టీడీపీ విందు రాజకీయం
బాపట్ల, న్యూస్‌లైన్: బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్‌ప్రభాకర్ విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. సూర్యలంక వెళ్లేదారిలోని ఆయన కళాశాలకు చెందిన బస్సులో బుధవారం డ్వాక్రాకు సంబంధించిన విలేజి ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్(వీవోఏ)లను కళాశాలకు తరలించారు. అక్కడ వారితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతా జయప్రకాశ్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ పాల్గొన్నారు. టీడీపీకి మీ ఓట్లతో పాటు మీ పరిధిలోని గ్రూపుల మహిళలతో ఓట్లు వేయిస్తే మీ ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తామంటూ వారిని ప్రలోభ పెట్టారు. గ్రామాల్లో మా పార్టీకి మీరే ప్రతినిధులు, అక్కడ పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా మీ ద్వారానే చేస్తామంటూ వారిని ఆకాశానికి ఎత్తేశారు. చక్కని విందు అందించారు. ఆనక ఆటోల్లో ఇళ్లకు పంపించారు.
ఏపీవో చెబితేనే వచ్చాం...
మహిళా సమాఖ్య ఏపీవో శ్రీనివాసరెడ్డి ప్రతి డ్వాక్రా వీవోఏకు ఫోన్ చేసి టీడీపీ మీటింగ్‌కు వెళ్లకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పడం వల్లనే తాము ఇక్కడికి వచ్చామని వీవోఏలు న్యూస్‌లైన్‌కు చెప్పారు. దీంతో ఇది ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన మీటింగ్ అనుకుని వచ్చామని కొందరు వీవోఏలు వాపోయారు.