ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ?
నేడు విజయవాడకు విజయమోహన్
– 24లోపు బాధ్యతల స్వీకరించనున్న కొత్త కలెక్టర్ సత్యనారాయణ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్(జేసీ) హరికిరణ్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. జిల్లా నుంచి విజయవాడకు సర్వే సెటిల్‌మెంట్ అండ్ భూ రికార్డుల స్పెషల్ కమిషనర్‌గా విజయమోహన్ బదిలీ అయ్యారు. ఆ మేరకు ఆయన బుధవారం(నేడు) విజయవాడకు వెళ్లనున్నట్టు సమాచారం. మరోవైపు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సత్యనారాయణ ఈ నెల 24వ తేదీలోపు బాధ్యతలు తీసుకోనున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యనారాయణ మొదటిసారి 1996లో సంగారెడ్డి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పెద్దాపురం ఆర్డీఓగా బదిలీ అయ్యారు. అనంతరం అదే జిల్లాలోనే డ్వామా పీడీగా, జెడ్పీ సీఈఓగా పనిచేశారు. అనంతపురం జేసీగా పనిచేసిన ఈయన.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జేసీగా పనిచేస్తున్నారు. పదోన్నతిపై ఆయన కర్నూలు జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ నెల 24వ తేదీలోపు ఏదో ఒక రోజు బాధ్యతలు తీసుకుంటానని ‘సాక్షి’కి సత్యనారాయణ తెలిపారు. కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ కాలేజీలో సత్యనారాయణ చదువుకున్నారు.
మంచి పోస్టింగ్ కోసం...!
వాస్తవానికి తనకు మంచి పోస్టింగు దక్కుతుందని ఆశించిన విజయమోహన్ చివరకు లూప్‌లైన్ పోస్టు దక్కడంతో అవమానంతో రగిలిపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంచి పోస్టింగ్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడకు వెళ్లి ప్రయత్నాలు చేయనున్నట్టు సమాచారం. వాస్తవానికి పంచాయతీరాజ్ కమిషనర్‌గా నియమితులవుతున్నారనే ప్రచారం జరిగింది. తనకు బదిలీ ఉండదని.. తననెవ్వరూ బదిలీ చేయలేరని కూడా గతంలో ఈయన వ్యాఖ్యానించారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే, ఇందుకు భిన్నంగా ఏ మాత్రం పెద్దగా పనిలేని పోస్టులో నియమితులవడం ఆయనకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఉద్యోగులతో వ్యవహరించిన తీరుతో పాటు ఇతర పలు వ్యక్తిగత కారణాలు కూడా సీఎం దృష్టికి పోవడంతోనే లూప్‌లైన్ పోస్టు ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది.