సిరిసిల్లలో ఐఐఏఎం?
- పెద్దూరులో భూములు పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్
- 1600 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు
- డీజీపీఎస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
- ఖరారైతే తెలంగాణలోనే తొలి బిజినెస్ స్కూల్
సిరిసిల్ల : సిరిసిల్ల ప్రాంతంలో ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (ఐఐఏఎం) బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జగిత్యాల సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్ బుధవారం సిరిసిల్ల మండలం పెద్దూరు శివారులో ప్రభుత్వ భూములను పరిశీలించారు. పెద్దూరులో సర్వే నంబర్ 405, 408, పెద్దబోనాలలో సర్వే నంబర్ 164, 149, సర్దాపూర్ సర్వే నంబర్ 61, వెంకటాపూర్ సర్వే నంబర్ 119లో మూడువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో గుట్టలను మినహాయిస్తే 1600 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఐఐఏఎం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరిన నేపథ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో అనువైన స్థలం కోసం సర్వే చేస్తున్నట్లు జేసీ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. గుర్తించిన మూడువేల ఎకరాల భూములను సర్వే చేసేందుకు డిప్రెషన్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్)ను ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ సర్వే అధికారులకు ప్రతిపాదనలు పంపాలని సబ్‌కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్‌ను జేసీ ఆదేశించారు. రూ.18 లక్షల వ్యయంతో డీజీపీఎస్ శాటిలైట్ సిస్టమ్‌తో భూసర్వే చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న 1600 ఎకరాల్లో ఐఐఏఎంతోపాటు ఇతర సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సిరిసిల్లలో ఇప్పటికే రెండో బైపాస్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు కోరారు. ప్రస్తుతం ఐఐఏఎం కోసం సేకరిస్తున్న భూమి కూడా బైపాస్ రోడ్డును ఆనుకునే ఉంది. దీంతో చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పే అవకాశముంది. ఐఐఏఎం దరిచేరితే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సిరిసిల్ల ఐటీ మంత్రి కె.తారకరామారావు సొంత నియోజకవర్గం కావడంతో ఐటీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి ఆహ్వానించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు మంత్రి చొరవ చూపుతున్నారు.