ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసినా ఫలితాలు ఇం కా తేలకపోవడంతో గెలిచేదెవరనే అంశంపై చర్చ జరుగుతోంది. పార్టీ నాయకుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల్లో మాత్రం ఒకింత ఆందోళన నెల కొంది. ఓటమి పాలైతే తమ భవిష్యత్ ఏమిటనే భయం వారిని వెంటాడుతోంది. పోలింగ్ సరళిపై లెక్కలు వేసుకున్న టీడీపీ నేతలు తాము ఊహించిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఫలానా సామాజిక వర్గం ఓట్లు కచ్చితంగా తమకే వస్తాయని, ఫలానా ఊరిలో, వార్డులో జనం తమకే అనుకూలంగా ఓటేస్తారని పెట్టుకున్న నమ్మకం కాస్తా లెక్కలు తేలాక తారుమారు కావడంతో నేతల అంచనాలు తలకిందులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కోటలుగా భావించే ప్రాంతాల్లో ప్రాభవం కోల్పోతోంది. ఆ పార్టీ ప్రాభవం పడిపోతోంది. వాస్తవ పరిస్థితి కళ్లముందు కనిపిస్తున్నా టీడీపీ నేతలు మరోసారి గోబెల్స్ ప్రచారానికి తెరతీశారు. పోలింగ్‌కు ముందు తమ పార్టీకే అనుకూల పవనాలు వీస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చేయించిన ఆ పార్టీ పెద్దలు మరోసారి అదే చేస్తున్నారు. వారి కుట్రను అప్పుడు జనం పసిగట్టడంతో చివరి క్షణంలో ఆ ప్రచారాన్ని ఆపేశారు. ఎన్నికలు ముగియడంతో ఓటమి తప్పదని తెలిసినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ జిల్లాలో అధిక స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందనే ప్రచారం చేయిస్తున్నారు. తద్వారా ప్రజల్లో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. అయితే లోలోన మాత్రం అభ్యర్థులు వణికిపోతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసిన కోట్లాది రూపాయల సొమ్ము పదవి దక్కకపోతే నష్టపోవడం ఖాయం. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి తెచ్చింది పోగొట్టుకుని రాజకీయాల్లో కొనసాగలేని పరిస్థితిని టీడీపీ నేతలకు ఊహించుకోలేకపోతున్నారు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయకుండా ఉండేందుకు తామే గెలుస్తామనే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.