ఓటుకు రూ.రెండు వేలు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓట్లపై అభ్యర్థులు కన్నేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొనుగోలు చేసేందుకు జిల్లాలోని టీడీపీ అభ్యర్థులు డబ్బులు విరజిముతున్నారు. ఒక్కో ఓటుకు రూ. రెండు వేలు చెల్లించేందుకు సైతం వెనకాడటం లేదని తెలిసింది. ప్రధానంగా నరసరావుపేట, రేపల్లె, చిలకలూరిపేట, పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్ల కోసం మధ్యవర్తులతో టీడీపీ నాయకులు బేర, సారాలు సాగిస్తున్నట్లు స్వయంగా ఆయా సంఘాల నాయకులే చెబుతున్నారు.
అత్యధికంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారీగా డబ్బులు విరజిమ్ముతున్నారు. ఆయా సంఘాల నాయకులతో విడి, విడిగా సమావేశాలు నిర్వహించి కోరినంత ఇస్తామని నమ్మబలుకుతున్నారని తెలిసింది. తమ పార్టీకే ఓటు వేసేలా హుకుం జారీ చేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే సంఘ పరంగా ఎవరి ఆశయాలు, లక్ష్యాలు వారికుంటాయని, ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయం ఉద్యోగుల వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, దీనికి విరుద్ధంగా ఫలానా పార్టీకి ఓటు వేయండంటూ తాము చెప్పలేమని ఉద్యోగ సంఘాల నాయకులు టీడీపీ అభ్యర్థులకు షాక్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక ఎప్పటి లానే డబ్బు విరజిమ్మి ఓట్లను కొనుగోలు చేసే పనిలో టీడీపీ అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
జిల్లాలో 23 వేల మంది...
మే 7న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా జిల్లాలో ఏడు వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. వీరితో పాటు ఒక్కో పోలింగ్ బూత్‌లో మరో ఐదుగురు చొప్పున విధులు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా జిల్లాలోని మూడు పార్లమెంటు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 23 వేల మంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరు ఏప్రిల్ 30, మే 1,2 తేదీల్లో శిక్షణ తరగతులకు హాజరైన సమయంలో అక్కడే ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎన్నిలక విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులకు ఆస్కారం కల్పించినట్లయింది. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్త చేస్తున్నారు.