ్‌గా వెలుగొందే అవకాశముంది. ► ఈలోగా హార్టికల్చర్ యూనివర్సిటీ పొరుగున ఉన్న మెదక్ జిల్లాకు తరలివెళుతుందనే ప్రచారం జోరందుకుంది. సిద్ధిపేట ప్రాంతంలో ఏర్పాటుకు ఉన్నత స్థాయి అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. సొంత జిల్లా కావటంతో పాటు అక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో సీఎం సిద్ధిపేటకే మొగ్గు చూపుతున్నట్లు ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. ► ఈలోగా ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు మరో లేఖ అందింది. దీనికి సైతం 500 ఎకరాల స్థలం కావాలని సూ చించింది. అప్పటికే సర్వే చేసిన రెవెన్యూ యంత్రాంగం ఈ మూడు ప్రాంతాల్లోనే అంత భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో ఐఐఎం ఏర్పాటుకు సిరిసిల్ల మండలంలోని పెద్దూరు, సర్దాపూర్ పరిసర ప్రాంతాలను సర్వే చేసింది. దాదాపు 1600 ఎకరాల స్థలం ఉందని ప్రభుత్వానికి నివేదించింది. ► కానీ... కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐఐఎం ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇటీవలి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఐఐఎం ప్రస్తావన లేదు. ఐఐఎం లేని రాష్ట్రాలన్నింటా కొత్తగా ఐఐఎం నెలకొల్పే ఆలోచన ఉందని.. అందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భరోసా ఇచ్చారు. ► తెలంగాణలో ఐఐఎం నెలకొల్పాలని ఎంపీ కవిత, మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి నుంచి అందిన విజ్ఞప్తులపై మంత్రి రాజ్యసభలో ఆ సమాధానమిచ్చారు. దీంతో భవిష్యత్తులో ఐఐఎం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నా.. సిరిసిల్ల ప్రాంతం అనువైంది కాదని ఉన్నతాధికార వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ► హైదరాబాద్ నుంచి సిరిసిల్ల 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. ఐఐఎం జాతీయ స్థాయి విద్యాసంస్థ కావటంతో విమానాశ్రయంతో పాటు రోడ్డు, రైల్వే రవాణా మార్గాలుండే ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లేదా పరిసర ప్రాంతాల్లో ఐఐఎం ఏర్పాటుకు అనువైన సదుపాయాలు ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
సిరిసిల్లలో ఐఐఏఎం?
- పెద్దూరులో భూములు పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్ - 1600 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు - డీజీపీఎస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు - ఖరారైతే తెలంగాణలోనే తొలి బిజినెస్ స్కూల్ సిరిసిల్ల : సిరిసిల్ల ప్రాంతంలో ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ (ఐఐఏఎం) బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జగిత్యాల సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్ బుధవారం సిరిసిల్ల మండలం పెద్దూరు శివారులో ప్రభుత్వ భూములను పరిశీలించారు. పెద్దూరులో సర్వే నంబర్ 405, 408, పెద్దబోనాలలో సర్వే నంబర్ 164, 149, సర్దాపూర్ సర్వే నంబర్ 61, వెంకటాపూర్ సర్వే నంబర్ 119లో మూడువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో గుట్టలను మినహాయిస్తే 1600 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఐఐఏఎం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరిన నేపథ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో అనువైన స్థలం కోసం సర్వే చేస్తున్నట్లు జేసీ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. గుర్తించిన మూడువేల ఎకరాల భూములను సర్వే చేసేందుకు డిప్రెషన్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్)ను ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ సర్వే అధికారులకు ప్రతిపాదనలు పంపాలని సబ్‌కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ను జేసీ ఆదేశించారు. రూ.18 లక్షల వ్యయంతో డీజీపీఎస్ శాటిలైట్ సిస్టమ్‌తో భూసర్వే చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న 1600 ఎకరాల్లో ఐఐఏఎంతోపాటు ఇతర సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సిరిసిల్లలో ఇప్పటికే రెండో బైపాస్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు కోరారు. ప్రస్తుతం ఐఐఏఎం కోసం సేకరిస్తున్న భూమి కూడా బైపాస్ రోడ్డును ఆనుకునే ఉంది. దీంతో చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పే అవకాశముంది. ఐఐఏఎం దరిచేరితే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సిరిసిల్ల ఐటీ మంత్రి కె.తారకరామారావు సొంత నియోజకవర్గం కావడంతో ఐటీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి ఆహ్వానించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు మంత్రి చొరవ చూపుతున్నారు.