తపాలా ఓటుకు టీడీపీ తిప్పలు!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలె ట్ కొన్నిచోట్ల అభ్యర్థుల జయాపజయాల్లో కీలకం కానుంది. దీంతో ఉద్యోగుల ఓట్లు పొందేందుకు తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బరితెగించి వారికి నజరానాలు ఎరవేస్తున్నారు. కుల, ధన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సెక్యూరిటీ, సైనిక రంగాల సర్వీసుల్లో ఉన్న కేటగిరీలకు చెందిన వారికి గాలం వేసేందుకు, వారిని తమవైపు తిప్పుకొని ఓట్లను రాబట్టుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్‌కు రూ.3 వేల చొప్పున వెలకడుతున్నారు. ఇందుకుకొంతమంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను పురమాయించినట్టు తెలుస్తోంది. సర్వీస్ ఓటర్ల విషయంలో మాజీ సైనికులతో ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునే వారి జాబితాలను సంబంధిత కార్యాలయాల వద్ద అంటించారు.
ఆ జాబితాలను దగ్గర పెట్టుకొని చిరునామాలను సేకరించి నేరుగా వారితో రాయబేరాలు సాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో యంత్రాంగం 18,320 పోస్టల్ బ్యాలెట్లు, 6,734 సర్వీస్ ఓట్లు జారీ చేసింది. రెండు కేటగిరీలకు కలిపి 25,054 మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు కేవలం 40 శాతం మంది మాత్రమే వీటిని వినియోగించుకున్నారు. ఈ నెల 16 ఉదయం ఎనిమిది గంటల వరకు గడువు ఉండడంతో మిగిలిన 60 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలో వారిలో ఎక్కువ శాతం మందిని తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. రెండురోజులుగా టీడీపీ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం వచ్చిపోయేవారిని కలుస్తూ పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పచ్చనోట్లను వెదజల్లుతున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల వైఖరిని అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు ఖండిస్తున్నారు. మరీఇంతగా దిగజారిపోయారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.